Previous Page Next Page 
అందమైన అపశృతి పేజి 28


    "చెబుతాను పిండారబోసినట్లున్న ఈ పండు వెన్నెల అందాన్ని చూడటానికి రమ్మనలేదు శృతీ!"

    "మంచిదే" వ్యంగ్యంగా అంది శృతి.

    "ఒక నిమిషంలో నేను చెప్పిన మాటలు పూర్తికావు శృతీ! కొద్దిసేపు కూర్చుంటే వివరంగా చెపుతాను."

    "మీరు చెప్పేది కాకమ్మకథేగా."

    "ఊహూ, ఓ పెద్ద యథార్థ గాథ."

    "అయితే నాకు వినే ఓపిక లేదు."

    "చూడు శృతీ! ఇది సీరియస్ విషయం. నన్ను మురారిదేముడిగానే ఎరుగుదువుగాని, నిజం నీకు తెలియదు."

    "ఓహ్, ఇంకా బొంకక మురారిదేముడని చెప్పినందుకు సంతోషం. ఎంత వేశం మార్చినా ఆ కళ్ళు చిట్లించి ఎదుటి మనిషిని గుచ్చి చూడడం చాలు గుర్తించదానికి. నేను ఎలాగూ గుర్తించాను కాబట్టి, ఏదో కథ అల్లి చెప్పి నమ్మించకపోతే మీకు ప్రమాదంకదా! మురారిదేముడు అవతారంలో దొంగతనాలు, హత్యలు, మోసాలు, ఇప్పుడు] రామరాజు అవతారం అందుకు భినమాయె. పిల్లజమిందారులా వుండాలాయె. అవును దేముడూ! ఈకోటలో ఎలా పాగా వేశావ్!"

    "ఖర్మకాలి" కసిగా అన్నాడు రామరాజు.

    "అందరి కళ్ళూ గప్పి హాయిగా వున్నావ్. ఖర్మ కాలటం ఏమిటి? ఇది రాజయోగం. పదకాలలపాటు పడితిన్నా తరగని ఆస్తి. ఓహ్ ఏమి అదృష్టం!"

    "నా విషయం తెలియక పోరపడుతున్నావ్ శృతీ! నిన్ను చూడగానే ఏమనిపించిందో తెలుసా, ఎడారిలో వంటరిగా పయనిస్తున్న ఈ దురదృష్ట ప్రయాణికుడికి ఓ తోడు దొరికిందనిపించింది. చల్లని మంచినీటి జలాశయంలో స్నానమాడినట్టయింది. ఈ విజయ్ ని మించిన  అదృష్టవంతుడు లేనే లేడనిపించింది......." ఆవేశంగా చెప్పుకుపోతున్నాడు రామరాజు.

    వింటున్న శృతి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయాయి. "ఏమిటి? విజయ్ అని మరో పేరు కూడా వుందా? ఎన్ని అవతారాలు, ఎన్నెన్ని పేర్లు పేరుకోకథ....."అంది అతన్ని విచిత్రంగా చూస్తూ,

    "ప్రస్తుతానికి రామరాజుగానే వ్యవహరిస్తాను. నా అసలు పేరు మాత్రం విజయ్ కాంత్"

    "చూడు మురారిదేవ చంద్రగుప్త రామరాజ భూపతీ విజయ్ కాంత్ మహాశయా! నీ నిజస్వరూపం వద్దు, నీ కథా వద్దు, నీ మారుపేర్లు వద్దు. నీ దోవ నీది, నాదోవ నాది. నీ వ్యవహారం చూస్తుంటే దేంట్లోనో నన్ను పోనియ్యి" అంటూ శృతి ముందుకడుగేసింది.

    ఒక్క అంగలో చేతులు చాచి శృతికడ్డంగా నుంచున్నాడు రామరాజు.

    "నన్ను మర్యాదగా వెళ్ళనియ్యి."

    "వెళ్ళనియ్యను."

    "అరుస్తాను."

    "ఏదీ అరువ్!"

