కోదండరామయ్యకి అది గుర్తుంది. అందుకే ఎడాపెడా కీ తిప్పాడు. ఇంక ఆ పెట్టె తెరుచుకునే పని లేదు. తెరవాలి అంటే పగలకొట్టాల్సిందే.
కోదండరామయ్య పెట్టె తాళంవేసి లేచాడు. పెద్ద నల్ల దుప్పటిని ముసుగులా వేసుకున్నాడు. పెట్టె నెత్తిమీద పెట్టుకుని బయలుదేరాడు.
"జాగ్రత్త మరీ దూరం వెళ్ళకండి" అంది వెంకుమాంబ.
"పక్కవీధిలో ఎవరింటి ముందన్నా పారేసి వస్తాను. ఖర్మ కాలినవాడు ఈ పెట్టెని చూసి ఆశతో ఇంట్లో తెచ్చి పెట్టుకుంటాడు. ఆ తర్వాత పాట్లు ఆ తర్వాతే" అన్నాడు కోదండరామయ్య.
వెంకుమాంబ ముందుగా వెనకవేపు తలుపు తీసి అటూ ఇటూ చూసింది. పక్కవాళ్ళ తలుపులు వేసి వున్నాయి. "రండి" అంది.
"జాగ్రత్తగా వెళ్ళిరండి. వీధి కుక్కలు వుంటాయి" అంది వెంకుమాంబ.
"అలా వెళ్ళి ఇలా వస్తాను. పావుగంట కూడా అక్కరలేదు తలుపులు తీసే వుంచు. ఇటే వస్తాను అని చెప్పి కోదండరామయ్య ముందుకి సాగాడు.
ఆ వీధి కాస్త పొడుగ్గానే వుంటుంది. అది రహదారి వీధిగాక అందరి ఇళ్ళకి పెరటివేపు తలుపులు వస్తాయి. అందువల్ల దానిని సందుగానే వ్యవహరిస్తుంటారు. సందులో మనుషులెవరూ పడుకోరు, చెత్తాచెదారం పోయటం తప్పించి. కుక్కలు, పందులు లాంటివి వున్నాయి.
చీకటిగా వుండడంవల్ల కోదండరామయ్య మొండి ధైర్యంతో ముందుకు సాగాడు. వీధిచివరకొచ్చి పక్కవీధిలోకి తిరిగి నాలుగిళ్ళ తర్వాత ఏదో ఒకఇంటిముందు ఆగి పెట్టెని ఎవరి వాకిలి పక్కనన్నా పెట్టి తిరిగి ఇంటికి వద్దామనుకున్నాడు.
పక్కవీదిలోకి తిరగబోతుండగా పక్క వీధిలో లైటు వెలుగులో మనుషులు, పోలీసులు కనిపించారు. అంతేకాదు, ఒకడు ఇటే పరుగెత్తుకు వస్తున్నాడు. కోదండరామయ్య పై ప్రాణాలు పైనే పోయి యముడు ఎడం కాలితో తన్నడంవల్ల క్విక్ గా మళ్ళీ వచ్చి ఆయనలో చేరాయి.
కోదండరామయ్య అరసెకండ్ లో ఆలోచించాడు. తన ఇంటిదాకా వెనక్కి పరుగెత్తుకుని వెళితే సమయం చాలదు. వాడు ఇటే వస్తే వాడికంట తను పడతాడు.
పెట్టెని అక్కడే పారేసిపోయినా ప్రమాదమే.
కనుక,
కోదండరామయ్య వీదిచివర ఇల్లు కాంపౌండు ఎత్తులేని రంగశాయి ఇంట్లోకి పెట్టె ఎత్తిపడేసి తనూ దూకాడు. కాలు కలుక్కుమంది అయినా ముందుకు పరుగుతీసి గుబురుగా వున్న క్రోటన్స్ మొక్కల చాటున నక్కి కూర్చున్నాడు.
రంగశాయి ఎవరో కాదు. కోదండరామయ్య మిత్రుడు. అలా అని ప్రాణమిత్రుడేమీ కాదు. "నీ అంత పిసినారి ఎవడూ వుండరు. కొడుకులు ఉద్యోగాలు చేస్తున్నారు. కూతుళ్ళకి మంచి సంబంధాలే చేశావు. సొంత కొంప కట్టుకున్నావు. అద్దె డబ్బు వస్తాయి. పించను వస్తుంది. నాలాగా హాయిగా ఖర్చు పెట్టుకోక ఎవరికోసం ఇంకా దాస్తావు" నవ్వుతూ రవంత వ్యంగ్యం జోడించి అడుగుతాడు రంగశాయి.
"నేను పీనాసివాడిని కాదు. పొదుపరిని. పొదుపు చెడ్డ విషయము అని ఏ సన్యాసీ అనడు. కూర్చుని తింటే కొండలయినా తరుగుతాయి. ఈ రోజువరకు నేను ఎవరి ముందూ చేయి జాపి ముష్టి అడగలేదంటే నీవే ఆలోచించు పొదుపు అనేది ఎంత మంచిదో" అనేవాడు కోదండరామయ్య.