Previous Page Next Page 
అహో! విక్రమార్క పేజి 2


    ఆ మాటలకు భారంగా నిట్టూర్చాడు తిమ్మరుసు.

 

    "మహారాజా దుర్భేద్యమైన గిరిదుర్గం ఉదయగిరి. గణపతికి వున్న బలిష్టమైన కోటలలో అతి ముఖ్యమయిన కోట అది. కోటను సమీపించడానికి మార్గం కడు దుర్గమమని మన వేగులు తెచ్చిన వార్త.

 

    ఇదివరలో మన విజయనగర సేనలు పదునెనిమిది మాసాలపాటు ఆ దుర్గాన్ని ముట్టడించడం కోసం పడిన శ్రమ, పన్నిన పథకాలు అన్నీ వెనక్కి రిక్తహస్తాలతో వచ్చేసేటట్లు చేశాయే తప్ప, శత్రుసేనల దిశగా మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాం. అందువల్ల...."

 

    "అందువల్లే అతి వీర పరాక్రమవంతులైన సైనిక గణంతో, స్వయంగా విజయనగర చక్రవర్తే ఉదయగిరిని ముట్టడించటానికి బయలుదేరాలని నిర్ణయించాం" భ్రుకుటి ముడుస్తూ అన్నారు రాయలు.

 

    "చక్రవర్తీ! తమరే స్వయంగా?!"

 

    "అవును. ఎనిమిది లక్షల కాల్బలంతోనూ, పదిహేడు వందల గజబలంతోనూ, ముప్పైయ్యారువేల ఆశ్వికదళంతోనూ, అభేద్యమైన గిరి దుర్గాన్ని సుభేద్యం చేయ సంకల్పించాం" అన్నారు రాయలు.

 

    తిమ్మరుసు తల పంకించి, అంత దూరంలో నుంచున్న సైనికాధ్యక్షుడు వజ్ర హస్తవిపు చూశాడు. మూడుపదుల వయసుగల వజ్రహస్త కుడిచేయి కరవాలం మీదకు వెళ్లింది ఉత్సాహంగా.

 

    సైనిక గణంలో పరాక్రమవంతుడు, సకల యుద్ధ విద్యానిపుణుడుగా గుర్తింపు పొంది ఇటీవలే సైనికాధ్యక్ష పదవిలోకొచ్చాడు వజ్రహస్త.

 

    "ఉదయగిరి తిరుమలకాంత రాయుడిని పరాజితుడ్ని చేయడానికి ప్రభువులవారే స్వయంగా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ వజ్రహస్తకు ఒక అవకాశం ఇప్పించండి. శత్రువుల తలల్తో బంతులాడుకొని, తమ విజయ పరంపరకు నిదర్శనంగా ఉదయగిరి దుర్గంమ్మీద ఆంధ్రపతాకాన్ని ఎగురవేయి తమముందు నిలుస్తాను" ధీరంగంభీరమైన వజ్రహస్త మాటలకు ఓరగా తలెత్తి చూశారు శ్రీకృష్ణదేవరాయలు.

 

    తిరుమలకాంతరాయుడి పరాక్రమం శ్రీకృష్ణదేవరాయులకు తెలుసు. ఆరితేరిన ఆ యుద్ధవీరుని పరాక్రమం ముందు వజ్రహస్త నిలువలేడేమోనన్న సందేహం రాయలవారికి లేకపోలేదు.

 

    "మహామంత్రి! మీ అభిప్రాయం ఏమిటి?" తిమ్మరుసువైపు చూస్తూ అడిగారు రాయలవారు.

 

    "యుద్ధాలే వీరత్వాన్ని పడునుబెట్టి పరాక్రమాన్ని వెలికితీసే స్పర్శ వేదులు. కాబట్టి...."

 

    రాయలవారు తన మనోగతాన్ని అర్థం చేసుకోగలరన్న ఉద్దేశంతో అప్పాజీ మధ్యలోనే ఆగిపోయారు.

 

    "అవగతమైంది మహామంత్రి. వజ్రహస్తకు కూడా ఒక అవకాశ మీయదలిచాం. రేపే శుభారంభం. యువవీరా వజ్రహస్తా. విజయనగర పౌరుష ప్రతాపాగ్ని, జ్వాలల రుచి, ఏ పాటిదో ఆ తిరుమల కాంతరాయుడికి చూపించు. నీ విజయమే మా సార్వభౌమత్వానికి ప్రతీక" అన్నారాయన గంభీరంగా.   

 

    వజ్రహస్త తన కరవాలాన్ని తీసి, శ్రీకృష్ణదేవరాయల పాదాలకు ఆనించి ప్రతిన చేశాడు.

 

    "మీ మంగళాశాసనం నాకు విజయాశ్వాసమవుతుంది" అని నమస్కరించి వెనుదిరిగాడు వజ్రహస్త.

 

    తిరుమల కాంతరాయుడి అరివీర పరాక్రమం ముందు ఆరితేరిన, అపారమైన అతని యుద్ధనైపుణ్యం ముందు యువకుడైన వజ్రహస్త నిలువగలడా అన్న సందేహం అప్పాజీకి సయితం లేకపోలేదు.

 

    ఉన్నా, తను పరోక్షంగా రాయలవారికి వజ్రహస్తని పంపేందుకు ఎందుకు దారి చూపాడు? ఏది ఏమైనా, కాలగతి అనుల్లంఘనీయం జరగవలసింది జరిగితీరక తప్పదు- అని అనుకుని భారంగా నిట్టూర్పు విడుస్తూ అప్పాజీ గృహోన్ముఖులయ్యారు.

