Previous Page Next Page 
అహో! విక్రమార్క పేజి 3


    కసిగా కాటేసే కాలనాగులా బుసలుకొడుతూ వజ్రహస్త ఖడ్గం గాల్లోకి లేచింది. వజ్రహస్త ఖడ్గవిన్యాస తాకిడిలో విజయసాధనపట్ల అతడికున్న జిగీష అగ్నివేష్ బాహువులను ప్రకంపింప చేసింది.

 

    చురుకయిన కదలికలతో ప్రత్యర్థి కళ్ళలోని భీతిని గమనించిన వజ్రహస్త అగ్నివేష్ తొడను నిర్దాక్షిణ్యంగా చీల్చాడు. ఆ మరుక్షణం దిక్కులన్నీ ఏకమయ్యేలా భయానకంగా అరిచాడు అగ్నివేష్.

 

    శత్రువుపై చివరి ప్రయత్నంలా విసిరిన అతడి కత్తిని రెండు ముక్కలుగా చేస్తూ వజ్రహస్త వీరఖడ్గం అతడి తలను అలవోకగా తెగనరికింది.

 

    ఆనందోద్వేగాన్ని ఆపుకోలేని వజ్రహస్త బిగ్గరగా విజయనాదం చేస్తూ రెండు చేతులూ జోడించి ధరిత్రిని చుంబిస్తూ మోకరిల్లాడు.

 

    సరిగ్గా అప్పుడు జరిగింది కుట్ర. కపటాన్ని గుండెల్లో గూడు కట్టుకొని అవకాశం కోసం పొంచివున్న శత్రురాజ్య ప్రధానమంత్రి రాజ్య కాంక్ష పరాకాష్టకు చేరుకుంది. ధర్మయుద్ధ నిబంధనల్ని తుంగలో తొక్కుతూ, మాటువేసిన వేటగాడిలా సమీపించి, విజయానందంతో తేలిపోతున్న వజ్రహస్త వెన్నులోకి బాకును బలంకొట్టి దించాడు.

 

    ఊహించని వెన్నుపోటుకు వెనక్కి తిరిగిన వజ్రహస్త ఆ శత్రురాజ్య ప్రధానిని చూసి అంత బాధలోనూ ఉలిక్కిపడ్డాడు. ఆ వెన్నుపోటుని జీర్ణించుకోలేని అసహాయతతో కళ్ళముందు మృత్యుమేఘం కమ్ముకుంటుండగా అతడి నయవంచనను హెచ్చరిస్తూ-

 

    "ద్రోహీ...వీరుడికి మరణం లేదు. వీరాత్మకు మరణం లేదు. రుధిరాగ్నికి మరణం లేదు. మహామహుడినై మళ్ళీ జన్మిస్తా. విశ్వనేత్రుడినై, త్రినేత్రుడినై మళ్ళీ జన్మిస్తా" అంటూ నేలమీద కూలి విగతజీవుడయి పోయాడు.

 

    వజ్రహస్త శరీరంలోంచి నేలమీదకు ప్రాకి, మట్టిలో ఇంకుతున్న కవోష్ణ రుధిరధార పడమటి సూర్యుని ఎండ కాంతిలో రక్తఖడ్గంగా మెరుస్తోంది. రణరంగంలో అధర్మయుద్ధాన్ని చూసిన సూర్యుడు పడమటి దిక్కున పాలిపోయిన వదనంతో అస్తమిస్తున్నాడు.

 

    అదే సమయంలో- వజ్రహస్త చూపులు విశాల ఆకాశంలోకి చూస్తున్నాయి. ఈ కుట్ర, అక్రమం, ఈ వెన్నుపోటు అన్యాయం, ఈ బాకుపోటు అధర్మం, అమానుషం, ఇది పిరికిపంద చర్య, ఇది పరాక్రమానికి సమాధి, ఇది ఘోరం, దారుణమైన ఘోరం.

 

    ఈ జన్మలో ఈ ఘోరాన్ని దుస్సహంగా చూస్తున్నాను. రుధిరనేత్రంతో అవలోకిస్తున్నాను.

 

    కానీ- నా శౌర్యం ఇంకిపోదు. నా పరాక్రమం వాడిపోదు. నా మేధస్సు మరుభూమిలో పూచిన పూలమొక్క కాదు. నా మేధస్సు భవిష్యత్తరాలను శాసించే అగ్నిధనస్సు. శాసిస్తా ఈ ప్రపంచాన్ని. జన్మిస్తావు నరాత్మతో వజ్రహస్త గుండెల్లో గూడు కట్టుకున్న అనంత వేదన అక్షరాలను వెతుక్కుంటోంది.

 

    మనసులోని మాటలు, మృతఘంటికల్లా మౌనాన్ని దాల్చుకున్నాయి. విశాల ఆకాశంలోకి చూస్తున్న వజ్రహస్త చూపులు నెమ్మది నెమ్మదిగా తమ తేజస్సును కోల్పోతున్నాయి.

 

    ఆ తేజస్సు క్రమంగా శూన్యంగా మారిపోయింది.

 

    శూన్యం... అనంత శూన్యం... సృష్టికి భ్రాంతిలాంటి శూన్యం.... పునః సృష్టికి నాందిలాంటి శూన్యం.

 

                              *    *    *    *

 

    నిశిరాత్రి... నిశ్శబ్ద నిశీథి రాత్రి.... భయానకంగా వుంది. సరిగ్గా అర్థరాత్రి పన్నెండు గంటలు దాటి రెండే రెండు నిమిషాలైంది.

