ప్రసాద్ ఆ అమ్మాయి వంక చూశాడు. చామనచాయగా పీలగా వుంది. ఆ మొహంలో కళ్ళు వకటే కనిపిస్తున్నాయి. ఆ కళ్ళల్లో లోకంలో వుండే దయంతా అక్కడే వున్నట్టు దైన్యంగా అతన్ని చూస్తున్నాయి. ఆ అమ్మాయి అతి సామాన్యంగా వుంది. పైనించి కిందవరకు బీదరికం మొహంలో , దుస్తుల్లో అన్నింటా కనిపిస్తుంది. అయినా ఆమె కళ్ళలో ఏదో ...వుంది అన్పించింది ప్రసాద్ కి.
"ఎవరీమె , నీ ఫ్రెండా...."
"కాదన్నయ్యా, నేను ఉద్యోగం కోసం యింటర్వ్యూ వెళ్ళిన రోజూ ఈమె వచ్చింది. ఉద్యోగం నాకొచ్చింది. అప్పటి నించి యింకా పాపం ఏది దొరకలేదుట. యివాళ ఉదయం బస్సులో కనిపించి నన్ను గుర్తు పట్టి పలకరించింది. మాటల్లో యిలా నీ కంపెనీలో ఓ పోస్టు వుంది, అప్లయి చేశానంటే నాకు చటుక్కున గుర్తు వచ్చింది అది మీ కంపెనీ అని. ప్లీజ్ ఎలాగైనా యీమేకి ఉద్యోగం యివ్వాలన్నయ్యా .....నిజంగా చాలా అవస్థలో వున్నారు...."
'అసలు మా ఆఫీసులో టైపిస్టు పోస్టు ఖాళీ వున్నట్టే నాకు తెలియదే.....వుండు అడుగుతాను ' అంటూ బెల్ కొట్టాడు. ఫ్యూను రాగానే "శేషగిరి గారిని పిలు' అని "ఫన్నీ.....మా ఆఫీసులో పోస్టుకి వేకెన్సీ వున్నట్టు నాకు తెలియదు కాని, మీ అందరికి తెల్సింది....' అంటూ నవ్వాడు ప్రసాద్.
"నీవు చాలా చాలా పెద్దవాడివిగా.....అందుకని యీ అప్ట్రాల్ సంగతులు నీదాకా రావు మరి. వసంత హాస్యంగా అంది..... శాంతి చిరునవ్వు నవ్వి తల దించుకుంది. ఎడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శేషగిరిరావు రాగానే విషయం అడిగాడు ప్రసాద్. 'అవున్సార్, రేపు పదహారున యింటర్వ్యూ వుంది పదిహేనుమందికి, యింటర్వ్యూ కాల్స్ వెళ్ళాయి" అన్నాడు.
'ఆహా... అలాగా ....సరే తరువాత మాట్లాడదాం ....ఐ విల్ నవ్ యూ ఎగైన్ , ఆ రెండు కాఫీలు పంపండి" అన్నాడు ప్రసాద్. ఎయిర్ కండిషన్డ్ రూములో అన్నగారి దర్జా, హోదా చూసి ఓపక్క గర్వం, అసూయ కలిగాయి వసంతకి. అతను వెళ్ళగానే "ఎమ్మా నీకు ఇంటర్వ్యూ కాల్ వచ్చిందా' అన్నాడు.
"లేదండి ....నేను అప్లయి చేశాను' అంది.
"సరే, ఆ సంగతి నేను చూస్తాను. యింటర్వ్యూ కి పిలుపు వస్తుంది. ఆరోజు రండి, మిగతాది ఆలోచిద్దాం....ఎంత ప్రైవేటు ఆర్గనైజేషన్ అయినా ఎవరినో ఫేవర్ చేసినట్లుంటే అనేక విమర్శలుంటాయి. రూల్సు అండ్ రేగ్యులారీటీస్ పాటించాలి.....అంచేత మీరు యింటర్వ్యూ కి రండి. ఈలోగా నేను మావాళ్ళతో చెప్పి వుంచుతాను'" అన్నాడు.
ఆ మాత్రానికే శాంతి మొహంలో జీవకళ వచ్చింది. ఆ అమ్మాయి కళ్ళలో నీటిపొర కదిలింది. అదిచూసి ప్రసాద్ మనస్సు ఆర్ద్రమయింది. తను నిరుద్యోగిగా వున్న రోజులు గుర్తువచ్చి ఆ అమ్మాయికి ఎలాగన్న ఉద్యోగం వచ్చేటట్టు చూడాలి అని నిర్ణయించుకున్నాడు. కాఫీ త్రాగి యిద్దరూ లేచారు. శాంతి చేతులు జోడించి నమస్కారం చేసి "ఈ ఉద్యోగం యిస్తే జీవితాంతం మీకు రుణపడి వుంటాను సార్, యింతకంటే ఏం చెప్పలేను" అంది.
"వస్తాం అన్నయ్యా .....నీదే భారం ....' అంది వసంత.
