Previous Page Next Page 
ఇంటింటి కధ పేజి 27


    ఫతిమా మాటలకి పైకి నవ్వినా వసంత హృదయం ఏదో ఆశా భంగంతో చిన్నపోయింది. అందరిని పిలిచారు. తననీ పిలిచారు. స్టాఫ్ అందరితో పాటు తనకీ ఓ కార్డు యిచ్చారు. తన ప్రత్యేకత ఏముంది? కనీసం బాస్ యివ్వలేదు, చెప్పలేదు , ప్యూను చేత పంపారు. ఏదో అవమానం అన్పించింది." అదేమిటి అతనేం మనల్ని పిలవలేదు , చెప్పలేదు ఫ్యూను యిస్తే వెడతామా ...."
    "బాస్ ఎప్పుడో చెప్పేశాడు. తన బర్త్ డే పార్టీకి ప్రతిసారీ రావాలని.....అప్పటి నుంచి అలవాటుగా వెడతాం."
    "అందరూ వెళ్తారా?"
    "ప్యూను నించి మేనేజరు వరకు మొత్తం స్టాఫ్ అంతా వేడ్తాం. ఏం, నీవు రావా....అందరం కల్సి సాయంత్రం 6 గంటలకి యిక్కడ కల్సి ఆఫీసు వ్యానులో వెడతాం ప్రతిసారి.  ఏం చీర కట్టుకుంటావు సాయంత్రం మంచి చీర కట్టుకొని బాగా తయారవ్వు బలే బాగుంటుంది పార్టీ. పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తారు. అబ్బ చూడాలి ఎన్ని రకాల పేషన్స్ కనిపిస్తాయో తెలుసా! మనం అంతలా ఎలాగు తయారు కాలెం, కానీ .....ఈ ఒక్కరోజయినా జిడ్డు మొహాలు ఓడకుండా స్మార్టుగా తయారవాలి. సాయంత్రం యివాళ ఓ గంట ముందు యింటికి వెళ్ళిపోయి మళ్ళీ తయారయి 6 గంటల కల్లా వుండాలిక్కడ. బలే పార్టీలే.....ఎన్ని పెడతారో తెలుసా తినటానికి." ఫతిమా టిఫిన్ తింటున్నంత సేపూ ఆ పార్టీ గురించి ఎక్శ్రాట్ అవుతూ ఎన్నో చెప్పింది.
    వసంత మవునంగా వింది కార్డు అందుకున్నప్పటి వుత్సాహం పోయింది. బాస్ ఏం అంటాడో చూడాలి. అప్పుడన్నా బాగా పలకరించి అందరికి పరిచయం చేసి , తనకి ఏమన్నా పని అప్పగిస్తాడేమో చూడాలి అనుకుంది.
    నాల్గు గంటల కల్లా ఆఫీసు వదిలి నాలుగున్నర కిల్లు చేరి తీరికగా శ్రద్దగా ముస్తాబు అయింది. వున్నవాటిల్లో కెల్లా మంచిది, రెండు మూడు నెలలు డబ్బు దాచి కొనుకున్న బనారస్ అర్గెండా లేత నీలం రంగుకి ముదురు నీలం బోర్డర్, లేత నీలం జాకట్టు , నీలం బొట్టు, పెదాలకి లైట్ షెడ్ లిప్ స్టిక్ చెవులకి బజార్లో కొనుక్కున్న నీలం టాప్స్, మెడలో నీలం లాకెట్ గొలుసు వున్నంతలో స్మార్టుగా తయారై తనని తాను అద్దంలో చూసి అసంతృప్తి పడింది.
    కూతురు ముస్తాబు గమనించి "ఎక్కడికే అంత ముస్తాబు మళ్ళీ ఎక్కడి కెడుతున్నావు ' అంది కాంతమ్మ.
    "మా బాస్ పుట్టినరోజు పార్టీకి పిలిచారు" అంది ముక్తసరిగా.
    కాలేజి నించి వచ్చిన మాలతి 'అంటే......కధ మూడో రీలుకి వచ్చిందన్న మాట . పుట్టింరోజు పార్టీ కారులో దింపడం.....అసలు కధ యిక్కడ నించి ఆరంభం ....' అంది చిలిపిగా నవ్వుతూ.
    వసంత కావాలనే నేనోకర్తినే కానే వెర్రిమొహమా మా స్టాఫ్ అంతా వస్తున్నారు అని చెప్పాలనిపించలేదు. కనీసం ఊహలలోనై తనని చూసి దాన్ని అసూయ పడనీ , చెప్పి చుల్కన అవటం అనుకుంది.
    ఆరుగంటల కల్లా అంతా బిలబిలమంటూ వ్యాను ఎక్కి బయలుదేరారు. ప్రతివాళ్ళు చక్కగా తయారయ్యారు. అందరి మొహాలు ఏదో ఆటవిడుపు దొరికినట్లు కలకల్లాడుటున్నాయి. అంతా చేరేసరికి కన్ను చీకటి పడ్తుంది. ఆ చీకట్లో నక్షత్రాల్లా వందల కొద్ది బల్బులు మెరిసిపోతున్నాయి. కొన్ని కార్లు అప్పటికే బారులు తీరి వున్నాయి. లోపల కొందరు జనం అప్పుడే వచ్చారు. అబ్బ ఏం యిల్లు....