Previous Page Next Page 
వేగు చుక్క పేజి 30



    నును సిగ్గుతో తల ఆడిస్తూ, "ఉహు వద్దు!" అంది అనూహ్య. అలా చెప్పడంలో, 'సరే' అన్న భావమే ప్రస్ఫుటంగా కనబడుతోంది.

    నీళ్ళలోకి దిగారు. స్వచ్చంగా ఉన్నాయి నీళ్ళు. అతను ఒక చెయ్యి పట్టుకుని ఉంటే రెండో చేత్తో వళ్ళు రుద్దుకుంటూ స్నానం చేసింది అనూహ్య.

    ఇద్దరూ పైకి వచ్చారు. తదిబట్టలు బరువుగా ఒంటికి అతుక్కుపోతూ ఉంటే నడవడం కష్టంగా ఉంది ఆమెకి. అతని మీద తన బరువంతా ఆనించి మెల్లిగా నడుస్తోంది.

    "చాంగ్ వీళ్ళని ఎక్కడికి లాక్కెళ్ళి ఉంటాడు? ఆ గుహ దగ్గరికేనా?" అనడిగింది.

    సాలోచనగా భుజాలెగరేశాడు "అయి ఉండవచ్చు. ఏమయినా, ఇప్పుడు మన నెక్స్ ట్ డ్యూటీ అదే-వాళ్ళని వెదుక్కుంటూ వెళ్ళడం."

    కొంతసేపటి తర్వాత గుహని సమీపించారు. గుహ ద్వారం దగ్గరే నించుని ఉన్నాడు డ్రాకులా చాంగ్. బిక్కుబిక్కుమంటూ లోపల కూర్చుని ఉన్నారు ఫకర్, ఇబూకా, సాగర్ కనబడగానే వాళ్ళ మొహాలు వికసించాయి.

    అనూహ్యను చూసి ముందు ఉలిక్కిపడి, తరువాత పళ్ళు పటపటా కొరికాడు చాంగ్. అతనికి పట్టేలేనంత ఆశ్చర్యంకూడా కలిగింది. ఊబిలో పడేసిన ఈ పిల్లను అవలీలగా రక్షించి తీసుకొచ్చేషాదా ఈ సాగర్. అయితే ఇంక ఇతన్ని అల్లాటప్పా మనిషిగా చూడకూడదు! అసాధ్యుడిలాగే ఉన్నడితను.

    ఇతని విషయంలో కాస్త ఎక్స్ ట్రా జాగ్రత్త తీసుకోవాలి తను, తన అలవాటుకి విరుద్దంగా.

    తప్పదు మరి.

    తుపుక్కున ఉమ్మేశాడు.

    "ఇదిగో నువ్వింక మాతోపాటు ఉండడానికి వీల్లేదు" అన్నాడు సాగర్ తో. "నిదికోసం వేట బురదగుంటలో చేపల వెతలా తుస్సుమంది రసగుల్లాలాంటి ఈ పిల్లను మాత్రం ఇక్కడొదిలేసి నువ్వింకెక్కడికన్నా దయచెయ్!" అన్నాడు మొరటుగా.

    "మిస్టర్ సింగ్ చాంగ్, ఉరప్ డ్రాకులా" అన్నాడు సాగర్ శాంతంగా.

    "నువ్వు పరమ లుచ్చాగాడివని తెలిసినా కూడా నిన్ను కాపాడటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను నేను. ఎందుకంటావ్ నేనొక షిప్పుకి కేప్టెన్ ని. నా షిప్పులో ఎక్కిన ప్రయాణీకులందరినీ క్షేమంగా దరిచేర్చడం నా నైతిక బాధ్యత. తలుచుకుంటే నిష్ప్రయోజనమైన  నీ జీవితాన్ని క్షణంలో అంతం చెయ్యగలను. కానీ చట్టాన్నీ నా చేతుల్లోకి తీసుకుని, ఒక మనిషి ప్రాణాలని తియ్యడం తప్పని నమ్మేమనిషిని నేను తెలిసిందా."

    ఆగ్రహంతో ఊగిపోతూ అతని మీదకు దూకబోయాడు చాంగ్.

    "ఆగు" అన్నాడు సాగర్ అధికారం ఉట్టిపడే స్వరంతో.

