"కమలా: నా గురించి ఆలోచించవద్దు నువ్వు నా మీది జాలితో ధనవంతుణ్ణి వదులుకోవద్దు నాకు కావలసింది నీకనికరం కాదు జాలి కాదు ప్రేమ వస్తాను గుడ్ లక్" అంటూ అభిమానధనుడైన మోహన్ చివ్వునలేచి వెళ్ళిపోయాడు.
కమల శిలాప్రతిమలా ఉండిపోయింది ఆ తరువాత ఏమైందో మనకు అనవసరం ఇలాగే కొందరు భర్తలుభార్యల్ని కనికరిస్తున్నట్టు ప్రవర్తిస్తారు కొందరు భార్యలు కూడా అలాగే ప్రవర్తిస్తారు.
మీరు ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేస్తే మరొకరితో చెప్పకండి అందువల్ల మీ గౌరవమేపోతుంది మీరు కృతజ్ఞతను ఆశించకుండా ఎవరికైనా సహాయం చేసి మరచిపోయినప్పుడే సహాయాన్ని అందుకున్న వ్యక్తి ఎంత కృతజ్ఞతాభావంతో మీ యెడల ప్రవర్తిస్తాడో తెలుస్తుంది.
సహాయాన్ని అందుకున్నవాడే మీకు ద్రోహం చేసినా ఆ సహాయం గురించి మాట్లాడకండి అతను మానవత్వంగల మనిషే అయితే వెంటనే తన ప్రవర్తనకు సిగ్గు పడతాడు.
కర్ణ పిశాచి
ఆదివారం శీలను చూసి చాలారోజులు అయిందని వాళ్ళింటికి వెళ్లాను శీలకు రెండేళ్ళనాడు పెళ్ళి అయింది ఆ అమ్మాయి నా కజిన్ కూతురు శీల భర్త ఒక బాంకులో పని చేస్తున్నాడు.
నేను తలుపు కొట్టగానే దాదాపు ముప్ఫయ్ సంవత్సరాల వయసులో ఉన్న స్త్రీ తలుపు తీసింది ఆమె మహాసౌందర్యవతి ఆమె మీద నుంచి కళ్ళు మరల్చుకోలేకపోయాను శీల "రా అత్తయ్యా" అంటూ ఎదురు వచ్చింది.
ఆ సౌందర్యవతి మూతి మూడు వంకర్లు తిప్పుతూ లోపలకు వెళ్ళింది శీల కళ్ళు ఉబ్బి ఉన్నాయి "ఏమిటి అలా ఉన్నావ్?" అని అడిగాను శీల గాభరాగా కళ్ళు తిప్పి నాలుగు వైపులకూ చూసింది "ఏమిటంత భయపడుతున్నావ్?" మా ఇంట్లో ఒక కర్ణ పిశాచి ఉన్నది జాగ్రత్త చిన్నగా మాట్లాడు" అన్నది శీల.
శీల నన్ను తన గదిలోకి తీసుకెళ్ళి తలుపులు వేసింది ఆ అందమైన యువతి శీల ఆడబిడ్డ అనీ, భర్త వదిలేశాడనీ చెప్పింది కారణం --- ఆమె వల్ల అత్తవారింట్లో సుఖశాంతులు లేకుండా పోయాయట.
ఇరుగుపొరుగుల్లో కూడా తగాదాలు తెచ్చేదట చాటుగా మాటలు వినే అలవాటు ఉన్నదట ఒకరోజు శీల దాదాపు పదకొండు గంటలకు రాత్రి తలుపులు తీసుకుని బయటికి వచ్చి నిలువునా వణికిపోయిందట.
చీకట్లో తెల్లచీరలో గది తలుపులు దగ్గర నిలుచుని ఉన్న స్త్రీని చూసి దడుచుకున్నదట ఏ దయ్యమోనని ఆ స్త్రీ గాభరాగా లోపలకు వెళ్ళిపోయిందట అప్పుడు అది దయ్యం కాదని, తన ఆడబిడ్డేననీ తెలుసుకుని విస్తుపోయింది.
అంతేకాదు ఉన్నవి లేనివి తల్లికి చెబుతుందట తనను ఎంతో బాగా ఒకప్పుడు చూసిన అత్తగారు ఇప్పుడు చీటికీమాటికీ సాధిస్తుందట ఒకోసారి తన భర్త కూడా విసుక్కుంటాడట. ఆవిడ మాత్రం శీలతో చాలా తియ్యగా మాట్లాడుతుందట ఆమె మాటలు వింటూంటే, ఆమె అందమైన ముఖంలోకి చూస్తుంటే ఈవిడేనా ఇంత భయంకరంగా ప్రవర్తిస్తూంది అని శీలకి అనిపిస్తుందట.
