దేవాలయం ఎలా నిర్మించాలా అనే విషయం చర్చించుకుంటున్న జనసమూహం వైపు తిరిగి "మిత్రులారా! వినండి......." అన్నాడు.
ఆ మాటలకు వర్తకుడు చకితుడై గర్వం వదులుకొని వంగి బ్రాహ్మణుని కాళ్ళు పట్టుకున్నాడు.
"అయ్యా! మిమ్మల్ని అగౌరవపర్చాలని నా ఉద్దేశంకాదు." పట్టుదొరకని అతని చూపు జనవలయాన్ని కలయజూసింది.
కాలూ మళ్ళీ అతన్ని ఇనుపచట్రంలో బిగించాడు. "అయితే నా ప్లాను రూపం చూడు. ఈ స్థలంలో దేవాలయం నిర్మించబడాలని భగవదిచ్చ. ఇందును గురించిన వివరాలు నీకు తెలియనివి కావు. చర్విత చర్వణం అనవసరం. పూజచేసుకోవడానికి ప్రజలు చోటుకావాలంటున్నారు. వారికి అడ్డం నిలుస్తే వారే చూసుకుంటారు. నీవంటున్న న్యాయం కంటే ఉన్నతమైన న్యాయం వేరే ఉంది. మంచిగా ఈ స్థలాన్ని ఇచ్చివేయడం నీకే మంచిది. గత్యంతరంలేదు."
"మరి ధర?" అన్నాడు వర్తకుడు వస్తూన్న దుఃఖాన్ని ఆపుకుంటూ. "ఈ రెండు సంవత్సరాల్లోనూ ఈ స్థలానికి పూర్వంకంటే రెండింతలు ధర పలుకుతుంది. యుద్ధం ఇలాగే సాగి డబ్బు మంచి నీటిలా దొరుకుతూంటే దీనిఖరీదు ఆరురెట్లు పెరుగుతుంది."
"ఆపు ఏమిటాలెక్కలు అవి నీ ఇనుపకొట్లో చేసుకో ఇక్కడో దేవాలయం నిలబడాలి. దేవునికి ఒక ఇల్లు కావాలి. సాక్షాత్తూ దేవుడే నీడ కోరుతుంటే లేదంటావా? నా ప్రయత్నాన్ని ఆపగలవా? ఆపు, చూతాం. ఇంతకంటే నేనేమీ చెప్పలేను."
వర్తకుడు తటపటాయించాడు. కాస్సేపు ఆలోచించి రాజీకి దిగాడు.
"సరే, నాకు చాతనైంది నేను ఇస్తా ముందు రాబోయే లాభాన్ని వదులుకుంటా. ఈనాటి ఖరీదుకు అమ్ముతా. ఒక్క బీగంభూమి........"
కాలూ పెద్దగా నవ్వి అతనిమాట తెంపేశాడు.
"ఇది కలికాలం. కరువు నోరుతెరిచి వేలమందిని పొట్టపెట్టుకుంటున్నా మనిషి దయతల్చిఏదీ ఇవ్వడు. అబ్బ! దేవునికి కూడా భక్తితో ఇవ్వడు. ఎంత ఆశ్చర్యం! శివుని జాజ్వల్యమానమైన కోపాగ్నిని తల్చుకుంటే నీమేను వణికిపోదూ? భయంకాదూ?"
కాలూ జందెం బొటనవ్రేలును చుట్టి ఆవాహనం చేశాడు.
వర్తకుని ముఖంలో విహ్వలతా కనిపించింది. పూజారి శపించడుకదా? మాట్లాడుతుంటే అతని నాలుక తడబడ్డది. "స్వామీ! నాకేం పాపం చేయాలని ఉంటుందా? నా పరిస్థితిని చూచి కనికరించండి. నేను పెద్దకుటుంబాన్ని పోషించాలి. చాతనైతే ఇదంతా శివునికి ఇచ్చి పుణ్యం సంపాదించుకోనూ? సరేకానివ్వండి. నా భాగానికి సగం వదులుకుంటా. బజారుధరతో సగం ఇప్పించండి. దయతల్చి సగం ఖరేదైనా ఇప్పించండి."
