Previous Page Next Page 
దాశరథి రంగాచార్య రచనలు -6 పేజి 26


    రెండు రోజుల్లో ఉక్కు షేర్లు ఆరు పాయింట్లు తగ్గాయి. ఇంకెంతదాకా తగ్గుతాయో తెలియదు. యుద్ధం త్వరలోనే ఆగిపోతుందంటున్నారు. శాంతిపేరు చెబుతే మార్కెట్టు బెదిరిపోతుంది. శాంతి ఏర్పడితే ఉత్పత్తి తగ్గిపోతుందని భయం. మార్కెట్టు యావత్తూ "అమ్మేయ" మని రొదపెట్తూంది.
    మోతీచంద్ ఆఫీసుకుచేరగానే మేనేజర్ను పిలిచి ఒక పట్టిక చూపాడు.
    "కొనే" యమని ఆర్డరు ఇచ్చాడు.
    మేనేజరు తెల్లబోయాడు.
    "అమ్మకానికి మీ ఆర్డరుకోసం వేచి ఉన్నా. జాగుచేయకుండా అమ్మేయడం మంచిది. మీరు ఒక అర్ధగంట క్రితమే వస్తారని చూశా. ఈ అర్ధగంటలో సుమారు ప్రతి స్టాకులోనూ రెండుమూడురూపాయలు పడిపోయాయి. పెద్దనష్టం ఏమీ లేకుండా ఇప్పటికీ అమ్మేసుకోవచ్చు."
    "కొనేయ్" అన్నాడు మోతీచంద్.
    మేనేజరు అర్ధంకాలేదు. యజమానిబుద్ధి వశంలోలేదు అనుకున్నాడు. అయితే మాత్రం? మేనేజరు వాదిస్తాడా?
    "ఎన్ని" అని అడిగాడు మేనేజర్.
    "అయిదువేలదాకా" మోతీచంద్ కంఠం వణికింది. క్షణంలో మళ్ళీ ఒక నిశ్చయనికి వచ్చి" ఇప్పటిరేటుకు పదివేలు అయినా కొనేయ్."
    తరువాత కొద్ది క్షణాల్లో అనేకషేర్లు చేబుతులుమారాయి. కొద్దిసేపు మార్కెటు కదలికలేకుండా ప్రశాంతంగా ఉండింది.
    అదోలా ఉన్న డీలర్లముఖాలు చుట్టూచూచి" ఇంకా అమ్మేవారు?" మోతీచంద్ ఏజెంటు బలంగలవానిలా అరిచాడు.
    ఇంకా అమ్మేవాళ్ళు ముందుకు వచ్చారు. కాని అంత తొందరగా రావడంలేదు. క్రమక్రమంగా అమ్మకాలు తగ్గుతున్నాయి. ఏమైంది? మోతీచంద్ కొనడానికి కారణం? బోర్డువారు లాభాల్ను గురించి తను నిర్ణయం మార్చుకున్నట్లున్నారు. అదే మోతీచంద్ రహస్యం అయి ఉండాలి. అతడు గుడ్డిగా పనిచేసేవాడు కాడు. సర్వత్రా అతని మనుషులుంటారు. ముసిముసి నవ్వులు నవ్వుతూ మోతీచంద్ ఏజెంటు ఇంకా కొనడానికి సిద్దంగా ఉన్నాడు.
    క్రమక్రమంగా రంగం మారుతూంది. అమ్మేవారు కాస్త ఆగి ఆలోచించారు. నెలవారీ ఉక్కు ఉత్పత్తిని గురించి టెలీప్రింటర్ రికార్డుచేసింది. ఉత్పత్తి బాగా పెరిగింది. కొనేవాళ్ళు కోకొల్లలుగా తయారైనారు. ఉక్కు నిలువలు పెరిగాయి.
    "కొను.......అమ్ము.......కొను........అమ్ము'. ఆ సూత్రాన్ని అతడు బాగా వల్లించాడు. ఇంకోగంట గంటన్నరలో మార్కెట్టు మూసేస్తారు.
    క్రమంగా మార్కెట్లో అమ్మే ఆర్డర్లు వచ్చాయి. అమ్మేది ఎవరో అంతుతెలియలేదు. మోతీచంద్ పాచికలు బాగానే పారుతున్నాయి.
    చివరకు ఉక్కురేటు క్రమక్రమంగా మొదటిరేటుకు తగ్గింది. మోతీచంద్ తన షేర్లన్నీ సుమారు గరిష్టరేట్లకే అమ్ముకున్నాడు. లాభాలు లక్షలకు పెరిగాయి. ధరలు మొదటిలాగేపడిపోతూ ఉంటే దివాలాతీసి ఉండేవాడు. దేవాలయపు యువతికి అంతశ్చక్షువులు ఉన్నాయనుకున్నాడు.