    సందేహంగా చూస్తూ, ఆగాడు చాంగ్.

    "హీనతి హీనమైన నీ హరిత్ర అంతా నాకు తెలుసు చాంగ్- డబ్బు మీద ఆశతో. శాడిస్టు మోంటాలిటితో నువ్వు చేసిన కిరాతకాల లిస్టు నా దగ్గర ఉంది. చెప్పమంటావా?"

    వింటున్న చాంగ్ కళ్ళు చీమ తలకాయల్లా చిన్నవిగా అయ్యాయి.

    గబగబ చెప్పడం మొదలెట్టాడు సాగర్. "నీతో పని చేసిన సాటి నావికుల మీద కోపం వస్తే, వాళ్ళని ఏ మారు మూలాన ఉన్న తీరానికో తీసుకెళ్ళి, వాళ్ళ సమాధులు వాళ్ళ చేత తవ్వించి, సజీవంగా  ఖననం చేశావు. ఉత్త చేతులతో కుత్తుకలు నలిపి చంపావు కొంతమందిని.

    మంచులా అతిచల్లగా ఉన్న నీళ్ళ పీపాలలో పసిపాపాలను ముంచి, ప్రాణాలు తీశావు ముక్కుపచ్చలారని చిన్నపిల్లలను గాల్లోకి ఎగరేసి, వాళ్ళు కింద పడేలోగా ఆ సుకుమారమైన శరీరాల్లోకి ఎన్ని బుల్లెట్లు పేల్చగలనో అని ప్రయత్నింఛి చూసేవాడివి. మనుషుల పాదాలకు తాడుగట్టి తల క్రిందులుగా వెళ్ళాడదీసి, ఆ స్థితిలో వాళ్ళెంతసేపు బతకగలరో అని  నీ నేస్తాలతో పందేలు కట్టేవాడివి. బతికి ఉన్నవాళ్ళ శరీరాలు నిలువునా చీల్చేవాడివి. తలలకూ, కడుపుకీ, కన్నాలు పెట్టి, గోళ్ళూ, కళ్ళూ పీకేసే వాడివి. నీ కుతూహలం కోసం, జంతువుల ఇంద్రియాన్ని మానవ స్త్రీల శరీరాల్లో ......" అని  ఆగి అతి కష్టంమీద కోపాన్ని అదుపులోకి తెచ్చుకున్నాడు సాగర్.

    "కాలభైరవుడి లాంటి కుక్కలని ఉసిగోపిలి మనుషులని గుడ్డ పెలికల్లా చింపించి, చంపేవాడివి నువ్వు ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి ప్రాణాలు తీసేవాడిని లోహాలని అతికించడానికి ఉపయోగించే సోల్టరింగ్ ఐరన్ తో వాతలో పెట్టేవాడివి.

    ఒక్క ముక్కలో చెప్పాలంటే నీలాగా ఇన్ని ఘెరాలు చేయించినవాడు చరిత్రలో ఇంకొక్కడే వున్నాడు చాంగ్. అతను హిట్లర్. అతన్ని పాలనలో ఆర్యుల సంతతి అయిన జర్మనులు తమ జాతిని నిశ్శేషంగా నాశనం చెయ్యడానికి కంకణం కట్టుకుని తలపెట్టిన మారణహొమంలో చేసిన నేరాలూ, ఘెరాలూ ఇలాంటివే. వాళ్ళని మించి పోయావు నువ్వు.

    నిజం చెప్పాలంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి కాకులాకి, గద్దలకీ వెయ్యాలని నాకు తహతహగా వుంది చాంగ్.

    కానీ, చెప్పానుగా, చట్టాన్ని నా చేతుల్లోకి తీసుకోను. నిన్ను సురక్షితంగా, తీసుకెళ్ళి ఇండియన్ పోలీసులకి అప్పచెబుతాను. నువ్వు ఏ దేశంలో ఈ నేరాలు చేశావో, ఆ దేశానికి  నిన్ను పంపిస్తారు వాళ్ళు. నాజీ జర్మనులు తాము చేసిన నేరాలకుగానూ న్యూరెమ్ బర్గ్ విచారణలో శిక్ష పొందినట్లు, నువ్వు కూడా అతి తీవ్రమైన శిక్ష అనుభవించాలని ఆశిస్తున్నాను చాంగ్! విష్ యూ బాడ్ లక్."