కాలూ పరిస్థితిని చూచి నవ్వుకున్నాడు. తనపట్టు వీసమంతైనా వదల్లేదు. తన శక్తిని చూచి తలతిరిగిపోయింది. మంచిది. తన పాచిక సరిగానే పారుతుంది.
"నీవు సమాజానికి కుళ్ళవు" పరిచిత పదాల్నే అన్యసందర్భంలో వాడాడు. శపిస్తున్నట్లు "నీలాంటివారే వంగదేశ వినాశానికి దారితీస్తున్నారు. శివుడు నీ స్థలంలో ఇల్లు కట్టుకుంటానంటే పొంగిపోక పొట్ట పట్టుకొని వ్రేలాడ్తావా? పరమశివునితో బేరాలా?"
అతడు క్షణం ఆగాడు. ఈ ఇంద్రజాలం అంతా చూసి అతని నోరు మూతపడింది. ముఖం కర్రముక్కలా మారిపోయింది.
"లేదు. వీల్లేదు. ఒక్కపైసాకూడా ఇచ్చేది లేదు" అని కాలూ అరిచాడు.
వర్తకుడు నీళ్ళు నమిలాడు. అతను గుడ్లు గుడ్లగూబ గుడ్లలా అయినాడు.
"ఒక్క పైసాకూడా లేదూ" పేలవంగా అన్నాడు.
విజయం లభించిన కాలూ కాస్త మెత్తపడ్డాడు.
"సరే, నీకిచ్చే బహుమానాన్ని గురించి నేనుచూసుకుంటా. ఒక చలవరాతిమీద స్థలదాతపేరు వ్రాయించి మా ఖర్చుతో దేవాలయపు గోడలమీద అందరూ చూసేలా పెడ్తాం. నీ ఈ బీగంనేలతో నీవు శాశ్వతంగా బ్రతికిపోతావు"
వర్తకుడు స్థలం గుడిపేర వ్రాసేశాడు. ఇప్పుడు కాలూకు తన పేరు ఒక సమస్యగా పరిణమించింది. ఇంతవరకూ పూజారిగా చలామణీ అవుతున్నాడు. కాలూకు మంత్రతంత్రాలురావు కాబట్టి ఒక గడ్డపు అర్చకున్ని నియమించాడు. తనకు పూర్తిగా బ్రాహ్మణత్వం సిద్దించడానికి తానొక మంచి బ్రాహ్మణపేరు తగిలించుకోవాలి.
ఈ విషయంలో లేఖ తనకు సహాయపడుతుందా? ఆమె బాల్కనిమీద నుంచొని కరపత్రాలు పంచిపెడ్తూ మెల్లమెల్లగా సాగిపోతూ ఉన్నకారును చూస్తూ ఉంది. లౌడ్ స్పీకర్లో ఒక మనిషి "నగరంలోకెల్ల ప్రధానమైన విజయాథియేటర్లో రేపటినుంచి "నాగరాజు" ప్రారంభం అవుతూంది. భూపాల్ అధికారి, సిప్రాదేవి ప్రధాన భూమికలు నిర్వహిస్తారు. పాటలూ, ఆటలూగల నాటకం. పక్కలు చెక్కలయ్యే హాస్యం, గుండె నీరయ్యే విషాదం చూచి ఆనందించండి" అని చెపుతున్నాడు.
తండ్రిమాటలు విని లేఖ కొంచెం సేపు ఏదో ఆలోచించి పక్కున నవ్వింది. కాలూ తెల్లబోయి చూచాడు. నవ్వు వచ్చేంతది ఏం జరిగింది? అది ఆమె విస్మృత జీవితపు మెరుపులా కనిపించింది! ఆమెను అంత నవ్వించేది ఏమిటి?
"అటు" అని వ్రేలితో చూపింది.
"ఏమిటి?"
"భూపాల్ అధికారి"
కాలూకు ఏమీ అర్ధంకాక దిగ్భ్రాంతుడై చూచాడు.
"అధికారి" బ్రాహ్మణవంశం. ఇంక మార్చాల్సింది ఒక్కపేరు మాత్రమే. మళ్ళీ ఒక్కక్షణం ఆలోచించి "నేపాల్, క్రిపాల్" ఊఁహుఁ అని తల ఊపింది. "మంగల్, మంగల్, మంగల్ అధికారి" ఏం ఎలా ఉంది?" ముఖం చాటంత అయింది.
