Previous Page Next Page 
విరిజల్లు పేజి 30


    "విరజా...."
    తలెత్తి చూసింది. ఆ ముఖంలో ద్యోతకమవుతున్న వేదనని, ఆందోళనని చూచి మరేమీ అనలేకపోయాడు. టేబిల్ పైకి ఆమె చేయినందుకుని ముఖంలోకి చూస్తూ అన్నాడు.
    "నన్ను క్షమించు విరజా! పువ్వుకన్నా సుకుమారమయిన నీ మనస్సుని నొప్పించాను. నీ మనసేమిటో తెలిసీ తెలియనట్లుగా నిన్ను యిబ్బందుల్లో పెట్టాను. బొమ్మలా కూర్చున్నానన్నావ్! ఎంతగా బాధించిందని ఆ మాట విరజా! అప్పుడే ఎందుకు అడ్డు చెప్పలేకపోయావ్."
    కన్నీరు కారబోతుంటే లోలోపలే కుక్కుకుంటూ అంది.
    చెప్పలేకపోయాను వేణూ! నా వేణుని నేనే అడ్డగించి అతన్ని బాధపెట్టి అతని కోర్కెను కాదనే దరిద్రపు స్థితి దాపురించిందేయని ఏడుస్తున్న మనస్సుని కాదనే మాట బయటపెట్టే ధైర్యం దానికి లేకపోయింది. కానీ నీవు అర్ధం చేసుకోలేక ఏమైనా అయిపోతావని భయమయింది వేణూ! నా అంగీకారమో, అనంగీకారమో, తేల్చుకోలేక ఏమీ తెలియని స్థితిలో నీకు బాధపెడుతూ వుంటే నేనెలా సరించుకోగలను వేణూ?"
    "ఇప్పుడు మాత్రం బాధకదా విరజా! అయినా నీ బాధ ఏపాటిది? నోరుండే మూగదానిలా కూర్చోవాలంటే ఎంత కష్టం విరజా! అసలు స్త్రీ జీవితమే అంత విరజా! యెప్పుడూ ఎందునా ఎన్నో విధాల యెన్నిటినో కోల్పోతుంది. నీ విషాద జీవితంలో మరో విషాద సంఘటనని సృష్టించిన నన్ను మన్నిస్తావుకదూ! ద్వందాతీతమైన రుణశీలిని నిన్ను బాధపెట్టిన పాపం వూరకే పోతుందా విరజా! అది నన్ను కాల్చేయ్యదూ...."
    "అంతమాట అనొద్దు వేణూ! నిన్ను క్షమించేంత గొప్పదనం ఏమీలేదు నాలో, కానీ నన్ను అర్ధం చేసుకోమని కోరుతున్నాను అంతే!"
    "నిన్ను అర్ధం చేసుకున్నాను విరజా! నీ మనసుని గ్రహించాను. నీవు రాసేవే ఆ మాట.... "వచ్చే జన్మలో ఎంత వీలయితే అంత తొందరగా నా దగ్గర చేరుతావని...." ఆ మాట చాలు విరజా నాకు.... ఈజీవితం ఎప్పుడు ముగుస్తుందో.... మళ్ళీ ఎప్పుడు పునర్జన్మ కలిగి నా విరజ నాదవుతుందా అని చూస్తున్నాడు. ఈ జన్మలో కలిగిన అనుభవాలు చాలు విరజా. నాకీ మానవ జీవితం అంటే విసుగెత్తింది. యెప్పుడెప్పుడు జీవన వాయువులు అనంత వాయువుల్లో కలుస్తాయో అని యెదురు చూస్తున్నాను, ఈ జన్మకీ విరజ స్నేహము చాలు. ఆనాడయినా నీవు భాషని అర్ధం చేసుకున్నంతగా భావాన్ని అర్ధం చేసుకోలేక పోయావ్. నాకు నీవు కావాలంటే ప్రతిక్షణం నీవు నా దగ్గర వుండాలనే కోరిక. అంతేకానీ దానికి మరో అర్ధంలేదు నా మనసులో. అయినా ఆ విషయం పోనేలే! భగవానుడు దయతో ఏనాడో విడిపోయిన నిన్ను దరిచేర్చి వదలి పోయిన జీవితాన్ని వాసన పూరితం చేశాడు."
    అతని చేతిని అందుకుని ఫాల భాగానికి రాసుకుంటూ "వేణూ! నీ ఔన్నత్యం నాలో లేదు. నిన్ను విడిచి బ్రతకలేక నీ దగ్గర చేరి చేరువకాలేక, చేరువై చెంత చేరలేక ప్రతి సెకనూ నరకం అనుభవిస్తూ మనస్సుని ఊరడించుకోలేక ఎంత బాధకు లోనవుతున్నానో దయామయుడయిన ఆ వేంకటేశ్వరుడు ఎప్పుడు దయజూస్తాడో మరి ఆయనకే తెలియాలి.
