Previous Page Next Page 
దాశరథి రంగాచార్య రచనలు -6 పేజి 27


    పూజారి నవ్వి, వేళ్ళు గడ్డంలో దూర్చినవ్వుకున్నాడు.
    "పాపం ఆమె ముఖాన ఎప్పటికీ ఏదోవిచారం కనిపిస్తూ ఉంటుంది."
    పెళ్ళాంగుడ్లెర్రచేసి పళ్ళుగట్టిగా బిగించి అరచేయి మొగని ముఖందాకా తీసుకొని పోయి పొడిచినంతపనీచేసి "ఇంత ఈడు వచ్చింది. సిగ్గులేదూ ఆముండమీద కన్నువేశావ్" అని గట్టిగా అరిచింది?"
    "ఏమిటా బుద్దితక్కువమాటలు. ఆమె.........."
    అతనిమాట తెంపేస్తూ "ఎండిన నీ ఎముకల్లో జవ వచ్చిందీ? ఆ ముండమీద కన్నువేసింది నేను చూడలేదనుకున్నావు గామాలు. నేనప్పుడే చచ్చాననుకున్నావేమో. ఇదిగో ఈ రెండుచేతుల్తో దానిమెడ నులిమేస్తా"
    "శివశివా! ఆమె నీకేం అపకారం చేసింది?" నిస్సహాయునిలా చెవులు మూసుకొని తల ఊపాడు.
    "అదిగో దాన్ని వెనుకేసుకొస్తున్నావ్, నీ నీతులన్నీ ఏ గంగలో కలిశాయట? హయ్యోనాయనో! ఇంత విషం గుండెలోపెట్టుకొని పూజారినంటున్నాడు పూజారి. నీ ముదనష్టపు గాలి సోకుతేనె గుడి పాడవుతుంది."
    కర్ణరంధ్రాలు పవిత్రం అయినవి. వాటిల్లోకి దుష్టవాక్యాలు జొరకుండా చెవులుమూసుకొని "శివశివా. ఎంతమాట" అంటూ విసుగ్గా ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఉన్నా ఆ సాధ్వినోరు మూయలేడని అతనికి తెలుసు.
    లేఖ ముఖంమీద పూజారికి కనిపించిన విచారం కాలూకు ఒక గడ్డు సమస్యగా పరిణమించింది. ఆమెను ఆ విచారంనుంచి మళ్ళించడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉండేవాడు. ఆమె గుండెలో ఎప్పుడూ మంచు కాపురంగా ఉండేది. ఆనందానికి అడ్డంగా ఆమె ఒక తుహినకుడ్యం నిర్మించుకుంది. ఆమెను ఎలా మళ్ళించాలి? ఏమాత్రం ధ్వని విన్నా అదిరిచూస్తూంది. హాస్యపుమాట వినిపిస్తే ఆమె ముఖం తెల్లబడిపోతుంది. కళ్ళవెంట టపటపా బాష్పబిందువులు రాలుతున్నాయి. సమవయస్కులైన స్నేహితులుంటే ఆమె విచారం కొంత తగ్గుతూ ఉండవచ్చు. కాని కాలూ ఏంచేయగలడు? అతడు నిస్సహాయుడు. ఒంటరివాడైపోయాడు. అతడు వర్ణబంధాల్ని తెంచుకున్నది నిజమే. కాని అంతకంటే గట్టివాటిని కట్టుకున్నాడు. తనకు వీసమెత్తు నమ్మకమైనా లేని పెద్దకులంవారితో తిరగాలి. అట్లైనా ఎప్పుడో ఒకప్పుడు తనలోని కమ్మరి తొంగిచూడవచ్చు. కాబట్టి వారినుంచి కూడా దూరం ఉండడం మంచిది.
    లేఖ పాఠశాలకువెళ్తే ఆమె సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకున్నాడు కాలూ. ఆమె ఆతురతతో వ్రాసిన వుత్తరాలు జ్ఞప్తికి వచ్చాయి. లేఖను సంతోషపెట్టడానిగ్గాను ఆమెకో ఊహాప్రపంచం చూపించాడు. పిల్లలు యూనిఫారం వేసుకునే గొప్ప పాఠశాలకు లేఖను పంపించాలనుకున్నాడు. నేటి పరిస్థితి వేరు. లేఖను ఏ పాఠశాలలోనైనా చేర్చవచ్చు. ఆమెను స్కూలుకు పంపించాలి అని నిర్ణయించుకున్నాడు. అందువల్ల అతని భారం కొంత తగ్గింది.
