ఆ విషయమై సీరియస్ గా ఆలోచిస్తున్నాడతను.
* * * *
సి.బి.ఐ. క్వార్టర్స్ లోని ఆ రెసిడెన్స్ లో ఫోన్ ఐదు నిమిషాల నుంచి యధేచ్చగా మోగుతోంది. ఉలిక్కిపడుతూ కళ్ళిప్పి చేతికందే దూరంలో వున్న టీపాయ్ మీద టెలిఫోన్ రిసీవర్ని అందుకున్నాడు అన్వేషి.
"అన్వేషి హియర్!" అన్నాడతను.
"సార్! నేను యాదగిరిని పేపర్ చూశారా సార్?"
"ఇంకా చూడలేదు. ఏం... ఏం జరిగింది?" అనుమానపడుతూ అడిగాడు అన్వేషి.
"అనుకున్నంతా జరిగింది సార్! ఒక్కసారి పేపర్ చూడండి సార్" ఫోన్ రిసీవర్ని పక్కకు పడేసి దిగ్గున లేచి డోర్ తెరిచి బయటికొచ్చాడు అన్వేషి.
ఇంటి గుమ్మం ముందు పడున్న డైలీ పేపర్ని అందుకుని గబగబా తనకు కావల్సిన వార్తకోసం అన్వేషిస్తున్నాడు. మొదటి పేజీలో కుడివైపు క్రింది భాగంలో డబుల్ కాలమ్ వార్త 'వీరేంద్రస్వామీజీ విడుదల' మెయిన్ హెడ్డింగ్.
దొరికిన డాక్యుమెంట్స్ కు, అతనికి ఏ విధమైన సంబంధం లేదు! గబగబా వార్తను చదివిన అన్వేషి ముఖం ఎర్రగా, కందగడ్డలా మారిపోయింది. కేసుని కోర్టుకు ప్రొసీడ్ చేయకుండా కంట్రోల్ రూమ్ నుంచే వీరేంద్రస్వామీజీని సాగనంపేశారు.
రాత్రికి రాత్రి ఏం జరిగింది?
అన్వేషి నరాల్లోని రక్తం బుసబుసమని పొంగుతోంది. మనిషి ఉద్రేకంతో వూగిపోతున్నాడు.
డ్రెస్ ఏ మాత్రం ఛేంజ్ చేసుకోకుండా నైట్ డ్రస్ లాల్చీ పైజామాతోనే విసురుగా బయటికొచ్చి జీపెక్కాడు.
దారిలో యాదగిరి ఎదురొచ్చి జీపెక్కాడు.
"సార్! ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. మీకు అప్పుడే చెప్పాను కదా.... ఎందుకు సార్ గొడవ వదిలేయకూడదూ?"
"షటప్ యువర్ మౌత్" ఆగ్రహంతో అంటూ జీప్ ని ముందుకు దూకించాడు.
మరో ఏడు నిమిషాల్లో జీపు సి.బి.ఐ. చీఫ్ ప్రవర్థమాన్ ఇంటి ముందు ఆగింది.
అప్పుడు ఉదయం ఆరుగంటలు అవుతోంది.
ప్రవర్థమాన్ అప్పుడే లాన్ లో కొచ్చి టీ సేవిస్తూ పేపర్ చూస్తున్నాడు.
గేటు విసురుగా తెరుచుకుని లోనికొస్తున్న అన్వేషిని చూడగానే అతను ఒకింత భయపడ్డాడు. అయినా అంతలోనే తమాయించుకున్నాడు.
"రా అన్వేషీ రా! నువ్వింత ఆవేశంగా వస్తావని నాకు ముందుగానే తెలుసు" కూల్ గా అన్నాడాయన లోలోన జంకుతూనే.
"ఏవిటి సార్! ఆవేశం? వాటీజ్ దిస్? వాటీజ్ ద హెల్ హేపెన్డ్ ఎస్టర్ డే నైట్. మీకు హైకమాండ్ నుంచి ఎన్ని లక్షలు సూట్ కేసులలో వచ్చాయి?" సూటిగా ప్రశ్నించాడు అన్వేషి.
అన్వేషిలాంటి వాళ్ళని చాలా సంవత్సరాలుగా చూస్తున్న సి.బి.ఐ. ప్రవర్థమాన్ సాత్వికమైన గొంతుతో "ముందు కూర్చో- తర్వాత చెప్తాను. దిసీజ్ మై ఆర్డర్" అన్నాడు.
ఆ ఆర్డర్ ను పాటించక తప్పలేదు అన్వేషికి.
అన్వేషి కూర్చున్నాక నెమ్మదిగా చెప్పాడు ప్రవర్థమాన్. "అన్వేషీ నేనూ నీలాంటి ఆఫీసర్నే. కొంచెం సీనియర్ ఆఫీసర్ని. మనమంతా పొలిటికల్ చట్రంలో పావులం. నిజాయితీతో నువ్వు పట్టించిన వ్యక్తిని, డాక్యుమెంట్స్ ని కోర్టుకి సబ్ మీట్ చేసేలోపుగానే..."
"హై కమాండ్ నుంచి ఫోనొచ్చిందా? ఎవరా హై కమాండ్?" వెటకారంగా ప్రశ్నించాడు అన్వేషి.
