"అదేమిటి అలా నిలబడ్డావు , ఏమిటలా చూస్తున్నావు?' ఆ వెన్నెల కాంతిలోనే సారధి మొఖంలో మార్పు గుర్తిస్తూ అడిగింది రమాదేవి.
"నేను నేను మీరు మీరు" గాభరాపడిపోయాడు సారధి> "ఏమిటలా గాభరాపడుతున్నావు? నిద్ర పట్టడం లేదా నీకూ? రా వచ్చి కూర్చో నాకూ ఎందుకో నిద్ర పట్టడం లేదు ప్చ్! ఎక్కడికెళ్ళినా ఒకలాగే వుంది" ఆమె గొంతు హటాత్తుగా బరువుగా అయింది. ఆమె బాధ ఏమిటో అర్ధం అయినట్టు అనిపించింది సారధికి. ఇద్దరి పరిస్థితి ఒకలాగే వుంది మరెందుకీ తాత్సారం.
సారధికి రమాదేవి అన్న ఆ ఒక్కమాట యిచ్చిన పోత్సాహంతో ఎక్కడ లేని ధైర్యం వచ్చింది.....మెల్లిగా కుర్చీ వెనక నుంచి రమాదేవి భుజాల మీద వణుకుతున్న రెండు చేతులు వేశాడు.
రమాదేవి త్రుళ్ళిపడింది. తలత్రిప్పి సారధి మొఖం చూడడానికి ప్రయత్నించింది. సారధి చేయి మరికాస్త గట్టిగా గుచ్చి పట్టుకుంది. మరో చెయ్యి ఆమె తలని అతని గుండెలకి చేర్చింది.
"సారధి," ఆమె గొంతుని ఎవరో నొక్కినట్టు అంతకంటే ఆమె నోట మాట రాలేదు. ఆమె చెయ్యి సారధి చేతి మీద బిగుసుకుంది.
ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది. సారధికి ఇంకేం పరవాలేదన్న నిబ్బరం వచ్చేసింది. భుజాలు పట్టుకుని రమాదేవిని నిలబెట్ట్టాడు. మంత్రముగ్ధలా స్పృహ లో లేనట్టు సారధి చేతులలో రమాదేవి శరీరం నిల్చుంది. రమాదేవిని నడిపిస్తూ గదిలోకి దారితీశాడు సారధి.
"సారదీ!" సారదీ! నీవు నేవేనా" తన నడుం చుట్టూ చుట్టిన చెయ్యిని విడదీయానికి ప్రయత్నిస్తూ వణుకుతున్న గొంతుతో నూతిలో పడ్డట్టు అంది రమాదేవి.
వళ్ళు తెలియని ఆవేశంలో వున్న సారధికి రమాదేవి మొహం రక్తం లేనట్టు పాలిపోవడం, ఆమె గొంతు వణకడం, ఆమె చేతులు తన ఇనప కౌగిలినించి తప్పించుకోవడానికి పడే ఆరాటం ఏమీ తెలియలేదు. గదిలోకి రాగానే రమాదేవిని గట్టిగా హృదయానికి హత్తుకున్నాడు. "మీరు మీరు అడ్డు చెప్పకండి. నాకు తెలుసు, మీకు ఇది ఇష్టమే" ముద్ద ముద్దగా వుంది సారధి గొంతు.
"సారదీ' రమాదేవి గర్జించినట్టే పిలిచింది. చాచిపెట్టి లెంపకాయ కొట్టింది." "ఇడియట్ ఇందుకేనా నిన్ను పిలిచాననుకున్నావు. స్టుపిడ్ గెటౌట్ , ఫో వెంటనే" ఆవేశంతో వ్రేలితో గుమ్మం వైపు చూపిస్తూ అరచింది. అతని నించి తప్పించుకుని దూరంగా జరిగి.
సారధి మత్తు దిగిపోయింది. చెంప పట్టుకుని, తెల్లబోతూ, గిల్టీగా చూశాడు. ఆవేశంతో అదురుతున్న రమాదేవి శరీరం వంక చూస్తుండిపోయాడు కర్తవ్య మూడుడిలా.
