Previous Page Next Page 
మోడల్ పేజి 29


    సిద్దిక్ స్టూడియోకి కమలిని, మంగళ వెళ్ళేసరికి మాయా మేకప్  రీటచస్ చేసుకుంటోంది స్టూడియో లోపల, బయట హడావుడిగా వుంది.

    సిద్దిక్ వర్క్ వుందంటే ఎక్కడెక్కడి వాళ్ళు వస్తారు అతని పని తనం చూడటానికి కాదు. మోడల్స్ ని అతనంత సెక్సీగా మరెవరూ చూపెట్టరని పైపెచ్చు మోడల్ మాయా డిసౌజా అంటే విపరీతమైన క్రేజ్. రొమాటింక్ క్వీన్ అని, సెక్స్ బాంబని మాయా డిసౌజాకి ముద్దు పేర్లున్నాయి.  యాడ్ వరల్టులో కమలిని, మంగళను చూసి మాయా ఎదురెళ్ళి తీసుకొచ్చి తన ప్రక్కనే కుర్చీలేసి కూర్చోబెట్టింది. స్టూడియో మోడరన్ గా డెకొరేట్ చేస్తుంది, నాలుగైదు కెమేరాలు స్టాండ్స్ లో అమర్చి వున్నాయి అయిదారు అల్యూమినియమ్ రిఫ్లెక్టర్స్ స్టాండ్ కి అరేంజ్ చేసున్నాయి.

    వాల్స్, రూఫ్ లైట్స్ గ్రే కలర్ లో వున్నాయి. హాల్ కి నాలుగు వైపులా నాలుగు ఎయిర్ కండిషన్ డ్ మెషిన్స్ నిశ్శబ్దంగా పనిచేసుకుపోతున్నాయి. స్టూడియోలో మామూలు లైట్స్ వుండవు. కార్భన్ ఆర్క్ లైటింగ్ లాంప్స్ (జూనియర్, సీనియర్) మెర్క్యూరీ లైటింగ్ ల్యాంప్స్ అరేంజ్ చేసున్నాయి అడ్జస్టబుల్ లైట్ బీమ్ లాంప్ ఒకటి మూలగా పేట్టి వుంది.

    స్టూడియోల్లో ఓ మూలగా మరో మోడల్ ప్రీతి కూచునుంది. ఆమె ప్రక్కనే  ఆమె తల్లి కూర్చునుంది. లైట్స్ బాయ్స్, మేకప్ మాన్, హెయిర్  స్టయిలిస్ట్ అందరూ వచ్చేశారు.

    వచ్చిన ప్రతివారు ముందుగా సీనియర్ మోడల్ కమలికి నమస్కారం చేసి, వారి పనిలో లీనమైపోతున్నారు.

    మామూలు స్టూడియో తప్ప మరేమీ చూడని మంగళకు మరేదో లోకంలో ఉన్నట్లుగా ఉంది. అంతలో వేరే రూమ్ లో వున్న సిద్దిక్ నుంచి కబురొచ్చింది__ప్రీతికి మేకప్. కాస్ట్యూమ్స్ ఒకసారి చెక్ చేయమని.

    ప్రీతి వచ్చి ఒక స్టూల్ మీద కూర్చుంది. ఆమె కెదురుగా నిలువెత్తు అద్దం వుంచారు. కాస్ట్యూమర్ వచ్చి ఆమె వైపోసారి చూసి పెదవి విరిచాడు.

    "ప్రీతి......నీవు కాస్ట్యూమ్స్ ధరించిన విధానం బాగాలేదు. డ్రెసింగ్ రూమ్ లోకి వెళ్ళి లోపలి బ్రా, అండర్ వేర్ తీసేసి ఉత్తచుడీదార్ వేసుకురండి___" అన్నాడు ఆమెవేపు గుటకలు మ్రింగుతూ చూస్తూ.

    ప్రీతీ లోనికెళ్ళింది. ఆ వెనుకే కాస్ట్యూమర్, మేకప్ మాన్, అసిస్టెంట్ కెమేరామాన్ వెళ్ళారు.

    అది చూసి ప్రీతి తల్లి ముఖం ముడుచుకుంది. "రోగ్స్.......చూసారా మాయా.....డ్రస్ మార్చుకు రమ్మన్నారు. వీళ్ళెందుకు డ్రెసింగ్ రూమ్ లోకి వెళ్ళటం........?" పళ్ళు పటపట కొరికింది కమలిని.

    "లోకువ మేడమ్..........మోడల్స్ అంటే లోకువ. వర్క్  ఇస్తున్నారుగా.....ఏం  చేసినా చెల్లుద్దని ధీమా....ప్రీతి అయినా ఆరోగ్స్ ని బయటకు గెంటవచ్చుగా....."

