Previous Page Next Page 
అందమైన అపశృతి పేజి 26


    శృతికూడా నేనేనా తక్కువ తిన్నదన్నట్లు "మీరు పోరాపడుతున్నారు. స్వాతిలాంటి  మంచి హృదయం గలవారికి లోకమంతా మంచివారే ననిపిస్తుంది. స్వాతికి లోకంలో దొంగలు, మోసకారులు, ఖూనికోర్లు తెలియదు. ఇలాంటి వారు కోకొల్లలుగా వున్న ఈ లోకంపోకడ తెలిసిన నేను అమాయకురాలిని మాత్రం కాదు." చిరునవ్వుతో మృదువుగా  ఎంతో వినయంగా అంది.

    "అమాయకత్వం అని ఎవరన్నారు!" మంచివారని కదా అన్నది!"

    "ఈ లోకంలో అమాయకులంతా మంచివాళ్ళే. నేను మామూలు మనిషిని."

    "మీరు చెప్పే తీరులోనే మీ తెలివితేటలు స్పష్టమవుతున్నాయి.

    అంతవరకూ వాళ్ళ మాటలు వింటూవున్న స్వాతి "బాగుందర్రా పుసకాల్లో భాష మాట్లాడుతున్నారు." నా కర్థమే కావటంలేదు. నా మెచ్చుకోలుకన్నాట్లు మాట్లాడుతున్నారు" నిష్ఠూరంగా అంది.

    "పుస్తకాల భాష అని వేరే వుంటుందా స్వాతీ!" అడిగాడు రామరాజు.

    "ఎందుకుండదు? నా లైబ్రరీ అంతా తిరగెయ్యి. నీకే అవగాహన అవుతుంది."

    "నీవు చెప్పావుగా స్వాతీ. నమ్ముతాను. పాపం నీ ఫ్రెండ్ నుంచునే వుంది. కూర్చోమను."

    "అరె, నే గమనించనేలేదు. ఇలా వచ్చి కూర్చో శృతీ!"

    "ఫరవాలేదు. మళ్ళీ వస్తాను. మీరు మాట్లాడుతూ వుండండి" అంది శృతి.

    "మా మధ్య రహస్యాలు లేవు. కూర్చోండి శృతీ!" అన్నాడు రామరాజు.

    కూర్చోక తప్పలేదు శృతికి.

   
                                                    22

    ఆరోజు చండీపూజ గొప్పగా చేస్తున్నారు.

    పక్క వూళ్ళనుంచి జనం బళ్ళు కట్టుకువచ్చారు.

    ముఖ్యమైన రెండుగంటలు ఊరిపెద్దలు, చిన్నా పెద్దా స్త్రీ పురుషులు పూజ జరిగేచోట కన్నుల పండుగగా చూస్తూ కూర్చుంటారు. పూజకి కావలసిన ఖర్చంతా రాజా నృసింహరాయ భూపతిరావ్ గారిదే. ప్రతి ఏటా వారింట్లో అంతా  పూజ జంగేటప్పుడు  చండీదేవి దగ్గరగా కూర్చుని చూస్తారు.

    రాజావారికి కాలూ చెయ్యి పడిపోయినా పూజకి మటుకు హాజరు కావాల్సిందే. రాజావారిని జాగ్రత్తగా ఎత్తుకు తీసుకువచ్చి వాలుకుర్చీలో కూర్చోపెడతారు. గుడి దగ్గరే కాబట్టి పెద్ద ఇబ్బందిలేదు. రాజావారు వ్యాధి గ్రస్తులైన తరువాత గది రావటంలేదు. ఈరోజు మాత్రమే గుడికి జరుగుతుంది.

    స్వాతి రానని ముందే గట్టిగా చెప్పింది.

    రాజావారు, నళినీదేవి తదితరులంతా గుడికి వెళ్ళారు.

    "ఒక్కసారి నువ్వూ వెళ్ళి చూసిరా! నేనంటే లేవలేను. నాకోసం దేవీపూజ చూడడం మానేస్తే ఆ దేవి నన్నే శిక్షిస్తుంది. ఎక్కడున్నాసరే ఈరోజు అన్నయ్య ఇక్కడ వుండాల్సిందే. మేమేగాదు మా యింట్లో ఎవ్వరం మానెయ్యం వెళ్ళు శృతీ!" అంటూ బలవంతం చేసింది స్వాతి.

