Previous Page Next Page 
అహో! విక్రమార్క పేజి 4


    అలవాటుగా టిక్కెట్ కోసం కుడిచేతిని ముందుకు సాచిన స్టేషన్ మాస్టర్ లైటు వెలుగులో స్పష్టంగా ఆ వ్యక్తి ముఖాన్ని చూడగానే పాము కరిచినవాడిలా తత్తరపడి తన చేతిని వెనక్కి తీసుకొని ఆ ముఖంవైపే తదేకంగా చూడసాగాడు.

 

    ఆ వెలుగులో ఆ వ్యక్తి ముఖం మంచునీటిమీద పడిన వెన్నెల కాంతిలా వింతగా మెరుస్తోంది.

 

    విశాలమైన ముఖంమ్మీద డెబ్బయి నాలుగేళ్ళ వయసు చూచిస్తున్న ముడతలు, అరుదుగా కనిపించే పెద్దకళ్ళు, తెల్లటి వత్తయిన కనుబొమలు, పొడవాటి సూదిముక్కు, వత్తయిన మీసాలు, మగతనానికి ప్రతీకగా కనిపించే వెడల్పాటి పెదవులు, ఆజానుబాహుడు.... వెరీ రేర్ క్రియేచర్. అరుదైన మానవ లక్షణాలతో తన ఎదురుగా నుంచున్న వ్యక్తివైపు సంభ్రమంగా, సమ్మోహనంగా చూశాడు స్టేషన్ మాస్టర్.

 

    "నేను ఊళ్ళోకి వెళ్ళాలి. ఎటు వెళ్ళాలో దారి చెప్తారా?" కరకర లాడుతున్న ఆ గొంతు మేఘగర్జనలా వుంది.

 

    ఒకే ఒక్క మాటతో ప్రపంచాన్ని శాసించే శక్తి ఆ గొంతుకుంది.

 

    "దారి... దారి.... యూ.... మీన్ వే.... మీరీ వూరుకు కొత్తా?" ప్రశ్నించాడు స్టేషన్ మాస్టర్.

 

    ఆ ప్రశ్నకు ఆ ఆజానుబాహుడు సమాధానం చెప్పకపోగా అసహనంగా, ఒకింత ఆగ్రహంగా స్టేషన్ మాస్టర్ కేసి చూశాడు.

 

    ఆ చూపులకే కంపించిపోయాడు స్టేషన్ మాస్టర్. ఆ అపరాత్రివేళ నీరవ నిశ్శబ్దంలో, భయానకంగ వున్న వాతావరణాన్ని సైతం శాసించేలాంటి అరుదైన వ్యక్తి అక్కడకు రావడం అంతా అయోమయంగా వుంది స్టేషన్ మాస్టర్ కి.

 

    "ఎటు వెళ్ళాలో దారి చెప్తారా?" మళ్ళీ వినిపించింది ఆ ప్రశ్న అక్కడ పేరుకున్న నిశ్శబ్దాన్ని చీలుస్తూ.

 

    వజ్రఘాతంలాంటి ఆ కంఠధ్వనికి, దడదడలాడింది ఆ స్టేషన్ మాస్టర్ గుండె.

 

    "స్టేషన్ కుడిపక్క నుంచి, ఎడమ ప్రక్కనుంచి రెండు దారులున్నాయి. కుడిపక్క దారి ఊరికి కొంచెం దూరమైనా నడిచి వెళ్లడానికి అనువుగా వుంటుంది. ఎడమ ప్రక్క నుంచయితే డొంకల్లోంచి, తుప్పల్లోంచి వెళ్ళాలి. నాలుగు నిముషాల్లో సరిగ్గా మీరు వైదీశ్వరుని కోవెల పడమటి దారి దగ్గరకు వెళతారు. కానీ దారిలో పురుగు, పుట్రా, పాములూ వుంటాయి చీకటి కూడా." ఎటువెళ్ళాలో చూపిస్తూ అన్నాడు అతను తనలోని భయాన్ని కప్పిపుచ్చుకుంటూ.