"వెళ్ళు వెళ్లిక్కడనించి, నీ మొహం నాకు చూపించకు" ఆ మాటతో సారధికి పూర్తిగా మెలకువ వచ్చింది. లజ్జతో, అవమానంతో, క్రోధంతో, అతని మొహం ఎర్రబడింది. "మహాపతివ్రతలా నటించకు' పై కనడానికి ధైర్యం చాలని ఆ మాట లోపలే కసిగా అనుకుని విసురుగా గదిలోంచి తన గదిలోకి నడిచాడు. బడాలున తలుపులు వేసి ప్రక్క మీద వ్రాలి తలగడలో మొహం దాచుకుంది రమాదేవి.
గదిలోకి వెళ్ళిన సారధి అవమానంతో, కోపంతో దహించుకు పోయాడు.
'హు పాపం ఆవిడ గురించి ఎవరికి ఏం తెలీదను కుంటుంది గాబోలు! మహాపతివ్రత అని అనుకుంటున్నరని అనుకుంటుందిగాబోలు! తను పనికి వచ్చాడు కాదులా వుంది. ఆవిడకి తను తగడనుకుందేమో" ఆవేశంతో కసిదీరా ఏవేవో అనుకుని రమాదేవిని కించపరచి తృప్తి పడ్డాడు సారధి.
ఓ అరగంట గడిచి ఆవేశం పొంగు తగ్గాక సారధికి తను చేసిన పని తల్చుకుంటుంటే మళ్ళీ రమాదేవి మొహం ఎలా చూడడం అన్న సందేహం వచ్చింది. ప్రొద్దుటే ఆవిడ మొహం ఎలా చూడడం? ఎలా హైదరాబాదు వరకు ఆవిడతో ప్రయాణం చెయ్యడం? అసలు మొహం చూపించవద్దంది. తన ఖర్మానికి తనని వదిలేసి ఆవిడంతట ఆవిడ వెళ్ళి పోతుందేమో! ఇంక తమతో మాట్లాడదేమో తమని చూడదేమో! వాళ్ళు ముగ్గురూ తనమీద ఏడుస్తారు. రమాదేవి స్నేహాన్ని పోగొట్టినందుకు ఛ.....తొందరపడి వెధవ పని చేశాను. సిగ్గు, పశ్చాత్తాపం , అవమానం మొదలనవన్నీ చుట్టుముట్టి సారధికి ఊపిరి అడనీయలేదు. ముందు ఎలాగైనా ఆవిడ కంటపడకుండా ఇక్కడ నించి పారిపోవాలనిపించింది. తెల్లవారి ఆమె ముఖం చూడలేడు; తరువాత ఊరికి చేరాక ఆమెకి కోపం తగ్గాక అప్పటి సంగతి ఆలోచించవచ్చు. రేపు మాత్రం కంటబడకూడదు. ఆ అర్ధరాత్రి రమాదేవి కంటపడకుండా వెళ్ళిపోదామనిపించినా, అర్ధరాత్రి తన కోసం ఏ బస్సులూ వుండవని ఆగాడు. తెల్లవారిం దగ్గరనించి బస్సు లుంటాయి. రమాదేవి లేవకముందే చీకట్నే లేచి వెళ్ళిపోవాలి....నిశ్చయించుకున్నాడు సారధి.
తెల్లవారింది. ఏడుగంటలయింది.
