"గ్యాసు మనిషిటండి!"
"ఎవడైతే మన కెందుకు? ఒక మనిషి చాలు!" అని ఆనందం గబాగబా మేడ దిగుతున్నాడు.
"పాపం! ఎవడో అమాయకుడు, అయిపోయేడు" అనుకున్నాడు సింహాచలం.
మేడ కింద -
గ్యాసు మనిషిని చూస్తూ ఎంతో ఆనందంగా పలకరించాడు ఆనందం-
"ఏవయ్యా!బావున్నావా?"
తనని 'ఎంతో ఇదిగా' క్షేమ సమాచారాలు అడుగుతున్నందుకు గ్యాసు మనిషి ఉబ్బితబ్బిబ్బవుతుంటే - తాయారమ్మ ఆనందం చేతిలో బిల్లు పెట్టి అన్నది-
"అతన్తో మాటలెందుకు? డబ్బిచ్చి పంపించండి!"
ఆనందం తాయారమ్మ సూచన పట్టించుకోలేదు. ఆవిడిచ్చిన బిల్లు తీసుకుంటూ గ్యాసు మనిషిని మళ్లా పలకరించేడు-
"ఏవయ్యా! బాగున్నావా?"
గ్యాసు మనిషి తల గోక్కుంటూ అడిగేడు.
"నేను తమకి ఇంతకు మునుపే తెలుసాండి?"
"ఎందుకలా అడుగుతున్నావు?"
"మరేం లేదండి! బాగున్నావాని రెండు సార్లు అడుగుతుంటేనూ-"
"అంటే? తెలిపిన వాళ్లనే అట్లా అడగాలని రూలేమైనా వుందా?"
లేదనుకోండి!" అని నీళ్లు నమిలేడు గ్యాసు మనిషి.
"పిచ్చివాడా! ఎవర్నైనా నేను అలాగే పలకరిస్తాను! నిజమే - నీ ఫేసు నాకు కొత్తగానే వుంది సుమా!"
"నాకు పాతదేనండి!" అన్నాడు గ్యాసు మనిషి ఉత్సాహంగా.
ఆ మాటకి ఆనందం పకపకా నవ్వేస్తూ నవ్వుకి తగ్గట్టు గ్యాసు మనిషి భుజమ్మీద దరువేస్తూ అడిగేడు -
"మంచి జోక్ వేసేవ్! నీ పేరేమిటో?"
"పర్వతాలండి!"
"కత్తి లాంటి కుర్రాడివి!"
"అతనికి డబ్బిచ్చి పంపించండీ!" అన్నది తాయారమ్మ.
తాయారమ్మను ఎంతో ప్రసన్నంగా చూస్తూ అన్నాడు ఆనందం -
"ఇస్తా! ఏమిచ్చి ఎట్లా పంపించాలో నువ్వు నాకు చెప్పాలా తాయారమ్మా? గ్యాసు వచ్చింది కదా! నువ్వెళ్లి వంట పని చూడు" అని తాయారమ్మకు వంట పని పురమాయించేడు.
తాయారమ్మ ఏదో గొణుక్కుంటూ వంట గదిలోకి వెళ్లిపోయింది.
"నువ్వు రావచ్చు. డబ్బిచ్చి పంపిస్తాను."
అని గ్యాసు మనిషిని మేడ ఎక్కిస్తున్నాడు. కస్టమర్లలో ఇంత మర్యాదగా పలకరించి మేడ మీదకు ఆహ్వానించే వాళ్లు కూడా వుంటారా అని ఆశ్చర్యపోతూ పర్వతాలు ఆనందంతో పాటు మేడ ఎక్కేడు.
ఆ వేళకి సింహాచలం సంచి భుజాన తగిలించుకుంటున్నాడు.
అతనికి గాసు మనిషిని పరిచయం చేస్తున్నాడు ఆనందం-
"కొండలరావని -"
"కొండల్రావు కాదండి! పర్వతాలు!"