 

    "థాంక్యూ" అని ముందుకు నడిచాడు అతను చూపించిన దిశగా.  

 

    మెట్లుదిగి చెట్లు, పొదల మధ్య నుంచి చీకటివైపు, దట్టమైన చీకటివైపు పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ నడుస్తున్న ఆ వ్యక్తివైపు ఆశ్చర్యంగా చూస్తుండిపోయాడు స్టేషన్ మాస్టర్.

 

    సర్రుమని చలిగాలి ఒక్కసారిగా వీచడంతో స్టేషన్ మాస్టర్ వేగంగా తన గదిలోకెళ్ళిపోయాడు. కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా మాయమయిపోయిన ఆ వ్యక్తిని తలుచుకోగానే భయం వేసింది అతనికి.

 

    "మురుగా... మురుగా" భయం భయంగా అతని పెదవులు కంపించాయి. తను దారి చూపిస్తూ ఆ దారిలో పురుగు, పుట్రా, పాములు వుంటాయని చెప్పినప్పుడు ఆ వ్యక్తి అన్న మాటలు గుర్తుకొచ్చి క్షణకాలం వణికిపోయాడు స్టేషన్ మాస్టర్.

 

    "చిన్ననాటి నుంచే ఎన్నో యుద్ధాల్ని చవిచూసినవాడ్ని. ఇప్పుడు ఈ జీవితం చివరి దశలో మృత్యువు పురుగు, పుట్ర రూపంలో వెంటాడినా భయపడను. పాములు నా ప్రాణం తీసే యమదూతలే అయితే, అవి నన్ను వెతుక్కుంటూ ఎక్కడికయినా వస్తాయి. ప్రపంచంలో ఎవరు దేన్నయినా జయించవచ్చేమో ఒక్క మృత్యువును తప్ప. మనం గెలవలేంది ఏదో ఒకటయినా వుండాలిగా! అదే మృత్యువు. వస్తాను" అంటూ అతనన్న మాటలే స్టేషన్ మాస్టర్ చెవుల్లో మార్మోగుతున్నాయి.

 

                                *    *    *    *

 

    తంజావూరు జిల్లాలో వున్న వైదీశ్వరన్ కోయిల్ గ్రామానికి చోళరాజుల కాలంనాటి వైదీశ్వరుని గుడి కారణంగా ఆ పేరొచ్చింది. ఈ దేవాలయం 1600 సంవత్సరాల క్రితానికి చెందినది. అంగారకుడు ఒకసారి జబ్బున పడ్డాడట. జబ్బుపడిన అంగారకుడికి వైద్యం చేయడానికి, వైద్యుడిగా ఈశ్వరుడే అవతారమెత్తి వచ్చి చికిత్స చేసిన ప్రాంతం. కాబట్టి, ఈ ప్రాంతానికి వైదీశ్వరన్ కోయిల్ అనే పేరు వచ్చింది. (తమిళంలో గుడిని కోయిల్ అంటారు)

 

    జ్యోతిష్యానికి ఆద్యుడు అగస్త్య మహాముని. జ్యోతిష్యంలో ఒక భాగం నాడీశాస్త్రం. బొటనవేలి ముద్రల ఆధారంగా మానవుల భూత, భవిష్యత్, వర్తమానాలను చెప్పే పద్ధతి ఈ వూరులో వుంది.ఈ గ్రామంలో దాదాపు పన్నెండుమంది పండితులు అనువంశికంగా తమకు సంక్రమించిన తాళపత్రాల ఆధారంగా నాడీ జ్యోస్యాన్ని చెప్పడంలో ప్రసిద్ధులు.