వసంత దూరం నించే చూసి అనుకుంది.... రతన్ లాల్ గ్రే కలర్ సూటులో మెరిసిపోతున్నాడు. అతని మెడలో పెద్ద పూలదండ వుంది. పక్కన టేబిల్ మీద ఎన్నో పూలరకాలు, ప్రేజెంట్లు వున్నాయి. వచ్చిన అందరూ పూల గుత్తో, ప్రెజెంట్ అందించి విష్ చేస్తున్నారు. రతన్ లాల్ అందరిని సవినయనంగా పల్కరించుతున్నాడు. పలకరింపులయ్యాక ఎవరో వాళ్ళని కుర్చీల దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోపెడుతున్నారు. ఆఫీసు స్టాఫ్ అంతా కలిసి కట్టుగా తాముకొన్న వెండి ఫిలిగ్రీ రధం ప్యాకెట్టు సంయిక్తంగా అందిస్తూ అభినందనలు చెప్పారు. "ఓ మెనీ థాంక్స్ . అంతా వచ్చారా, ప్లీజ్ నో ఫార్మాలిటీస్ , అంతా ఫలహారాలు చేసి వెళ్ళండి. అంటూనే యింకేవరో ఖరీదయిన జంట రాగానే పల్కరించంలో మునిగిపోయాడు. అంతా కలిసి మళ్ళీ అక్కడ నించి కదిలి.....సోఫాలోకి దూరంగా వేసిన కుర్చీల వైపు వెళ్ళి కూర్చున్నారు లానులో..... పెద్ద పెద్ద వాళ్ళంతా సోఫాలలో కూర్చుంటున్నారు. కొందరు నిల్చుని షోగ్గా డ్రింక్స్ స్లిప్ చేస్తూ మాట్లాడుకుంటున్నారు. చీకటి పడిన కొద్ది జనం ఎక్కువగా రాసాగారు. చీకటిలో యింద్రభవనంలా వెలిగిపోతున్న ఆ భవనం, తోట, పౌంటేన్సు .....అందులో దేవతల్లా మెరిసే ఫాషనిబుల్ లేడీస్ ని అందరిని వింతగా, కుతూహలంగా చూడసాగింది వసంత. ఆమె దృష్టి అంతా రతన్ లాల్ వైపే వుంది. అతనే ఆడవాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాడో ఎంత అందమైన ఆడవాళ్ళు అతన్ని పలకరించుతున్నారు , కొందరు చేతులెలా నలుపుతున్నారో, మరికొందరు భుజం చుట్టూ చెయ్యేసి నుదురు మీదో, బుగ్గ మీదో ముద్దు పెట్టి అభినందనలు చెపుతున్నారో, అతనెంత స్మార్టుగా , అందంగా వున్నాడో చూస్తుంటే ఆమెలో ఏదో అశాంతి, అసూయ కల్గింది. పుట్టినరోజే యింత ఘనంగా చేస్తుంటే పెళ్ళి ఎంత బాగా జరుగుతుందో ! ఆ పెళ్ళి కూతురు ఎంత అదృష్టవంతురాలో ! ఆ అదృష్టవంతురాలు ఎవరో!" ....తనెలా కాగలదు, కాగలిగే ఆశ వుందా!
    ...."ఏమిటలా చూస్తున్నావు. మొదటిసారి నేనూ యిలాగే వెర్రి మొహం వేసుకు చూసాను. యిప్పుడు అలవాటయి పోయింది. తిను తిను అంది ఫతిమా.
    బేరర్లు అందరికి తలో ప్లేటు అందిస్తున్నారు ఎన్నో రకాలు..... కొన్ని రుచి చూడనివి, పేరు తెలియనివి వున్నాయి. ఆఖర్న ఐస్ క్రీమ్. కడుపు నిండింది కాని, ఆమె మనసంతా వెలితి అయిపొయింది. అనుకున్నది ఆశించినది ఒక్కటి జరగలేదు. రతన్ లాల్ తనని అసలు చూడలేదు. ఇంత అందంగా శ్రద్దగా అలంకరించుకుని వస్తే కన్నెత్తి చూడలేదు. పలకరించడం మాట దేముడెరుగు , యింతమంది పేషన్ బుల్ అందాల రాశుల మధ్య తను తేలిపోతుంది. ఏ ప్రత్యేకత లేనట్టు నీరసంగా నిరుత్సాహంగా కూర్చుంది. వెళ్ళేటప్పుడు మళ్ళీ అంతా గుంపుగా వెళ్ళి నమస్కారం చేసి శలవు తీసుకున్నారు.
    మేనేజరు తో కరచాలనం చేసి, జనాంతికంగా .....'థాంక్స్ ఫర్ కమింగ్, అంతా ఫలహారం చేశారా" అన్నాడు మొక్కుబడిగా రతన్ లాల్ అంతా గొర్రెల మందలా తలూపి బయటపడి వ్యాన్ ఎక్కారు.
    "అదేమే వెళ్ళేటప్పుడు అంత ఉత్సాహంగా ఎగురుకుంటూ వెళ్ళావు. మొహం వాడిపోయిందేం...." అంది తల్లి.
    "పాపం రాజశేఖరం కారులో లిప్టు యిచ్చినట్టులేదమ్మా" అంది మాలతి ఉడికిస్తూ.
    ఆ మాటకి ఇంకోసారయితే దెబ్బలాడేదేమో కాని, ఇప్పుడు వసంత గుండెల్లో సన్నని నొప్పి, నిరాశతో వచ్చిన ఆ బాధ, ఏదో అవమానంతో ఆమె కళ్ళలో నీరు తిరిగింది. చీకటి చాటున చప్పున కళ్ళు తుడుచుకుంది వసంత.

                                               *    *    *    *

 Previous Page Next Page