Previous Page Next Page 
అగాధాల అంచులో పేజి 29

    నందితాదేవి గబుక్కున తలుపు తీసింది.

    ఆమె ఎదురు రూమ్ లోకి వెళ్లినట్లుంది. తలుపులు అప్పుడే మూసుకుంటున్నాయి. జరీ చీర చెంగు కనిపించింది.

    "అదేమిటి ఆమె ఆ రూమ్ లోకి వెళ్ళింది?ఆ వెధవ చూపులు చూసే పిల్లిగడ్డం వాడు కదా వుంది? ఆమె కారిడార్ చివరి రూమ్ లో వున్నానని చెప్పింది. తను వెంటనే తలుపుతీసింది. కారిడార్ చివరిదాకా నడవాలంటే కొద్దిసేపు పడుతుంది. తను భ్రమ పడలేదు. ఆమె ఎదురు రూమ్ లోకే వెళ్ళింది. పోనీ వెళ్ళిందే అనుకో వెంటనే బైటికి రాదేం? వెధవ చూపుల వాడూ వెర్రి నవ్వు ఆమె కలిసి... ఛీ-ఛీ వెధవగోల ఆలోచిస్తూ ఎదురు రూమ్ తలుపులెప్పుడు తెరుచుకుంటాయా అని అలానే చూస్తూనుంచుంది నందితాదేవి.

    అరగంట దాటింది. ఎదురు రూమ్ తలుపులు తెరుచుకోలేదు.

    కారిడార్ చివరి నుంచి రాజు వస్తూ కనిపించాడు.

    "పృధ్వీరాజ్ కనిపించాడేమో?" పురివిప్పిన నెమలిలా నాట్యమాడింది ఆమె మనసు.

    "ఇక్కడ నుంచున్నావేం?" రాజు వస్తూ అడిగాడు.

    "నీకోసమే!" అని నాలుక కొరుక్కుంది ఆమె. రాజు గదిలోకి రాగానే తలుపులేశాడు.

    అతను చెప్పే వార్తకోసం ఆతృతగా ఎదురుచూసింది ఆమె.

    "పృధ్వీరాజ్ అక్కడ లేడు" బూటు లేసు విప్పుతూ నిదానంగా చెప్పాడు అతను.

    "అబద్ధం."

    "గట్టిగా అరవటం తగ్గించుకో నందితాదేవీ! దీనిలో అబద్ధం ప్రసక్తి ఏముంది? నా ఫ్రెండ్ స్వయంగా వెళ్ళి చూశాడు. పృధ్వీరాజ్ రూమ్ తలుపులు వారంనుంచీ తాళం వేయబడి ఉన్నాయట. ఇరుగూ పొరుగూ చెప్పిన వార్త. అతను అర్జంట్ గా వూరికెళ్ళాడని, వాళ్ళ నాయనమ్మగారు అకస్మాత్తుగా మరణించారుట. టెలిగ్రాం వస్తే..."

    అతని మాటలకి అడ్డుతగిలి "అబద్ధం ఇది మరో పచ్చి అబద్ధం. పృధ్వీరాజ్ కి నాయనమ్మేలేదు" గట్టిగా అరిచినట్లే అంది ఆమె.

    "నా ఫ్రెండ్ స్వయంగా వెళ్ళి ఎంతో గట్టిగా ఎంక్వయిరీ చేసి తెలుసుకున్న విషయం ఇది, నమ్మటం, నమ్మకపోవటం ఇహ నీ ఇష్టం. అబద్ధాలాడితే నాకేం ఒరుగుతుంది?"

    పంపు తిప్పింది ఆమె.
    "అందరూ మోసం చేసేవాళ్ళే. అక్కడేమో బలవంతం పెళ్ళి. ఇక్కడికేమో నీవు తీసుకువచ్చావు. నా పృధ్వీరాజ్ నాకు కాకుండా పోయాడు. ఇంక నేను హాయిగా మరణించటం మంచిది!" ఓ పక్క వెక్కిళ్ళు పెడుతూనే నిష్ఠూరంగా బాధగా ఏదేదో అంటూనే ఉంది!

    అతను మాటాడలేదు! నచ్చజెప్పే ప్రయత్నమూ చేయలేదు! తీవ్రంగా ఆలోచిస్తూ కూర్చున్నాడు.

    కొద్దిసేపు ఆగి కళ్ళు తుడుచుకున్నాడు "మాటాడవేమిటి? నే ఏడుస్తుంటే నవ్వులాటగా వుందా?" గయ్యిమంది నందితాదేవి!

    "నువ్వు ఏడుస్తున్నా నీ మోము ముద్దొస్తూనే ఉంది" అని జోక్ వేసే పరిస్థితిలోలేను! నేనూ నీకన్నా వెయ్యి రెట్లు బాధపడుతున్నాను. నేను మోసగాడినికాను!నన్నర్ధం చేసుకోమని మరోసారి చెపుతున్నాను! పృధ్వీరాజ్ కి నాయనమ్మ లేనిమాట నిజం కావచ్చు! ఆ టెలిగ్రాం దొంగ టెలిగ్రాం కావచ్చు! ఇందులో కూడా ఏదైనా మిష్టరీ వుండవచ్చు! నువ్వు పృధ్వీరాజ్ ని ప్రేమిస్తున్నట్లు మీ వాళ్ళకి చెప్పావా?"

    "బలవంతానా నాకు పెళ్ళి చేయబోతుంటే చెప్పాను! అతన్ని ప్రేమించానని అతన్ని తప్ప మరొకళ్ళని నా బొందిలో ప్రాణముండగా పెళ్ళాడనని చెప్పాను..."

    "గుడ్, అతని అడ్రస్ చెప్పే అవసరం వచ్చిందా?"

    "పృధ్వీరాజ్ ని పిలుస్తాము! అతను నిన్ను పెళ్ళాడనంటే అప్పుడు సంతోషంగా ఈ పెళ్ళికి ఒప్పుకుంటావా? అని అడిగారు! నా రాజు నన్ను కాదనడు అంటూ అడ్రస్ ఇచ్చాను, వెళ్ళాం! తాళం వేసి వుంది. అని నీలాగానే వాళ్ళూ అబద్ధం చెప్పారు."  

 Previous Page Next Page