"సారదీ, సారదీ, ఇంకా నిద్రేనా లే....లే....పాపనాశనం వెడదామనుకున్నాంగా ఏడున్నరకి, ఏడయినా ఇంకా నిద్రేనా" త్రుళ్ళిపడి లేచాడు సారధి. ఎదురుగా ఓ చేత్తో కాఫీ కప్పు పట్టుకుని రెండో చెయ్యి తనమీద వేసి లేపుతూ స్వచ్చమైన చిరునవ్వుతో తన వైపే చూస్తున్న రమాదేవిని చూసి బిత్తరపోయాడు. తలారా స్నానం చేసింది గాబోలు విరబోసిన కురుల కోసలనించి నీటిబొట్లు రాలుతున్నాయి. తోపురంగు పట్టుచీరె, తెల్ల జాకెట్టు కుంకం బొట్టు, మొహాన నిర్మలమైన నవ్వు. రమాదేవిని వెర్రివాడిలా చూశాడు సారధి.... తను చూస్తున్నది . కలా! నిన్నరాత్రి జరిగింది కలా అన్న సందేహం వచ్చింది సారధికి. అప్రయత్నంగా వాచి చూశాడు. ఏడయింది. ఆలోచనల్తో , ఆవేశంతో ఏ మూడున్నరకో నిద్రపట్టిన సారధికి తెల్లవారి లేచి బస్సు కెళ్ళాలన్న గుర్తులేదు.
"ఏమిటలా చూస్తున్నావు? ఇంకా మెలకువ రాలేదేమిటి? ఇదిగో కాఫీ, త్రాగు మెలకువ వస్తుంది...." చిన్న నవ్వుతో కప్పు అందించింది ఆమె. అప్రయత్నంగానే కప్పు అందుకుని లేచాడు సారధి.
"త్వరగా తెములు.....ఆలశ్యం చెయ్యకు , ప్రోగ్రాం అనుకున్న ప్రకారం జరగాలి" అంటూనే గదిలోంచి బైటకి వెళ్ళిపోయింది రమాదేవి.
నిన్నరాత్రి జరిగింది కలకాదు. అని అతని మనసు గట్టిగా చెపుతున్నా ఉదయం రమాదేవి ప్రవర్తన చూస్తూ అది కలని అనుకోకుండా వుండలేకపోతున్నాడు సారధి. అది కల అయితే ఎంత బాగుండును. అనిపించింది. ఆ క్షణాన అతనికి. రమాదేవి నిన్న రాత్రి అసలు ఏం జరగనట్టు అంత నిర్మలంగా , ప్రశాంతంగా ఎలా వుంది? అన్నిటికంటే తనని ఎలా క్షమించింది? ఆదరా బాదరా స్నానం అదీ చేస్తున్నా అతని మెదడంతా సందేహాలతో , ప్రశ్నలతో నిండిపోయింది.
పాపనాశనం వెళ్ళే త్రోవలో అంతా కారులో రమాదేవి ఏదేదో మాట్లాడుతూనే వుంది. సారధి ఆ మాటలకి జవాబీయలేక పోవడం అటుంచి ఊ ఆ..... అని కూడా అనలేకపోయాడు. రమాదేవి అంతా నిర్మలంగా , అభిమానంతో మాట్లాడుతుంటే ఆవిడ వైపు చూడలేక, ఆమెతో మాట్లాడలేక ఆతను పడే ఇబ్బంది వర్ణనాతీతం! ఆ బాధ అవిడ్నీ క్షమార్పణ కోరుకుంటేనే గాని పోయేట్లు లేదనిపించింది. చేసిన పాపం చెపితే పోతుంది, పొరపాటు చేశానని , తప్పయింది క్షమించమని అడగాలి.
"ఏమిటలా వున్నావు ప్రొద్దుటనించి మాట్లాడవేం" చాలాసేపు చూసి అంది రమాదేవి.
"మీరు మీరు నన్ను క్షమించాలి. క్షమించాననండి." ఎలాగో నోరు పెగాల్చుకుని ఆమె వైపు చూడలేక తల దించుకుని రెండు మాటలు అన్నాడు సారధి.
రమాదేవి మొహం ఒక్కక్షణం నల్లబడింది. అంతలోనే చిరునవ్వు తొంగి చూసింది ఆమె పెదాల పైన. "క్షమాపణ దేనికోసం?" అంది.
సారధి చివ్వున తల ఎత్తాడు. ఏం ఏరగనట్లు, జరగనట్లు నిర్లిప్తంగా చూస్తున్న ఆమె మొహం చూసి జవాబు చెప్పటానికి తడబడ్డాడు, ఎలా చెప్పాలో అర్ధం గాలేదు.