Previous Page Next Page 
ఇంటింటి కధ పేజి 25


    ప్రసాద్ తనలో తాను కాస్త సిగ్గుపడ్డాడు. నిజంగా తను లతని ముందు నించి అర్ధం చేసుకోడంలో పొరపడ్డాను అనుకున్నాడు. ఆరోజు ప్రసాద్ కి చాలా ఆనందంగా వుంది. తండ్రికి తను సాయపడగల్గుతున్నాందుకు సంతోషం అనిపించింది. చెల్లెల్లిద్దరి పెళ్ళి అయి తండ్రి బాధ్యతలు తీరుతాయి. శంకరు కి ఏదో ఉద్యోగం తన ఆఫీసులోనే వేయించవచ్చు. కమల తన బతుకు బతికే మార్గం చూసుకుంది....యీ సాయంతో తనవాళ్ళు గట్టేక్కుతారు. అతని ఊహకి రెక్కలు వచ్చి ఆనందంగా ఎగిరాడు.
    ఆ సాయంత్రం చాలా సంతోషంగా ఆఫీసు నించి యింటికి వెళ్ళి తల్లితో ఏభై వేలు యిస్తాను యిద్దరికి మంచి సంబంధాలు చూడమన్నాడు. పెళ్ళికి ముందు యిల్లు బాగుచేయించి సున్నాలు వేయించ మన్నాడు. తల్లి పెట్టిన ఉప్పుడుపిండి టిఫిను ఆప్యాయంగా తిన్నాడు. అందరితో సరదాగా కబుర్లు చెప్పి అంత ఉత్సాహంగానూ యిల్లు చేరాడు. మొదటిసారిగా లతని అభిమానంగా పలకరించాడు. దగ్గిర కూర్చుని సరదాగా మాట్లాడాడు. తోచడం లేదా పెకాడదాం రా అంటూ రమ్మీ ఆడాడు ఓ గంట. రికార్డులు పెట్టాడు.....నీ కోసం 16 ఎమ్.ఎమ్ ప్రొజెక్టర్ కొంటాను, యింట్లోనే సినిమాలు చూద్దాం అన్నాడు.
    ఒక్కరోజులో ప్రసాద్ లో వచ్చిన మార్పు చూసి లత మనసులో వికటంగా నవ్వుకుంది. దెబ్బకి దెయ్యం దిగి వస్తుందన్న సామెత సరిచేసి "డబ్బుకి దయ్యం దిగి వస్తుంది" అనాలి అనుకుంది. హు....ఏభై వేలు యిస్తాననే సరికి ఎంత ప్రేమ పుట్టుకొచ్చింది మొగుడికి. తన మీదా కాదు ప్రేమంతా డబ్బు మీద అని యీ సంఘటనతో స్పష్టంగా తేలిపోయింది. ఎంత అభిమానం! యిన్నాళ్ళు తనకి తోడుగా ఒంటరిగా వుంటే అన్నది ఈరోజు తట్టింది కాబోలు! డబ్బిస్తుంటే యిలా మొహం కళకళ లాడుతుందన్న మాట. ప్రసాద్ చెల్లెళ్ళ గురించి తల్లితండ్రులెలా బెంగపెట్టుకున్నదీ, ఈరోజు అంతా యింట్లో ఎంత సంతోషించారో, తనికెంత సంతృప్తిగా వుందో చెప్పాడు. ప్రసాద్ మొహంలో వెల్లి విరిసిన ఆనందాన్ని సంతృప్తి ని చూసి లత కసిగా అవి అతనికి అందకుండా ఎలా బాధించి ప్రతీకారం తీర్చుకోవాలి. ఇన్నాళ్ళు తనని అలక్ష్యం చేసినదానికి ప్రతిగా ఏదో చేసి అతనికే ఆనందాన్ని దొరకనీయకుండా ఎడిపించాలి . లత వక్ర బుద్ది ఆలోచనలో పడింది.