    "బాబూ స్కూలా!"
    లేఖ ముఖాన ఒక సంతోషరేఖ మెరిసి మాయం అయింది. మళ్ళీ మామూలు విచారం ఆమె ముఖాన్ని అలముకుంది.
    "ఈ కొద్దివారాల్లోనే నేను నావయసుకంటే ఇరవై ఏళ్ళు పెరిగిపోయాను. స్కూలు వయసుకంటే పెద్దదాన్ని అయిపోయాను"
    "నా వయసుకంటే ఇరవై ఏళ్ళు పెరిగిపోయాను." ఈ మాటలు విని కాలూ అదిరిపోయాడు. బి- 10 అలాగే అనేవాడు. తనకూతురు అతని భావాల్లో పాలుపంచుకొని అవే మాటల్ను పలకడం విచిత్రం అనిపించింది.
    ఒకరోజు ఒక పెద్ద అట్టడబ్బాతెచ్చి సంతోషంతో పొంగిపోతూ కూతురు ముందుంచాడు.
    "నీ కోసమే తెచ్చాను. ఏం తెచ్చావో చెప్పు."
    ఆమె పెట్టెనుచూసి తండ్రివైపుచూసి తల ఊపింది. అంతే. ఆమె ముఖాన ఆనందంగాని, ఆతురతగాని, సంతోషంగాని మచ్చుకు సహితం గోచరించలేదు. ఆమె నిశ్చలంగా ఉంది.
    "రేడియో" అని కాలూ ఆనందంతో కేకవేసినంత పని చేశాడు. "బ్యాండు తిప్పుతే సంగీతం కురుస్తుంది. తిప్పడం తేలిగ్గా నేర్చుకోవచ్చు. గ్రామఫోనులా దీనికి 'కీ' ఇవ్వాల్సిన అవసరంలేదు. ఝార్నా లాయర్ సతీష్ ఘోష్ ఇంట్లో ఇలాంటిది ఉంది. ఆ ఇంటిముందునుంచి సాగినప్పుడల్లా సంగీతం వినిపిస్తే నీకూ అలాంటిది ఒకటి తెచ్చి పెట్టాలనుకునేవాణ్ణి."
    చచ్చిన ఆమె ఉత్సాహానికిరేడియో జీవం పోస్తుందా?
    రేడియోడీలరు చూపినట్లు కాలూ ఏరియల్ కట్టాడు. డయలు, బ్యాండ్లను గురించి లేఖకు జాగ్రత్తగా వివరించాడు. "పాట వచ్చేదాకా ఆ ముల్లు కదుపు. పాట పసందు కాకుంటే ఇంకా తిప్పు. సంగీతం, పాటలు, ఇంటికబుర్లు, బిడ్డలపోషణ ఏది కావాలన్నా వినిపిస్తుంది."
    ఇంటికబుర్లు, శిశుపోషణ. కాలూ ఆగిపోయి ఆలోచించాడు. లేఖకు పెళ్ళి ఈడు వచ్చింది. ఆమె ఎవర్ని పెళ్ళిచేసుకోవాలి? బ్రాహ్మన్నే. లేఖ అందుకు అంగీకరిస్తుందా? ఏదో మార్పువచ్చి సర్దుకుపోవడం జరక్కుంటే వైవాహిక జీవితంలో ఈ నాటకం ఎలా సాగుతుంది?
    వాతావరణం "భర్ భర్" మని విఘాతం కల్పించింది. కాలూ స్విచ్చివైపు తిరిగే వరకు లేఖ నిర్జీవంగా కుర్చీలో కూలబడి ఉంది. సంగీత సాహిత్యాలు ఆమెమీద పనిచేసేట్టులేవు. సదా తన మనోఫలకంపై చిత్రతంఅయిఉండే దేవాలయం, దాని ప్రభావందూరంగా అట్టమీది బొమ్మలా కనిపించింది. లేఖ సమస్య, అతని నిస్సహాయతా తల్చుకుంటే అతనికి దుఃఖం పొంగివచ్చింది. నీతిగా శ్రమించి బ్రతికే మార్గం ఎన్నటికైనా దొరుకుతుందా?