"రెండుపేర్లకీ మీనింగు ఒక్కటే! ఏపేరైతే ఏం గానీ చాకులాంటి కుర్రాడు."
"ఇందాక కత్తి అన్నారండి" అని గుర్తుచేసేడు గాసు మనిషి.
"కత్తి అన్నా చాకు అన్నా ఒకటే మీనింగు" అన్నాడు ఆనందం.
జరగబోయే కార్యక్రమం ఊహించిన సింహాచలం అక్కడి నించితప్పుకొడం మంచిదని గాలిలో చేతులు తిప్పుకుని చెంపలు వాయించుకుంటూ మేడ దిగి పోతున్నాడు.
సింహాచలం వెళ్లిపోగానే, ఆనందం టేబుల్ మీదున్న పేక ముక్కల్ని తీసేడు. డబ్బుల్వికుండా పేక ముక్కలు తీయడం పర్వతాలకు నచ్చలేదు. అందుచేత తన మొహాన్ని గోడవేపు తిప్పుకున్నాడు. అతని రియాక్షను గమనించి ఆనందం అన్నాడు -
"ఏదైనా దీక్షలో వున్నావా గిరీ?"
గోడవేపు నుండి తన మొహం తిప్పకుండానే అన్నాడు-
"నా పేరు గిరి కాదండి! పర్వతాలు"
"అదే లేవయ్యా! గిరి అన్నా కూడా పర్వతమనే మీనింగు! దీక్షలో వున్నావా అని అడుగుతున్నాను!"
"దీక్షా?" అడిగేడు పర్వతాలు మొహం తిప్పకుండానే.
"లేకపోతే ఏవింటయ్యా! గోడ కేసి మొహం గుద్దుకుంటుంటే ఏమనాలి? నా మొహం చూడు!"
"మీ చేతిలో పేకముక్కలున్నాయండి" చూపు మార్చకుండానే అన్నాడు.
"ఊఁ....వుంటే?"
"మీ మొహం చూస్తే నాకు పేక ముక్కలు కనిపిస్తాయండి."
"ఊఁ....కనిపిస్తే?"
"నా గుండెల్లో పేకను కత్తెర వేస్తున్న ఫీలింగు కలుగుతుందండి" అని తన బాధను చెప్పుకున్నాడు - గోడవేపు చూస్తూనే.
"చూడు నాయనా!"
"నే చూడనండి! పేక ముక్కల్ని చూడనని ఒట్టేసుకున్నా!"
"తప్పు నాయనా! పేకని ప్రేమించాలి!"
"నా వల్ల కాదు. భయం నాకు!"
"భయపడ కూడదు. నేనున్నాగా ఒక్కసారి చూడు-"
పర్వతాలు చూళ్లేదు. మరింత పంతంతో గోడ వేపు మొహం పెట్టి గోడను బల్లి లాగా అతుక్కుపోయాడు. దాంతో ఆనందం అహందెబ్బతింది. ఆఖరి అస్త్రం ప్రయోగించేడు -
"నా దగ్గిర అయిదొందల నోటుంది."
"నా దగ్గిర చిల్లర లేదు."
"ఆఖ్ఖర్లేదు. నువ్వు చిల్లరివ్వనవసరం లేదు. అయిదొందల నోటు నీకివ్వాలను కుంటున్నాను"
ఆ మాటకి పర్వతాలు ఎంతో ఆనందించేడు. కానీ - నోటు తీసుకునేప్పుడు పేక ముక్కల్ని చూడవలసి వస్తుందన్న భయంతో మొహం తిప్పలేదు.
"మొహం తిప్పక్కర్లేదులే! నీ చెయ్యి ఏది?" అన్నాడు ఆనందం.
"ఇక్కడే వుంది!" అన్నాడు పర్వతాలు గోడ వేపు నుంచి దృష్టి మరల్చకుండానే.
