"ఏమండీ....పిల్లలు ఏడిచారా అండీ అల్లరి పెట్టారా ఏమన్నా" ఆఫీసు నించి పిల్లలని తీసుకెళ్ళడానికి వచ్చిన రామారావు మొదటిరోజు ఆరాటంగా అడిగాడు.
'అసలు ఏడవలేదు. మీ పాప కరుణ చక్కగా ఆదుకుంది. ఇన్నాళ్ళు యింట్లో ఆడుకోడానికి ఎవరు లేరేమో ఈరోజు చాలా సరదాగా ఆదుకుంది. బాబుదేం వుంది. పాలుపడితే చాలు" అంది కమల నవ్వుతూ పిల్లలని అందించింది.
"థాంక్ గాడ్ ఒక వర్రీ , బోధరేషన్ తప్పించారు" అన్నాడు రామారావు.
"యిప్పుడు యింటి కెళ్ళాక ఎవరు చూస్తారండీ....యింట్లో వంట అది....' అనవసరంగా అతని విషయాలలో కల్పించుకుంటున్నానేమోనన్న బెరుకుతో ఆగిపోయింది.
అతను విషాదంగా "ఎవరు చూస్తారండి, అన్నీ నేనే చూసుకోవాలి, వండుకోవాలి, పిల్లలని చూసుకోవాలి రాత్రంతా బాబు ఎన్నో సార్లు లేస్తూనే వుంటాడు. పగలు ఆఫీసు , రాత్రి సరిగా నిద్ర వుండదు. అడక్కండి నా అవస్థలు ' దీనంగా అన్నాడతను. "సరళ బదులు నేను పొతే బాగుండేది అనిపిస్తుంది." ఈ పిల్లలు ఎప్పటికి పెద్దవాళ్ళవుతారో ఎలా అవుతారో" తనలో తను అనుకున్నట్టు అన్నాడు.
కమల జాలిగా చూసింది....అంతకంటే తనేం చెయ్యగలదు అనుకుంది నిట్టూర్చి.... పాపం తల్లి లేని పిల్లలని వాళ్ళిద్దరిని మరింత ఆదరంగా చూస్తుంది. కరుణ అయితే ఒక్క నిముషం వదలలేదు.....ఎంతోమంది తల్లిదండ్రులు పిల్లల్ని దింపిపోతున్నారు , గాని.....రామారావు స్థితి చూసి అతనంటే జాలితో తనకి తెలియకుండానే అతనంటే అభిమానం కల్గింది కమలకి.
ఓరోజు సాయంత్రం అరయినా రామారావు ఆఫీసు నించి వచ్చి పిల్లలని తీసుకెళ్ళ లేదు. మిగతా పిల్లలంతా వెళ్ళిపోయారు. చీకటి పడసాగింది. రామారావుకి పిల్లలని అప్పగించందే ఎలా వెళ్ళడం. ఆయా ముందే వెళ్ళిపోయింది. రజియా బేగం కి ఆరోజు జ్వరం తో రాలేదు. కమల ఆందోళనగా ఏం చెయ్యాలో అర్ధం గాక యిటు అటు తిరిగింది.... తన బస్సు వెళ్ళిపోయి వుంటుంది. రిక్షాలో వెళ్ళాలి. యీ పిల్లలని అప్పగిస్తే కాని తను ఎలా వెళ్ళడం అతనేం అయ్యాడు. ఎందుకు రాలేదు. ఎవరిని అడగడం ....ఫోను చేస్తే ఎక్కడ నుంచి చెయ్యడం. యీ పిల్లలని వంటరిగా వదిలి ఎలా వేడ్తుంది.... ఆలోచనలతో , ఆందోళనతో సతమతమవుతుండగా ఆరున్నరకి చెమటలు కక్కుతూ ఉరుకులు పరుగులతో వచ్చాడు. "సారీ అండీ వేరీ సారీ....ఆఫీసరు ఏదో అర్జంటు పని కగిలించాడు వచ్చేస్తుంటే పూర్తీ చేసి వచ్చేసరికి బస్సు వెళ్ళిపోయింది. ఇంకో బస్సు కోసం వెయిట్ చేసి దొరక్క రిక్షాలో వచ్చాను....మీకు నానుంచి ఆలశ్యం అయిపొయింది. క్షమించండి" నొచ్చుకుంటూ అదే పనిగా క్షమాపణ చెప్తున్నా రామారావుని చూసి చిన్నగా నవ్వింది కమల. "ఫరవాలేదు లెండి ఒకపూటకి. కాని మీరెందుకు రాలేదా అని కంగారు పడ్డాను. అంతే....' పిల్లలని అందించి తాళం వేసి అతనితో బయలుదేరింది. "మీరెలా వెడతారు. బస్సు దొరుకుతుందా యిప్పుడు....'
