అంతే! ఆ వీథి పేరు వినగానే ఆటో మనిషికి నిజంగానే ఒక పనైపోయింది. అకస్మాత్తుగా 'ఆ' అంటూ మాయమైపోయేడు.
ఆటో మనిషి మాయమై నందుకు ఇల్లాలు ఆశ్చర్యపోతూ వుంటే - చిట్టి మాజిక్ ప్రదర్శన చూస్తూన్నట్టు ఎగిరెగిరి చప్పట్లు కొడుతూ నవుతూ అంటున్నాడు-
"భలే! భలే! వీథి పేరు వినగానే మాయమై పోయేడు."
అక్కడే వున్న ఒక వ్యక్తి చిట్టితో అన్నాడు.
"తనే కాదు బాబు! నంది వాడ వారి వీథి గురించి తెలిసిన వారెవరైనా అంతే! ఆ వీథి పేరు వినగానే మాయమై పోతారు."
ఆ మాటకి భయపడి చిట్టిని దగ్గరిగా తీసుకుని అడిగింది ఇల్లాలు.
"ఏం బాబు? పిల్లాడ్ని చేసి కాశీ మజిలీ అడిగింది ఇల్లాలు.
"కథలు కావమ్మా! చరిత్ర! ప్రస్తుతం నందివాడవారి వీథిలో నడుస్తున్న చరిత్ర! ఆటో వాళ్లు రిక్షా వాళ్లే కాదమ్మా! కూరల వాళ్లు, పాలవాళ్లు ఎవరూ ఆ వీథిలోకి వెళ్లారు. వెడితే క్షేమంగా వెనక్కి తిరిగి రారు."
"ఎంచేత? ఆ వీథిలో ఏవైనా దయ్యాలు భూతాలూ వున్నాయా?"
"అవే ఉంటే భయమెందుకమ్మా? వాటికి భూతవైద్యులుంటారు. కానీ, ఆ వీథిలో రోడ్డుకి కుడివేపు ఆనందం, ఎడమవేపు పరమానందం వున్నారు."
"వాళ్లెవరు?"
"పుట్టు శ్రీమంతులమ్మా! డబ్బుతో బలిసి పోయిన శ్రీమంతులు!"
"అయితే కావచ్చు! వాళ్లంటే భయమెందుకు?"
"వాళ్ల బుద్ది పరమ నీచం తల్లీ! జూద బుద్దమ్మా! జూదం వాళ్లకి ప్రాణంతో సమానం. జూదమే వాళ్ల నిత్యకృత్యం."
"అది సరేనయ్యా! వాళ్లు జూదగాళ్లే కావచ్చు. మనకేమిటిబ్బంది?"
"ఒకసారి ఆ వీథి లోకి అడుగుపెడితే తెలిసోస్తుంది. మీకు తెలీకుండానే - మీ మీద పందెం కాస్తారు.""నా మీద పందెమా?" ఆశ్చర్యంగా అడిగింది.
"అవునమ్మా! మీ నడక మీద పందెం కాస్తారు. మీరు కట్టుకున్న చీర మీద కాస్తారు. మీజడ మీద, మీ జళ్లో పువ్వుల మీద కాస్తారు. మీరే కాదమ్మా - ఆ వీథిలోకి వచ్చే కారు మీద, దాని రంగుమీదా, ఆటో మీదా, దాని నెంబరు మీదా. పందాలు కాస్తుంటారు. ఆ వీథిలో తిరిగే కుక్కలు, పిల్లలు, కోళ్లు - ఒక్కటేవిటి చివరికి ఆ వీథిలో వీచే గాలి మీద కూడా పందాలు కాసి వాళ్లు కాలక్షేపం చేస్తుంటారు."
"ఇదేం విడ్డూరం?"
"లక్షలూ కోట్లూ డబ్బుంటే సరిపోతుందమ్మా? బుద్ది.... బుద్ది కూడా వుండాలిగా! అదే లేదు. అది వాళ్లకి లేదని తెలిసిన బుద్దిమంతులెవ్వరూ సాహసించి ఆ వీథిలోకి అడుగుపెట్టరు. అడుగుపెట్టారో - వాళ్లు ఆడుకునే జూదంలో పేక ముక్కగానో, కోడి పందెంలో కోళ్లు లాగానో మారి పోవాల్సిందే! అందుకే ఆటో వాళ్లు. రిక్షావాళ్లు ఆ వీథిలోకి వెళ్లారు!" అన్నాడు.