    తెల్లవారి దేవాలయానికి వెళ్ళాడు. కాలూకు మోతీచంద్ పులిలా కనిపించాడు. అతన్ని చూడగానే కాలూ ప్రాణాలు పైపైనే పోయాయి. అతని మాటలు వినేవరకు కాలూ సంతోషంతో ఉప్పొంగిపోయాడు. కాలూతో మోతీచంద్ ఒక గంట మాట్లాడాడు.
    మోతీచంద్ శివునికిగాను ఒక రమ్యమైన దేవాలయం నిర్మిస్తామని వాగ్దానం చేశాడు. ఇక చిన్నచిన్న విరాళాలకు అర్రులు చాచాల్సిన పనిలేదు.
    "మనిషి ముఖాన్ని చూసి కనిపెట్టేస్తా" అన్నాడు స్నేహంగా మోతీచంద్. కాని కాలూ అతని మాటలు విని బెదిరిపోయాడనే విషయం గమనించకుండానే" ఆ మహాదేవుడు నిన్నెందుకు అనుగ్రహించిందీ నాకు తెలుసు. నగరంలోని లక్షలకొద్దిజనం భక్తితో నీ కాళ్ళు మొక్కుతారు."
    కాలూ విజయగర్వం ఉట్టిపడుతూ ఉండగా లేఖతో. "అదృష్టం మనకు అనుకూలంగా ఉంది మనంవేసుకున్న అంచనాలకంటే ఎక్కువగానే విజయం లభిస్తూంది. అబ్బ! ఎంత చిత్రం? డబ్బు వర్షంలా కురుస్తూంది. తక్కువ కులంవాని కాళ్ళు పట్టుకుంటున్నారు. దేవుడేలేని వట్టి బండను పూజిస్తున్నారు. వారి ఆత్మలు ఎన్నటికీ పరిశుద్దంకావు. వారు భ్రష్టులైనారు. పతితులైనారు. "అతని కళ్ళల్లో అపహాస్యం గోచరించింది. క్షణం ఆగాడు. ధ్వని మారింది. "నిన్న ఒక వ్యక్తి నాకాళ్ళు పట్టుకున్నాడు. అతడు ఎవరనుకున్నావ్? నన్ను జేలుకుపంపిన మేజిస్ట్రేటే. 'నువ్వెందుకు బ్రతకాలి? నీ కూతురెందుకు జీవించాలి.' అని అడిగినవాడే!"
    కాలూ విజయంగాని సంతృప్తిగానీ, లేఖలో రేఖామాత్రంగా కూడా కనిపించడంలేదు. 'దీని కొస ఎక్కడ?' అని మాత్రమే అడిగింది.
    "కొస, ఎలాంటిదైనా మొదలుకంటే అధ్వాన్నం అవుతేకాదు. మనం ఉభయ పక్షాల్నూ జయించాం. ఇంక మనం తిండికి పరితపించాల్సిన అవసరం ఉండకపోవడమేకాక ఎదురుదెబ్బ తీయవచ్చు కూడా. ఏమంటావ్?"
    "ఈ బూటకం నా గుండెమీద గుట్టలా కూర్చుంది"
    ఆమె అసంతోషానికి కారణం అర్ధంకాక కాలూ ఊరికే చూచాడు. ఆమెను ఓదార్చాలనే ఉద్దేశంతో "విను" అన్నాడు. కాని అతనినోరు బండాలా అయిపోయి అతనినోటివెంట మాటరాక అక్కన్నుంచి వెళ్ళిపోయాడు.
    మాటల్తోగాని, చేతుల్తోగాని లేఖ తండ్రిని ఎదిరించలేదు. ప్రతిచిన్న విషయంలోనూ తండ్రిని సంప్రదించుతూ, అర్ధనిద్రావస్థలో కూడా ఆమె ఎప్ప్దుడూ తండ్రిమీదనే ఆధారపడి ఉంటూంది.
