Previous Page Next Page 
పెట్టితిసిచూడు పేజి 28

    అంటే దొంగ పారిపోయాడు.

    పారిపోయిన దొంగ పెట్టెకోసం మళ్ళీ తిరిగివస్తాడా?

    వచ్చి ఎవరి నడుగుతాడు?

    అడగడు.

    కనుక ఆ పెట్టె తనది.

    "ఇంతకీ ఆ పెట్టెలో నగలు వున్నట్టా, సినిమాలలో చూపించినట్లు నోట్ల కట్టలు పేర్చి వున్నట్లా? ఏవైనా ఫర్వాలేదు. జీవితం అన్న తరువాత మనిషి జన్మంటూ ఎత్తిన తర్వాత అన్నీ అనుభవించాలన్నది తన సిద్దాంతం. ఉన్నంతలో చాలానే అనుభవించాడు. ఫైవ్ స్టార్ హోటల్లో పాతిక రోజులు వుండి రోజుకో దేశం ఆడదాన్ని ఆనందంగా అనుభవించాలన్న కోరిక తప్పించి మరోగంట తర్వాత బొందిలో ప్రాణాలు వుంటాయో లేదో తెలియని పాడు మానవజన్మ ఇది. పెట్టెలో వున్న ధనాన్ని ఖర్చు పెట్టి తన చిరకాల వాంఛ అతి ఖరీదైన కోరిక తీర్చుకోవాలి. ఎంత ప్రయత్నించినా పెట్టెకున్న తాళం రావడంలేదు. అది తియ్యటం ఎలా? తాళాలు రిపేరు చేసేవాడిని పిలిస్తే అయిదు నిమిషాలలో తీసిపెడతాడు. కాని అది అంత మంచిపని కాదు. ఈ రాత్రికి తీరుబడిగా కూర్చుని పగలకొడితే సరి...."

    రంగశాయి తన బెడ్ రూమ్ లో పడక్కుర్చీలో పడుకుని మంచం మీద పెట్టెని వుంచి తదేక దీక్షగా ఆ పెట్టె వంక చూస్తూ ఉషారుగా కాళ్ళు వూపుతూ ఆలోచిస్తున్నాడు.

    రంగశాయి అలా ఆలోచిస్తున్న సమయంలో కోదండరామయ్య ఆ యింటికి వచ్చాడు.

    వాకిట్లో ఎదురయిన నౌకరు "అమ్మగారు, పిల్లలు పుట్టింటికి వెళ్ళారు. అయ్యగారు బెడ్ రూమ్ లో వున్నారు. పిలవమంటారా?" అని అడిగాడు.

    రంగశాయి ఏ గదిలో వున్నాడో అడగా పెట్టకుండా లోపలికి వెళ్ళే చనువు కోదండరామయ్యకి వుంది. అందుకని "నే వెళతాలే" అని చెప్పి సరాసరి రంగశాయి బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు.

    రంగశాయి అటు తిరిగి వున్నాడు. అందువల్ల కోదండరామయ్యని చూడలేదు.

    కోదండరామయ్య గుమ్మం దగ్గరే ఆగి రంగశాయి ముఖంలో కదులాడే సంతోష చిహ్నాలని కనిపెట్టాడు. మనసుని చదివేశాడు నవ్వుకున్నాడు. 'అలాగే ఆశపడరా నాయనా! పిశాచం పీక్కుతినేదాకా' అనుకున్నాడు. ఆ తర్వాత తన రాకని గుర్తు చేస్తూ పొడిదగ్గు దగ్గాడు.

    రంగశాయి కంగారుగా తలతిప్పి చూశాడు.

    "ఏమిటి సుదీర్ఘ దీర్ఘాలోచన చేస్తున్నావ్?" నవ్వుతూ అడిగేశాడు కోదండరామయ్య.

    పెట్టెతీసి దాచే టైము లేదు. వరండాలో కూర్చుందాం అందామంటే, తనిక్కడే కూర్చుని కోదండరామయ్య రావడంతో ఆ మాట అంటే బాగుండదు మింగాకక్కాలేని పరిస్థితిలో "రా రా" అంటూ ఆహ్వానించాడు. అలా ఆహ్వానిస్తూనే 'జిడ్డు పీనాసి' అని తిట్టుకున్నాడు.

    రంగశాయి పక్కనే కుర్చీ వుంటే దానిని మంచం పక్కకు లాక్కుని కూర్చున్నాడు కోదండరామయ్య.

    "యాత్రలనుంచి ఎప్పుడు వచ్చావ్" రంగశాయి అడిగాడు.

    'మొన్న వచ్చాను. ఈ పెట్టె ఏంటి మంచం ఎక్కించావు?" కోదండరామయ్య మామూలుగా అడిగినట్లు అడిగాడు.

    'నీ పిండాకూడు' అనుకున్నాడు రంగశాయి. అయినా జవాబు ఏదో ఒకటి యివ్వాలి కాబట్టి "మంచంమీద నుంచి తీసి బీరువామీద పెడదామనుకున్నాను. ఇంతలో నీవు వచ్చావు యాత్రా విశేషాలు ఏమిటోయ్?"

    "షరా మామూలే. విశేషాలంటూ ఏమీ జరగలేదు. ఈ పెట్టె కొత్తరకంగా బాగుంది. ఎక్కడ కొన్నావ్?"

    "మా ఆవిడ కొంది. వూరికి తీసుకెళతానంది. మళ్ళీ మానేసింది. ఈ తఫా యాత్రలనుంచి వస్తూ ఏం తెచ్చావ్?"

    పెట్టెమీదనుంచి దృష్టి మళ్ళించాలని రంగశాయి తాపత్రయపడుతుంటే కోదండరామయ్య జిడ్డులా ఆ పెట్టె గురించే అడుగుతున్నాడు.  పిల్లికి చెలగాటం ఎలుక్కి ప్రాణసంకటంలా వాళ్ళమధ్య సంభాషణ నడుస్తున్నది.  

 Previous Page Next Page