"యిద్దరూ వెళ్ళాక అప్రయత్నంగానే నిట్టూర్చాడు. బీదరికం మనిషిని ఎంత కృంగదీస్తుంది. ఆ ఆర్ధికదుస్థితే తననీనాడు యింత దుస్థితిలో పడేసింది.....ఇదివరకు ఏమిలేదని బాధ.....యిప్పుడుండి అనుభవించలేని దుస్థితి ఆర్ధికంగా ఎవరికి ఏమి సహాయపడలేకపోయినా ఈ ఉద్యోగం యిప్పించడం తనకి కష్టం లేదు. సుళువుగా తనీ సహాయం చేయగలడు. అనుకున్నాడు ప్రసాద్. కాని....యింత చిన్న విషయానికి కూడా అతనికి స్వతంత్రం లేదని, స్వాతంత్రం లత యివ్వదని అతనూహించలేదు అప్పుడు.
* * * *
ఆరోజు ఆఫీసు నుంచి వస్తూనే వెంకట్రావు గారు దూర్వాసావతారం ఎత్తి, యింట్లోకి రాగానే "ఏడి వాడు, ఆ వెధవ ఏడీ, ఆ దరిద్రుడినిలా పిలు...." అన్నారు ఆవేశంతో ఎగిరిపడ్తున్న గుండెలతో..... అయన మొహం ఎర్రబడింది. వళ్ళంతా చెమట పట్టింది. ప్రళయకాళరుద్రుడిలా వచ్చిన భర్తని చూసి తెల్లపోయింది.
కాంతమ్మ ...."ఏమిటండీ ....ఏమయింది...." అంది బెదురుగా చూస్తూ.
"ముందా శంకరుగాడిననిలా పిలు...."
"యింట్లో లేదండి వాడు.....కాలేజి నించి వచ్చి ఎటో వెళ్ళాడు" సంగతి తెలియక భయంగా అంది.
"హా.....హా కాలేజీకి నీ కొడుకు చదవడానికి వెళ్ళడం లేదే , బజ్జీలు, పకోడీలు అమ్మటానికి వెళ్తున్నాడే. కాలేజీల దగ్గర, సినిమాహాళ్ళ దగ్గిర బండి మీద పకోడీలు అమ్ముతున్నాడే నీ కొడుకు. నా పరువు, మర్యాద అంతా గంగలో కలపడానికి పుట్టాడీ వెధవ. చదువుకోరా అని కాలేజీకి పంపిస్తే వీడు చేస్తున్న నిర్వాహకం యిదీ....." ఆవేశంతో అయన మాట తడబడింది.
"మీకెలా తెలుసునండి....మీరెక్కడ చూశారు.....' తెల్లబోయింది కాంతమ్మ.
"ఇవ్వాళ ఆఫీసు పనిమీద జీపులో సెక్రటేరియట్ వేడ్తుంటే గాంధి మెడికల్ కాలేజీ బయట వీడు, మరి ఇద్దరు కలిసి బండి తోస్తూ కన్పించారే. అప్పుడు ఆపడానికి నా ఆఫీసువాళ్ళు యిద్దరున్నారు పరువు పోతుందని వెళ్ళిపోయాను. ఆఫీసు నించి వచ్చేటప్పుడు అక్కడికి వెళ్ళి వాకబు చేశాను. అక్కడ స్టూడెంట్స్ యింకా ఇద్దరు ప్రొఫెసర్లు అంతా చెప్పారు. ఎవరో రోజూ మధ్యాహ్నం బండి మీద రకరకాల ఫలహారాలు తెచ్చి అమ్ముతున్నారట. కాలేజీ కురాళ్ళట అని చెప్పారు. తరువాత వాడి కాలేజీకి వెళ్ళాను. టైమయిపోయింది ప్రిన్సిపాల్ లెక్చరర్లు ఎవరూ కనపడలేదు. యిద్దరు ముగ్గురు స్టూడెంట్స్ ని అడిగాను. ఇంకెవరో ముగ్గురు వీడు కల్సి మొబైల్ కాంటీన్ పెడతారట. ముందు బండి వ్యాపారం ప్రారంభించారట. వీడి కర్మ కాలిపోనూ నా కడుపున చెదబుట్టాడు. బజ్జీలమ్మీ బతకాల్సిన ఖర్మ పట్టించానా వీడికి. నేనేం చదివించనన్ననా. కనీసం డిగ్రీ వరకైనా చెప్పించనా......ఏ యిబ్బందులు పడ్డా పిల్లలకోసం గదా .....ప్రసాద్ అలా చేతిలోంచి జారిపోయాడు. వీడిలా చదువు సంధ్యలు లేకుండా బజ్జీల,మ్ము కుంటున్నాడు" అయన గొంతు పట్టుకుంది.
కాంతమ్మ కలవరపడిపోయింది అయన చెప్పింది విని. భర్త వంక ఆందోళనగా చూసింది. అసలే గుండె జబ్బు మనిషి. అంత ఆవేశం పనికి రాదన్నారు డాక్టర్లు. ఈ సంఘటన ఆయనని దెబ్బతీసింది. "మీరూరుకోండి, గాభరాపడవద్దన్నాడు డాక్టరు. రానీండి వాడిపని నేను చెపుతాను . మీరు ఆవేశపడ్డారంటే మళ్ళీ మొదట కొస్తుంది మీ స్థితి . చదువుకోరా నాయనా అంటే వీడు చేస్తున్న నిర్వాకం యిదా. వాడ్ని ఇంటికి రానీవండి అసలు సంగతేమిటో అడుగుదాం.....' కాంతమ్మ ఆయన్ని స్వాంతన పరుస్తూ అంది.