 

    తమిళనాడులోని తంజావూరు జిల్లా, సేర్ కాళీ తాలూకాలోని చిదంబరంకు దాదాపు పాతికమైళ్ళ దూరంలో వున్న ఆ గ్రామం పేరు విదీశ్వరన్ కోయిల్. వూరికి పడమరవైపు నున్న రైల్వేస్టేషన్ మసక మసక దీపాల వెలుతురులో వింతగా మెరుస్తోంది. ఆ స్టేషన్ లో వున్న ఒకే ఒక్క ప్లాట్ ఫారం నిర్జనంగా వుంది.

 

    స్టేషన్ మాస్టర్ రూంలో, స్టేషన్ మాస్టర్ కునికిపాట్లు పడుతున్నాడు. బయట జేగురురంగు గోడకి చేరబడి వాచ్ మేన్ అలవాటుగా కుడిచేతిని జేబులోకి పోనిచ్చి బీడీకట్టను బయటకు తీసి అందులోంచి బీడీని తీసి అగ్గిపుల్లతో వెలిగించాడు. కుడిచేతి వేళ్ళమధ్య అగ్గిపుల్ల శివనేత్రంలా వెలుగుతోంది. ఆ వెలుగులో రైలు పట్టాలవేపు చూశాడు.

 

    ఆ పట్టాలు గాజుకళ్ళలా మెరుస్తున్నాయి. అంతకు ముందే కురిసి వెలిసిన వాన తాలూకు తడి మిణుకు మిణుకుమంటున్న ప్లాట్ ఫారం లైట్స్ వెలుగులో సమాంతర రేఖల్లా వింతగా కన్పిస్తున్నాయి. జడివాన తగ్గినా, చిరుజల్లు మాత్రం పడుతూనే వుంది.

 

    రైలు పట్టాలకు అటువైపు వున్న కొండలు దూది దిబ్బల్లా మెరుస్తున్నాయి. క్రమంగా చలి పెరుగుతోంది.

 

    వాచ్ మేన్ లేచి లోపలి రూంలోకి తొంగిచూశాడు గోడ గడియారం వైపు.

 

    మరో పదిహేను నిమిషాల్లో మద్రాసు ఎగ్ మోర్ ప్యాసింజర్ రైలు వస్తుంది.

 

    మెల్లగా లేచి చలిని తట్టుకునేందుకు మరో బీడీ వెలిగించి, చేతి లాంతరు తీసుకొని వళ్ళు విరుచుకుంటూ ప్లాట్ ఫారం మీదకొచ్చి నిల్చున్నాడు. అ వెంటనే స్టేషన్ మాస్టర్ కూడా కొంచెం మెల్లగా ప్లాట్ ఫారం మీదకొచ్చాడు. చలి మరికొంచెం పెరిగింది.

 

    మద్రాసు నుంచి 250 కిలోమీటర్లు. తిరుపతి నుంచి 330 కిలోమీటర్లు. బెంగుళూరు నుంచి 400 కిలోమీటర్లు దూరంలో వున్న వైదీశ్వరన్ కోయిల్ కి మద్రాస్- ఎగ్ మోర్ నుంచి కుంభకోణం వెళ్ళే మీటర్ గేజ్ రైల్లోగాని వయా పాండిచ్చేరి- కడలూరు- చిదంబరం నుంచి వెళ్ళే బస్సుల్లో కాని వెళ్ళవచ్చు.

 

    సరిగ్గా పన్నెండు ఇరవై నిమిషాలైంది. చిరుజల్లును, చలిని చీల్చుకుంటూ నెమ్మదిగా ప్యాసింజర్ రైలు వచ్చి ప్లాట్ ఫారం మీద ఆగింది.

 

    సరిగ్గా ఇరవై సెకండ్లు గడిచాయి. రైలుబండిలోంచి ఏ ఒక్క ప్యాసింజర్ దిగకపోవడంతో ఆశ్చర్యంగా చూస్తున్నాడు స్టేషన్ మాస్టర్.

 

    మరో రెండు క్షణాలు గడిచాక రైలు కూతపెట్టింది నేను వెళుతున్నానన్నట్టుగా.

 

    రైలింజన్ నెమ్మదిగా ముందుకు కదిలింది.

 

    సరిగ్గా అప్పుడు చూశాడు స్టేషన్ మాస్టర్. ఇంజన్ కు పక్కనున్న కంపార్టుమెంట్ లోంచి నెమ్మదిగా దిగి, ప్లాట్ ఫారం మీద అడుగుపెట్టిన వ్యక్తిని.

 

    మసక వెలుతురు, దూదిగింజల్లా పడుతున్న వర్షం, నలువైపులా ఒకసారి చూసి తనవైపే నెమ్మదిగా వస్తున్న ఆ వ్యక్తివైపే కళ్ళార్పకుండా నిశ్చేష్టుడైపోయి చూస్తున్నాడు స్టేషన్ మాస్టర్.

 

    ఆ ఆకాశం అంతకంతకు దగ్గరవుతోంది.

 

    ఆ వ్యక్తి ఆజానుబాహుడు, పాలమీగడలాంటి పంచె, కమీజు వేసుకొన్నాడు.

 

    తెల్లగా నెరిసిపోయిన జుత్తు, వత్తుగా పెరిగిన గెడ్డం, భుజాలచుట్టూ కప్పుకున్న కాశ్మీర్ శాలువా.

 

    ఆ వ్యక్తిని స్టేషన్ మాస్టర్ ఇంతకుముందెన్నడూ ఆ ఊళ్ళో చూడలేదు.

 

    ఊళ్ళోకి కొత్తగా వస్తున్నవాడయితే చేతిలో కనీసం సూట్ కేస్ అయినా వుండాలి గదా! కనీసం చిన్న బ్యాగ్ కూడ లేదు.

 

    ఇద్దరి మధ్యా రెండడుగుల దూరం.

 Previous Page Next Page