    రోడ్డుకు ఆవల గుడికి ఎదురుగా కాలూ ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. కాలూ రెండవ అంతస్తులో ఉంటూ ఉండగా అర్చకుడు పెళ్ళాంతో క్రింది అంతస్తులో ఉండేవాడు. నడీడుదాటిన ఒక స్త్రీని వంటకు కుదిరించాడు. ఆమె బామ్నీ ఇప్పుడు వారికి మంచి భోజనము చిన్నచిన్న విలాసవస్తువులూ లభించడమేకాక బోలెడు డబ్బు కూడా వెనకపడింది. అతడు మిగతా కమ్మరి అలవాట్లన్నీ మానుకున్నా, ఖర్చు విషయంలో మాత్రం వెనుకటిలాగే జాగ్రత్తపడుతున్నాడు. అతడు తనకు పూర్వం ఉన్న విశ్వాసాల్నూ, నమ్మకాల్నూ వదులుకోవచ్చు కాని ఆకలి, కష్టాలు మాత్రం అతని స్మృతిపథం నుంచి చెరగవు. రోజూ స్వయంగా బజారుకు వెళ్ళేవాడు. కూలీ డబ్బులు మిగిలించడానికి స్వయంగా మోసుకొచ్చేవాడు. తక్కువ ఖరీదుకు బంగాళాదుంపలు దొరికే జోగూబాబూ బజారుకు మైళ్ళకొద్దీ నడిచిపోయేవాడు. బామ్నీకి ఇదంతా నచ్చేదికాదు. పూజారి పెళ్ళాం పొడుపుమాటల్తో "చీమకు రెక్కలు వచ్చిగాలిలో ఎగిరినంతమాత్రంతో పక్షి అవుతుందా?" అన్నప్పుడు బామ్నీనొచ్చుకునేది.
    అర్చకుని పెళ్ళాం అసాధ్యురాలు. బండ గుండెది. అర్చకుడు మాత్రం ఉత్తముడు. కాలూ ఎప్పుడూ అర్చకున్ని సంతృప్తిపరుస్తూ ఉండేవాడు. కొన్ని నెలలనుంచి కాలూ కండ్లు మూసుకున్నట్లే కనిపిస్తూన్న పూజజరిపే విధానాన్ని కనిపెడ్తూనే ఉన్నాడు. మంత్రాలు నేర్చుకోవడం ఈ దశలో అసాధ్యం. కాబట్టి ఏదైనా క్రతువు నిర్ణయించాల్సి వచ్చినప్పుడు నిరాయుధునిలా "నేను శివుని సేవకుణ్ణి. అతని ఇచ్చకు దాసుణ్ణి. నన్ను ఈ నిత్యకృత్యాలనుంచి విముక్తున్ని చేయండి. పూజారికి ఇష్టంవచ్చినట్లు, అతనికి సంతృప్తి కలిగేలా జరిపించండి" అనేవాడు.
    కాలూకు తనమీద ఉన్ననమ్మకానికి పూజారి పొంగిపోయేవాడు. పూజారి తన భార్యతో "మంగల్ అధికారి ఎప్పుడూ శివసాన్నిధ్యంలో ఉంటాడు. ఆయన్ను భూమికి ఎందుకు దిగలాగాలి. ఏదో అత్యవసరం అయితే తప్ప అతన్ని వంటరిగా వదిలేయడమే మంచిది."
    గయ్యాళిగంప తనను వెక్కిరించినప్పుడు "అంతేమరి. పల్లెవారికి అంతకంటే ఎక్కువేంతెలుస్తుంది? అధికారి ఏదో చిన్నగుళ్ళోపూజారి. ఆకలిగాను పొట్టపట్టుకొని కలకత్తావచ్చాడు. రైతుల్లో రైతుగా ఉండే పల్లెటూరిపూజారికి మన జ్ఞానంలో నూరోవంతు మాత్రం ఉంటుందని ఎలా అనుకుంటాం? అయినా అతని ఆత్మ పవిత్రం అయింది. ఊళ్ళో రోజూ పూజచేస్తూ ఉండే బ్రాహ్మడికి కలకత్తా వచ్చేవరకు గుడిలేక పూజ చేయలేకపోయాడు. అతని హృదయం పరితపించింది. శివుని గుండెకరిగి అతనికి కలలో ప్రత్యక్షం అయి కొత్త దేవాలయాన్నిగురించి చెప్పి వరం ఇచ్చాడు. అది అతని పూర్వజన్మ సుకృతం.  అంతేకాదు. అతడు నాకు బాగా డబ్బు ఇస్తాడు. అన్నలా చూస్తాడు. ఇంకేం కావాలి?" అన్నాడు.
    పెళ్ళం వెక్కిరింపు ఇంకోవైపు తిరిగింది.
    "ఆ ముండణు చూడు. దాని పుస్తకాలూ అదీ. సంవత్సరం పొడుగునా రోజుకొక పుస్తకం చదివేటట్లు ఉంది. దాని పొట్టనిండా చదువే ఉంది. దానికి వచ్చిన చదువులో నూరోవంతుకూడా నీకు రాదు. ఇవ్వాళకాకుంటే రేపైనా అదినిన్ను బైటికిగెంతి పూజారిణి అవుతుంది."

 Previous Page Next Page