"ఫోన్ రాలేదు. మనిషే స్వయంగా వచ్చాడు..." నిబ్బరంగా చెప్పాడు ప్రవర్థమాన్.
"ఎవరా మనిషి?"
"హోం మంత్రి. స్వయంగా ఆయనే వచ్చారు"
"నాలుగు తన్ని బొక్కలో పడేయాల్సింది. లేదా నాకు ఫోన్ చేయవలసింది."
"అన్వేషీ! ఆవేశపడకు. కేంద్రంలో కీలకమైన వ్యక్తుల దగ్గిర్నించి హత లైన్ లో వచ్చిన మెసేజ్ మేరకూ హోంమినిస్టర్ వచ్చారు. ఆ డాక్యుమెంట్స్ ని ఇచ్చేసి వెంటనే వీరేంద్రస్వామీజీని వదిలేయమని. వీరేంద్రస్వామీజీని పొరపాటున అరెస్ట్ చేయటం జరిగిందని, ఆ డాక్యుమెంట్స్ కూ అతనికీ ఏ విధమైన సంబంధం లేదని ప్రెస్ నోట్ రిలీజ్ చేయమని ఆదేశం. వాళ్ళు చెప్పినట్లు చేయడం మన విధి. లేకపోతే బతుకంతా బాధలు పడాల్సివస్తుంది."
"మీ సిన్సియారిటీ మీకు నేర్పింది పిరికితనమా?" అడిగాడు అన్వేషి ఆగ్రహావేశాలతో వూగిపోతూ.
"లేదు అన్వేషీ! రాజీపడటం నేర్పింది. అందుకే నీ గురించి, నా గురించి ఆలోచించిన మీదట ఆ డాక్యుమెంట్స్ తో సహా వీరేంద్రస్వామీజీని విడుదల చేసేశాను. హోంమంత్రి స్వామీజీని ఎయిర్ పోర్టుకి తీసుకెళ్ళిపోయాడు" గిల్టీగా ఫీలవుతూ అన్నాడాయన.
మ్రాన్పడిపోయి చూశాడు అన్వేషి.
"సారీ సార్! మీరు మరో విధంగా భావించకపోతే మీ చర్యను నేను తీవ్రంగా గర్హిస్తున్నాను సార్.
రెండు మూడేళ్ళలో రిటైరయ్యే మీరు డిపార్ట్ మెంట్ పరువుని నిలువునా తీసేసి, రాజకీయ నాయకులకు, అధికార వర్గాలకు తొత్తుగా పనిచేసే డిపార్ట్ మెంట్ మాత్రమేనని రుజువు చేశారు. నేషనల్ ఇంటెస్ట్ కోసం జీవితంలో ఒక్క మంచి పని చేయలేమా? మన ఆదర్శాలు ఉపన్యాసాలకే పరిమితమా? ఐ పిటీ యూ సార్! ఎందుకు సార్ జీతాలు తీసుకొంటూ మెడల్స్ ని భుజాలకు తగిలించుకుని సిన్సియర్ గా సేవ చేస్తున్నామని నటించడం? మీ యూనిఫాంని, మీ మెడల్స్ ని, మీ టోపీని తీసేసి మురిక్కాల్వలో పడేయండి సార్" అంటూ దిగ్గున లేచాడు అన్వేషి.
అన్వేషి ఆవేశం గురించి, కోపం గురించి బాగా తెలిసిన ప్రవర్థమాన్ తనూ లేచి నిలబడ్డాడు.
"మిస్టర్ అన్వేషీ! మనం చాలా చేయాలనుకుంటాం. కానీ చేయలేని పరిస్థితులు...." నసుగుతూ అన్నాడాయన.
"ఏవిటి సార్ ఆ పరిస్థితులు? హోంమినిస్టర్ రాయబారానికి వచ్చినప్పుడు కనీసం ఒక్కసారి... ఒక్కసారి... నాకు మీరు ఫోన్ చేయడానికి వీలవదా? మీరు నాకు జర్నలిస్టులకన్నా కట్టుకథలు చెపుతున్నారు. వాళ్ళు డబ్బుకు, గిఫ్ట్ లకి, మందులకి అమ్ముడపోయి వార్తలు రాస్తే- మీరు అధికారానికి, డబ్బుకి అమ్ముడుపోయి హోంమంత్రితో కుమ్మక్కయిపోయారు... అవునా?" ఆవేశంగా అడిగాడు అన్వేషి.
"యూ ఆర్ టాకింగ్ టూ మచ్ మిస్టర్ అన్వేషీ"
"నిజం ఎప్పుడూ చేదుగానే వుంటుంది సార్!"
"నువ్వు చెప్పింది, నువ్వూహించిందే నిజమనుకుంటున్నావా?" ప్రవర్థమాన్ కి కోపం వచ్చింది.
"ఏం కాదా?"
"కాదు. ముమ్మాటికీ కాదు. నీకంత సత్తా, దమ్మూ వుంటే హోంమంత్రిని నిలదీయ్. అభిమానంగా చూసే ఆఫీసర్ ని నిలదీయడం కాదయ్యా! పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి. పేషన్స్... పేషన్స్ కావాలయ్యా..." ఆయనకూడా చిరాకు పడుతూ అన్నాడు.