దుంగలా పడుకుని, గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు డ్రాకులా చాంగ్. సింగ్ ముడుచుకు పడుకుని ఉన్నాడు. అతని పక్కనే స్వరూప. కొంచెం దూరంలో కోతి.
ఇబూకా ఏడీ? ఫకర్ కూడా లేడే.
ఏమయ్యారు వీళ్ళిద్దరూ?
సాగర్ నొసలు ముడిపడ్డాయి. చాకుని సరిచూసుకుని, బొడ్లో దోపుకున్నాడు. అనూహ్యతో కలిసి బయటికి వచ్చాడు.
గుండ్రటి మెర్క్యురీ లైటులా వెలిగిపోతున్నాడు చంద్రుడు.
ఆ వెన్నెట్లో అడవి అతి మనోహరంగానూ, అతి భయంకరంగానూ కూడా కనబడుతోంది. ఏవేవో చిత్రమైన శబ్దాలు, కీచురాళ్ళ రోద, నిర్విరామంగా కప్పల బెకబెకలు, మధ్య మధ్య క్రూరమృగాల అరుపులు.
వాళ్ళ పాదాలక్రింద ఎండుటాకులు విరుగుతున్న చప్పుడు కూడా యాంఫ్లిఫయిర్ లో వినబడినట్లు అతి పెద్దగా వినబడుతోంది.
మధ్య మధ్య సర్పాలు సర సర పాకుతున్నట్లు సన్నటి సవ్వడి. మంచులో తడిసిన పచ్చగడ్డి వాసన అక్కడంతా అలుముకుని ఉంది.
వీటన్నిటి మధ్యా, ఎవరో ఆయాసపడుతూ, అతి ప్రయసమీద శ్వాస పీలుస్తున్నా చప్పుడు.
వాళ్ళు ఆగిపోయారు.
దృష్టి ముందుకు సారించాడు సాగర్.
ఎదురుగుండా పడి ఉన్నాడు ఒక మనిషి తారుకంటే కూడా కారు నలుపులో ఉన్నాడు.
కళ్ళు చిట్లించి చూశాడు సాగర్.
ఆ నలుపు అతని వంటిది కాదు. అవి......
"మైగాడ్ డ్రైవర్ యాంట్స్! రాక్షసి చీమలు" అన్నాడు సాగర్.
"చీమలా? ఎక్కడ? అంది అనూహ్య బెదిరిపోతూ.
"చూడు అతని వంటినిండా అరరె పాపం."
ఆ మనిషి శరీరం నిండా సూదిమొన మోపడానికి వీల్లేకుండా 'డ్రైవర్ యాంట్స్' అనే చీమలు ఉన్నాయి. వాటికి కళ్ళుండవు పూర్తిగా గుడ్డివి స్థిర నివాసం కూడా ఉండదు వాటికి- లక్షోపలక్షల చీమలు కిలో మీటర్ల పొడుగున బారు తీర్చి మహా సైన్యంలా వెళ్ళిపోతుంటాయి. తమ మార్గంలో ఉన్న ఏ ప్రాణినైనా కొరికి తినేస్తాయి, ఛటాకు మాంసం మిగల్చకుండా.
అవి వెళ్తున్న దారిలో పడుకోబెట్టారు ఆ మనిషిని ఎవరో అప్పటికే అతని చర్మాన్ని. కండలనీ పీక్కు తినేశాయి అవి. కొన ఊపిరితో పడి ఉన్నాడు అతను.
సాగర్ గొంతు వినగానే గుర్తుపట్టినట్లు, "సా.........ర్....." అన్నాడు అతను అతి హీనస్వరంతో. నూతిలోనుంచి వస్తున్నట్లు ఉంది అతని గొంతు.
"ఎవరూ?"
"నే.....ను.....ఇ.....బూ.....కా...." అవే అతని చివరి మాటలు. అదే అతని చివరిశ్వాస.
దుస్సహమైన ఆ బాధనుంచి అతనికి ముక్తిని ప్రసాదించింది మృత్యువు.
"అయ్యో అయ్యో ఏమయింది ఇబూకా!" అంది అనూహ్య దుఃఖంతో.
అతని దగ్గరనుంచి సమాధానం లేదు.
అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయని అర్ధమయింది సాగర్ కి. ఆ రాక్షసి చీమలు ఎదురైతే, ఏనుగులు, పెద్దపులిలాంటి జంతువులే బెదరి పక్కకి తప్పుకుంటాయి.
ఏ జంతువునో ఆ పళంగా మింగేసిన కొండచిలువ బద్ధకంతో కదల లేక పడుకుని ఉండిపొతే, రాక్షసి చీమలు కొండచిలువనీ, దాని కడుపులో ఉన్న జంతువునీ కూడా ఆరగించేస్తాయి.
ఇక మనుషులనగా ఎంత?