    శృతి అరవటానికి నోరు తెరిచింది. చటుక్కున శృతి నోటిమీద చెయ్యిపెట్టి మరోచెయ్యి భుజంమీద నొక్కిపట్టి శృతిని కింద కూలేశాడు రామరాజు. "అల్లరిచేస్తే బలప్రయోగం చేయల్సివస్తుంది. జాగ్రత్త. ఈ ప్రంపంచంలో చాలామంది మన నడత మంచిది. ఎదుటివాళ్ళు వంచకులు అనుకుంటారు. ఆ అనుకునే చాలామందిని మించిన  వంచకులు వేరే ఎవరూ వుండరు." అన్నాడు శృతిని  తీక్షణంగా  చూస్తూ.

    శృతి దోసిట్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్పు మొదలుపెట్టింది.

    "ఆడవాళ్ళకి దేవుడిచ్చిన పెద్ద ఆయుధం కన్నీళ్ళు" అన్నాడు రామరాజు.

    "ఆ దేవుడే మగవాళ్ళకి పశుప్రవృత్తి, శరీరబలం, మోటుతనం అనే ఆయుధాలు ఇచ్చాడు. బాల ప్రయోగం చేయాల్సింది నాబోటి వాళ్ళమీద కాదు." వెక్కిళ్ళు పెడుతూనే అంది శృతి.

    సానునయంగా శృతి భుజంమీద చేయివేశాడు రామరాజు. శృతి ఆ చేతిని విసిరికొట్టింది. వెంటనే రామరాజు రెండు భుజాలపై రెండు చేతులూ వేసి గట్టిగా నొక్కిపట్టాడు.

    "చూడు శృతీ! నువ్వీ ఏడుపు అపకపోతే దేవుడు మా మగజాతికిచ్చిన నీవన్న ఆ ఆయుధాల్ని ఉపయోగించి నిన్ను ......నిన్ను....ఓహ్, నన్ను రెచ్చగొట్టి పశువును చేయకు శృతీ! నన్నర్థం చేసుకుంటే నాకూ, నీకూ ఈ బాధ లేకపోను." అంటూ శృతి భుజాలమీదనుంచి తన చేతులు తీసేశాడు.

    శృతి మాట్లాడలేదు. మోకాళ్ళలో తల దూర్చుకుంది.

    "శృతీ! ఆవేశం విడనాడి అపార్థం చేసుకోక కాస్త ఆలోచించు పరిస్థితులు ఈ ఇంటికి నిన్నెలా చేర్చినాయి. నాకెవరూ లేరంటూ, కన్నతల్లి, తోడబుట్టిన అన్న వున్నా దిక్కులేనిదానిలా ఇక్కడ ఉద్యోగం చేస్తున్నావు. నిజం కప్పిపుచ్చడానికి ప్రతి నిమిషం అబద్దాలు. మీ అన్న సిద్దార్థ గజదొంగ. ఆ దొంగకి చెల్లెలయిన నీవు మోసగత్తేవి తెలివిగా మీ అన్నాచెల్లెళ్ళు ప్లానువేసి, ఈయింట్లో ముందుగా నీవు చేరావు. సమయం చూసి ఈ యిల్లు, ఈ యావదాస్తి దోచేస్తారు......"

    "అబద్ధం-అబద్ధం-అబద్ధం......"గట్టిగా అరిచింది శృతి.

    "భువనగోళాలు దద్దరిల్లేటట్లు అరిచి చెప్పినా మీ యింటి విషయం తెలిసిన ఎవరూ నీమాట నమ్మరు. సిద్దార్థ లక్షలు కాజేసి పరారయాడు. ఎవరూ లేని అనామకురాలిలా నీవీయింట్లో చేరావు. దీనికేం సాక్ష్యం చేబుతావ్!"

    "నేను అలాంటి దానిని కాదు. మా యింట్లో ఎవరూ కూడా చెడ్డవాళ్ళుకాదు. పరిస్థితులు మాకలా వచ్చాయి."

    "అదే మాట నేను అంటే నీవు నమ్మలేదు."

    శృతి నోరు మెదపలేదు.