'లేదింకా బస్సు కోసం చూడను.... రిక్షాలో వెళ్ళిపోతాను " అంది కమల. ఇద్దరూ రిక్షా కోసం చూస్తూ నడవసాగారు. ఫర్లాంగు దూరం నడిచినా ఏ ఖాళీ రిక్షా కనిపించలేదు. మనకవసరం వచ్చినరోజు ఏది కనపడదు..... పదండి.....మా యింటికి వెడదాం ......కాఫీ తాగేలోపల రిక్షా గాని అటో గాని తెస్తా. అన్నాడు రామారావు.
"ఏమిటి మీ యిల్లిక్కడేనా.....తెలియదే నాకు" అంది కమల ఆశ్చర్యంగా . దగ్గర కనకే పిల్లలని వదలడానికి సుళువయింది. యిది మరో చోట అయితే యింకే యిబ్బంది అయ్యేది. రండి యీ సందులోనే ....' అన్నాడు రామారావు.
"వద్దండి , రాత్రయింది యింటికి వెళ్ళాలి. యింకోసారి వస్తాను " అంది కమల కాస్త సందేహిస్తూ.
"ఫరవాలేదు ఒక క్షణం కూర్చుంటే రిక్షా తెస్తాను.... చుట్టుపక్కల ఏం కనబడడం లేదు. ఒక్కరూ ఎలా వెడతారు.... నా మూలంగా ఆలశ్యం అయింది కనక మిమ్మల్ని పంపే బాధ్యత నాదే" అన్నాడు. యింకా కాదనలేక అతని వెంట నడచింది సందులో నాలుగో యింటి ముందు ఆగి చేతిలో బాబుని కమలకి అందించి తాళం తీశాడు . రెండుగదులు , వంటిల్లు, ముందుకి చిన్న గ్రిల్స్ వున్న వరండా ముచ్చటగా చిన్న యిల్లు కాని ఆడది లేని యిల్లని తాళం తీయగానే ఎక్కడపడితే అక్కడ పడి వున్న బట్టలు, పుస్తకాలు, బొమ్మలు , గిన్నెలు తెలిసాయి.... అతను కాస్త బిదియపడుతూ , "చూశారా, ఇల్లాలు లేని యిల్లు అడవిలా వుంటుంది. అంటే నమ్మేవాడిని కాను ఎవరన్నా చెపితే ..... యిప్పుడు అర్ధమయింది" అన్నాడు పాపం ఈ మానవుడు ఆఫీసులో చాకిరీ చేసి వచ్చి, యిప్పుడు యింటికి వచ్చి వండాలి. పిల్లలకి పెట్టి నిద్రపుచ్చాలి ఎంత అవస్థ పడుతున్నాడో ...." ప్లీజ్ కూర్చోండి కాఫీ చేస్తాను బ్రూ వుంది కలుపుతాను.
"వద్దండి , అసలు మీరే అవస్థ పడ్తుంటే నాకీ మర్యాదలేందుకు.
అలా కాదు, మొదటిసారి వచ్చారు. నాకోసం ఎలాగో చేసుకొంటాను. ఒక్క నిమిషం , అంటూనే వంటింట్లోకి వెళ్ళాడు.