    దెయ్యం పట్టిన వాడిలా పెద్దగా కేకలు వేశాడు చాంగ్. "ఇవన్నీ నీకెలా తెలుసు!"

    "తెలుసు అంతే"

    అతి వేగంగా వచ్చి సాగర్ గొంతు పట్టుకున్నాడు చాంగ్.

    "వదులు" అన్నాడు నిర్భయంగా. "నువ్వు ఈ ద్వీపంలో నుంచి తప్పించుకు బయటపడాలంటే బోటు ఒకటి కావాలి. ఆ బోటు ఎక్కడుందో తెలిసిన మనిషిని నేనొక్కడినే."

    స్లో మోషన్ పిక్చర్ లో లాగా నెమ్మదిగా చేతులు పట్టు సడలించాడు చాంగ్. అతి మెల్లగా చేతులు వెనక్కి తీసుకున్నాడు.

    "ఉంది. బోటు నడపడానికి నీబోటి దున్నపోతులాంటి మనిషి ఒకడు అవసరం నాకు. పైగా, బోటులో చాలా బరువైన సరుకు రవాణా చెయ్యబోతున్నాం."

    "సరుకా? ఏం సరుకు?" అన్నాడు చాంగ్ అనుమానంగా.

    నిర్లక్ష్యంగా భుజాలు ఎగరేశాడు సాగర్.

    "బంగారం, వెండీ, నగలూ, నాణ్యాలూ, ఎట్ సెట్రా, ఎట్ సెట్రా......"

    నిలువుగుడ్లు పడ్డాయి చాంగ్ కి. "బంగారమా? బంగారమెక్కడిది? కొంపదీసి నువ్వు....."

    "అవును! నీ ఊహ కరెక్ట్! నిధి ఎక్కడుందో కనిపెట్టాను నేను."

    చాంగ్ మొహంలో త్వరత్వరగా రంగులు మారాయ్ తను వింటుంది జీర్ణించుకోవడానికి చాలా సేపు పట్టింది అతనికి.

    "వెధవది అయితే సాధించామన్నమాట!" అన్నాడు ఉత్సాహంగా.

    "సంబరపడకు! ముందున్నది నీ ముసళ్ళ పండగ" అన్నాడు సాగర్.

    అది చెవిని పెట్టలేదు చాంగ్. ముందు నిధిని చేరుకుంటే, తర్వాత వీళ్ళందరి సంగతీ తేల్చవచ్చనుకుంటున్నాడు అతను.

    అనూహ్య భుజం చుట్టూ చెయ్యివేసి, నిబ్బరంగా గుహలోకి వచ్చాడు సాగర్.

    కోపాన్ని దిగమింగి, అయిష్టంగానే కొద్దిగా పక్కకు తప్పుకుని దారి ఇచ్చాడు చాంగ్.

    లోపలికి రాగానే ఆనందంగా అతన్ని చుట్టుముట్టేశారు ఇబూకా, ఫకర్, ఉరాంగ్ ఉటాన్, స్వరూపా, సింగూ.

    ఇంతవరకూ జరిగిందేదో జరిగిపోయింది. ఇకనుంచీ మనం క్రమ శిక్షణతో, ఒక క్రమ పద్దతిలో ముందుకు సాగాలి. లేకపోతే ఇక్కడ నుంచీ బయటపడడం కష్టం, ఓకే?" అన్నాడు సాగర్.

    వెంటనే పరిస్థితిని తన కంట్రోల్ లోకి తెచ్చుకుంటూ ఆర్డర్స్ ఇవ్వడం మొదలెట్టాడు.

    "ఇబూకా చీకటి పడిపోతుంది ఇంకో గంటలో? ఇంక నువ్వు వంట ప్రయత్నాలు మొదలెట్టు. చాంగ్! నువ్వు వెళ్ళి కట్టెలు కొట్టుకురా. అనూహ్యా నువ్వు స్వరూపతో కలిసి గుహ శుభ్రం చెయ్యి. సింగ్ సాబ్, మీరు కాసేపు విశ్రమించండి"

    గబగబ పనుల్లో మునిగిపోయారు అందరూ. ఉడభక్తి ప్రదర్శిస్తునట్లు తనుకూడా వాళ్ళతోబాటు  హడావిడిగా అటూ ఇటూ తిరుగుతోంది ఉంరాంగ్ ఉటాన్.