ఇల్లాలు బోలెడు విచార పడిపోతూ అనుకుంది.
'దిక్కుమాలిన మేళం! వీథిలో అడుగుపెట్టిన వాళ్ల మీద పందాలు కాయడమేమిటి? ముదనష్టపు పందాలు?' అని రాగాలు తీస్తోంది ఇల్లాలు!
3
అది నందివాడ వారి వీథి!
అందంగా వుంది. వీథి మొత్తం ఎంతో నీటుగా వుంది. చక్కటి రోడ్డు చూడ ముచ్చటగా వుంది. అయితే ఆ రోడ్డు మీద జనం పంచారం మాత్రం అతి శోచనీయమైన సంఖ్యలో వుంది.
నందివాడ వారి వీథిలోకి గ్యాసు వాడు సిలిండరు భుజాన వేసుకుని నడుస్తున్నాడు. దాన్ని ఏ ఇంటికి తీసుకెడుతున్నాడో తెలుకుందామని ఒకరిద్దరిళ్లవారు ప్రయత్నాంచారు గానీ - లేని పోనీ వ్యవహారం మనకెందుకని ఆ ప్రయత్నాన్ని మధ్యలోనే నిరమించేపేరు.
గ్యాసు వాడు చేతిలో బిల్లును చూసుకుంటూ - ఆ బిల్లు మీద రాసిన అద్రసుని గోడల మీద వెతుక్కుంటో నడుస్తున్నాడు. ఆ విధంగా అతను అన్ని గోడలు వెతుక్కుంటో నడుస్తున్నాడు. ఆ విధంగా అతను అన్ని గోడలు వెతుక్కుంటో 'ఆనంద నిలయం' దగ్గిర కొచ్చి ఆగేడు. అదొక పెద్దమేడ. పచ్చమేడ!
మేడమీద గదిలో ఆనందం ఫోన్లో మాటాడుతున్నాడు. అతని పక్కన అతని గుమాస్తా నిలబడి యజమాని తాలూకు సంభాషణ వివరాలు శ్రద్దగా రాసుకుంటున్నాడు.
ఆనందం ఫోన్లో మాటాడు తున్నా స్టాంపు పేపరు మీద రాసుకునే ఒప్పందం మాదిరి నొక్కి నొక్కి మాటాడుతున్నాడు.
"జాగ్రత్తగా విను! మన వీథిలో శ్రీవేణుగోపాల స్వామి దేవాలయంలో - ఇవాళ ఉదయం పది గంటలలోపు - ఎన్ని కొబ్బరి కాయలు పగుల్తాయి? అచ్చేప్పు.... రెండొందల డెబ్బై! అంతేగా సరే. నేను రెండొందల ఏబై అంటున్నాను. నోట్ చేసుకో ..... రెండొందల డెబ్బై గానీ - అంతకు మించి గానీ పగుల్తే పందెం నీది. రెండొందల ఎబై లోపు ఎన్ని పగిలినా పందెం నాది. సరేనా? అయిదొందల ఇరవై రూపాయల పందెం. చెక్కురాసి మా గుమాస్తాకిచ్చి పంపిస్తున్నా! నువ్వు కూడా ఆ ఏర్పాటులో వుండు."
అని ఫోన్ పెట్టేసి 'సింహాచలం' అని పిలిచేడు. పక్కనే ఉన్న బక్క గుమాస్తా అంటున్నాడు-
"చిత్తం! అలాగే కానీండి. ఇంద చెక్కు సంతకం చేయండి" అని చెక్కు ఆనందానికిచ్చేడు.
ఆ చెక్కు మీద పరమానందం అని పేరు రాసి వుంది. ఆ మాట కొస్తే ఆనందం దగ్గిరున్న చెక్కులన్నిటి మీదా పరమానందం అనే పేరు మాత్రమే రాసి వుంటుంది. అవన్నీ పందెం చెక్కులే! పైకం వేసి సంతకం చేయడమే ఆనందం వంతు. ఆనందం ఆ పనిలో వున్నాడు.
అయ్యా -ఆ చెక్కుతో నేటికి రెండొందల తొంబై చెక్కులు పూర్తయ్యాయండి!" అన్నాడు సింహాచలం.
