Previous Page Next Page 
అందమైన అపశృతి పేజి 27


    కిటికీదగ్గర పొంచివుండి ఎవరో తన ఫోన్ సంభాషణ వింటున్నట్టు తను వెనుతిరగడంతో గబుక్కున కిటికీలోంచి తప్పుకున్నట్లు నీడ కదిలినట్లయింది.

    శృతి పరుగున గదిలోంచి బైటికొచ్చింది.

    కిటికీ అవతల గుమ్మానికి అందంగా వేలాడ గట్టిన గాజు పూసలు చిరుశబ్దం చేస్తూ కదులుతున్నాయి. బరువైన లోపలికిగాని. బైటికిగానివస్తే పూసలు కదులుతాయి.

    శృతి అనుమానం నిజంచేస్తూ ఆ గాజు పూసలు కదులుతున్నాయి.

    అంటే ఎవరో కిటికీ దగ్గరనుంచి రెండంగల్లో ఆ గుమ్మం దగ్గరకెళ్ళి ఆ గుమ్మంలోంచి లోపలికి వెళ్ళారు.

    దానికి ఆధారం కదులుతున్న గాజు పూసలు.

    "ఎవరో తను ఫొస్ చేయడం చూశారు. అంతేకాదు తన మాటలు విన్నారు." రూఢి చేసుకుంది శృతి.

    ఆ గదిలోంచి బైటకి వెళ్ళడానికి, పక్క గదుల్లోనికి వెళ్ళడానికి బోలెడు దోవలున్నాయి. వెతకడం అనవసరపు శ్రమ.

    జరగబోయేదాన్ని ధైర్యంగా ఎదుర్కోవడం తప్పచేసేదేం లేదు. కానున్నది కాక మానదు.

    శృతి మొండిగా ఓ నిశ్చయానికొచ్చి మేడమెట్లు ఎక్కింది. స్వాతి గదిలోకి వెళ్ళిం తరువాతగాని పొరపాటు తెలిసి రాలేదు శృతికి.

    "అదేం, అప్పుడే వచ్చేశావ్?" శృతిని చూస్తూనే అడిగింది స్వాతి.

    "కిందవరకూ వెళ్ళాను. ఆ పైకి వెళ్ళలేక పోయాను." శృతి తెలివిగా బొంకింది.

    "ఏం జరిగింది?"

    "ఉన్నట్టుండి కళ్ళు తిరిగాయి. కాసేపు కళ్ళు మూసుకుని కూర్చున్నాను. ఇప్పుడు తగ్గింది. ఈ విషయం చెప్పిపోదామని పైకి వచ్చాను."

    "చెప్పడానికి మళ్ళీ పైకి వచ్చావా! వంట్లో బాగుండకపోతే, కాసేపు పడుకుని విశ్రాంతి తీసుకో శృతీ!"

    "అక్కరలేదు. ఇప్పుడు బాగానే వుంది? కాసిని మంచి నీళ్ళు తాగి వెడదామని వెనక్కువచ్చాను. ఏం జరిగినా నీతో చెప్పకపోతే తోచదు కదా! చెప్పేశాను."

    "భలేదానివే" అంటూ నవ్వింది స్వాతి.

    "అమ్మయ్య, ఇప్పుడు హాయిగావుంది. మరి నే వెళ్ళి రానా స్వాతీ!"

    "జాగ్రత్త"

    "ఫరవాలేదు. వంట్లో పైత్యరసం ఎక్కువయితే కళ్ళు తిరుగుతాయట. అదే జరిగుంటుంది. వస్తా స్వాతీ!" అంటూ శృతి కిందకొచ్చింది. సరాసరి వంటగదిలోకి వెళ్ళింది.

    కూనిరాగం తీస్తూ చంద్రమతి వంట చేస్తున్నది.

    మంచినీళ్ళడిగి తాగింది శృతి.

    ఆపైన చంద్రమతితో రెండు ముక్కలు మాట్లాడింది.

    చంద్రమతి మామూలుగానే మాట్లాడింది.

    తన ఫోన్ సంభాషణ చాటుగా  విన్నది చంద్రమతి కాదని శృతి గ్రహించుకుంది. ఆపైన పూజ జరుగుతున్నగుడి దగ్గరకు వచ్చింది.

    రాజా నృసింహరాయ భూపతిరావ్ గారు, నళినీ దేవి, మేనేజరు రఘునందన్, రామరాజు, చంద్రగౌడ మరికొందరు తెలిసినవాళ్ళు అక్కడేవున్నారు. రాజావారింట్లోని వారంతా అక్కడే వున్నప్పుడు ఇంట్లో వుండి తన ఫోన్ లో మాట్లాడుతుంటే చాటుగా గమనించింది ఎవరు?

    శృతి కర్థం కాలేదు.

    కళ్ళ ముందు చిరుశబ్దంతో కదులుతున్న గాజుపూసలే కనిపిస్తున్నాయి.

    కళ్ళముందు చిరుశబ్దంతో కదులుతున్న గాజుపూసలే కనిపిస్తున్నాయి.

    కళ్ళప్పగించి పూజచూస్తూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూన్నది శృతి.