    సాగర్ చెప్పినట్లు తను చెయ్యవలసి రావడం తలకొట్టేసినట్లు వుంది చాంగ్ కి. కానీ బంగారం మీద ఆశతో అతను  పౌరుషాన్ని దిగమింగి, సమయం కోసం కాచుకుని వున్నాడు.

    "ఫకర్! వెళ్ళు! వెళ్ళి నీ బూమారాంగ్ తో మళ్ళీ ఒక కోడినో, కొక్కిరాయినో కొట్టుకురా." అన్నాడు. ఇబూకా ఉత్సాహంగా, మళ్ళీ సాగర్ నాయకత్వం కింద క్రమశిక్షణతో పనులు జరగడం అతనికి సంతోషంగా వుంది.

    ఇబూకా మాటలు వినగానే ఎప్పుడూ లేనిది ఫకర్ మొహం  చిట్లించాడు.

    "అన్నీ నాకే చేబుతావేం? నేనిప్పుడు నీ నౌఖర్ నీ కాను. నువ్విప్పుడు నా బాస్ వీ కావు. ఆహొదాలూ, ఆ బాధలూ  అన్నీ షిప్పులోనే. ఇది ఆడవి, ఇక్కడ ఎవరూ, ఎవరికీ బానిసలు కారు."

    "అంత కోపమెందుకు ఫకర్? ఇప్పుడు నేనేమన్నాననీ?" అన్నాడు ఇబూకా ఆశ్చర్యంగా.

    జవాబు చెప్పకుండా, ధుమధుమలాడుతూ వెళ్ళిపోయాడు ఫకర్.

    అతని ప్రవర్తన వింతగా కనబడింది సాగర్ కి.

    పెద్దవాడైన సింగ్ మగత నిద్రలోకి జారిపోయాడు, వెంటనే స్వరూప వెళ్ళి. చాంగ్ తో ఏదో గుసగుసగా చెప్పింది.

    అది గమనించాడు సాగర్. హఠాత్తుగా ఆ గాలిలో విషం అలముకున్నట్లు అనిపించింది అతనికి. ఇదివరకులేని కొత్త అనుమానాలూ స్పర్థలూ బయల్దేరినట్లనిపించింది.

    ఫకర్ కి ఉన్నట్లుండి అంత కోపం ఎందుకు వచ్చింది? అలాంటి తత్వంకాదే అతనిది.

    అరగంట తర్వాత తిరిగి వచ్చాడు ఫకర్.  అతని చేతిలో జెయింట్ సైజు తేనె తుట్టి ఉంది.

    "ఇంకేం దొరకలేదు బాస్! తేనెపట్టు కనబడితే కొట్టుకొచ్చా!" అన్నాడు సంజాయిషీ చెబుతున్నట్లు అతనెందుకో, పక్కచూపులు చూస్తున్నాడు.

    అతన్ని పరిశీలనగా  చూశాడు సాగర్.

    పెద్ద పెద్ద  ఆకులు తెంపుకొచ్చి, వాటిని దోనెల్లాచేసి, తేనె పిండారు. పిండారబోసినట్లున్న వెన్నెల్లో కూర్చుని, మధురాతి మధురంగా ఉన్న ఆ తేనె తాగుతుంటే హాయిగా ఉంది.

    తర్వాత ఒక్కొక్కళ్ళుగా నిద్రలోకి జారారు.

    అర్థరాత్రి అయ్యాక నెమ్మదిగా లేచాడు సాగర్. సవ్వడి చెయ్యకుండా అనూహ్య దగ్గరికి వచ్చాడు.

    "ఒకసారి బయటికిరా." అన్నాడు గుసగుసగా.

    "ఎందుకు?"

    "నిన్ను కొరుక్కు తినడానికి కాదులే రా"

    మెల్లిగా లేచి కూర్చుంది అనూహ్య.

 Previous Page Next Page