Previous Page Next Page 
అహో! విక్రమార్క పేజి 28


    "నల్లబజారులో అమ్ముడుపోయే ఆఫీసర్స్ కి కావాలి పేషన్స్. ఒక్కొక్క ఓటునీ, ఒక్కొక్క నోటుతో కొనే పొలిటికల్ లీడర్స్ కి కావాలి పేషన్స్. పేషన్స్... పేషన్స్ అని నాలాంటి వాళ్ళని నిర్వీర్యుల్ని చేయకండి"

 

    అతను అన్న మాటకు మరింతగా కోపం వచ్చింది ప్రవర్థమాన్ కి. "నా ఎదురుగా నువ్వు ఇష్టమొచ్చినట్టుగా వాగుతున్నావ్. అదే హోంమినిష్టర్ ముందు వాగావనుకో...."

 

    వెనుదిరిగబోయిన అన్వేషి ఆ మాటకు ఆగిపోయాడు. అప్పుడతని ముఖం జ్వాలాముఖిలా వుంది.

 

    "ఏం చేస్తాడు హోంమినిష్టర్?"

 

    "వెళ్ళి అడిగి చూడు"

 

    "అడుగుతాను. సి.బి.ఐ. డిపార్ట్ మెంట్ పరువు ప్రతిష్టల్ని నాశనం చేస్తున్న ఈ అధికార బ్రోకర్స్ ని ఎక్కడ నిలదీయాలో అక్కడే నిలదీస్తాను" అంటూ గబగబా వెనక్కొచ్చి జీపెక్కాడు అన్వేషి.

 

    "మిష్టర్ అన్వేషీ! ఆగు" అన్వేషి విసురూ, వేగం, సాహసం తెలిసిన ప్రవర్థమాన్ పరుగు పరుగున ముందుకొచ్చాడు.

 

    కానీ- అప్పటికే జీపు వెళ్ళిపోయింది.

 

    దుమ్ము రేపుకుంటూ ముందుకెళ్ళిపోతున్న జీపువైపు కన్నార్పకుండా చూశాడు సి.బి.ఐ. డైరెక్టర్ ప్రవర్థమాన్.

 

                               *    *    *    *

 

    సరిగ్గా ఉదయం పదకొండు గంటలయింది. పార్లమెంటు భవనం ముందు నేరుగావచ్చి సడెన్ బ్రేక్ తో ఆగింది జీపు. అప్పటికి పార్లమెంట్ కార్యక్రమాలు ప్రారంభమై రెండు రోజులైంది. ప్రజల్నించి పార్లమెంట్ సభ్యులని, సభ్యుల నుంచి ప్రజల్ని రక్షించడానికి అన్నట్లు ఎక్కడికక్కడ పోలీస్ ఫోర్స్ మోకరించి వుంది.

 

    విసురుగా జీపులోంచి కాలు క్రిందకు పెట్టాడు అన్వేషి.

 

    "సార్... ఎందుకు సార్ గొడవ? నా మాట వినండి" యాదగిరి మాటల్ని వినిపించుకోకుండా వెళ్ళిపోతున్న అన్వేషి వైపు చూసి, గబగబా జీపును పార్క్ చేయడానికి ఓ చెట్టుక్రిందకు తీసుకెళ్ళాడు యాదగిరి.

 

    ఉగ్రనరసింహంలా లోనికొస్తున్న అన్వేషిని చూసి అతనికి బాగా తెలిసిన ఎ.సి.పి. స్థాయి పోలీస్ ఆఫీసర్....

 

    "ఏమిటిసార్... ఇలా వచ్చారు?" అని చనువుగా ప్రశ్నించబోయి అన్వేషి ముఖంలో కనిపించిన రౌద్రాన్ని చూసి వెనక్కి తగ్గాడు.

