Previous Page Next Page 
పెట్టితిసిచూడు పేజి 27

    "ఇదంతా ఎవరు తిన్నట్టు?"

    "ఏకపాదం గాడు."

    "దరిద్రుడు.

    "వాడు కాదే నేను. ఒకటా రెండా? నాలుగు వందల పైన...."

    "లాభం చిల్లిగవ్వ లేకపోగా నష్టం నాలుగొందల చిల్లర"

    "లాభం లేకపోవడమేం ఖర్మ. ఎర్రపెట్టె వుందిగా!" వ్యంగ్యంగా అన్నాడు కోదండరామయ్య.

    "దానిని ఈ జన్మకి బైటికంటూ తీసికెళ్ళం, దానికో భయంకర చరిత్ర వుంది కాబట్టి. పెట్టెలో ఏమన్నా పెట్టుకుందామా అంటే నాకు సుతరామూ ఇష్టంలేదు. పోనీ అమ్మేద్దామా అంటే ఇప్పుడప్పుడే వద్దని మీరన్నారు. ఎప్పటికైనా అమ్ముదాం ఇంత పెద్ద పెట్టెకి మనం ఖర్చు చేసినంత అయినా రాదా?" వెంకుమాంబ అన్నది.   

    "రాదు. ఈ కాలంలో నూటికో కోటికో తప్ప ఇలాంటి ట్రంకు పెట్టెలు ఎవరూ కొనరు. పల్లెటూరి బైతుకూడా షోగ్గా వి.ఐ.పి. కొంటున్నాడు. మనం దీనిని దాచి దాచి అమ్మినా రెండు వందలపైన ఎర్ర ఏగానీ రాదు. అదైనా ఎవరైనా కొనే నాధుడంటూ వుంటే! నెలకి నాలుగొందలు వడ్డీకి ఇస్తే వడ్డీ ఎంత పెరిగేను? ఇప్పుడు అసలు లేదు, వడ్డీలేదు. అసలుకే ఎసరంటారే- అదే ఇది!"

    "గొప్పగా లైసెన్స్ కూలీకి, రిక్షావాడికి ఎక్కువ ఇస్తిరి" అంది వెంకుమాంబ.

    "అక్కడికేదో ఆశపడి నేను చచ్చినట్టు ఏమిటా మాటలు? అప్పుడే వద్దనకపోయావా? వడ్డాణం, రాణీ కాసులపేరు ఇంకా వళ్ళంతా బంగారం తొడుగు...."

    కోదండరామయ్య వ్యంగ్యంగా అంటుంటే వెంకుమాంబకి ఒళ్ళు మండింది. ఇరువురు విసుగొచ్చేదాకా వాదులాడుకున్నారు.

    "తప్పు చేసినా ఒప్పు చేసినా ఇరువురం అనుభవించాలి. అంతేకాని నువ్వంటే నువ్వని ఈ గోల ఏమిటి? ఇద్దరం ఆశపడి చచ్చాము, ఇరువురం అనుభవించి చద్దాము" రుసరుసలాడుతూ కోదండరామయ్య  లేచాడు. "అలా కాసేపు రంగశాయి ఇంటిదాకా వెళ్ళి వస్తాను. మనసన్నా ప్రశాంతంగా వుంటుంది" అంటూ ఇంట్లోంచి బైటపడ్డాడు.

    "బైటికెళితే మీ మనసు ప్రశాంతంగానే వుంటుంది. ఇంటి పట్టున వుండిచచ్చేది నేను" గొణుక్కుంటూ తలుపులు వేసుకుంది వెంకుమాంబ.

    కోదండరామయ్య వీధిగుమ్మం దిగాడు.

    రంగశాయి ఇంట్లో పెట్టెని పారేసినట్లు భార్యకి చెప్పలేదు కోదండరామయ్య. ఆడవాళ్ళ నోట్లో నువ్వుగింజ నానదని ఆయన గాడాభిప్రాయం రహస్యం దాయడంలో పురుషుడికన్నా స్త్రీ చాలా గట్టిది. ఆ విషయం తెలియక చాలామంది వలెనే ఆయన పొరపాటు పడ్డాడు. అంతే.

    రంగశాయి ఇంట్లో పెట్టెని పారేసినట్లు చెప్పక పక్క వీధిలో పారేసివచ్చినట్లు భార్యతో చెప్పాడు రంగశాయి ఆ పెట్టెని చూసే వుంటాడు. తీసి దాచివుంటాడు. ఆ తర్వాత కథే తెలియదు. తెలుసుకోవాలంటే అక్కడికి వెళ్ళడమే వుత్తమం. రంగశాయి ముఖం వెలిగిపోతుంటే పెట్టె ముఖం తెరవనట్లు, వెయ్యి లంఖణాలు చేసినట్లువుంటే పెట్టె తెరిచి శవం తలకాయని చూసినట్లు.

    రంగశాయి ముఖంచూసి ఏ విషయం తెలుసుకోవడానికి అంతులేని కుతూహలంతో బయలుదేరాడు కోదండరామయ్య.

    అప్పుడు సమయం ఉదయం పదకొండు పది.

                   15

    రంగశాయి తీవ్రాలోచనలో మునిగి తేలుతున్నాడు.

    ........రాత్రి పెట్టె కంట పడంగానే కేసు అర్ధమయినట్లే అయింది. దొంగ వకడు విలువైన నగలు, డబ్బు పెట్టెలో పెట్టుకుని పారిపోయి వస్తుండగా జనం వెంటబడి వుంటారు వాడు తన ఇంట్లోకి వచ్చాడు. పెట్టెతో గోడవారగా నక్కాడు. అదే సమయంలో తను పాస్ కి వెళ్ళడానికి తలుపుతీసి లైటు వేశాడు. వాడు తత్తరపడి పెట్టెని అక్కడే వదిలేసి కాలికి బుడ్డి చెప్పాడు. తను వాకిట్లోకి వెళ్ళి చూడలేదుగాని తన్నండి, కొట్టండి అన్న మాటలు గోలగోలగా విన్నాడు. ఆ తర్వాత పారిపోతున్నాడు పట్టుకోండి అన్న అరుపులు, చాలామంది పరుగెత్తుతున్న శబ్దం వినపడింది. 

 Previous Page Next Page