    కళ్ళు మూసుకుని ఉచ్చ్వాస నిశ్వాసలు బలంగా వదులుతూ అన్నాడు.
    "ఇదొక చిత్రమైన బంధం విరజా! ఎలా కలిశామో, యెందుకిలా విడిపోయి మళ్ళీ కలిశామో, యెలా మన జీవితాలు ముగుస్తాయో, తెలియటం లేదు. యీ చిత్రమయిన జగన్నాటకంలో మనలాంటి వాళ్ళు యెందరున్నారో, ఏమో తెలీదు కానీ మనలాంటి చిత్రమైనబంధం కలిగే వాళ్ళు మాత్రం చాలా అరుదు. ఊహించుకునే కొద్దీ ఎక్కువ అవుతుంది యెలా విరజా!"
    పిచ్చి వేణూ! బాధలోనే సుఖంవుంది. దానివల్లే శాంతి లభిస్తుంది. నీ ఇలా పరస్పరం ఒకరి కోసమై ఒకరు యెదురు చూస్తూ కలయికకై నేనూ, నా కలయికకై నీవూ యిలా అహర్నిశలూ తపస్సుచేస్తూ రాబోయే జన్మకై ఎదురు చూడటంలో వున్న ఆనందం కలిసి కాపురంచేసి వుంటే దక్కదా? నిరీక్షణలో వున్న ఆనందం ఆశలో వున్న సుఖం అనుభవంలో దొరకవు వేణూ?"
    "విరజా! నీవు క్రిష్టియన్ వి. నీకు పునర్జన్మ అంటే నమ్మకం వుందంటే మరి ఎలా చెబుతున్నావ్?"
    బాగా కాగిన పాలపై మీగడలాంటి నవ్వు నవ్వి అంది "జీవుని చిత్రమైన శక్తికి సామాన్యమైన భౌతికమైన కులం పంతం, మతం పంతం అంటదు వేణూ! నేను క్రిష్టియన్ని జన్మచేత కానీ భారతీయురాల్నికదా.... నీ వెంట తిరిగిన దాన్ని. ఈ దేశంలో జన్మించిన ప్రతిఒక్కరికీ పునర్జన్మ పై నమ్మకం వుంటుంది. ఎవరికైనా వున్నా లేకున్నా నా చిత్రమయిన మనస్సుతో మాత్రం హిందూ మతపు సాంప్రదాయాలు ఆచారాలు అభిప్రాయాలు గట్టిగా పాతుకుని వున్నాయి. నాకు పునర్జన్మపై నమ్మకం ఎందుకు ఉండదు వేణూ!"
    "పోనీ! విరజా! నన్ను పెళ్ళి చేసుకోకూడదా?"
    అతని కళ్ళలోకి కోపంగా చూస్తూ అంది ఎంతమాట అంటే అంత మాట అంటావు వేణూ! నీవు ఆలోచించకుండా. ఎలా పెళ్ళిచేసుకోను నిన్ను? నీకు పెళ్ళయింది. భార్య వుంది. త్వరలో తండ్రివి కాబోతున్నావు. సమాజం హర్షిస్తుందా? కులం వేరు. మతం వేరు. అన్నీ అడ్డంకులు. అసలది సహజంగా ఉంటుందా చెప్పు? ఒకరుండగా మరొకరు వద్దు వేణూ. ఆ ఆలోచన రానీకు. పెళ్ళి అనే అదృష్టయోగం మనల్ని కలపలేకపోయింది. చైనీస్ చెక్కర్ లో పావుల్ని ఎత్తివేస్తూ నడిపినట్లు భగవంతుడు ఎక్కడికి ఎవర్ని నిర్ధేశించి నడుపుతాడో మానవులు అక్కడికే నడుస్తారా? నడవాలి. పధం మార్చాలన్నా పధం వెతుక్కోవాలన్నా పధికులు పదవిహీనులు కావటంతప్ప మరొకటి వుండదు.
    కించపడుతూ అన్నాడు. "ఒకదాని బదులుగా మరొకటి అడిగాను. నా ఉద్దేశ్యంకాదు. నేను అడగాలనుకున్నది నీవు.... నీవు ఇక పెళ్ళి చేసుకోవా విరజా!"
    అనుకోకుండా సకృత్తుగా అమావాస్యనాడు కనిపించే చంద్రకలలా నవ్వింది.
    "పెళ్ళి పెళ్ళి"
    ఒక సెకను ఆగి ప్రశ్నార్ధకంగా అతని ముఖంలోకి చూస్తూ అడిగింది. "అదో అవసరమా వేణూ!"
    అతని జవాబు కోసం ఆగింది. కానీ అతను ఏమీ జవాబుచెప్పలేదు. ఏవో దేన్ని గురించో ఆలోచించాలని యత్నిస్తోంది అతని మనస్సు కానీ అది మనస్సుకి అంది చావటంలేదు.
