ఆ వాతావరణం కమలని చూడగానే రామారావు సగం బరువు తీరినట్లు ఫీలయ్యాడు. తనకో దోవ దేముడే చూపినట్లు సంతోషపడ్డాడు. నెల క్రితం స్టవ్ కి చీరంటుకుని కాలి బూడిద అయింది భార్య. అప్పటి నుంచి యీ నెలరోజులు యిద్దరి పసిపిల్లలతో యమయాతన పడ్తున్నాడు . భార్యకి సవతితల్లి , తనకి ఆదుకునే తల్లి లేదు. మిగతావారికి ఎవరి సంసారాలు వారికి. పసిపిల్లల ఆలనాపాలనా చూసేవాళ్ళు లేక, డబ్బిచ్చినా మనుష్యులు దొరక్క, దొరికినా సరిగా చేయక అతను పడ్డ అవస్థ దేముడి కెరిక, నెల సెలవు అయి ఆఫీసు కెడితే పిల్లలని చూసే దిక్కెవరు? వాళ్ళ గతి ఏమిటి అని రాత్రింబవళ్ళు బెంగతో, దుఃఖంతో ఏడిచాడు. ఎవరో బాలవిహార్ సంగతి చెప్పి అక్కడ చేర్చమనగానే ప్రాణం లేచి వచ్చినట్లు పరిగెత్తి వచ్చాడు. "రక్షించారండి. ఆమాత్రం మాట అనేవారు కనపడక పిల్లలకి దిక్కెవరు అని బెంగాపెట్టుకున్నాను. యిక్కడ యీ పిల్లలని మిమ్మల్ని చూశాక నాకు నిశ్చింత కల్గింది. ఈ రోజు నించే నా పిల్లలని మీ చేతిలో పెడ్తున్నాను. మీదే భారం , తల్లి లేని లోటు, తండ్రి ఉండీ లేని లోటు వాళ్ళకి కనపడకుండా కాపాడారంటే మీ ఋణం వుంచుకొను. రేపోస్తాను. డబ్బు తీసుకుని వాళ్ళకి కావాల్సినవన్నీ తెస్తాను. ఇంట్లో చేసి పెట్టె దిక్కు లేదు. మా పాప మధ్యాహ్నం ఏం తింటుందో , మీరేం పెడతారో అంతా మీ యిష్టం. ఇంతివ్వండి అంటే యిస్తాను" సమస్య భారం దిగి పోయినవాడిలా అతని మొహంలో దిగులు పోయింది. కళ్ళలోకి కాస్త జీవకళ వచ్చింది.
అతన్ని చూస్తె కమలకి జాలి కల్గింది. భర్త పొతే భార్య బిడ్డలని ముష్టేత్తన్నా పెంచుకోగలదు. కాని భార్య లేకపోతే ఆ మగవాడి గతి అంతే. అనుకుంది. మర్నాడు వచ్చి పిల్లలని చేరుస్తానని చెప్పి సంతోషంగా వెళ్ళాడు అతను, అతన్ని చూస్తుంటే కమలకి ఎందుకో భర్త గుర్తువచ్చాడు. ఇతనిలో ఏవో ఆ పోలికలు ఎక్కడో వున్నాయి. చూడగానే చటుక్కున భర్త గుర్తువచ్చాడు. భర్త పోయి ఏణార్ధం అవుతుంది. తను యించు మించు అప్పుడే అతన్ని మరచిపోయింది. బతుకు పోరాటంలో పడిపోయి రాజీ పడింది పరిస్థితులతో...... యింతేనా -----యింకా బతుకంతా యిలా తనది కాని పిల్లలని లాలిస్తూ, ఆడిస్తూ, మురిసిపోవాల్సిందేనా! వసంతన్నట్టు ఎప్పుడో ఎవరో తనని చేసుకోడానికి ముందుకు వస్తారా? ఎవరొస్తారు? ఈ కాలం ఆడపిల్లలకి ఒక పెళ్ళే గగనమవుతుంటే తనని అందులో అన్నీ అంతంత మాత్రం వున్న తనని ఎవరు చేసుకుంటారు? కమల తెలియకుండానే నిట్టూర్చింది.