 

    (కర్నాటకలోని కోడిమెట్ అనే గ్రామంలోనూ నాడీ జ్యోతిష్యం చెబుతారు. ఇందిరాగాంధీ బ్రతికున్న రోజుల్లో ఆమె తరచూ అక్కడికెళ్ళేవారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులే కాదు- రాష్ట్రపతులు, అత్యున్నత పదవులలంకరించిన వ్యక్తులు చాలామంది కోడిమెట్ వెళ్ళారు. వెళుతున్నారు. అయితే వైదీశ్వరన్ కోయిల్ నాడీ జ్యోతిష్యంతో పోలిస్తే కోడిమెట్ ప్రాముఖ్యత ఒకింత తక్కువే. ప్రపంచ వ్యాప్తంగా ఈ రెండు గ్రామాలే నాడీ జ్యోతిష్యానికి కేంద్రబిందువులు)

 

                                              *    *    *    *

 

    నిబిడాంధకారంలో ఆ వ్యక్తి అడుగుల చప్పుడు మట్టిరోడ్డు మీద వింతగా చప్పుడు చేస్తోంది.

 

    రోడ్లన్నీ నిర్మానుష్యంగా వున్నాయి. రోడ్లమీద చలిలో ముణగదీసుకుని పడుకున్న ఊరకుక్కలు ఆ వ్యక్తి అడుగుల చప్పుడుకి ఉలిక్కిపడి లేచి పక్కకి వత్తిగిలి చూసి, మొరిగే ప్రయత్నానికి స్వస్తి చెప్పేసి పక్కకి జరిగిపోతున్నాయి.

 

    సరిగ్గా పదినిముషాలు గడిచాయి. నాలుగురోడ్ల కూడలికొచ్చి తల పైకెత్తి చూశాడాయన. ఊరంతా నల్లటి కంబళి కప్పుకున్నట్లుగా వుంది.

 

    ముందుకు వెళ్ళబోయి పక్కకు తలతిప్పి చూసిన ఆ వ్యక్తి దూరంగా అంతెత్తున కనబడిన గుడి గోపురాన్ని చూసి తలపంకించాడు. గుడిలోపలి ధ్వజస్తంభం మీద దీపాలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. నల్లటి రాతిగోడలు, గుడి ముందు శిథిలమైపోయిన కర్ర రథం, ఆ రథంవైపు నడిచి మూసివున్న సింహద్వారం వైపు చూసి మెయిన్ రోడ్ దిశగా సాగాడా వ్యక్తి.

 

    మరో రెండు నిముషాలు గడిచాయి. రోడ్డు పక్కనున్న ఒక ఎత్తయిన బిల్డింగ్ ముందు ఆగాడా వ్యక్తి. ఆ బిల్డింగ్ ముందున్న బోర్డ్ వైపు చూశాడు.

 

    శ్రీ భక్కియం లాడ్జి... సౌత్ కార్ స్ట్రీట్....

 

    వైదీశ్వర్ కోయిల్-609  117

 

    ఆ వ్యక్తి అటూ ఇటూ చూసి లాడ్జి మెట్లెక్కాడు. మెట్లపైన గోడకు ఆనుకొని చిన్న రిసెప్షన్ రూమ్- ఒక బక్కపల్చటి వ్యక్తి తెరచివున్న రిజిస్టర్ బుక్ మీద తల ఆనించుకొని నిద్రపోతున్నాడు. అ రూమ్ లో నైట్ బల్బ్ కాంతి పల్చగా పర్చుకొని వుంది.

 

    చిన్నగా దగ్గాడు ఆ వ్యక్తి.

 

    ఆ చప్పుడుకి రిజిష్టర్ బుక్ మీద తల ఆనించుకొని నిద్రపోతున్న బక్కపల్చటి వ్యక్తి కలలో దెయ్యం కన్పించినవాడిలా వులిక్కిపడి తల ఎత్తి ఎదురుగా నించున్న అరుదయిన ఆకారాన్ని చూసి నిజంగా భయపడి కెవ్వున కేక వేయబోయి ఆగిపోయాడు.

 

    "ఎ....ఎ...ఎవరు...ఎవరు కావాలండీ? రూమా... లేవ్... ఖాళీల్లేవు" కంగారు కంగారుగా అనేశాడు గుండెలమీద తుప్పు తుప్పుమని వూదుకుంటూ.

 

    "నేను రూమ్ కోసం రాలేదు. నాడీ జ్యోతిష్యులు శివస్వామివారి కోసం వచ్చాను" గంభీరంగా బదులిచ్చాడా వ్యక్తి.

 Previous Page Next Page