    చండీదేవి పూజ చాలా చక్కగా కన్నుల పండుగగా జరుగుతున్నది. "అమ్మా చండీ దేవీ! పరిస్థితులకు తలవొగ్గి ఇక్కడికొచ్చి రోజులు గడుపుతున్నాను. నన్ను రక్షించు తల్లీ!" అనుకుంది శృతి.

    రాజుగారు ఇంటికి పంపిస్తే చంద్రగౌడ్ వచ్చాడని, శృతి ఫోన్ చేయడం చూశాడుగాని మాటలు వినలేదని శృతికి తెలిస్తే ఇంత భయపడేదికాదు.


                                                   23

    ఎప్పుడు రాత్రవుతుందా అని ఎదురుచూస్తున్నది శృతి. అదేమోగాని గంటలు నిమిషాల్లో గడవడంలేదు. ఒక్కో గంట కాలం ఒక్కో యుగంలా అనిపిస్తున్నది.

    శృతి రాత్రి కోసం ఎదురు చూడడానికి గట్టి కారణమే వుంది.

    ఎవరూ చూడకుండా రామరాజు ఓ కాగితం శృతి చేతిలో ఉంచాడు.

    శృతి బిత్తరపోయింది.

    శృతి ఇదేమిటి అనేలోపలే "దీనిలో రాసింది చదువు. తొందరపడి ప్రమాదం కొనితెచ్చుకోకు." అని చెప్పి రెండంగల్లో అవతలికెళ్ళిపోయాడు రామరాజు.

    మాయలపకీరు ప్రాణంలా ఆ కాగితాన్ని అలాగే గుప్పెటలో బంధించి తన గదిలోకి వెళ్ళి తలుపు లోపల గడియ వేసుకుని రామరాజు రాసిన ఆ కాగితం మడత విప్పింది.

    శృతీ!

`    రాత్రికి నీతో మాట్లాడాలి. పన్నెండు గంటలకి అంతా నిశ్శబ్దమయిపోతుంది. పై మేడమీదకు రా. నీతో చాలా విషయాలు మాట్లాడాలి. రెండురోజులపట్టి చూస్తున్నాను, వీలుకాలేదు, రాత్రిళ్లు నీవేమో లోపల గడియ బిగించుకుని పడుకుంటున్నావు. నీవు చాలా వివేకం గలదానివి, తెలివిగా ప్రవర్తించి రావలసింది."

    అంతవరకే రాసి వుంది. కింద సంతకం లేదు. ఓ అడ్డ గీత వుంది.

    అది చదవగానే పేరు రాయని పిరికివాడు అనుకుంది శృతి. ఈ మోసగాడిని నేనెందుకు అర్థరాత్రి కలుసుకోవాలి" అనుకుంది. నిమిషానికో పేరు, నిమిషానికో వేషం, ఇలా చాలాచాలా అనుకుంది.

    ఆ రోజు రాత్రి కాలికి గాయమై దిక్కూ మొక్కూ లేక తన శరణు వేడి___పోనీ  భయపెట్టి అనుకుందాం__ఆటక మీద దాగున్నాడు. దొంగ,ఖూనీకోరు, అలాంటివాడు ఇక్కడ చిన్న జమిందారులా వెలిగిపోతున్నాడు. అదెలా సాధ్యం!

    ఇక్కడవున్న చిన్న జమిందారుని చంపి అతనిస్థానంలో చేరి ఆస్తి కాజేద్దామని చూస్తున్నాడేమో! అదే నిజం కావాలి. తనెక్కడ గట్టు బైటపడేస్తానో అని భయపడి ఈ రాత్రికి మేడమీద కలవమని రాశాడు. అ మోసగాడి మాట వినడానికి తను ఛస్తే వెళ్ళకూడదు.

    పోనీ వెళితే__

    మరో కల్లబొల్లి కొత్త కథ చెపుతాడేమో!

    చెపుతాడేమిటి? చెప్పటం ఖాయం.

    అతను రామరాజు కాదు. ఒక ఖూనీకోరు. పేరు మురారిదేముడని తను చెపితే ఎవరూ నమ్మరు. లేనిపోనిది తన మీది కేదయినా రావచ్చు.

    చివరికి రాత్రికి  వెళ్ళడానికే నిశ్చయించుకుంది శృతి.

    ఎప్పటికో రాత్రయింది.

    పన్నెండు దాటినతరువాత తన గదిలోంచి నెమ్మదిగా బయటికి వచ్చింది శృతి.

    మేడపైకి వెళ్ళే మెట్లదగ్గర ఉన్నాడు రామరాజు.

    దొంగతనానికి ఎవరింట్లోనో ప్రవేశిస్తున్నట్లు ఏమాత్రం చప్పుడుకాకుండా మేడమెట్లు ఎక్కారు ఇరువురూ.

    పైకి వెళ్ళగానే "రమ్మనగానే వచ్చావు. థాంక్స్ శృతీ!" అన్నాడు రామరాజు.

    దగ్గరగావస్తున్నా రామరాజునిచూసి ఒక అడుగు వెనక్కు వేసింది శృతి. "దూరంగా వుండి మాట్లాడండి కాదంటే నేను కిందకి వెళ్ళిపోతాను." అంది.

    "ఊ....మొత్తానికేం మారలేదు."

    అదేం వినిపించుకోలేదు "ఎందుకు రమ్మన్నారో చెప్పండి." అంది శృతి.

 Previous Page Next Page