Previous Page Next Page 
పెట్టితిసిచూడు పేజి 26

    "ఆ విషయానికొస్తే ఎవరి ముందు ఎవరూ చేయి చాపలేదు. పొదుపు వేరు. పీనాసితనం వేరు" అనేవాడు రంగశాయి.

    రంగశాయి తనని పీనాసివాడు అనడం మంటగా వుండేది కోదండరామయ్యకి. ఆ మాట తప్పించి వాదోపవాదాలు వారి మధ్య లేవు.

    రంగశాయిని ఒకసారి అయినా దెబ్బ తీయాలని వుండేది కోదండరామయ్యకి. అదేం ఖర్మో కాలం కలిసి రాలేదు.

    రంగశాయి ఇంట్లో నక్కి ఈ విషయం ఆలోచిస్తుంటే కొత్త ఆలోచన వచ్చింది కోదండరామయ్యకి.

    'రంగశాయి తనకి ప్రాణమిత్రుడేమీ కాదు. తనూ వాడూ కల్సుకున్నప్పుడల్లా తన పీనాసితనాన్ని ఎత్తి పొడవని రోజు లేదు. వాడిని తను దెబ్బ తీయాలంటే కుదరడం లేదు. ఈ అర్ధ శవాన్ని తీసుకుని ఈ అర్దరాత్రిపూట తను పట్టు వదలని విక్రమార్కుడిలా ఎక్కడా పారేద్దామా అని చూస్తే తను పట్టుబడడం ఖాయం. ఇంత బతుకూ బతికి ఇంటెనక చచ్చినట్టు వెధవ చావు తను చావదలుచుకోలేదు. కనుక ఈ పెట్టెని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతే తనకి విముక్తి కలుగుతుంది. రంగశాయి వ్యంగ్యానికి దెబ్బ తీసినట్టు అవుతుంది.....'

    కోదండరామయ్య ఆలోచిస్తుండగానే ఆ పక్కనే వున్న తలుపు తీస్తున్న చప్పుడు అయింది. ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పెట్టెని వదిలేసి గోడ దూకడానికి గోడవేపు పరుగు తీశాడు.

    తలుపు తీసింది రంగశాయి.

    తలుపు తీస్తూనే పెరటివైపు లైటు వేశాడు. చెట్ల అడ్డం వల్ల పెరడంతా వెలుగు పరుచుకోకపోయినా వెలుగు నీడల్లా పడింది. ఆ చీకటి వెలుగుల్లో నల్లటి ముసుగు వేసుకున్న మనిషి కాలికి బుద్దిచెప్పి గోడదూకి పారిపోవడం కొంతవరకూ చూశాడు.

    'వచ్చింది వెళ్ళింది దొంగ' అనుకునే లోపల వీధివైపు కేకలు. అరుపులు 'తన్నండి. కొట్టండి' అన్న మాటలు గంద్ర గోళంగా వినపడ్డాయి. సరీగ అప్పుడే రంగశాయి కళ్ళకి గోడవారగా వున్న పెట్టె కనపడింది.

    రంగశాయి కళ్ళు మెరిశాయి.


            14

    లైసెన్స్ కూలి- రు. 6-00

    రిక్షా- రు. 5-00

    నిమ్మకాయలు- రు. 1-00

    కొబ్బరికాయ- రు. 2-50

    హారతికర్పూరం- రు. 0-25

    చిల్లర ఖర్చు- రు. 1-00

    హోటలు భోజనం- రు. 10-00

    రిక్షా- రు. 2-00

    తోలు పెట్టె- రు. 380-00

    రిక్షా- రు. 2-25

    కోదండరామయ్య తీరుబడిగా కూర్చుని లెక్కలు వేస్తుంటే వెంకుమాంబ వచ్చింది "అబ్బాయికి ఉత్తరం రాస్తున్నారా?" అంటూ.

    "ఉత్తరం కాదు పత్తరం కాదు. నష్టాన్ని కాగితంమీద ఎక్కిస్తున్నాను" కోదండరామయ్య చెప్పాడు.

    "నష్టమా?"

    "ఇది చదివి చూడు."

    "లైసెన్స్ కూలి ఆరు రూపాయలు. రిక్షా అయి....."

    "పైకి చదవకపోతే అర్ధంకాదా?" కోదండరామయ్య ముందు జాగ్రత్తతో అనేసరికి వెంకుమాంబ తెలివి తెచ్చుకుని లోలోపల చదువుకుంది.

    "నాలుగొందల పది రూపాయలు. అమ్మో అమ్మో" అంది వెంకుమాంబ లెక్క కాగితం భర్తకి తిరిగి ఇచ్చేస్తూ.

    "ఇంకా వుంది చిల్లర వేయాల్సింది"- దివాలా తీసిన ముఖం పెట్టుకుని చెప్పాడు కోదండరామయ్య.

 Previous Page Next Page