"ఆవేశం తగ్గించుకోమని చిలక్కి చెప్పినట్లు చెప్పాను. అసలు నువ్వు జైలుకెళ్ళాల్సినవాడివి.... క్షమాపణ పత్రం రాసిస్తే సభ నిన్ను క్షమిస్తుంది. లేదా నువ్వు ఉద్యోగంలోంచి సస్పెండ్ కాక తప్పదు"
"నా రిజిగ్నేషన్ ని నేను సబ్ మిట్ చేశాను..." అతనేం చేశాడో దానికి పశ్చాత్తాపపడటం లేదు అన్వేషి.
"అసలు సస్పెండ్ చేయాల్సింది నన్ను కాదు. ఆ హోంమినిష్టర్ని, మిమ్మల్ని" మళ్ళీ ఆవేశంగా అన్నాడు.
"నువ్విలాగే వుంటే, నీ ప్రవర్తన మార్చుకోకపోతే జీవితంలో చాలా నష్టపోతావ్" హెచ్చరికగా అన్నాడు ప్రవర్థమాన్.
"నాకు సిగ్గు, లజ్జా- చీమూ, నెత్తురుతోపాటు నిజాయితీతో కూడిన దేశభక్తి కూడా వుంది. అందుచేత ఈ దేశంలో నేను సగౌరవంగా, భారతదేశపు పౌరుడిలా బతకగలను. డోన్ట్ వర్రీ ఎబౌట్ మీ- వర్రీ యువర్ సెల్ఫ్- మీరూ, ఆ పొలిటికల్ లీడర్స్ అందరూ తోడేళ్ళజాతికి చెందిన గ్రూపు. మిమ్మల్ని ప్రజలు నిలదీసి నడిబజార్లో చెప్పులదండలు వేసి ఊరేగించేరోజు వస్తుంది మైండిట్" ఆవేశంగా అనేసి వెనుదిరిగాడు అన్వేషి.
* * * *
సి.బి.ఐ. హెడ్ క్వార్టర్స్ లోంచి బయటికొచ్చిన అన్వేషి బస్టాపు కొచ్చి నిలబడ్డాడు.
నిన్నటివరకూ జీప్ లో అదే రోడ్డులో ఠీవిగా వెళ్ళిన అన్వేషికి నిన్నటికీ ఇవాల్టికీ తేడా గుర్తుకు రావడంతో చిన్నగా నవ్వుకున్నాడు.
అంతలోనే సిటీబస్సు వచ్చి స్టాపులో ఆగింది. అందులో ఎక్కి కూర్చున్నాడు అతను.
* * * *
హైదరాబాద్ కు దాదాపు నలభై కిలోమీటర్ల దూరంలో, బొంబాయి నేషనల్ హైవేకు ఎడమపక్కన వుంది సువిశాలమైన జ్ఞానభారతి యూనివర్శిటీ.
ఉదయం 10 గంటలు అవుతోంది.
చుట్టూ దట్టంగా పెరిగిన పచ్చని చెట్లు... తెరలు తెరలుగా వీచే గాలిలో తేలుతూ వచ్చే వివిధ రకాల పక్షుల ప్రియ సంగీతంతో అక్కడి వాతావరణం అనంతమైన పాటకచేరీలా ఆహ్లాదంగా వుంటుంది. ప్రకృతి ఒడిలో ఓ మహాశిల్పి రూపుదిద్దిన అపురూప కళాఖండంలా వుంది జ్ఞానభారతి యూనివర్శిటీ భవనగోపుర శిఖరాగ్రం.
ఆ భవన గోపుర శిఖరాగ్రం సూర్యకిరణాల స్పర్శతో వెలుగుతూ వజ్రదీపంలా వింతకాంతులను వెదజల్లుతోంది. వేగంగా వచ్చి సడన్ బ్రేక్ వేయడంతో, కీచుమంటూ ఆగింది వైట్ కలర్ మారుతీకారు.
కారు దిగగానే యూనివర్శిటీ భవన గోపురంవైపు కాసేపు తన్మయంగా చూశాడు అన్వేషి! తనక్కడే గతంలో చదువుకున్నది.
పక్షుల్లా యూనివర్శిటీ జ్ఞాపకాలు మనసులోంచి పైకి ఎగిరాయి. యూనివర్శిటీ బెల్ శ్రావ్యంలా మోగింది. తను అయిదేళ్ళలో ఇదే మొదటిసారి క్యాంపస్ కు రావడం. గడిచిపోయిన కాలాన్ని ఆశ్చర్యంగా తలచుకుంటూ ముందుకు కదిలాడు అన్వేషి.
రాలిపోయిన ఎండుటాకులు కాళ్ళక్రింద రవరవమంటూ శబ్దం చేస్తున్నాయి.
అన్వేషికి ఎక్సయిటింగ్ వుంది. జరగబోయే ఇంటర్వ్యూలో తను ప్రభుత్వ ఉద్యోగం ఎందుకు వదులుకున్నాడో సరైన కారణం చెప్పాలి.
కానే సరిగ్గా 24 గంటల క్రితం పత్రికల్లో తను చూసిన యాడ్ జ్ఞానభారతి యూనివర్శిటీకి అనుబంధంగా విశ్వాత్మ స్థాపించిన ట్రస్ట్ కు సామర్థ్యం వున్న డిటెక్టివ్ కావాలనే ప్రకటన చూశాక, అప్రయత్నంగా ఇంటర్వ్యూకి బయలుదేరాడు.