"అయితే వుండండి నేను చేస్తాను. అంటూ చనువుగా వంటింట్లోకి వెళ్ళింది కమల. పాప కమల యింట్లో తిరుగుతుంటే సంతోషంగా కమలని అంటిపెట్టుకునే సంబరంగా తిరిగింది. బాబుని పడుకో పెట్టి, యింట్లో గుడ్డలు, పుస్తకాలు సర్దాలని వ్యర్ధ ప్రయత్నం చేశాడు రామారావు. కమల కప్పుల్లో కాఫీ పోసి తెచ్చింది. రామారావు డబ్బాలో బిస్కెట్లు తీసి ప్లేట్లో పెట్టి పట్టుకు వచ్చాడు. 'అన్ని పనులు మీరే చేసుకుంటున్నారా , పనిమనిషన్నా వుందా...."
"ఆ, రక్షించి అదెమ్మ దయ తలచి చేస్తుండబట్టీ బతుకుతున్నాను. పిల్లలకి నీళ్ళు అంట్లు, యిల్లుడ్చీ , బట్టలుతికి , కూరలు తరిగి, వంటిల్లు కడిగి ఏదో వున్నంతసేపు కాస్త సాయం చేస్తుంది. జీతం ఎక్కువిస్తున్నాను." అన్నాడు. అతను కాఫీ కప్పు కిందపెట్టి నేను వెళ్ళి అటో తెస్తాను రిక్షా అయితే చాలా ఆలశ్యం అవుతుంది. అంటూ వెళ్ళి పది నిమిషాలలో అటో తెచ్చాడు. రామారావుకి థాంక్స్ చెప్పి, ఆటోలో యింటికి వెళ్తుంటే తనలో మార్పుకి తనే ఆశ్చర్యపోయింది. ఈ ఉద్యోగం తనకి ఎంత చొరవ ధైర్యాన్నిచ్చాయి! యిలా ఒక మగవాడితో మాట్లాడడం, అతనింటికీ వెళ్ళడం, ఓ ఆటోలో ధైర్యంగా వెళ్ళడం వసంత ధర్మమా మాని ఏదో కాలక్షేపం దొరికింది. లేకపోతే యింట్లో తోచక కొట్టుకునేది అనుకుంది.
* * * *
'అన్నయ్యా నీవు నాకో చిన్న సాయం చెయ్యాలి. చేస్తావని మాటివ్వు" అంది వసంత. ప్రసాద్ ఆఫీసులో వుండగా వసంత ఒక అమ్మాయిని వెంటబెట్టుకుని వచ్చింది. చెల్లెలు యిలా ఆఫీసుకి రావడంతో ఆశ్చర్యపోయాడు. ఆ అమ్మాయి ఎవరో ఏమిటో అడిగేలోపలె వసంత అంది....
"ఏమిటి, ఏం కావాలి.....యిలా ఆఫీసుకి వచ్చావెందుకు , యింటికి రాకపోయావా?" అన్నాడు ప్రసాద్ ఆశ్చర్యంగా.
"యింటి పనికాదు. అఫీసుపనే. అందుకే యిక్కడికి వచ్చాను. అన్నయ్యా. యీ అమ్మాయి పేరు శాంతి. బి.ఏ ప్యాసయింది. టైపు షార్టు హాండు వచ్చు. మీ ఆఫీసులో టైపిస్టు పోస్టు ఖాళీ అయింది కదా, ఆ పోస్టుకి అడ్వర్టయిజ్ చేసారుట కదా, అన్నయ్యా యీ అమ్మాయి పాపం మూడేళ్ళుగా ఉద్యోగానికి తిరుగుతున్నా దొరకలేదు. తండ్రి లేడు . పెమిలీని పోషించాల్సిన బాధ్యత యీ అమ్మాయిదే.... తల్లి పాపం వంటలు చేస్తూ రోజులు గడుపుతుందిట..... ఎలాగైనా ఈ ఉద్యోగం యీ అమ్మాయికిప్పించన్నయ్యా. అది నీ చేతిలోని పనిగదా....." అంది ఆశగా చూస్తూ వసంత.