ఈ రాక్షసి చీమలు ఎవరి ఇంట్లోనన్నా ప్రవేశిస్తే, వాళ్ళ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని అడవుల్లోకి పారిపోతారు. అవి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి వచ్చి చూస్తే, ఇంట్లోని తినదగ్గ వాటినన్నింటినీ తినేసి ఉంటాయి రాక్షసి చీమలు నల్లులూ, బల్లులూ, పిల్లలతో సహా.
వాటికి చిక్కిన మనిషి ప్రాణాలతో బయటపడటం కల్ల అని సాగర్ కి తెలుసు.
గుండెలు నీరయిపోగా, చాలాసేపు నోటమాట రాకుండా అలాగే చూస్తూ నిలబడిపోయారు సాగర్, అనూహ్య.
మెల్లిగా సాగర్ పెదిమలు బిగుసుకున్నాయి. సౌమ్యుడయిన ఇబూకాని అంత దారుణమైన మరణానికి గురి చేసింది ఎవరు?
ఫకరా? ఎందుకు చేస్తాడలా? సాయంత్రం కొద్దిగా ఘర్షణ పడినందుకేనా? అంత పాషాణ హృదయుడు కాడే అతను.
హఠాత్తుగా గుర్తు వచ్చింది సాగర్ కి. నిన్న ఫకర్ తేనె తీసుకు రావడం.
తేనె.
అది కేవలం కాకతాళీయమేనా? లేదా అతను మనసులో కసిపెట్టుకుని ఇబూకా శరీరానికి తేనె రాసి చేమలబారు దారిలో.....
అంతకంటే ముందుకి ఆలోచించడానికి నిరాకరించింది అతని మనసు.
అసలు ఫకర్ ఏడీ? ఎక్కడికి వెళ్ళిపోయాడు.
మళ్ళీ ఇంకో ఆలోచన వచ్చింది.
ఇది ఫకర్ పని అయి ఉండదా? అతన్నీ, ఇబూకానీ కూడా ఎవరన్నా.......
వళ్ళు జలదరించింది.
ఎవరు చేసిఉంటారు అలా? ఇలాంటి కిరాతకమైన పనులు చెయ్యగలిగినవాడు చాంగ్ ఒక్కడే.
అతనే ఇబూకానీ, ఫకర్ నీ కూడా ఫినిష్ చేసేసి ఉంటాడా?
ఎందుకు?
తనకూ ఇలాంటి గతే పడుతుందని హెచ్చరికా అది?
చనిపోయిన ఇబూకా శరీరాన్ని చీమలు తినడం పూర్తి అయింది. అతన్ని వదిలి గుడ్డిగా ముందుకు సాగాయి అవి కిలోమీటరు పోడుగున్న చీమల బారు ఆ పాయింటుని దాటే సరిగ్గా గంట దాటింది.
అన్నీ వెళ్ళిపోయాక చూస్తే, తెల్లటి ఆస్థిపంజరం గోళ్ళతో, జుట్టుతో మాత్రం మిగిలింది. దాని కాళ్ళూ చేతులూ తాళ్ళతో కట్టేసి ఉన్నాయి. నోట్లో గుడ్డలు కుక్కిఉన్నాయి.
అతి భయంకరమైన చావు చచ్చాడు విశ్వాస పాత్రుడయిన నౌఖరు ఇబూకా.
అంతా అయోమయంగా ఉంది.
వెక్కివెక్కి ఏడుస్తోంది అనూహ్య "ఎంత ఘోరం ఎంత ఘోరం? మనుషులా, రాక్షసులా, ఈ పని చేసింది?"
మౌనంగా ఆమె భుజం తట్టి, నెమ్మదిగా ముందుకు నడిచాడు సాగర్.
"ఎక్కడికి వెళుతున్నాం?" అంది అనూహ్య మెల్లిగా.
"ఒక విశేషం చూపిస్తాను నీకు."
"నిధి ఉన్నచోటా?"" అంది నిరాసక్తిగా.
"కాదు ఇంకో విచిత్రం."
"ఏమిటది?" అని అడుగుతూనే ఉలిక్కిపడింది అనూహ్య.
ఉన్నట్లుండి నక్క ఒకటి శోకం పెట్టడం మొదలెట్టింది.
తలయెత్తి చూసింది అనూహ్య.
ఎదురుగా పెద్ద కొండ. దానిమీద పెద్దబండ.
ఆ బండమీద కూర్చుని మోరజాచి ఏడుస్తున్నట్లు ఊళ వేస్తోంది ఒకనక్క.
దాని వెనకగా చంద్రుడు కనబడుతున్నాడు.
ఎందుకో దిగులుగా, గుండె నీరయిపోయేటట్లు ఉంది ఆ దృశ్యం.
ఉన్నట్లుండి కొండమీద నుంచీ ఒకరాయి దొర్లుతూ వచ్చి వాళ్ళ ముందు ఆగింది.