    ఐదు నిముషాల్లో ప్రీతి బయటకు వచ్చింది. ప్రీతి తల్లి దగ్గరకు వెళ్ళి కూతుర్ని మందలించింది. దానికామె సీరియస్ అయిపోయింది.

    "ఎందుకు మేడమ్ ఆమె  సీరియస్ అయింది......!" మంగళ అడిగింది కమలిని."

    "ఆవిడో పుస్పీ మదర్. డబ్బులకోసమో, కూతురు ద్వారా గొప్పపేరు ఆశించో తమ కూతుర్ల ను పరహారు, పదహేడేండ్ల వయసులోనో కావాలని మోడల్ గానో, ఏక్టార్ గానో తయారుకమ్మని వత్తిడిచేస్తారు. కూతుర్లు ఇష్టం లేదంటే ఊరుకోరు, స్టడిభీ కరో........ మోడలింగ్ భీకరో, లేకిన్ సైసా లావో (చదువుకో___మోడలింగ్ చేయి___లేదంటే పైసలు తీసుకురా) అంటూ వత్తిడి చేస్తారు. పేరొస్తుందని. డబ్బులొస్తాయని ప్రోత్సాహపరుస్తారు. తొలిరోజుల్లో తల్లిదండ్రులంటే గౌరవంగానే చూస్తారు పోనుపోను గర్వం పెరగడం, డబ్బురావటం, గ్లామర్ పెరగటం, వృత్తిలొ అటుపోట్లకు తట్టుకుని రాటుతేలిపోవటం జరుగుతుంది. తనే వంపాదిస్తున్నానని, తన సంపాదన మీదే తల్లిదండ్రులు బ్రతుకుతున్నారనే చులకనభావం వారిలో పేరుకుపోయి, అహంకారం వారిలో చోటు చేసుకుంటుంది. తాము తప్పులు చేసినా తల్లిదండ్రులు మందలించకూడదు. మందలిస్తే మీరేగా  నన్నీ వృత్తిలోకి దింపింది అంటారు.

    తమ కూతుర్లెంత హీనంగా చూసిన ఊరుకొక తప్పదు."

    మంగళ ఆశ్చర్యపోయింది.

    "మరి సినిమాపత్రికల్లో, చాలామంది హీరోయిన్స్ తమకు తమ తల్లిదండ్రులంటే ఏంతో ప్రేమని, గౌరవం అని ఇంటర్వ్యూలిస్తారు.......!? అమాయకంగా అడిగింది, కమలిని చెప్పింది జీర్ణం చేసుకోలేక.

    కమలిని నవ్వింది తెరలు తెరలుగా, ఆ నవ్వులో మాయా భాగం పంచుకుంది.

    "ఆత్మవంచన___దారుణమైన ఆత్మవంచన. వంచన వంచన వళ్ళు దాచుకోవటం. హీరోయిన్స్ అయినా, మోడల్స్ అయినా  తల్లిదండ్రుల్ని కుక్కలకంటే  హీనంగా చూస్తారు. ఇది వచ్చి నిజం. వీరి జీవితాల్లోకి ప్రజలు తొంగి చూడలేరు. కనుక ఇవి తెలియవు. అలా చెప్పుకోకపోతే తను అభిమానుల దృష్టిలొ చులకనయిపోరూ.

    తల్లిదండ్రులు క్రింద హాల్లో కూర్చుని వుండగానే తమ బాయ్ ఫ్రెండ్స్ ను నేరుగా నిర్భయంగా బెడ్ రూంలోకి తీసుకెళ్తారు......అయినా కిక్కురుమనలేరు. ఇంకోవిషయంచెప్పనా, కొందరు తల్లిదండ్రులు తామే బ్రోకర్స్ గా మారిపోతారు. తమ కూతుర్ల ఆందాన్ని అమ్ముతుంటారు. బ్లూ ఫిలిమ్స్ లొ యాక్టు చేయిస్తుంటారు. ఇలాంటి ఘోరకృత్యాలు జరుగుతాయని ఎవరైనా ఊహించగలరా?

    గ్లామర్, ఇమేజ్ ముసుగులొ జరుగుతున్న పరమ నికృష్టమయిన పనులిని ఈ బండారాలు సాధారణంగా బయటకురావు. అందుకే మేమంటే పిచ్చి ప్రజలకు......"కమలిని భారంగా నిట్టూర్చింది.