 

    అన్వేషి కాన్ఫరెన్స్ హాల్ వైపు వెళ్ళడాన్ని ఆశ్చర్యంగా చూస్తున్న అ ఎ.సి.పి. అన్వేషి నడకలో వేగాన్ని బట్టి, ఉదయాన్నే డైలీలో వీరేంద్రస్వామీజీ న్యూస్ ని చదివి వుండటం వల్ల అతనెందుకు అక్కడకు వచ్చాడో వూహించటానికి ప్రయత్నిస్తూ, వెంటనే అతనిలో అనుమానం పొడచూపింది.

 

    అప్పుడు అతనికి బాధ్యత గుర్తుకు వచ్చి అన్వేషిని వారించడానికి ముందుకు పరుగెత్తాడు. అప్పటికే అన్వేషి కాన్ఫరెన్స్ హాల్ మెయిన్ గేటు దగ్గరున్నాడు.

 

    ఆ సమయంలో కాన్ఫరెన్స్ హాల్లో గౌరవనీయ సభ్యులు వేస్తున్న ప్రశ్నలకు మంత్రివర్యులు సమాధానాలు చెప్పే కార్యక్రమం జరుగుతోంది.

 

    "అధ్యక్షా! కొన్నిగంటల క్రితం అధికారపక్ష సభ్యులు, హోంమంత్రి అండదండలతో జరిగిన వీరేంద్రస్వామీజీ విడుదల గురించి నేను మంత్రిగారిని ప్రశ్నిస్తున్నాను. విలువైన డాక్యుమెంట్స్ తో సదరు స్వామీజీగారు దొరికిపోయారని వార్తలు వినిపిస్తుండగా, ఆ డాక్యుమెంట్స్ నకిలీవని, వాటికి ఆ స్వామీజీకి ఏ సంబంధమూ లేదని పేర్కొంటూ ఎవరి చొరవతోనో హోం మినిష్టర్ గారు వీరేంద్రస్వామీజీని విడిపించేశారని కొన్ని పత్రికలు రాసిన వార్తల్ని మీ ముందు వుంచుతున్నాను.

 

    అలాగే కనీసం ఎఫ్.ఐ.ఆర్. కూడా లేకుండా ఆ స్వామీజీని వదిలేయడానికి కారణమేమిటని హోం మినిష్టర్ గారిని ప్రశ్నిస్తూ, స్వామీజీ దగ్గర స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్స్ ని సభ ముందుంచమని ఆదేశించమని గౌరవనీయులైన అధ్యక్షుల వారికి విన్నపం చేస్తున్నాను" అని చెప్పి కూర్చున్నాడు ఆ సభ్యుడు.

 

    సరిగ్గా తను కాన్ఫరెన్స్ హాల్ దగ్గరికి వచ్చిన సమయంలోనే ప్రతిపక్ష సభ్యుడి నుండి ఆ ప్రశ్న రావడంతో ఎలర్టయి ముందుకొచ్చాడు అన్వేషి.

 

    స్పీకర్ ఆదేశం మేరకు హోం మినిష్టర్ జరీ కండువాను సర్దుకుంటూ లేచి నిలబడ్డాడు.

 

    "అధ్యక్షా... ఈ రోజు పేపర్లలో వచ్చిన రాతలన్నీ అసత్యాలని మనవి చేస్తున్నాను. ఎవరో సి.బి.ఐ. ఆఫీసర్ ఆవేశంతో అరెస్ట్ చేసిన వ్యక్తి అసలు వీరేంద్రస్వామీజీ కాదని, ఏ విధమైన డాక్యుమెంట్స్ ని స్వాధీనం చేసుకోలేదని మనవి చేసుకుంటున్నాను."  

 

    నిజాలు అబద్ధాలుగా వక్రీకరింపజూసే ప్రజాస్వామ్య ప్రతినిధి వక్ర భాష్యాన్ని చెవులారా విని ఒక్కసారిగా కుతకుతలాడిపోయాడు. అడ్డుగా వున్న మార్షల్ ని నెట్టివేసి గాయపడ్డ పులిలా లోనికొచ్చాడు అన్వేషి.

 

    "ఒరేయ్... హోం మినిష్టర్...."