చాటుగా ఇతరులు మాట్లాడుకునే విషయాలు వినడం, ఆ విన్న విషయాలను పూర్తిగా మార్చి, మరో రంగు పూసి వేరే వాళ్ళముందు చెప్పడంలో వారికి ఎలాంటి ఆనందం లభిస్తుందో మనకు తెలియదు మనస్తత్వ శాస్త్రవేత్త చెప్పాలిసిందే.
నాకు తెలిసిన ఒకామెకు ఒక్కడే కొడుకు అతన్ని అపురూపంగా పెంచుకుంది కాని ఆమె వస్తుందంటే ఆ వూళ్ళో అందరూ భయపడేవారు ఎవరింటికయినా వెళ్ళితే తిన్నగా లోపలకు వెళ్ళకుండా తలుపు చాటుగా నిలుచునేదట చెవులు నిక్కబొడిచి ఆమె కొడుక్కి పెళ్ళయింది వేరు కాపరం పెట్టారు.
ఆమె కోడలు నాకు బాగా తెలుసు "పాపం! ఆ ముసలమ్మను ఒక్కరైనూ వదిలి వేరు కాపరం పెట్టడం ఏమి బాగాలేదు" అన్నాడు. "ఏం చెయ్యమంటావ్? రాత్రిళ్ళు సమయంలోనైనా తలుపు తెరిచి మా గది ముందే తారట్లాడుతూ కనిపిస్తుంది" అంటూ ఇంకా ఏదేదో చెప్పింది.
ఇలాంటి వారు తమ స్వార్థం కోసం పరనింద వేస్తారు అందువల్ల అవతల వ్యక్తి ఎదుటివ్యక్తి దృష్టిలో చులకన అవుతాడనీ, తన ప్రాముఖ్యం పెరుగుతుందనీ, తన మంచితనం చూసి ముగ్ధులౌతారనీ, పరనిందకు పాల్పడేవారి భ్రమ. కొందరికి ఈ కళలో మంచి ప్రావీణ్యత ఉంటుంది.
కొంతకాలం వరకైనా కొందర్ని నమ్మిస్తారు ఫలితంగా సన్నిహితులు కూడా ఒకర్ని ఒకరు అపార్థం చేసుకునే పరిస్థితులు వస్తాయి.
ఇటువంటి వాళ్ళు ఇళ్ళల్లో, ఆఫీసుల్లో, ఎక్కడంటే అక్కడే తటస్థ పడతారు శీల ఆడబిడ్డ విషయం వినగానే నాకు చదువుకొనే రోజులు గుర్తుకు వచ్చాయి రమ గుర్తుకు వచ్చింది హాస్టల్ భోజనం చాలా దారుణంగా ఉండేది.
అన్నంలో తెల్లటి చచ్చిన పురుగులు కన్పించేవి అవి మజ్జిగ పోసుకున్నప్పుడు స్పష్టంగా కన్పించేవి చాలామంది మజ్జిగ అన్నం తినకుండానే చేతులు కడుక్కునేవారు ఒకసారి అందరం కలిసి భోజనాల దగ్గిర కూర్చుని, వడ్డించాక తినకుండా లేచి వెళ్ళాలనీ, ఆ విధంగానైనా పెద్దవారి నోటీసుకు వస్తుందనీ నిర్ణయించుకున్నాం.
కాని మా నిర్ణయం తెల్లారేసరికి వార్డెన్ కు తెలిసిపోయింది ఎంతో ప్రయత్నం మీద విభీషణుణ్ణి పట్టగలిగాం లంకరహస్యం విభీషణుడు పరాయివాడైన రాముడికి చెప్పాడు అందుకే రమను 'విభీషణి' అనేవాళ్ళం.
ఒకరోజు కాలేజీలో రేఖ నేను బొత్తిగా చదవడం లేదు ఏం, పాసవుతానో ఏమో: అన్నది ఆమె బాగా చదువుతుందనీ: కాలేజీలోని ఆడపిల్లలందరికంటే ఎక్కువ మార్కులతో ప్రతి పరీక్ష పాసవుతుందని అందరికీ తెలిసిన విషయమే అయినా ప్రతి పరీక్ష ముందు అలాగే అంటూ ఉంటుంది.
చాలామందికి ఈ అలవాటు ఉంటుంది ఆ రోజు నాకు ఒళ్ళు మండింది రేఖా, నేనూ చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం "దొంగ: రాత్రిళ్ళు రెండుగంటలకు తప్ప నిద్రపోవటం లేదట అంతగా చదువుతూ ఈ అబద్ధాలెందుకూ?" అన్నాను నోరు జారి ఇంకేముంది: విభీషణి విన్నది? వెంటనే రేఖకు మరో నాలుగుమాటలు కలిపి చెప్పేసింది రేఖ చాలా కాలం నాతో మాట్లాడలేదు.
