"చెల్లెమ్మ ఊరినుంచి వచ్చిం తరువాత ఈ పెట్టె ఎక్కడ కొన్నదీ అడిగి కనుక్కో. ఖరీదుకూడా కనుక్కో (ఒక్కోప్రశ్న వేస్తుంటే చచ్చిపోతున్నాడు. అప్పుడే ఏమయింది లేరా నాయనా)"
ఇలా వాళ్ళిద్దరూ పెట్టెగురించి పైకొకరకం మాట, లోపల తిట్టుకుంటూ పది నిమిషాలు గడిపారు.
ఈ ప్రపంచంలో మూడురకాల మనుషులు.
బాధలని దాచుకొని పైకి నవ్వేస్తూ వుండేవాడు. బాధని తమలో దాచుకొని వంటరిగా కుమిలిపోతారుగాని పరులని బాధకి గురిచేస్తూ తమ గోడు వెళ్ళబోసుకోరు.
కొందరు తమతోపాటు పక్కవాళ్ళు బాధపడాలన్నట్లు సమస్యలని సృష్టించుకొని బాధపడుతూ, యితరుల తలకి సమస్యల తోరణం తొడిగి వాళ్ళని బాధలకి గురిచేస్తుంటారు.
మూడోరకం__వాళ్ళ బాధని తొలగించుకొని పక్కవాళ్ళ నెత్తిపై ఆ బాధని పెట్టి వాళ్ళు బాధపడుతుంటే తన అనుభవాన్ని, గతాన్ని మరచి బాధపడుతున్న వ్యక్తిని చూసి మనసారా ఆనందించడం. యిదోరకం శాడిస్ట్ మనస్తత్వం.
కోదండరామయ్య మూడోరకం వ్యక్తి.
పెట్టె గురించి కొద్దిసేపు మాటలు అయిం తరువాత మామూలు మాటల్లోకి దిగారు యిరువురు.
"ఏమిటి పొద్దున్నే వచ్చావు?" రంగశాయి అడిగాడు.
"ఏం రాకూడదా?" కోదండరామయ్య నవ్వుతూ అడిగాడు.
"రాకూడదు అనే ధైర్యం నాకుందా?" అయినా ఈ ఇంట్లో సరాసరి బెడ్ రూమ్ లోకి వచ్చే చనువు నీకెలాగూ వుంది."
వెంకుమాంబ ఆలస్యంగా వంటచేయటం మొదలు పెట్టి నందువల్ల వంటయ్యేలోపల కాలక్షేపంగా వుంటుందని ఇలా వచ్చానని కోదండరామయ్య చెప్పాడు.
అరగంట తర్వాత.
రంగశాయి వద్ద శలవు తీసుకుని కోదండరామయ్య ఇంటికి బయలుదేరాడు.
ప్రస్తుతానికి కోదండరామయ్య చాప్టర్ క్లోజ్.
16
"ఓరి దేముడోయ్! నా కొంప ముంచావు కదయ్యా!"
ఈ మాట సరీగ ఏ వందసార్లో అనుకుని వుంటాడు రంగశాయి.
ఎవడో గోడ పక్కన పెట్టె పెట్టి గోడదూకి పారిపోతే ఆ విషయం వెంటనే పోలీసులకి చెప్పక పెట్టెని ఇంట్లో పెట్టుకోడం మొదటి పొరపాటు.
వాకిట్లో ఏదో గలాటా అవుతుంటే వెళ్ళి చూసి, అది దొంగకి సంబంధించిన విషయం అయితే, మా యింట్లో కూడా ఎవడో దొంగదూరి, నేను తలుపుతీయడంతో పెట్టెని యిక్కడే వదిలేసి కాలికి బుద్ది చెప్పాడు. ఇదేమిటో చూడండి అని అనక పోవడం రెండో పొరపాటు.