    "శృతీ! నీవు ఏదోఏదో ఆలోచించి అటే పోతున్నావు గాని, నిజం చెప్పబోతున్నా వినిపించుకోవడంలేదు. నేను రామరాజుని కాదంటే  ఈ యింట్లో ఎవరూ నమ్మరు. నేను నీ విషయంలో ఒక చిన్న నిజంగాని, పోని చిన్న అబద్ధంగాని చెపితే నీ బొందిలో ప్రాణాలు వెంటనే తీస్తారు. ఇక్కడి సంగతి నీకు తెలియదు."

    రామరాజు నిదానంగా మాట్లాడుతుంటే నిజమే అనిపించింది శృతికి.

    "నేను చెప్పేది మనస్పూర్తిగా వింటానంటేచెపుతా శృతీ! నీవు ఆప్తురాలివనిపించి నా కథ చెప్పుబోయాను. బలవంతాన ఏం చెప్పను? ఒక్కటి ఆలోచించు శృతీ! ఆనాడు దాక్కునేందుకు భయపెట్టి చోటు అడిగాను. అదేగానా నేరం? నీ ఆస్తి దోచానా? మీ యింట్లోవారికి అపకారం చేశానా? ఒంటరిగా వున్న నీవు నన్నేం చేయలేవు. అలా అని నిన్ను.....ఉహూ...... ఆవిషయం దేనికిలే" అంటూ రామరాజు తల విదిలించాడు.

    "కష్టంలో ఉన్నప్పుడు నీసాయంకోరాను. ఆరోజు బజారులో కారుదిగి కనబడ్డావు. నాకు చంద్రగుపుడని మారుపేరు చెప్పినన్నో పిచ్చిదానిలా చూచి కారెక్కి పరారయ్యావు. ఆ రోజు నిన్ను చూడగానే నా ఆనందం ఏమని  చెప్పను? డబ్బు పోవటందాంతో అన్నయ్య కనపడకుండాపోవటం-అప్పటినుంచి తరుచునీమాటే గుర్తుకోచ్చేది మురారి దేవుడు వెళ్ళేటప్పుడు సమయం వచ్చినప్పుడు సాయం చేస్తానని లెటర్ రాసి వెళ్ళాడు. అతను కనబడితే అన్నయ్య ఆచూకీ తెలుపుతాడు. భగవంతుడా! అతన్ని ఒకసారి నా కంట పడేటట్లు చెయ్యి. నీ గురించి ఇలా ఎన్నోసార్లు అనుకున్నాను. కనపడ్డావు కానీ ఆడిన మాట తప్పావు. ఇది మోసం కాదా? పాముకి పాలు పోస్తే కాటేసి పోతుందట. అలా......"

    "నేను పాముని కాదు."

    "నిజమే! పాముకి కోరల్లో విషముంటుంది. మనిషికి నిలువెల్లా విషమే."

    "తొందరలో నోరుజారకు శృతీ! నిజం వింటే నిర్ఘాంతపోతావు"

    "ఏమిటా నిజం?" వ్యంగ్యంగా అంది శృతి.

    "జాగ్రత్తగా విను" అంటూ రామరాజు చెప్పింది విని నిజంగానే నిర్ఘాంతపోయింది శృతి. కొద్దిసేపటికి తెప్పరిల్లి "నీవు చెప్పింది నిజమేనా!" అంది.

    "నిజం నీవు నమ్మితే" అన్నాడు రామరాజు.


`                                                                        24


    "మాఅన్నయ్యని నీవు విడిపించావా! మా సిద్దూ ఆచూకీ నీకు తెలిసిందా! ఎలా తెలిసింది? ఎలా విడిపించావు దేముడూ? ఆ రోజునే చెప్పేది వినిపించుకోక నన్ను విదిలించుకు వెళ్ళిపోయానే. అది నిజమైతే ఇదెలా నిజమవుతుంది. చెప్పు దేముడూ చెప్పు! శృతి ఆవేశంగా రామరాజు చేయిగట్టిగా పట్టుకు వూపుతూ అడిగింది.

 Previous Page Next Page