ఆనందం పర్వతాలు చేతిని సుతిమెత్తగా తాకేడు. ఆ చేతిని చూస్తూ అన్నాడు-
"గొప్ప జాతకుడివయ్యా పర్వతాలూ! చూసేవా? నా నోటి నుండి నీపేరు కరక్టుగా వచ్చేసింది. అదన్నమాట. ఇల్లిల్లూ తిరిగేకాళ్లుంటే వుండొచ్చు గానీ - నీ చెయ్యి మాత్రం అద్భుతం. ఏది ముట్టుకున్నా బంగారమే!"
అంత మాట విన్న తర్వాత ఇక ఓర్చుకోలేక పోయేడు పర్వతాలు గోడ నుండి వెనక్కి వచ్చి ఆనందాన్ని చూస్తూ, ఆత్మీయంగా అడిగేడు
"నిజమా సార్! నా చేతిలో ధన యోగముందా?"
మిడతంబోట్లు దొరికినందుకు సంతోషిస్తూ-
"దైర్యం చేయాలే గాని లక్ష్మీదేవి నీ వెంట నీ ఇంటికే వస్తుంది అంతెందుకు? ఈ పేకలో మూడో కార్డుబొమ్మా? నెంబరా? చెప్పుచూద్దాం!" అని అడిగేడు
"బొమ్మ ఖచ్చితంగా బొమ్మ!" అన్నాడు పర్వతాలు.
ఆనందం చాలా జాగ్రత్తగా పేకల్లోంచి కార్డు లాగేడు. ఆ కార్డు మీద ఆటీను రాణి బొమ్మ వుంది! ఆటీను రాణిని చూడగానే పర్వాతాలు ఆనందించేడు. అతన్ని మరింత ఉత్సాహపరిచే విధంగా ఆనందం అన్నాడు.
"చూసేవా?"
"చూసేనండి"
"ఇంకా చూడు. బాగా చూడు సింపులుగా నీ జాతకం ఇదన్నమాట! ఇంద అయిదొందలు తీసుకో!"
పర్వతాలు ఉక్కిరి బిక్కిరవుతూ అన్నాడు-
"అయిదోందలే! వద్దుసార్! అంత డబ్బు నా కొద్దు! గేసు బిల్లివ్వండిచాలు!"
ఆనందం పర్వతాలను ఓదార్చే బాణీలో అన్నాడు-
"అయిదోందలకే మెలికలు తిరుగుతున్నావా పర్వాతాలూ! అయిదు కోట్ల యోగం నీ చేతిలో వుంది. తెలుసా?"
"అంతే నంటారా?" పర్వతాలు ఆశగా అడిగేడు.
"కాకపోతే - కొంచెం దైర్యంగా, చొరవగా వ్యవహరించాలి!"
అని అయిదొందల కాగితం పర్వతాలు జేబులో పెట్టి -
"శ్రీవేణుగోపాల స్వామి ఆలయానికి వేళయింది. వస్తా" అన్నాడు ఆనందం.
పర్వతాలు మెలికలు తిరిగి పోతూ ఆశగా అడిగేడు -
"సార్! ఇంకొక్క పందెం! ఇల్లాంటిదే. కాదనకండి."
ఆనందం వేదాంతపరమైన నవ్వోక్కటి నవ్వేసి ఎంతో ప్రేమగా అన్నాడు-
"అల్లాగే ఆ బల్లమీద కూచో!"
4
ఆనందం గారి పచ్చమేడ ముందు పరమానందంగారి తెల్లమేడ వుంది. ఆ మేడ కూడ ఈ మేడ మాదిరి ఎంతో ఖరీదుగా, ముచ్చటగా కనిపిస్తోంది.
ఆ రోడ్డుమీద ఇప్పుడు కూరల బండి నడుస్తోంది.
ఆ బండిలో ఏఏ కూరలున్నాయో రాగాలు తీస్తూ ప్రకటిస్తున్నాడు కూరలు వాడు. ఇంత మునుపు గాసు తెచ్చే మనిషీ -ఇపుడు కూరలు మనిషి ఆ వీథీలోకి రావడం అక్కడి కనాభాకీ విడ్డూరమనిపించింది.