ఇలాంటి వాళ్ళు పరాయి ఇల్లు తగలబెట్టి చలికాచుకుంటారు చివరికి రమను అందరం దూరంగా ఉంచసాగాం. నలుగురు మాట్లాడుకుంటున్నప్పుడు రమ వస్తే టక్కున మాటలు ఆగిపోయేవి. ఆమె నాలుకను తియ్యటి కత్తి అనేవాళ్ళు ఆమెకు కర్ణ పిశాచి అనే బిరుదు ప్రదానం కూడా చేశారు.
ఇలాంటి వారు మనం ఎవర్ని గురించి అయినా వ్యతిరేకంగా మాట్లాడితే వెంటనే మోసుకెళ్తారు కాని, మనం వాళ్ళముందు ఏవర్నయినా ప్రశంశించామనుకోండి, ఆ విషయం మాత్రం చస్తే చెప్పరు ఇలాంటివారు క్రమంగా మిత్రుల సంఖ్య కంటే శత్రువుల సంఖ్య పెంచుకుంటారు.
మన పెద్దలు 'నవరసాల'ను మాత్రమే ఉంచారు పరనిందారసం పదోరకంగా వర్ణించవచ్చును ఇది రసరాజుగా ఉండేది పరనిందతో చాటుగా మాటలు వినడంలో, ఇద్దరి మధ్యా తగాదా పెట్టడంలో ఉన్న ఆనందాన్ని వర్ణించి అద్భుతమైన ఖండకావ్యాన్ని రాయవచ్చును.
నాకు ఇలాంటి వారిని చూసినప్పుడు తామర వచ్చిన శరీరం గుర్తుకు వస్తుంది తామర ఉన్నచోట గోరువెచ్చని నీళ్ళు పోసి గోకడంలో ఒక విధమైన ఆనందం లభిస్తుంది కాని అధికంగా గోకినట్లయితే రక్తం కారి పుండు పడుతుంది అంటే ఆ ఆనందంతో తామర ఉన్న వ్యక్తి తన శరీరాన్నే గాయపర్చుకుంటున్నాడనే విషయం మర్చిపోతాడు.
అలాగే చాడీలు చెప్పే వ్యక్తులు కూడా వారికి అలా చెప్పడంలో ఏదో తెలియని, తామర మీద వేడి నీళ్ళు పోసుకున్నప్పుడు కలిగే లాంటి ఆనందం కలుగుతుంది అందువల్ల తమకు తామే హాని చేసుకుంటున్నామనే జ్ఞానం ఉండదు మారడానికి ప్రయత్నించరు నలుగురు పట్టుకొని దులిపేస్తే తమను కాదన్నట్టు వెళ్ళిపోతారు 'థిన్ స్కిన్డ్' అన్నమాట.
"కుక్కలు ఉన్నాయి జాగ్రత్త" అనే బోర్డు గేటు మీద చూసి జాగ్రత్త పడతాము అలాగే ఇలాంటి వ్యక్తులకు కూడా దూరంగా ఉండమని చెప్పే సంకేతాన్ని దేన్నయినా కనిపెడితే ఎంత బాగుణ్ణు:
ముఖం మీద విమర్శించేవాడే మిత్రుడు
మిమ్మల్ని మీ ముఖం మీద విమర్శించే వాళ్ళే మిత్రులు అంటే మీరు అంగీకరించరేమో! అలా చెయ్యడం అందరిమిత్రులు వల్లాకాదు అంతమాత్రం చేత వారు మిత్రులు కాదు అనడం లేదు.
మిత్రులుగా నటిస్తూనే, చాటుగా విమర్శించే వారికంటే శత్రువు మరొకడు ఉండడు. శత్రువును దూరంగా వుంచుతాము మిత్రులుగా కన్పించే శత్రువులను గుర్తించలేక మోసపోతాము ముఖం మీదే విమర్శించాలంటే ధైర్యం కావాలి.
అతనిలో నిజాయితీ కూడా వుండాలి అప్పుడు ఆ విమర్శ మీ లోపాలను ఎత్తి చూపించి, వాటి నుంచి బయటపడే దానికి సహాయకారి అవుతుంది ముఖం మీద విమర్శించే వారిని చాలామంది అర్థం చేసుకోరు విమర్శను సహనంతో అంగీకరించి, తన లోపాల గురించి ఆలోచించేవారు కూడా అతి తక్కువమందే ఉంటారు.
ఒకసారి ఒక టీచర్ ఒక అమ్మాయిని "ఎందుకమ్మా ఇవ్వాళ ఆలస్యంగా వచ్చావు" అని అడిగిందట. దానితో ఆ అమ్మాయి "మేడమ్ రోజూ ఆలస్యంగా వచ్చేవాళ్ళను ఏమి అనరు నేను ఎప్పుడో ఒకసారి వస్తే అడుగుతారు" అన్నదట.