    శృతి ఈ సమయంకోసమే చూస్తున్నది. "అలాగే"నని చకచక కిందికి దిగివచ్చింది. అటూఇటూ చూసి ఎవరూ లేరవి నిర్ధారణ  చేసుకుని ఆఫీసుగదిలో దూరింది. ఆ గది లోంచి వీథిగేటు కనిపిస్తుంది. ఎవరైనా వస్తే ముందే తెలుస్తుంది. జాగ్రత్తగా ఇవతలి కొచ్చేయవచ్చు.

    వంటాపడ చంద్రమతి వంటగది దాటి బైటికి రాదు. పనివాళ్ళు ఆ గది చాయలకు రారు. రాజాగారితోపాటు నళినీదేవి, రామరాజు, మేనేజరు, ఆ యింట్లోని మరికొందరు గుడి దగ్గర వున్నారు. శ్రీదేవికి ఫోన్ చేయడానికి ఇంతకన్నా మంచి సమయంగాని అవకాశంగాని చిక్కదు.

    ముందే లెటర్ లో వివరం రాయబట్టి శృతి ఫోన్ చేయగానే అక్కడ ఫోన్ దగ్గర  రెడీగావున్న శ్రీదేవి పలికింది.

    "ఓహ్ శృతీ! ఎన్నాళ్ళయింది నీ గొంతు విని"

    "శ్రీ! ఇప్పుడు మనం కులాసా కబుర్లు కాదు మాట్లాడుకొవలసింది. ఫోన్ చేయటానికి చిక్కిన ఈ కొద్ది సమయిం సద్వినియోగం చేయాలి. అమ్మ ఎలా వుందో, అన్నయ్య విశేషాలూ వివరంగా చకచకా చెప్పెయ్యి." అంది శృతి ఎవరైనా వస్తారేమో అని చూపులు వీథివేపే వుంచింది.

    ఓ రోజు రాత్రి నేనిద్రపోతుంటే కిటికీ దగ్గరకొచ్చి "ఇష్ ఇష్" అంటూ శబ్దం చేశాడు సిద్దూ. కళ్ళువిప్పి చూసి దొంగేమో అనుకున్నాను. అప్పుడు నెమ్మదిగా తన పేరు చెప్పాడు సిద్దూ నేను లేచి వచ్చాను. అసలు జరిగింది ఏమిటంటే....."

    శ్రీదేవి ఫోన్ లో సిద్దార్థ విషయం చెప్పుకుపోతున్నది.

    శృతి జాగ్రత్తగా ఫాలో అవుతున్నది.

    సిద్దార్థ డ్యూటీలో వున్నప్పుడు ఓ రోజు కొందరు కొత్తవాళ్ళు వచ్చి రెండు గూడ్స్ వ్యాగన్లలో కొన్ని ప్యాకేజీ పెట్టెలు బియ్యంబస్తాలు  వచ్చాయని వాటిని డెలివరీ చేసి తీసుకు వెడతామని చెప్పారు. అప్పటికి టైమయిపోవటం వల్ల రేపొచ్చి తీసుకెళ్ళండని మంచిగా సిద్దార్థ చెప్పాడు. వాళ్ళు ఇప్పుడే తీసుకువేడతామని బతిమిలాడారు. లంచం పెద్ద మొత్తం ఇవ్వజూపాడు. సిద్దార్థకు అనుమానం వచ్చి స్టేషన్ పోలీసులకి ఫోన్ చేశాడు. ఇది గ్రహించి వాళ్ళు చల్లగా జారుకున్నారు.

    పోలీసులు వచ్చారు. గూడ్స్ వ్యాగన్ లో సామాను చెక్ చేశారు. జస్తాలలో వుంది బియ్యం కాదు, ప్యాకేజి పెట్టెలలో వుంది ప్లాస్టిక్ సామానూ కాదు.  పైన పేర్చినవి ఒకటి. లోపల సామాను వేరొకటి. ప్రభుత్వ అనుమతి లేకుండా చేరవేస్తున్న స్మగుల్డు వస్తువులు. అవి మొత్తం లక్ష పైన ఖరీదు చేస్తాయి, బ్లాకులో ఇంకా ఎక్కువ.

    కొత్త అడ్రస్ తో వచ్చిన ఆ కొత్తవాళ్ళ ఆచూకీ తెలియలేదు. సామాను గవర్న మెంటు స్వాధీనం చేసుకుంది.

    ఆ కథ అంతటితో ముగిసింది.

    కొత్త కథా  మొదలైంది.

