దీక్ష ఆ వీధిలో అష్టలక్ష్మి ఇల్లు మొదలు ఆ చివరి ఇంటిదాకా, పాంప్లెట్లు యిచ్చుకుంటూ వెళ్ళి పక్క వీధిలోకి తిరిగింది. దాహంగా వుండేసరికి అటుగా వస్తూన్న సోడాబండిని నిలిపి నిమ్మకాయ సోడా తాగింది. మళ్ళీ బయలుదేరింది.
తన కృషి ఫలిస్తుంది అన్న నమ్మకం వుంది. తన ప్లాను సక్సెస్ అవుతుందన్న ఆత్మ విశ్వాసం వుంది. ఈ కొత్తరకం ప్రయోగం గురించి నలుగురు నానా గందరగోళం పడేసరికి అప్పుడు తను చాపకింద నీరులా చల్లగ...
దీక్ష ఆలోచనలు చెదిరిపొయ్యాయి, ఎదురుగా వస్తున్న తొంభై ఆరుకేజీల బలవర్ధనమ్మని చూసి.
బలవర్ధనమ్మ అసలు పేరు బలవర్ధని. వయసు మీద పడేసరికి వర్ధనమ్మ అయింది. శరీరం పెరిగేసరికి బాలో దీర్ఘం తగ్గి బల అయింది. దానాదీనా బలవర్ధనమ్మ అయింది. మగవాళ్ళు ఆఫీసులకి వెళ్ళినవేళ ఈవిడ చాంద్రాయణానికి బైలుదేరి తిరిగి వాళ్ళు ఆఫీసుల నుంచి గూటికి చేరేవేళకి ఈమె తన యింట్లో కాలు పెడుతుంది.
ఆలిండియా రేడియో అన్న బిరుదు బలవర్ధనమ్మకి వుంది. ఇక్కడి వార్తలు అక్కడికి అక్కడి వార్తలు ఎక్కడెక్కడో ప్రచారం చేసే నోరున్న సాధనం ఆమె. ఈ విషయం దీక్షకి తెలియదు. తెలియకుండానే ఆగింది ఆమె ముందు.
"నమస్కారం పిన్నిగారూ!" అంది.
బలవర్ధనమ్మ ఉబ్బి తబ్బిబ్బు అయింది. ఆమెకి నమస్కారం పెట్టినవాళ్ళు ఎవరూ లేరు.
ఆ పిల్ల నమస్కారం పెట్టింది కాబట్టి తను ఏదోవకటి అనకపోతే బాగుండదు. నమస్కారానికి ప్రతి నమస్కారం చేస్తారో లేదో గట్టిగా తెలియదు. పైగా ఆ పిల్ల చిన్నది.
దీక్ష పెదవుల చివరన చిరునవ్వు చిందిస్తూ సంచిలో చేయి పెట్టి పాంప్లెట్ తీసి బలవర్ధనమ్మ చేతిలో పెట్టింది. కొత్తగా షాపులు పెట్టినవాళ్ళు ప్రచార సాధనంగా తను చిల్లర కొట్టో, ఫ్యాన్సీ షాపో పెట్టామని చెప్పటానికి ఇలా కాగితాలు యిస్తారని ఆమెకి తెలుసు. ఫలానా సబ్బు వాడండనో, ఫలానా తిలకంబుడ్లు వాడండనో ఏదోవకటి కంది గింజ కాకపోతే పెసరబద్ద. ఈ రకం కాగితాలు అడిగి తీసుకుంటుంది.
దీక్ష తన చేతిలో పెట్టిన కాగితం మీద అక్షరాలు చదవకుండానే. "ఏది మరో పది కాగితాలు ఇటువ్వు తల్లీ!" అంది బలవర్ధనమ్మ.
పది కాగితాలే! తెల్లబోయింది దీక్ష. అంతలోనే తెప్పరిల్లింది.
"పది కాగితాలు ఏం చేసుకుంటారండీ?"
"నేనేం చేసుకుంటానమ్మాయ్! మధ్యాన్నమంతా తోచక వాళ్ళిల్లూ వీళ్ళిల్లూ చుట్టేస్తుంటా కదా! మనవాళ్ళ నలుగురికీ ఈ కాగితాలు నేనే పంచుతాను నీకు శ్రమలేకుండా." అంది బలవర్ధనమ్మ.
దీక్ష చాలా ఆనందించింది. బలవర్ధనమ్మ ఇల్లు ఏ వీధిలోనో తెలుసుకుంది. ఆమె పది కాగితాలు అడిగితే పాతిక కాగితాలు తీసి చేతిలో పెట్టింది. "మీకు శ్రమ యిస్తున్నాను. ఏమీ అనుకోకండి పిన్నిగారూ, మళ్ళీ కలుస్తాను" అని చెప్పి దీక్ష మళ్ళీ ముందుకు సాగింది.
"వీధికి ఇద్దరు చొప్పున ఇలాంటి పిల్లలు ఎదురైతే చాలు. ఓ పూట వంటకి బొగ్గులక్కర లేదు." అనుకుంది బలవర్ధనమ్మ.
బలవర్ధనమ్మ దగ్గర నా అనే వాళ్ళు లేరు. బుల్లికుంపటి మీద వంట కానిస్తుంది. బొగ్గులు వెలిగించటానికి కాగితాలు తగలేస్తుంది. బుట్టెడు కాగితాలు వుంటే ఏకంగా కాగితం మంటమీదనే అడ్డెడు తప్పేలని అవలీలగా వండి వార్చగల ఘనురాలు.
'హమ్మయ్య! ఈ పూటకి గుప్పెడు కాగితాలు కుంపట్లో తగలేయటానికి దొరికాయి.' అని ఆనందిస్తూ 'ఇది కిరాణాకొట్టుకి సంబంధించిన కాగితమా! ఏదైనా సబ్బు గురించా!' అనుకుంటూ దీక్ష యిచ్చిన పాంప్లెట్ మీద ఏమి రాసుందో చదివింది.