    అసిస్టెంటు కెమేరామేన్ ప్రీతి దగ్గరకు వెళ్ళి చుడీదార్ భుజం బొందుల్ని వదులుచేసి ఆమె వక్షోజాలు సగం కనిపించేలా చేశాడు అక్కడున్న అందరూ గుటకలు మ్రింగుతున్నారు____అరని అదృష్టానికి ఈర్ష్య పడుతున్నారు. కెమేరామేన్, మేకప్ మాన్ ఆమె వళ్ళంతా పనిపేరుతో తడిమేస్తున్నారు. ఆ దృశ్యం దుర్భరంగా కనిపించింది మంగళకు. అంతలో సిద్దిక్ వచ్చాడు.

    "రడీనా" అన్నాడు మాయాని, ప్రీతిని ఉద్దేశించి,

    "రడీ" అన్నారుఇద్దరూ.

    "ఈరోజు వర్క్ మధుర బట్టల కంపెనీది. పత్రికల్లో ఎడ్వర్టయిజ్ మెంట్స్ కోసం తీస్తున్న ఫోటోలు.

    అప్పటి వరకూ టవల్ కప్పుకున్న మాయా దాన్ని తీసేసి స్టూల్ మీద కూర్చుంది. మధుర కంపెనీకి చెందిన బెడ్ మీదపర్చే బ్లాంకెట్ ఒకటి ఆమె ఒంటికి చుట్టుకుంది. ఆమె కట్టుకున్న బ్లాంకెట్ అడుగున మరేమీ లేకపోవటంతో ఆమెలోని అమోఘమైన వంపులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

    మాయాను అప్పటివరకూ ఎంతో గౌరవంగా చూసిన మంగళ ఆమె వస్త్రధారణ చూసి అసహ్యించుకుంది.

    "మాయా బ్లాంకెట్ సగానికి మడచి మీ గుండె ఎత్తులు, సగం, మోకాళ్ళపైన కొంతవరకు కనపడేలా చేయాలి" అంటూ చొరవగా బ్లాంకెట్ ముడిని విప్పేందుకు ఆమె వెనక్కు చేరాడు.

    మాయా ఠక్కున వెనుదిరిగింది కోపంగా.

    "చూడు సిద్దిక్ ఇలాంటి పిచ్చిపనులు నా దగ్గర కుదరవు. దూరంగా వుండి చెప్పు. లేదంటే విజువలైజర్ ఇల్లస్ట్రెషన్ చూపించు. అలా నేను మార్చుకుంటాను. పని పేరుతో వళ్ళంతా ముట్టుకోవటం నాకిష్టముండదు. ఇష్టంలేదంటే చెప్పు వెళ్ళిపోతాను."

    "సిద్దిక్ కొద్దిగా ఖంగుతిన్నాడు. అందరిముందు మాయా అలా అనటం అవమానమనిపించింది.

    "చూడు సిద్దిక్.....ఈ  వర్క్ తో అమ్మకాలు పెరగాల్సింది మధుర కంపెనీ బట్టలకి. నా అందాలకి కాదు. నా అందాలు చూపించమంటే చూపిస్తాను. కాని దానివలన వినియోగదారులు నా అందాలు మాత్రం  ఎంజాయ్ చేసి కంపెనీ బట్టల గురించి పట్టించుకోరు. వినియోగదారులుల యాస్పిరేషన్స్ ని తప్పుదారి పట్టించవచ్చు. మేం ఆ కంపెనీ బట్టలు బాగా అమ్ముడు పోవటానికి మాత్రమె ఉపయోగపడాలి. ఆపైన నీ ఇష్టం."

    సిద్దిక్ విపరీతమైన కోపం వచ్చింది-కాని తమాయించుకున్నాడు. ఒక మోడల్ తనకు సలహాలు ఇవ్వటం ఉక్రోషం తెప్పించింది.

    మాయాలాంటి కొద్దిమంది మోడల్స్ ని చూసి మిగతా మోడల్స్ కూడా తమ వంపుల్ని చూపించటానికి ముట్టుకోవటానికి ఇష్టపడటంలేదు. అలా అని ఆమెను తీసేయలేడు. క్లెయింట్స్ మాయాకావాలని పట్టుపట్టారు.

    ఫోటోగ్రాఫర్ లో ఏ బలహీనతలు లేకుండా సిన్సియర్ గా ఉంటే, మోడల్స్ నాకీ ఎంగిల్ బాగోలేదు........ఈ మేకప్ బాగాలేదు అని చెప్పలేరు. చెప్పకూడదు అలా చెబితే నీ అందాలకు డబ్బులివ్వటంలేదు...........మోడల్ గా పేచేస్తున్నాం అని నోరు మూయిస్తారు ఫోటోగ్రాఫర్స్.