* * * *
ఆరోజు ఆఫీసులో అందరికి రతన్ లాల్ బర్త్ డే ఇన్విటేషన్ కార్డ్స్ పంచాడు ఫ్యూను. ప్రతి సంవత్సరం రతన్ లాల్ జన్మదిన సందర్భంగా పెద్ద పార్టీ జరుగుతుంది. ఆ పార్టీకి ఆఫీసు స్టాప్ అందరికి ఆహ్వానం వేడ్తుంది. ప్రతి సంవత్సరం స్టాఫ్ అందరూ తలో పదో పదిహేనో వేసుకుని ఖరీదయిన బహుమతి కొని తీసుకెళ్ళి, పార్టీలో సుస్టుగా తిని వస్తారు. బంజారాహిల్స్ లో పెద్ద భవంతి అంతా రంగు రంగుల దీపాలతో , బెలూన్స్ తో అలంకరించుతారు. పెద్ద గార్డెన్ లో సోఫాలు, టేబిల్సు వేస్తారు. ఆరోజు పెద్ద హొటల కి ఆర్డర్ యిస్తారు. ఆ బేరర్లె వచ్చి సర్వ్ చేస్తారు. స్టీరియో లోంచి అద్భుతమైన ఇంగ్లీషు సంగీతము విన్పిస్తుంటే రకరకాల కారుల్లోంచి , రంగురంగుల దుస్తులతో అందంగా ఆధునికంగా ప్యాషన్ ఫేరాడ్ కి వచ్చినట్టు వస్తారు స్త్రీలు, పురుషులు కూల్ డ్రింక్స్, హాట్ డ్రింక్స్ ఎవరికి ఏం కావాలిస్తే అవి దొరుకుతాయి. మంత్రులు, పెద్ద పెద్ద ఆఫీసర్లు, కంపెనీల వాళ్ళ నించి సినిమా తారల వరకు ఆ పార్టీకి వస్తారు. అలాంటి పార్టీలు ఏ సినిమాలోనో తప్ప చూడలేని ఆఫీసు స్టాఫ్ .....ఆపార్టీ జరుగుతున్నంత సేపు ....ఏ ఇంద్రలోకంలో వున్నట్టు ఆ హడావుడి , ఆ అనందం అంతా వింతగా చూస్తారు. ప్రతి సంవత్సరం రతన్ లాల్ బర్త్ డే కోసం ఎంతో ఉత్సుకతతో చూస్తుంటారు అంతా.
వసంత క్రొత్తగా చేరిందేమో , ఈ సంగతి తెలియక ఫ్యూను యిచ్చిన కొద్ది తీసి ఆరాటంగా చదివింది. బాస్ పుట్టినరోజు! తనకి ఆహ్వానం ...... ఒక్కసారి వసంతకి గాలిలో తేలిపోయినట్లుంది. యిన్నాళ్ళ కి తాను ఎదురు దూసింది ఒకటన్నా జరగబోతుంది. బాస్ పుట్టినరోజు పెద్ద పార్టీ చక్కగా ....అలంకరించుకుని వేడ్తుంది. బాస్ అందరికి యింటర్ డ్యూస్ చేస్తాడు. తరువాత తనని అతిధులని ఆహ్వానించమంటాడు గుమ్మం దగ్గిర నించుని. అతిదులందరిని పలకరిస్తూ ఫలహారాలు చేసారో లేదో చూడమంటాడు. అన్నింటా తానె అయి చలాకీగా , స్మార్టుగా తిరిగే ఈ అమ్మాయి ఎవరా అని ఒకరినొకరు అడుగుతుంటారు...." ప్రతిదానికి బాస్ పదిసార్లు తననోచ్చి పిలిచి ఏదో అడుగుతుంటాడు.....ఆఖరికి.....పార్టీ ముగుస్తుంది . తిరిగి తిరిగి అలిసిపోయి అలిసిపోయి తోటకూర కాడలా వ్రాలిపోతుంది తను. అలిసిన కళ్ళు తెరవడానికి ఇష్టం వుండదు. "వసంతా..... సారీ, మీకు ట్రబులిచ్చాను . పార్టీకి పిలిచి చాకిరి చేయించాను.,. మీరెంతో హెల్ప్ పుల్ గా వున్నారు. మీరు రాకపోతే అంతే ఒకడినే చూసుకోలేక యిబ్బంది పడేవాడిని. మీలా చలాకీగా , స్మార్టుగా అమ్మాయి నాకు స్టెనో గా దొరుకిందని అంతా అసూయ పడ్తున్నారు. కమాన్ రండి మిమ్మల్ని కారులో ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. అరే, యింతకీ నువ్వేం తినలేదా, అంటూ స్వయంగా ప్లేట్లు తీసుకొచ్చి తినేవరకు వదలడు. 