కాలూ అర్ధంచేసుకున్నాడు. మంగల్ అధికారి, మంగల్ అధికారి. తనలో తాను మననం చేసుకున్నాడు. అతనికి సంతృప్తి కలిగింది.
పేరు కుదిరిపోయింది. ఆ పైన రెండుమూడురోజులూ 'మంగల్ అధికారి, మంగల్ అధికారి, అని జపించాడు.
రోజులు దొర్లిపోతున్నాయి. మర్రిచెట్టు ప్రక్కన ఒక సుందరదేవాలయం నిర్మించబడుతూంది. ఒకరోజు ఒక ధనికుడైన స్టాకు బ్రోకర్ - మోతీచంద్ - దేవాలయం ముందునుంచే లయన్స్ రేంజిలో ఉన్న స్టాకు మార్కెట్టుకు కారులో వెళ్తున్నాడు.
"ఈ గుడి కట్టేచోటనే శివుడు భూమిలోంచి బయటికి వచ్చింది" అన్నాడు డ్రైవరు.
"నిజమే?"
డ్రైవరు వివరాలన్నీ అందించాడు.
మోతీచంద్ కారు ఆపించి ఆ పవిత్ర స్థలానికి కాలినడకన వెళ్ళాడు. ఉదయపు అర్చన జరుగుతూంది. అర్చకుడు పూజ చేస్తున్నాడు. కాలూ, అతని కూతురు పద్మాసనాలు వేసుకొని ఒకరి ప్రక్కన ఒకరు కూర్చున్నారు.
శివుని కరుణకు పాత్రులైన వారిద్దరినీ మోతీచంద్ కంటితో కొల్చాడు. లేఖ అతనికి సాక్షాత్తు పార్వతిలా కనిపించింది. పార్వతి శివుని అర్ధాంగి.
పూజ ముగిసింది. హారతిలో ఒక రూపాయివేసి మోతీచంద్ తల నేలకు ఆనించి మొక్కాడు. లేఖవైపు తిరిగి "నాది షేర్ల వ్యాపారం. ఈనాటి మార్కెట్టు స్థితి చూస్తూంటే నా తల తిరిగిపోతూంది చెప్పండి. నేను కొనాలా? అమ్మాలా?" అని అడిగాడు.
గుబురు మీసాలమీద నిలిచి ఉన్నట్లు కనిపించే పెద్ద ముక్కూ, మేకలాంటి సన్నని ముఖమూకల మోతీచంద్ ణు కాలూ ఎగాదిగా చూశాడు. ఈ ప్రశ్న ఏదో ఒక వల పన్నినట్లు అనిపించి గుప్తంగా లేఖను హెచ్చరిస్తున్నట్లు చూశాడు. ఆమె దాన్ని గ్రహించక "కొను.......అమ్ము.........కొను.......అమ్ము" అన్నది. ఆమె ముఖంలో ఏమాత్రం మార్పురాలేదు. నిశ్చలంగా ఉంది.
మోతీచంద్ చేతులు జోడించి ప్రణామంచేసి కారుదగ్గరికి వెళ్ళిపోయాడు. "కొను.......అమ్ము.......కొను......అమ్ము" గొణుక్కున్నాడు.
కొనడంతోనే ప్రారంభించాలి. మార్కెట్టుకు ఎదురీదాలి. ధర గబగబా పడిపోతుంది. ఇది అమ్మివేయాల్సిన సమయం. "కొను......అమ్ము........కొను........అమ్ము" కారు వేగం హెచ్చుతూండగా మోతీచంద్ అవే మాటలను పదిసార్లు ఆవర్తనం చేసుకున్నాడు.
మోతీచంద్ ఇట్టే నిర్ణయాలు చేసే బాపతు. అమాంతంగా ఒక నిర్ణయానికి వచ్చేశాడు. అతనికేదో మహదావకాశం లభిస్తున్నట్లు, ఆలస్యం అయితే అది జారి పోతుందన్నట్లు డ్రైవర్ను 'వేగంగా పోనీ' యమని ఆదేశించాడు.