    "ఎడ్వర్ టైజింగ్స్ దృక్పథం మారిపోయింది. ప్రకటన చూస్తే ఆ వస్తువు కొనేలా వుండాలి. ప్రోడక్టు పుష్ చేసేందుకు సైకలాజికల్ బేస్ వుండాలి. ఒక కంపెనీ చీర ఒక మోడల్ కట్టుకున్న ప్రకటన చూస్తే ఆ కంపెనీ చీర కట్టుకుంటే నేనూ ఆమె  అంత అందంగా, ఆకర్షణీయంగా వుంటాను అనే సైకలాజికల్ టెంప్టేషన్ రావాలి. అదీ ప్రకటన అంటే కాని ఇప్పుడో ADVERTISING CONSIDER WOMEN AS SEX OBJECT ఈ బట్టలు  కొనండంటూ మోడల్ సెక్సీనా వినియోగదారుల్ని అప్పీల్ చేస్తే.....మగ వినియోగదారులు ప్రోడక్టుని వదిలేసి మోడల్ అందాల్ని కసిగా చూస్తారు. మొత్తానికి అసలు విషయం దెబ్బతింటోంది........" అంది కమలిని.

    ఇలాంటి ఫీల్డులోనా మనోహర్ సెటిలయింది. మనస్సులో అనుకొని బాధపడింది మంగళ.

    స్టూడియోలో వర్క్ చకచక జరిగిపోయింది.

    కెమేరా, స్లేవ్ యూనిట్స్ ఆంబరిల్లాలు ముమ్మరంగాపనిచేస్తున్నాయి.[స్లేవ్ యూనిట్ అంటే రిమోట్ ప్లాషెస్ ఎక్కువ ప్రాంతాన్ని వెలుగుతో నింపడానికి వీటిని వాడతారు] కెమేరా క్లిక్ అయ్యే సమయంలో ఎంటికనెక్షన్ లేకుండా ఆటోమేటిక్ గా వెలుగుతాయి. అంబరిల్లాలు అంటే___లైట్స్ కాంతి డైరెక్టుగా మోడల్స్ మీదపడితే వారి మొఖాలు పేలవంగా వస్తాయి. అందుకని ప్లాష్ లైట్సు తెల్లటి బట్టతో తయారుచేసిన గొడుగుల మీదపడి, కాంతి కొద్దిగా తగ్గి రిప్లేక్టు అయి ఆబ్జెక్టు మీద సరిపడ లైటింగ్ పడుతుంది.

    "ఈమధ్య గార్డెన్ చీరలు వస్తున్నాయి చూశావా? వాటి పబ్లిసిటీ ఎంత హుందాగా వుంటుందో గమనించావా? గార్డెన్ చీరలు మిగతా కంపెనీ చీరల అమ్మకాల్ని దెబ్బకొట్టాయి. అదీ పబ్లిసిటీ అంటే.........." అంటూ లేచింది కమలిని.

    మంగళ కూడా లేచింది. మాయాతో వెళ్ళొస్తామని చెప్పి బయట కొచ్చి కారెక్కారు. కారు లాయర్ సీతారామయ్య ఇంటివైపు పోతోంది.

    "మేడమ్.......మాయా అలా బిహేవ్ చేస్తే  ఊరుకుంటారా?"

    "చచ్చినట్లు, తనదగ్గర ఎప్పుడూ ఫిస్టల్ వుంటుంది. ఎవరయినా వెకిలి వేషాలేస్తే అది తీస్తుంది. పైగా ఒక బాడీగార్డ్ ని వెంట తెచ్చుకుంటుంది....."

    "బాడీగార్డ్ ని కూడా పోషిస్తారా...........?"

    "ఎవరికోసం పోషిస్తారు? ప్రదీప్ శర్మ అని ఒక మోడల్ వున్నాడు___విక్స్ ఫార్ములా___44కి మోడలింగ్ చేస్తాడు. అతను తన వెంట తన కుక్కనుకూడా తెస్తాడు. దానికి కూడా రాచమర్యాదలు చేయాలి. ఏమైనా మేల్ మోడల్స్ అదృష్టవంతులు. డబ్బుకు డబ్బు, పేరుకు పేరు నచ్చిన మోడల్ ని అనుభవించటం.........వర్క్  అయిపోయాక జాబ్స్ చేసుకోవడం. వ్యాపారం చేసుకోవటం. వారి సుఖం మాకుండదు.........ఎంతమంది ఫిమేల్ మేడల్స్ అన్యాయమైపోతున్నారో....." అందూ బాధగా విట్టూర్చింది.

    కారు లాయర్ ఇంటిముందు ఆగింది. మంగళకు అర్థం కాని దొకటే......మోడలింగ్ అసహ్యం అంటుంది. దారుణం అంటుంది___బాగా సంపాదించింది. ఇప్పుడైనా మోడలింగ్ మానేయవచ్చుగా.......!!

 Previous Page Next Page