"ప్రతిరోజూ ఈ వేళకి అయిదోందల చెక్కులు సంతకం చేసేవాడ్ని పందాలు పలచబడుతున్నాయి. గమనిస్తున్నావా?" అన్నాడు ఆనందం.
"చిత్తం! వీథిలో మనుషులు సరే - పశుపక్ష్యాదులు కూడా కనిపించడం లేదండి! వాటిక్కూడా తమ పందాల గురించి తెలిసి బెదిరిపోతున్నాయో ఏమిటో? తమరు సంతకం చేయండి" అన్నాడు సింహాచలం.
సింహాచలానికి పెళ్లి కాలేదు. అట్లాగని వయస్సు చిన్నదా అంటే అదీ కాదు. ముదిరి పోయిన బెండకాయ. పెళ్లీ పెటాకులు వదిలేసుకుని యాజమాని సేవకే తన జీవితం అంకితం చేసుకున్నాడు. ఆనందం చెక్కు మీద సంతకం చేస్తుండగా-
మేడ కింద -
గేటు తెరుచుకుని గ్యాసు మనిషి లోపలికి వచ్చేడు. గుమ్మం దగ్గర నిలబడి బజరు మీద చేయివేసేడు. గుమ్మం తలుపు తెరుచుకుంది. శ్రీమతి తాయారు - ఆనందం సతీమణి- గుమ్మంలో నించుంది.
గ్యాసు మనిషి బిల్లు చూస్తూ అడిగేడు-
"ఆనందం గారిల్లు ఇదేకదండి?"
"అవును. గ్యాసు తెచ్చేవా?"
"అవునండి. గ్యాసు కంపెనీలో కొత్తగా చేరాను గదండీ - అంచేత-"
"నువ్వు కొత్తగా చేరేవని తెలుస్తునే వుంది. ఇంటో అయ్యగారున్నారు! గట్టిగా మాటాడకు."
"మాటాడితే ఏమవుద్దమ్మా?" అని మెల్లిగా అడిగేడు.
"ఆ వివరాలు నీకెందుగ్గానీ - సిలిండరు లోపలికి తీసుకురా!" అని ఆమె ఇంటోకి నడిచింది.
ఆమెను వెంబడిస్తూ గ్యాసు మనిషి కూడా ఇంటోకి వచ్చేడు.
"అదుగో అదే వంట గది! అక్కడ పెట్టు" అన్నది తాయారమ్మ.
గ్యాసు మనిషి ఆ పనిలో వున్నాడు. అతనికివ్వవలసిన డబ్బు కోసంపర్సు చూసుకుంది తాయారమ్మ బిల్లుకి సరిపడే డబ్బులేదు. అంచేత ఆమె ఆనందాన్ని పిలవక తప్పలేదు-
"ఏవండీ! మిమ్మల్నే!"
మేడమీద ఆనందం బిజీగా వున్నాడు. సంతకం చేసిన చెక్కు సింహాచలానికిస్తూ కొన్ని సూచనలు కూడా ఇస్తున్నాడు-
"ఇంద! ఈ చెక్కు తీసుకుని గుడి కెళ్లు"
"చిత్తం!" చెక్కు తీసుకుంటూ అన్నాడు సింహాచ"ఎన్ని కొబ్బరికాయలు పగిలాయో పూజారిని అడుగు!"
"చిత్తం! తప్పకుండా అడుగుతానండి!"
"లెక్క చెబుతాడు. అతని లెక్క మీద అనుమానం కలిగితే స్వయంగా నువ్వే అక్కడున్న చిప్పల్ని లెక్క పెట్టు!"
"అంతే గదండీ మరి?"
"ఒక కాయికి రెండు చిప్పలు!"
"చిత్తం! కాయ సమంగా పగలకపోతే మూడు ముక్కలవుతుందండి."
"ఎన్ని ముక్కలైనా సరే! కాయల్ని కరెక్టుగా లెక్క పెట్టడం నీ డ్యూటీ!"
"చిత్తం!"
కింద నుండి తాయారమ్మ రెండో తడవ భర్తని పిలిచింది.
"మిమ్మల్నే! గ్యాసోచ్చింది. ఒకసారి మేడ దిగిరండి!"
ఆనందం సింహాచలంతో ఉత్సాహంగా అన్నాడు-
"విన్నావా?"
"చిత్తం! విన్నానండి!"
"ఎంతో కాలానికి మనింటికి మనిషోచ్చేడు!"