    
                                                                                         *    *    *    *
    "ఏమండీ మా పిల్లలని యిక్కడ చేర్పించాలని వచ్చాను. చేర్చుకుంటారా దయచేసి......" ....ఓ పాపకి పాలు పడ్తున్న కమల వెనక నించి వచ్చిన మాటలకి ఉలిక్కిపడి యిటు తిరిగింది. ఆ వచ్చినతనికి ముప్పై ముప్పై ఐదు మధ్య వయసుంటుంది.....అతని కళ్ళు లంఖణాలు చేసినవాడిలా లోపలికి పోయాయి. గడ్డం, క్రాపు బాగా మాసివున్నాయి. వేసుకున్న ఫ్యాంటు షర్టు నలిగి వున్నాయి. అతని చేతిలో నెలల బాబు, అతని చెయ్యి పట్టుకుని మూడేళ్ళ పాప వున్నారు. మంచి ఎండలో వచ్చాడేమో చమటలు కక్కుతూ వచ్చాడు... ఏదో దయ చూపండి అన్నట్టు ప్రాదేయపడ్తున్నట్టు దీనంగా చూస్తూ నిల్చున్న అతన్ని చూసి కమల ఆశ్చర్య పోయింది.
    పిల్లలను చేర్చుకోడం , డిపాజిట్టు కట్టించుకోడం, నెలనెలా డబ్బు వసూలు చెయ్యడం అంతా ఫతిమా తల్లి రజియా బేగం చూసుకుంటుంది. ఆవిడ ఆరోజు ముఖ్య బంధువుల యింట్లో పెళ్ళి వుందని వెళ్ళింది. పిల్లలందరినీ ఆయా సాయంతో కమల ఒక్కర్తే అవస్థ పడుతూ చూసుకుంటుంది. నెలల పిల్లల నించి మూడేళ్ళ వరకు రకరకాల సైజుల్లో పిల్లలున్నారు అక్కడ. మూడేళ్ళ నిండాక స్కూల్లో వేస్తారు గనక ఆలోపు వయసు పిల్లలే పాతిక మంది వున్నారు. కొందరు బొమ్మలతో ఆడుతున్నారు, కొందరు నిద్రపోతున్నారు. కొందరు ఏడుస్తున్నారు, కొందరికి పాలుపట్టే టయిము. అలా పది చేతులున్నట్టు సతమత మవుతున్న కమల ఆ ఆగంతకుడ్ని చూసి ...."మీరు ....మీరు...." అంది.
    "నా పేరు రామారావండి. ...ఎల్.ఐ.సి ఆఫీసులో పని....మా పిల్లలిద్దరిని దయచేసి బాలవిహార్ లో చేర్చుకుంటారా ....ఎంత డబ్బు కట్టాలో ...ఏమేం కొనాలో చెపితే....
    'అమ్మగారు లేరు రేపురండి. చేర్చుకుంటాం. ఆవిడ లేందే నాకేం తెలియదు " అంది కమల .... ఒక్క క్షణం ఆగి "పిల్లల తల్లి కూడా ఉద్యోగం చేసృన్నారా.... అంత పసిబాబుని.' అంటూ ఆగిపోయింది.
    ఆ మాటకు అతని మొహం వివర్ణమయింది. కళ్ళలో తడి కదిలింది. "లేదండి....నా భార్య చనిపోయింది. నెలరోజుల కిందట ....పిల్లలని చూసుకునే వాళ్ళెవరూ యింట్లో లేక మీ బాలవివార్ లో చేర్చుదామని వచ్చాను ఈ నెలరోజులుగా ఆఫీసుకు సెలవు పెట్టి వీళ్ళని చూసుకున్నాను నానా యిబ్బంది పడ్తూ...... యింక శలవు ఎల్లుండితో ఆఖరు . మీ బాల విహార్  గురించి ఎవరో చెపితే చేర్చాలని వచ్చాను" రుద్దమయిన గొంతుతో అన్నాడు.