'మరి మీరో మీరూ ఏం తినలేదుగా అంటుంది తను' అవును, యింతసేపూ ఆకలే తెలియలేదు అంటూ చనువుగా ఆమె ప్లేటు లోనివి తీసుకుంటాడు. తినడం అయ్యాక ఫ్యూన్ ని పిలిచి స్వీట్లని పేక్ చేసి తెమ్మంటాడు. అమ్మా, నాన్నగారు వాళ్ళకివ్వండి అంటూ పెద్ద పేకట్టు కారులో పెట్టిస్తాడు. కారులో అతని పక్కన కూర్చుని .....పోతుంటే ......ఆ చల్లటిగాలి పక్కన అతని సాంగత్యం అతని నించి వచ్చే విదేశీ పరిమళాలు అన్నీ ఆమెని మైమరుపులో పడేస్తాయి. సారీ..... డియర్ నిన్ను శ్రమపెట్టాను .' అని నాలిక కొరుక్కుని "సారీ నోరు జారింది. ఏం అనుకోకండి " అని నోచ్చుకుంటాడు..... నో నో ....ఎంత బాగుంది మీరలా అంటే వణుకుతున్న గొంతుతో అంది.....నీకు కోపం వస్తుందను కొన్నాను నా అతి చనువు..... రియల్లీ మనం ఇన్నాళ్ళు అనవసరంగా వేస్ట్ చేశాం వసూ అంటూ బుజం చుట్టూ చేయి వేస్తాడు పులకించి పోతుంది. ఆ నెయ్యి మీద తల ఆన్చి , ఐ లవ్ యూ ఐ లవ్ యూ సార్....అంటుంది. సార్, వాటీస్ దిస్ , నగ్నంగా బాస్ అనే అనుకుంటున్నావా వసూ టల్ మీ డాళింగ్ , టల్ మీ రతన్ అంటూ తన భుజం చుట్టూ వేసిన చేతితో ఆమెని మరింత దగ్గరికి లాక్కుంటాడు. తను అతని భుజాల మీద తల తల ఆన్చి చుట్టూ ప్రపంచాన్ని మరచి పోతుంది....
"ఓ వసంతా దేవిగారూ, ఏ లోకంలో వున్నారు మీరు" లంచ్ అవర్లో వసంత కనిపించక పిలవడానికి వచ్చిన ఫతిమా రెండు సార్లు పిలిచి పలక్కపోయేసరికి చెవి దగ్గర గట్టిగా అరిచింది.
వసంత ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది. "ఏమిటంత ఆలోచన బాస్ పుట్టినరోజు పార్టీకి ఏ చీర కట్టుకోవాలానా అంది నవ్వుతూ ఫతిమా.....
అరె తనకెలా తెల్సింది బాస్ పుట్టినరోజని.....లోపల అనుకున్న మాట పైకే అడిగేసరికి వసంత "నీకెలా తెల్సు బాస్ పుట్టినరోజని "
ఫతిమా వింతగా చూసి ఎలా తెలియడం ఏమిటి ఇన్విటేషన్ కార్డు యిచ్చారుగా అందరికీ, నీకూ యిచ్చారుగా అంది. వసంత తెల్లబోయింది.
"అందరికీ యిచ్చారా" అపనమ్మకంగా అంది.....
ఫతిమా వసంత మొహకవళికలు చూసి ఫక్కున నవ్వేసింది....ఆ ....లేకపోతే నీకోక్కర్తికె స్పెషల్ గా బాస్ ఆహ్వానం పంపాడనుకొన్నావా....అబ్బ ఎంత ఆశ. ఎంత బాస్ పర్సనల్ స్టెనో అయినా అంత ఆశ. అదా పాపం అమ్మాయిగారు కలలు కంటున్నారు నేను వచ్చేసరికి. సారీ డార్లింగ్..... మేమందరం పానకంలో పుడకల్లా అక్కడ తప్పం.....అంటూ ఆటపట్టించింది.