    ఇప్పుడు బ్రతకడం అనేది సమస్యకానేకాదు. పగతీర్చుకోవాలి. పొట్టలో పొడిచిన వాళ్ళను వీపునగుద్దాలి. గుణపాఠం నేర్పడానికి గుడికంటే మంచి ఉపాయం ఏముంటుంది? బూటకపు దేవునికి మొక్కాలి. కమ్మరి కాళ్ళు పట్టుకొని ఆశీస్సులు పొందాలి. వంటినిండా బంగారం పెట్టుకొని గర్వంతో పొంగిపోతున్న స్త్రీలు పతితురాలితో సమానమైన లేఖకాళ్ళు పట్టుకోవాలి.
    అతనికొక పెద్ద నవ్వుతెర వచ్చింది. కాని లేఖ పిచ్చివాడనుకుంటుందేమోనని నవ్వును ఆపుకొని రేడియోవైపు తిరిగాడు.
    "అయితే నీకు రేడియో తిప్పడం వచ్చన్నమాట."
    లేఖ తల ఊపినట్లుచేసి 'అవును బాబూ' అన్నది. కాని ఆమె గుండె కాళీగా ఉందని కాలూకు తెలుసు.
    కాలూ కళ్ళల్లో మెరిసే ఆనందాన్ని పదాల్లో జొప్పించి "ఒకనాటికి మనకూ బగ్గీ, గుర్రమూ వస్తాయి. నీవు బగ్గీలో వెళ్తూంటే చూసిన జనమంతా' ఎవరైఉంటుందబ్బా' అని నోట్లో వేలేసుకుంటారు."
    లేఖ ముఖాన ఒక మెరుపు మెరిసింది.
    "నగరంలో వేలమంది బగ్గీలమీద బజార్లో వెళ్తున్నారు. వారందరినీ చూచి ఎవరు నోట్లో వేలువేసుకుంటున్నారు?"
    "నీకూ వారికీ పోలికేమిటి? నీలాంటివారు లక్షల్లో ఒకరుంటారు"
    లేఖ ప్రతిమలా అతన్నిచూచి "నువ్వలాగే అంటావ్" అని ముఖం తిప్పుకుంది.
    బ్రాహ్మణవేషం వేయడం కాలూకు తాను అనుకున్నంత తేలిగ్గా అనిపించలేదు. సోమరితనానికి అంతూపొంతూలేదు. ఎప్పుడూ చేతులు ముందర పెట్టుకొని కూర్చోవాలి. చెమటోడ్చి పనిచేసేవానికి అదొక సమస్యగా పరిణమించింది. చేతులు పనిముట్లకోసం అర్రులుచాచేవి. కిటికీలోంచి దేవాలయంవైపు చూచాడు. వందలమంది ఆడా, మగా సున్నం, ఇటుక, ఇనుముతో ఒక రూపాన్ని కల్పిస్తున్నారు. అనుభవం లేక ఇంకా పని నేర్చుకోవడంలో ప్రథమదశలోనే ఉన్న ఇద్దరు కమ్మరి కుర్రాళ్ళు కనిపించారు. వారిని చూస్తుంటే అతనిచూపులో ఈర్ష్య గోచరించేది. ఒకసారి వాళ్ళు కొన్ని అంగుళాల ఇనుపసీకు వృధాచేస్తుంటే దాన్ని కోసి కిటికీలో బిగించడంలో పొదుపు ఎలా చేయాలో వారికి చెప్పాడు. వారు ఆశ్చర్యంగా అతనివైపు చూసినప్పుడు తాను జాగ్రత్త పడాలి అనుకున్నాడు కాలూ.
    కాలూ గుండె పనికోసం రెపరెపలాడింది. చేతులు దురదపెట్టాయి. భరించలేని స్థితి వచ్చింది. ఒకరోజు బజారుకువెళ్ళి తిత్తి, సమ్మెట కొని మరొకరు గుర్తుపట్టకుండా పాక్ చేయించుకొని ఇంటికి తెచ్చాడు. మిద్దెమీద కొలిమి ఏర్పర్చుకుని అందర్నీ దూరంగా ఉండమని చెప్పాడు. తలుపు తాళం  వేసి లోపల కూర్చుంటే జనం ఏకాంతంలో మంగల్ అధికారి యోగాభ్యాసం చేస్తున్నాడు అనుకున్నారు. దైవ సాక్షాత్కారానికి తపస్సు చేస్తున్నాడని గుసగుసలు బైల్దేరాయి.

 Previous Page Next Page