 

    ఆ అరుపుకి హాల్ మొత్తం నివ్వెరపోయింది. విద్యుత్ వేగంతో లోనికొచ్చిన అన్వేషి మార్షల్స్ కి గానీ, మిగతా వ్యక్తులకిగానీ ఏమాత్రం అవకాశం లేకుండా హోం మినిష్టర్ కాలర్ ని పట్టుకొని సీట్లోంచి బయటకు గుంజాడు.

 

    ఆ విసురుకి హోం మినిష్టర్ క్రిందపడిపోయాడు.

 

    "అయామ్ అన్వేషి... సి.బి.ఐ. ఆఫీసర్ అన్వేషి! జిత్తులమారి వీరేంద్రస్వామీజీని కనీసం ఎఫ్.ఐ.ఆర్. లేకుండా ఎందుకు విడుదల చేయించావ్? పవిత్రమైన పార్లమెంట్ హాల్లో నిజాన్ని చెప్పకుండా, మొత్తం కేసంతట్నీ ఎందుకు తారుమారు చేశావ్? కమాన్ టెల్ మీ! ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి, నేరస్థుల్ని పట్టుకునే సి.బి.ఐ. ఆఫీసర్లు నీలాంటి లుచ్చా రాజకీయ నాయకుల దృష్టికి వెర్రివెధవల్లా కనిపిస్తున్నారా?"

 

    ఆవేశంగా ప్రశ్నల్ని గుప్పిస్తూ, అన్వేషి క్రిందపడిన హోంమినిష్టర్ని పైకి లేపి ఈ చెంపా ఆ చెంపా వాయించేశాడు. పార్లమెంట్ చరిత్రలోనే అనూహ్యంగా జరుగుతున్న ఆ సంఘటనను స్పీకర్ తోసహా అందరూ కళ్ళప్పగించి చూస్తున్నారు తప్ప ఏ ఒక్కరూ నోరు మెదపలేదు. ముందుకు రాలేదు. అంతలోనే అభిమన్యుడ్ని చుట్టుముట్టిన కురువీరుల్లా మార్షల్స్ అందరూ అన్వేషిని పట్టుకున్నారు.

 

    "అధ్యక్షా! అధ్యక్షా! సేవ్ మీ అధ్యక్షా... సేవ్ మీ అధ్యక్షా" గగ్గోలు పెడుతున్నాడు హోం మినిష్టర్.

 

    స్పీకర్ ఆదేశంతో అన్వేషిని మార్షల్స్ బయటికి తీసుకొని వెళ్ళారు.

 

    ఏమీ అర్థంకాని పరిస్థితి!

 

    సభను అకస్మాత్తుగా వాయిదా వేసేసి, స్పీకర్ ఆదరాబాదరాగా తన ఛాంబర్ ను చేరుకున్నారు.

 

    పోలీస్ అధికారులు వడివడిగా స్పీకర్ ఆదేశం మేరకు స్పీకర్ ఛాంబర్లో సమావేశమయ్యారు.

 

    అన్వేషి ఏమిటో తెలుసుకోవడం, సి.బి.ఐ. చీఫ్ ప్రవర్థమాన్ అక్కడికి రావడం, స్పీకర్- ప్రవర్థమాన్ చర్చలు. ప్రవర్థమాన్ అన్వేషి తరఫున సంజాయిషీ యిచ్చుకోవడం, అన్నీ పార్టీలకు సంబంధించిన సభ్యులందరూ అన్వేషిని ఉద్యోగంలోంచి సస్పెండ్ చేయాలని పట్టుబడటం, మూడు గంటలసేపు పార్లమెంట్ ప్రాంగణంలో రభస జరిగింది.

 

    ఎట్టకేలకు సి.బి.ఐ. చీఫ్ ఉన్నతాధికారులతో సంప్రదించిన మీదట అన్వేషిని ఉద్యోగంలోంచి సస్పెండ్ చేశాడు. అంతకు కొద్దినిముషాల ముందు అన్వేషి ప్రవర్థమాన్ ని కలిసి రాజీనామాను సమర్పించాడు.

 Previous Page Next Page