 

                           *    *    *    *

 

    అతడి అశ్వం తడబడుతూ దూరదూరంగా అంగలు వేస్తోంది. చుట్టూ సైనికుల కోలాహలంతో, అలవికాని మృత్యుకేకలతో రణరంగం దద్ధరిల్లి పోతోంది.

 

    ఎర్రబారిన నెత్తుటి చిత్తడినేల భూతలంపై సూర్యబింబాన్ని పరిచినట్లుంది.

 

    నిప్పులు కురిపిస్తున్న ఫిరంగి మంటలు పొగమబ్బులపై మెరుపుల్లా రెప్పలల్లారుస్తున్నాయి.

 

    చిందర వందరగా తెగిపడుతున్న మాంసపు కండలతోపాటు, రక్తపుటేరు పరవళ్ళు తొక్కుతూ మందంగా ప్రవహిస్తోంది.

 

    క్షతగాత్రులను దాటుకుంటూ శిఖరాగ్రం చేరుకున్న వజ్రహస్త అశ్వం బెదిరిన జింకలా భీతిల్లి, అకస్మాతుగా ముందుకు తూలిపడింది.

 

    రెప్పపాటులో జరిగినదానికాతడు ఒడుపుగా ఆయుధాలు జారిపోకుండా పట్టుకుని సమయస్పూర్తిగా లోయలోకి దొర్లిపోయాడు.

 

    పల్లంలోంచి ఎగశ్వాస పీలుస్తూ పైకొచ్చిన వజ్రహస్తకు సైన్యం దక్షిణ ప్రాంతాన శత్రుసేనాని అగ్నివేష్ మసక మసగ్గా కనిపించాడు.

 

    యుద్ధరంగం పల్లంలోని ఎడమభాగాన తన సేన బలహీనపడడం గమనించిన అగ్నివేష్ పిచ్చెక్కినవాడిలా గర్జిస్తూ సైన్యాన్ని అటువేపుగా ఆగ్నాపిస్తూ సంజ్ఞలు చేశాడు.

 

    అప్పటికప్పుడు చాకచక్యంగా వ్యూహం పన్నిన అగ్నివేష్ తెలివిగా తన సైనికులను కొండదిగువకు చేర్చాడు. పథకం అర్థం చేసుకున్న సైన్యం, శత్రువుల చుట్టూ క్షణాల్లో వలయంలా కమ్ముకుంది.

 

    శిఖరాగ్రం నుండి ఇదంతా గమనించిన వజ్రహస్త ఇక ఏమాత్రం ఆలస్యం చేయలేదు.

 

    వీరుడి చేతిలో గడ్డిపరక కూడా వజ్రాయుధంగా మారుతుంది. ఇప్పుడు తన వాళ్ళకు కావాల్సింది ఆయుధాలు కాదు ఆత్మస్థయిర్యం. చిత్రపటంలా అతడి కళ్ళ ముందు విజయనగర సంస్థాపకులైన హరిహరరాయలు, బుక్కరాయలు, దక్షిణాపథాన్ని ఏకచ్చత్రాదిపత్యం క్రిందికి తెచ్చిన విజయనగర సామ్రాజ్య సార్వభౌమత్వం, విజయనగర ప్రభువు తనమీద వుంచిన కర్తవ్యం, లక్ష్యాన్ని సూచిస్తూ కదలాడాయి. ఆపైన వజ్రహస్త క్షణకాలం కూడా నిలవకుండా మెరుపువేగంతో ఒక ప్రవాహంలా కొండ దిగువకు దూకాడు.

 

    శత్రుసైన్యం తప్పించుకోవడానికి అణుమాత్రం అవకాశం యివ్వకుండా, ఓ మహాశక్తిలా అడ్డు నిలబడి "సాహో" అంటూ సహచరులతో పాటు కదం తొక్కుతూ ముందుకు కదిలాడు.

 

    వజ్రహస్త చేరికతో కట్టలు తెంచుకున్న నదీ ప్రవాహంలా అతడి సైన్యం, ప్రత్యర్థి సైన్యాలపై విరుచుకు పడింది. గుప్పించి వదిలిన శరపరంపర గాలిలో బుసలు కొడుతూ, ఎదురొడ్డిన గుండెల్లోంచి దూసుకుపోయాయి. తుట్టెలు తుట్టెలుగా సైన్యం చెల్లాచెదురై నేలరాలసాగారు.

 

    రణరంగపు నడిబొడ్డుకు చేరుకున్న వజ్రహస్త ఇక ప్రత్యర్ధి నాయకుడితో ముఖాముఖి పోరాడటానికి సిద్ధపడ్డాడు. కసిరేగిన సింహంలా నిల్చున్న వజ్రహస్తను చూడగానే అగ్నివేష్ కు క్షణకాలంపాటు వళ్ళు జలదరించింది. అతడు నిగూఢంగా ఏదో నిశ్చయించుకున్న వాడిలా ఒక్కసారి తల విదిల్చి, ఒరలోంచి లాఘవంగా కత్తిని తీశాడు.    

 

    ఓటమి అంచుల్లో నిలబడి కూడా శత్రువు మొండిధైర్యంతో కాలు దువ్వడం వజ్రహస్త అహాన్ని తీవ్రంగా రెచ్చగొట్టింది. ప్రత్యర్థి అణువణువునూ ఛిద్రం చేయాలనే కోపావేశాన్ని పళ్ళ బిగువున దాచుకుంటూ పట్టాకత్తిని ఝుళిపించాడు.

 Previous Page Next Page