    ఆ కొత్తవాళ్ళు ఓ దొంగలముఠాకి సంబంధించిన వాళ్ళు. భారీఎత్తున స్మగ్లింగ్ చేస్తుంటారు.

    సిద్దార్థవద్ద వాళ్ళ ఆట సాగలేదు లక్ష రూపాయల పైగా నష్టం. సిద్దార్థ మీద పగబట్టారు వాళ్ళు.

    పటిష్ఠమైన ప్లాన్ వేశారు.

    నరహరి, మురహరి అనేవాళ్ళు మధ్యమధ్య సిద్దార్థ వద్దకు వచ్చి అతని డ్యూటీలో పళ్ళబుట్టలు లాంటివి పార్శిల్ చేసి పంపిస్తూ వుండేవారు. సిద్దార్థతో మంచిగా పరిచయం పెంచుకున్నారు.

    సమయం కోసం చూస్తున్నారు.

    ఒకరోజు మూడు లక్షల క్యాష్ ఇనప్పెట్టెలో వుండటం, అదేరోజు సిద్దార్థ డ్యూటీలో వుండటం  తెలుసుకున్నారు. స్టేషన్ మాటుమణిగింతరువాత నీతో మాట్లాడాలి, అలా నడుస్తూ మాట్లాడుకుందామని ఒకతను వచ్చి పిలిచాడు. అతను మురహరి. తెలిసిన అతనే  కాబట్టి సిద్దార్థ అసిస్టెంట్ చంద్రంతో చెప్పి బైటికి వెళ్ళాడు. అటునుంచి గూడ్స్ బండి అడ్డంవుంది. నరహరి, మురహరి సిద్దార్థ ముక్కుకి కర్చీప్ అదిమిపెట్టారు. మత్తువాసనపీల్చి సిద్దార్థ ముక్కుకి కర్చీప్ అదిమిపెట్టారు. మత్తువాసనపీల్చి  సిద్దార్థ పడిపోయాడు. గూడ్స్ బండి అవతలవేపు జరిగింది. ఇవతల ఎవరూ గనించడానికి ఆస్కారంలేదు. సిద్దార్థను అక్కడే వదిలేసే వాళ్ళే అసిస్టెంట్ వున్న గదిలోకివచ్చి అతన్ని వెనుకవేపునుంచి మత్తువాసన చూపి ఇనప్పెట్టెలో వున్న డబ్బంతా తీసుకున్నారు. డబ్బుతోపాటు సిద్దార్థని ఎత్తుకు వెళ్ళారు.

    లోకానికి నిజమేం తెలుసు?

    "సిద్ధార్థ లక్షలతో పరారయ్యాడని అనడం తప్ప!

    సిద్దార్థని ఓ రహస్య గృహంలో వుంచారు తిండి మాత్రం పెట్టెవారట. ఇటు సిద్దార్థమీద పగ తీర్చుకున్నట్టూ వుంటుంది. అటు నేరం అతని మీద వుంటే తమ మీద అనుమానం రాదని వాళ్ళప్లాను. వాళ్ళ ప్లానే కరెక్ట్ అయింది లోకం, పోలీసులు అంతా సిద్దర్థే నేరస్తుడన్నారు.

    ఎన్నోసార్లు సిద్దార్థ పరారి కావడానికి చూశాడు. ప్రయత్నం ఫలించలేదు. దొంగలు మరో పని కూడా చేశారు సిద్ధార్థ ఒకడిని హత్య చేయబోతూ వుండగాను, చేసిన తరువాత ఫోటోలు తీశారు. అది నిజంహత్య కాదు, సిద్దార్థని తమ  గుప్పెట్లో వుంచుకోడానికి సినిమా సెట్టింగూలాగానే వేసి సిద్దార్థచేత బలవంతాన యాక్షన్ చేయిస్తూ ఫోటోలు తీశారట. సిద్దార్థని బయపెట్టి అలా చేశారు వాళ్ళు బయపెట్టింది ఏమిటంటే నిన్నూ, మీ అమ్మనూ ఎత్తుకొచ్చి నీ కళ్ళముందే నరకయాతనలు పెడతామని.....సిద్దార్థ భయపడి వాళ్ళు చెప్పినట్లు నటించాడుట.