అప్పుడు కొండమీద కనబడింది ఆ ఆకారం.
17
ఆ ఆకారాన్ని చూస్తూనే కెవ్వున అరిచింది అనూహ్య.
"ఏ......................ఏమిటిది?" అంది బెదురుగా.
చిన్నగా నవ్వి "తెలుస్తుందిలే, రా!" అంటూ ఆమెకు చెయ్యి అందించాడు సాగర్ దాన్ని పట్టుకుని సందేహంగా నడిచింది అనూహ్య.
వాళ్ళు కొండ ఎక్కడం చూడగానే నక్క బండమీంచి దూకేసి అదృశ్యమయింది.
ఆ వింత ఆకారం కూడా పారిపోవటానికి సిద్దమైనట్లు ఓ కాలు వెనక్కి పెట్టి, కొంచెం పక్కకి తిరిగి నిలబడింది క్షణంలోనే సాగర్ , అనూహ్య ఆ ఆకారానికి దగ్గరయ్యారు.
నరవానరంలా ఉందది.
ఒక్క దూకులో పారిపోబోతూ సాగర్ ని స్పష్టంగా చూడగానే ఆగి పోయింది. సాగర్ చేయి ఎత్తి "ఆగండి, వెళ్ళిపోకండి!" అన్నాడు మృదువుగా.
ఆశ్చర్యంగా నోరు తెరిచింది అనూహ్య.
ఆ ఆకారం మనిషేనా? చాలాఎత్తుగా, ఏళ్ళ తరబడి ఎండకు ఎండి, వానకు తడిచి, చలికి ముడుచుకు పోయినట్టుంది శరీరం జుట్టు జడలు కట్టి రాగి రంగుకు తిరిగి వుంది. గోళ్ళు పోడ్డుగ్గా వంకర్లు తిరిగాయి. నడుముకి ఆద్చాదనంగా గొర్రె చర్మం. పాదాలకి రాళ్ళు గుచ్చుకోకుండా ఎలుగుబంటి చర్మంతో చేసిన పాదరక్షల వంటివి.................
ముందుకి నడిచాడు సాగర్.
ఆత్మరక్షణ అనేది స్వభావంలో జీర్ణించుకుపోయిన జంతువులా అటూ ఇటూ చూశాడాయన తప్పించుకుపోయే మార్గాలు గుర్తు పెట్టుకోవడం కోసం.
ఇంకో అడుగు ముందుకు వేశాడు సాగర్.
ఆయన ఒక అడుగు వెనక్కి వేశాడు.
"భయంలేదు. వెళ్ళిపోకండి!"
ఆయన ఆగి, అనూహ్య మొహంవైపు తెరపార చూశాడు. క్రమ క్రమంగా ఆయన మొహం అనందంతో విచ్చుకుంది.
"అ...... న.....సూ.....యా!"
అక్షరాలను ఉచ్చరించి చాలాకాలమైనట్లూ, మాటలు మార్చిపోయినట్లూ పలికాడు ఆయన. "అన.....సూయ!"
సంభ్రమంగా చూస్తూ ఉండిపోయారు అనూహ్య సాగర్.
'అనసూయ అంటే బామ్మపేరు' అనుకుంది అనూహ్య.
బామ్మపేరు ఈ అడవి మనిషి కెలా తెలుసు?
"నువ్వు!"
"అనసూయ మా బామ్మ!" అంది అనూహ్య సాగర్ తో.
"బామ్మా!" అన్నాడు ఆయన పట్టలేనంత ఆశ్చర్యంతో.
ఆ నిజాన్ని జీర్ణించుకోవడానికి ఆయనకు చాలాసేపు పట్టింది. "అనసూయ మీ బామ్మా అంటే నువ్వు నా .......మనవరాలివా?"
"అవునన్నట్లు తల ఊపింది అనూహ్య.
"మా బామ్మని మీరు చూశారా?"
డెలీరియంలో ఉన్నట్లు నవ్వాడు ఆయన.
"చూశానా అంటావా? చూశాను. చూసి, ఇష్టపడి, మెళ్ళో తాళిగట్టాను కూడా."
"తాళిగట్టారా? అయితే.....అయితే......మీరు సీతాపతి తాతయ్యగారా? మీరు అండమాన్స్ జెయిల్లో చనిపోలేదూ?"
విషాదంగా నవ్వాడు ఆయన.
"లేదు తల్లీ లేదు. బ్రతికే ఉన్నాను. నువ్వు అనసూయ మనవరాలి వంటే, కొడుకు కూతురివా అమ్మా!"
ఆయనవైపు ఆర్ద్రంగా చూసింది అనూహ్య. "కొడుకు కూతురినే మీ కొడుకుని మీరు చూడలేదు కదూ?"
ఆయన గొంతు వణికింది.