    "అయ్యో ....." అప్రయత్నంగా అంది కమల. యింత పసిపిల్లలు తల్లి లేని వారయ్యారు ....పాపం! తమ దగ్గిరున్న పిల్లందరూ ఉద్యోగం చేసుకునే తల్లుల పిల్లలే. వారే తల్లిని విడిచి కొన్ని గంటలు వుండడానికి ఎంత ఏడుస్తారో, మాలిమి అయి, చేరిక అయ్యేవరకు తల్లి కోసం దిక్కులు చూస్తూ బిక్కమొహాలు పెట్టి ఏడుస్తారు. కొందరు కాస్త తొందరగా ఆటపాటల్లో , మిగతా పిల్లలతో కల్సిపోతారు. మరికొందరు మాత్రం అలా బెంగగా బిక్కమొహాలు పెట్టుకు కూర్చుంటారు. సాయంత్రం తల్లో, తండ్రో రాగానే వాళ్ళ మొహాలు ఎలా విడతాయో చూసి తీరాలి. అలాంటిది ఇంత చిన్న పిల్లలకు తల్లి లేదు. తండ్రి పాపం ఏం చూడగలడు? ఏం పెంచగలడు? ఎన్నాళ్ళు పెంచగలడు? అతనూ చిన్నవాడే. రేపు మళ్ళీ పెళ్ళి చేసుకుంటాడు. ఈ పిల్లలకి సవతి తల్లి..... కమల హృదయం ఏం చంటి పిల్లని చూసినా కంటితో కూడా చూడని తన పాప గుర్తు వచ్చి గుండె కలుక్కు మంటుంది. యింక ఈ జన్మకి తను తల్లి అయ్యే ఆశ లేదు అని నిట్టురుస్తుంది. అందుకే ఆ పసిపాపల పోషణ, అట పాటల మధ్య ఉద్యోగం ఆమెకి ఎంత గానో నచ్చింది. అందులో ప్రతి పిల్ల తన పిల్లలన్నంత ప్రేమానురాగాలు వచ్చాయి. జీతం తీసుకుంటున్నందుకు మొక్కుబడిగా చేసే చాకిరిలా కాక అభిమానంగా పిల్లలని చూస్తుందని రజియా బేగం ఆమె జీతం మరో యాభై ఎక్కువ చేసింది. పిల్లల సంఖ్య పెరిగింది. పిల్లలని విడవడానికి వచ్చే తల్లి దండ్రులు కూడా కమలని చూడగానే పిల్లలు ఆమె కౌగిట్లో కి ఎలా వేడతారో చూసి తమ పిల్లలకి , తాము కరువు చేస్తున్న అనురాగం, కమల నుంచి దొరుకుతుందని సంతృప్తిగా వెళ్ళేవారు. తమ పిల్లలకి పాలు, బిస్కెట్లు పళ్ళు యిచ్చి వెళ్ళినవి సక్రమంగా వాళ్ళకి అందుతాయని నమ్మకం కల్గింది. పిల్లాల మధ్యే తన జీవిత గమ్యంగా మార్చుకుంది కమల. యీ మూడు నాల్గు నెలల ఉద్యోగంతో వచ్చిపోయే తల్లితండ్రులతో బిడియం లేకుండా మాట్లాడం, బస్సులలో ప్రయాణాలు, వీటన్నిటితో కమల పూర్తిగా మారింది. మగవాళ్ళని చూసి ముడుచుకు పోయే కమల కాదు ఇప్పుడు.
    'అయ్యో పాపం, మీరు చాలా యిబ్బంది పడ్తున్నారన్న మాట. తప్పకుండా మా బాలవిహార్ లో చేర్చుకంటాం. మీరు నిశ్చింతగా ఆఫీసుకి వెళ్ళవచ్చు. ఉదయం ఆఫీసుకి వెళ్ళేముందు దిగబెట్టండి..... సాయంత్రం ఆరు లోపల వచ్చి తీసికెళ్ళాలి. మీ బాబుకి పాలడబ్బాలు, ప్లాస్కు, బట్టలు పాలసీసాలు అన్ని ఓ బుట్టలో పెట్టి తీసుకురండి. మీ అమ్మాయికి ఏ ఏ టైములో ఆహారం ఇవ్వాలో చెప్పండి. యీ వయస్సులో కావాలంటే పాలు మేమే యిస్తాం డబ్బు తీసుకుని, మధ్యాహ్నం ఏదన్నా పెట్టాలంటే యింట్లో చేసి తీసుకురాలేని వాళ్ళకి మేమే పెడతాం. వాటికి వేరే చార్జీలు తీసుకుంటాం. పిల్లకి నూరు రూపాయల చొప్పున డిపాజిట్టు కట్టాలి. నెలకి పిల్లకి ముప్పై రూపాయలు తీసుకుంటాం . చూడండి....మీ పిల్లలని కూడా వదిలి మీరు వెళ్ళాక మా పిల్లలు గానే చూసుకుంటాం. ఆ విషయంలో మీరు నిశ్చింతగా వుండచ్చు" కమల చకచక అన్ని విషయాలు చెప్పింది. ఒక బాబుకి తడిసిన బట్టలు మారుస్తూనే.

 Previous Page Next Page