    మళ్ళీ అంది "నా మనస్సులో మగవాడంటే నీకు మాత్రమే వేణూ! ఇంకెవ్వరూ మెదలరు. నిండు పున్నమి చంద్రునిలాంటి నిన్ను పొందలేని నా భాగ్యాన్ని నిందించుకోవటం తప్ప ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. అంతేకాని నీవు దక్కలేదని మరొకర్ని వెదుక్కోనా? అయినా నాకెవరున్నారు చెప్పు? తండ్రా, తల్లా, సోదరులా? ఎవరున్నారు? నన్ను వేధించటానికి ఇంకా చదవాలనిపిస్తే యమ్మేకి చదువుతాను. అనిపిస్తే ఉద్యోగం చేస్తాను. విసిగెత్తిననాడు జీవితమే ముగిస్తాను."
    గాబరాగా అన్నాడు. "అలా అనకు విరజా! నా ఎదురుగా అటువంటి మాటలనకు. నీవు జీవించాలి సుఖంగా ఉండాలి. నీకు నీవు దక్కినంత మాత్రాన జీవితం ముగించాలనుకోవటం అర్ధంలేని మాట. బ్రతికి ఉంటే భోగభాగ్యాలు అనుభవించలేకపోయినా ఒకరిని ఒకరు చూడగలుగుతున్నామనే తృప్తి అయినా ఉంటుంది."
    భారమైన మనస్సు కొన్ని సెకన్ లు మాటాడనివ్వలేదు. మళ్ళీ అన్నాడు పెళ్ళి అనేది అంత అవసరం కాకపోయినా ప్రకృతి శక్తుల్ని జయించటానికి సమాజంలో గౌరవం పొందటానికి అవసరమే. ఏ పరిస్థితిలోనైనా పెళ్ళి అనేది అవసరం అనిపిస్తే చేసుకోటానికి వెనుదీయకు. నీవు కోరిన వారిని చేసుకో. ఏ మధుర క్షణాలలోనయినా నేను గుర్తుకువస్తే ఎప్పుడైనా సరే నిన్ను నేను...."
    అతను చెప్పలేకపోయినా దాన్ని అలాగే విడుస్తూ అంది. ఆమె కళ్ళలో తిరిగిన నీళ్ళను మాత్రం విడువలేకపోయింది.
    "పోనీ వేణూ! ఆ విషయాలన్నీ భవిష్యత్తులో ఎప్పుడో జరుగబోయేవి. అసలు జరుగకపోవచ్చు కూడా. వాటిని గురించి ఎందుకాలోచన!"
    "నాకు ఆలోచన కాకుండా మరేముంది విరజా! ఎప్పుడూ బాధపెట్టానే అనే విషయం మనసులో వేధిస్తూంటే శాంతి నెరుగక ఎంతగా కుమిలి, కుమిలి పోవాలో కదా? ఎందుకిలా చేశానో కదా అని యిప్పటికీ నా మనసులో తెలియని ప్రశ్న బయలుదేరుతూనే ఉంది."
    ఆ క్షణం అలాంటిది వేణూ! అంతే అందులో నీ ప్రయత్నం ఏమీలేదు. మనం అంతా నిమిత్తమాత్రులం. అయినా దీన్ని మరచిపోయాను ఎప్పుడో. నీవు ఎందుకు మరచిపోలేక పోతున్నావు?"
    "అలా అని మనసుని సరిపెట్టుకోలేక పోతున్నాను విరజా! నిమిత్తమాత్రులం అన్నదానికి అన్నిట నిమిత్తమాత్రులం కాదా? దుఃఖించటంలో మాత్రం నేను నిమిత్తమాత్రుడినే కదూ...."
    కుర్చీలోంచి లేచి లైట్ వేసింది. బయటనుంచి మెల్లి మెల్లిగా చీకట్లు గదిలోకి రావాలని యత్నించాయి. టేబిల్ పై కూర్చొని అతనిచేయి అందుకుని అంది.   
    "వేణూ.... అన్నీ మర్చిపో. నీ విరజ నీ విరజే. నీ చిన్ననాటి విరజగా మాత్రమే నన్ను గుర్తుంచుకో__ అంతేచాలు. ఈనాటి సంఘటనలు అవి అన్నీ మరిచిపో! నేనెప్పటికీ నీదాన్నే. నన్ను బాధించటం అనేదే లేదు. నాకు దుఃఖమే లేదు. మనమధ్య స్నేహితంలో ఏమాత్రమయినా కించదనం లేదు. లేకుండా వుండాలి_నీవు నేను యింతే మన సంబంధం. దీనిలోవున్న పవిత్ర బంధం మరి దేన్లోనూ లేదు. ఇక వెడతాను. అన్నీ మరిచిపో, కానీ నన్ను గుర్తుంచుకో_" చివరిమాట నవ్వుతూ అంది.    

 Previous Page Next Page