    ఒక రోజు అర్థరాత్రి ఒకతను మీ అన్నయ్య గది దగ్గరకు వచ్చి తాళం తీశాడుట, ఇంతలో ఎవరో వస్తున్నా చప్పుడయింది. మీ అన్నయ్యని ఫలానా మార్గం గుండా పారిపొమ్మని చెప్పి కంగారుగా అతను వెళ్ళి పోయాడట. అతను మనిషికాదు. భగవంతుడే ఆ రూపంలో వచ్చి నన్ను ఆ నరకకూపం నుంచి విముక్తుడివి చేశాడని సిద్దార్థ అంటున్నాడు.

    ప్రస్తుతం సిద్దార్థ బయటికొస్తే ఇటు పోలీసులు, అటు దొంగలు తరిమి పట్టుకుంటారు. సిద్దార్థ  నేరం చేయలేదనటానికి ఆధారాలు లేవు నిజం చెప్పినా పోలీసులు నమ్మరు. ఈ అబద్దం బతుకు, ఈ చాటుబతుకు ఎన్నాళ్ళని మరోవైపు వుంది సిద్దార్థ ప్రస్తుతం ఒకనిర్ణయానికి వచ్చాడు.

    ఆ రోజు అంటే పారిపోయివచ్చేరోజు అతనెవరో తలుపుతీసి పారిపొమ్మని చెప్పాడుకదా! సిద్దార్థ చాటు చాటుగా  నక్కుతూపైకివచ్చాడుట. తనని ఓ భూగృహములో బంధించారుట, పైకిరాగానే పెద్దకారు వున్నాయట. మనుషుల అలికిడి ఎక్కువగా వుంది. పైగా కొందరు దూరదూరంగా తిరుగుతూ కనిపించారట. వాళ్ళని తప్పించుకొని బయట పడటంకష్టమని అలా గోడచాటుగా నక్కుతూ, నాడుస్తూవచ్చి ఓ లారీలో ఎక్కిదాగున్నాడట. నిండులోడ్ లారీఅది. కొద్ది సేపటిలో అది బయలుదేరిందట.

    సిద్దార్థ దాదాపు ఓగంటలారీమీద సామానులమధ్యలో వున్నాడట. తర్వాత వీలుచూచుకుని బైటపడ్డాడు. అసలు విషయమేమిటంటే ఆ తొందరలో తనని బంధించిన ఇంటిని గుర్తు పెట్టుకోలేదు. ఆ పరిసర ప్రాంతాలూ తెలియవు. బాగా గుర్తున్నదల్లా కారు గ్యారేజీ.

    "ఎలా అయినాసరే కష్టపడి చాటుగానే తిరిగి ఆ యిల్లు కనిపెడతాను. అదో పెద్ద దొంగలనివాసం. పైకి ప్రపంచానికి తెలియకుండా నాటకం ఆడుతున్నారు. ఆ యిల్లు కనిపెట్టిం తరువాత అప్పుడు పోలీసులకు నిజం చెప్పి ఓ నాటకం ఆడి వాళ్ళను పట్టిస్తాను. నాకు విముక్తికలుగుతుంది. అందాకా ఓ దొంగలా ఈ చాటుబతుకు బతకాల్సిందే" అంటున్నాడు సిద్దార్థ.

    అంతవరకూ వివరంగా ఫోన్ లో చెప్పింది శ్రీదేవి.

    "మరి అన్నయ్య వుండటం......!" అంది శృతి.

    "మీ అమ్మగారి దగ్గరే!"

    "ఎవరికీ తెలియకుండా ఎలా సాధ్యమవుతుంది? మీ నాన్నగారు ఏమన్నారు? వారికి తెలుసా?" అడుర్థాగా అడిగింది శృతి.

    మొదటేమయిందంటే, సిద్దూకి ఇక్కడ విశేషాలు తెలియక మీరున్న క్వార్టర్సు దగ్గరకెళ్ళాడుట. అప్పుడు ఎంత ప్రమాదం తప్పిందో తెలుసా!" అంటూ ఆ రోజు జరిగింది చెప్పుబోయింది శ్రీదేవి.

    వీధిగేటు తీసుకుని లోపలికొస్తూ మరో నౌకరు సూరయ్య కనిపించాడు. శృతి వెంటనే "శ్రీ! ఫోన్ పెట్టేస్తున్నాను. అవకాశం వచ్చినప్పుడు మాట్లాడతాను అవతల మనుషులు వస్తున్నారు" అంటూ రిసీవర్ క్రేడిల్ మీద వుంచి గిరుక్కున వెనుతిరిగింది.

    ఒక్కసారిగా శృతి గుండే ఆగినట్లుయింది.

 Previous Page Next Page