"హ్హూ! బొంబాయి మహానగరం రాక్షసులకి పుట్టినిల్లా ఏమిటి? ఇక్కడున్నవాళ్ళే. బొంబాయి ముఖం తానేనాడూ చూడలేదని చెప్పబట్టి లేనివి చెప్పి భయపడుతున్నాడు. గదిలోంచి బైటికి రావద్దన్నాడు. తను తెలివిగా పోట్లాడబట్టి చివరికి కారిడార్ వరకూ వెళ్ళమని బోడి ఆజ్ఞ ఇచ్చాడు. అసలు ఇతనిమాట తనెందుకు వినాలి? తనకి చదువుంది. సంస్కారముంది. తెలివుంది. ఓసారి అలా బైటికెళ్ళి టాక్సీ ఎక్కి ఊరంతా తిరిగిరావాలి. తిక్క తిన్నగా కుదురుతుంది."
"ఎవరి తిక్క?" అంతరాత్మ ప్రశ్నించినట్లయింది.
"ఉష్. నీదో గోల, రాజ్ లాగానే నీవూ భయపెడతావేమిటి? అసలితన్ని నమ్మవచ్చో లేదో? మంచివాడు లాగానే మసలుతున్నాడు. అఫ్ కోర్స్-అది వేరే సంగతి. ఎన్నిసార్లు అడిగినా తన నేరం చెప్పడేమిటి? మంచిమాటలతో తనను ఈ గదిదాటి పోనీయడంలేదేమో? బంధించటంలో ఇదోరకం తెలివి కాదుకదా? అక్కపేరు, తనపేరు తెలిసి నాటకం అడుతున్నాడేమో! ఎవరినీ నమ్మడానికి వీలులేదు బాబూ!
"పోనీ ఇక్కడనుంచి అతనొచ్చేసరికి జండా ఎత్తేస్తే ఉహు అదంత మంచిపని కాదేమో! ఇంటిముఖం చూసే ప్రసక్తిలేదు. పృధ్వీరాజ్ దగ్గరకు వెళ్ళాలి. లేనిపోంది ఇతనికి పృధ్వీరాజ్ అడ్రస్ యిచ్చాను. తను పారిపోయానని తెలియగానే రాజు జాగ్రత్త పడతాడు. పృధ్వీరాజ్ నే మాయం చేయవచ్చు. ఉష్. ఎటు చూసినా మార్గం కనపడటం లేదు.
తన ఆలోచనలకి తనే విసుక్కుంది నందితాదేవి. విసురుగా వెళ్ళి ధబేల్ మంటూ మంచంమీద కూర్చుంది. తిరగేసినట్లే తిరగేసి మాగజయిన్ విసిరి నేలకేసి కొట్టింది.
టక్ టక్ మంటూ నెమ్మదిగా సుతారంగా తలుపు చప్పుడయింది.
నందితాదేవి గబుక్కున మంచం మీంచి లేచింది.
మరోసారి చప్పుడయింది.
"రాజు అలా కొట్టడు. ఎందుకయినా మంచిది. తను జాగ్రత్తగా మెలగాలి. తనకేం భయమా? భయం కాదు గాని కొత్తది కొని తెచ్చుకోటం దేనికి?"
నెమ్మదిగా కొద్దిగా తలుపు తెరిచింది నందితాదేవి.
తెల్లగా మెరిసే పళ్ళు, నల్లని చాయ, రూపాయంత పెద్ద కుంకం బొట్టు, జరీ చీర. ముమ్మూర్తులా ఆంధ్రవనిత నలభై, యాభై ఏళ్ల మధ్య వయసావిడ నుంచొని వుంది.
"ఆ చివరి రూమ్ లో నేనూ మావారూ దిగాము. మా వారు బైటికి వెళ్ళారు. ఏమీ తోచటం లేదు. నిన్న నిన్ను చూశాను. మన ఆంధ్రా పిల్లేనని సంతోషించాను. ఇరువురం మాట్లాడుకుంటూ కూర్చుందాము అమ్మాయ్" నవ్వటం తన జన్మహక్కన్నట్లు నవ్వుతూ చెప్పింది ఆమె.
ఆమె నవ్వు నచ్చలేదు నందితాదేవికి "నేను పడుకుంటాను" అంది.
"కాదన్నదెవరూ. పడుకో అమ్మాయ్? కూర్చుని కబుర్లు చెపుతాను" అదే నవ్వుతో అంది ఆమె.
"కబుర్లు వినే ఓపికలేదు. తలనొప్పిగా వుంది. పడుకుంటాను. తర్వాత మాట్లాడుకుందాము" మరో మాట కాస్కారమివ్వక తలుపు ఆమె ముఖం మీదనే వేసింది నందితాదేవి.
తలుపు వేసిం తర్వాత అనుకుంది. "ఆమె పాపం ఆంధ్ర తెలుగుపిల్లని కదా అని నా దగ్గరకొచ్చింది. అతను చెప్పటం కాదు గానీ అన్నీ లేనిపోని అనుమానాలు మనసులో చోటు చేసుకుంటున్నాయి. ఆమెతో పరిచయం చేసుకుంటే ఈ రాజువల్ల ఆపద వచ్చినా ఓ తోడు వుంటుందికదా?"