చురుగ్గా, చుట్టుపక్కల వాతావరణాన్ని గమనిస్తూ రెండో ఫ్లోర్ కు చేరుకున్నాడు అన్వేషి.
ఆఫీస్ రూం డోర్ పై 'విశ్వాత్మ ఫౌండేషన్' అనే అక్షరాలు అందంగా మెరుస్తున్నాయి. అయిదు నిముషాల తరువాత ఆఫీస్ లోకి ప్రవేశించాడు. పెయింటింగ్ రూం చాలా అపూర్వంగా వుందనిపించింది అన్వేషికి. అక్కడికి కాస్త దూరంలో కాఫీ తాగుతూ వర్కర్స్ మార్లాడుకుంటున్నారు హుషారుగా.
రిసెప్షన్ డస్క్ లో అమ్మాయి చలాకీగా ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతోంది.
వెయిటింగ్ రూంలో ఫైబర్ కుర్చీలో కూర్చున్నాడు. తనకు కావలసిన ఇన్ఫర్మేషన్ గురించి రిసెప్షన్ ని అడుగుదామనుకున్నాడు. కానీ ఎందుకో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.
సరిగ్గా 10-50 నిముషాలకు వెయిటింగ్ రూంలోని ఎడమపక్క వున్న ఎలక్ట్రానిక్ బోర్డుమీద సన్నని సంగీతంతో అన్వేషి పేరు, ఇంటర్వ్యూ టైమ్ 11 గంటలు అని ప్రత్యక్షమైంది.
పరిశీలనగా దానివైపు చూశాడతను. అపాయింట్ మెంట్ కాలంలో ఇంకెవరి పేర్లూ లేవు.
బహుశా తనొక్కడే ఇంటర్వ్యూకి వచ్చాడేమో!
కాసేపయ్యాక ఈజిప్ట్ మమ్మీలా ఓ వ్యక్తి మౌనంగా నడుచుకుంటూ వచ్చి- "గుడ్ మార్నింగ్ సర్" అని కూల్ డ్రింక్ బాటిల్ టేబుల్ మీద పెట్టి వెళ్ళాడు.
కూల్ డ్రింక్ నిదానంగా సిప్ చేస్తూ సాలోచనగా బోర్డ్ వైపు చూస్తూ గడిపాడు. "మిస్టర్ అన్వేషి ప్లీజ్ వెల్ కమ్" అన్న అక్షరాలు బోర్డుమీద ప్రత్యక్షం కాగానే అన్వేషి ఠీవిగా నుంచున్నాడు.
ఎటు వెళ్ళాలో తటపటాయిస్తుండగా మళ్ళీ ఈజిప్ట్ మమ్మీ వచ్చి హావభావాల్తోనే ఎటు వెళ్ళాలో చెప్పి వెళ్ళిపోయాడు.
ఆల్ట్రామోడ్రన్ ఆర్కి టెక్చర్ తో నిర్మితమైన ఆ రూంలో లైట్ల కాంతి కూడా మిలమిలమంటూ బంగారువన్నెను వెదజల్లుతోంది.
రూంలోకి ప్రవేశించగానే పరిసరాలను క్షుణ్ణంగా జల్లెడపట్టే అన్వేషి కళ్ళు డైరెక్ట్ గా ఛైర్ కు ఎడమవైపు పొందికగా కూర్చున్న అమ్మాయి కళ్ళల్లోకి పలకరింపుగా చూశాయి.
కానీ మామూలు అమ్మాయిలా ఆమె సిగ్గుపడుతూ తలదించుకోలేదు. శోధిస్తున్నట్లు చూసిన అతడి చూపులకు మాత్రం కనురెప్పలు పూలరెక్కల్లా సన్నగా వణికాయి.
"గుడ్ మార్నింగ్ టు ఎవ్విరిబడీ" అంటూ వినయంగా విష్ చేశాడు అన్వేషి.
"వెల్ కమ్ మిస్టర్ అన్వేషి!" అంటూ డైరెక్టర్ ఛెయిర్ లో కూర్చున్న యాభైఏళ్ళ వ్యక్తి కూర్చోమన్నట్లుగా అతనికి సైగ చేశాడు.
విశాలమైన రౌండ్ టేబిల్ కు ఒక ప్రక్కన కుషన్ చైర్ లో కూర్చున్నాడు అన్వేషి.
"మైనేమీజ్ మిత్ర. డైరెక్టర్ ఆఫ్ విశ్వాత్మ ఫౌండేషన్. అండ్ షి ఈజ్ మిస్ శృతి" గంభీరంగా అంటూ తనను తాను పరిచయం చేసుకున్నాడు మిత్ర.
హలో అన్నట్లు తల పంకించాడు అన్వేషి. శృతి నవ్వీ, నవ్వనట్లు పెదవి కదిపింది.
కొద్దిక్షణాలు నిశ్శబ్దంగా గడిచాక ప్రారంభించండి అన్నట్లు మిత్రవైపు తిరిగి చూసింది శృతి.
కూర్చున్న కొద్దిక్షణాల్లోనే వాళ్లిద్దర్నీ అంచనా వేశాడు అన్వేషి.
తనను, తన భావాలను అబ్జర్వ్ చేయడానికి శృతిని ప్రత్యేకంగా ఇంటర్వ్యూలో నియమించారేమోనని అన్వేషి మనసులో భావించాడు.