Previous Page Next Page 
సూపర్ స్టార్ పేజి 26


    "ఉదయం వాటిని కూడా చేజిక్కించుకోమన్నారు?:" అన్నాడు జయధీర్ స్ట్రాటజీ అర్థంకాని దాదా.

    "తరువాత అనిపించింది-మనకై మనమే పోలీసుల దృష్టిని, ఆ అమ్మాయి దృష్టిని మనవేపుకు తిప్పుకుంటున్నామా అని. అది మన వృత్తికి మంచిదికాదు. చెప్పింది చేయ్-రీ జనింగ్ కోసం తాపత్రయపడకు.....బై..."అన్నాడు జయధీర్ సీరియస్ గా.


                       *    *    *

    ఊరేగింపుని రికార్డ్ చేసిన నాలుగు మాస్టర్ క్యాసెట్స్ ని ఒక మాస్టర్ క్యాసెట్ లోకి ఎక్కించి దాన్ని తీసుకొని వీడియో లాబ్ ప్రక్కనే ఉన్న పోస్టాఫీసులోకి వెళ్ళాడు భవానీ. జూబ్లీహిల్స్ ఏరియాని కవర్ చేసే పోస్ట్ మేన్ ని కలుసుకొని తన దగ్గరున్న కేసెట్ ని అతనికిచ్చి, అతను చేయవలసిన పని చెప్పి, ఓ యాభై రూపాయలు అతనికిచ్చి బయటపడ్డాడు.

    ఎప్పుడు ఏ కేసెట్ కోసం తనమీద దాడి చేస్తారోనని భవానీ బలంగా విశ్వసించటంతోటే ఆ పని చేసాడు.


   
                        *    *    *


    ప్రభు వచ్చేసరికి హంపీ ఆలోచనల్లో మునిగిఉంది.

    "సారీ ఫర్ ది డిస్ట్రబెన్స్ " అంటూ ప్రభువచ్చి హంపీకి ఎదురుగా కూర్చున్నాడు.

    తన పరిశోధనలు ఈసమెత్తయినా ముందుకు వెళ్ళలేకపోతున్నందుకు అతనికి బాధగా ఉంది.

    అదే బాధను ఆమె ముందు వ్యక్తం చేసాడు ప్రభు.

    ఒక సిన్సియర్ పోలీసాఫీసర్ అయిన ప్రభు చిన్నబుచ్చుకోవడం హంపీకి బాధనిపించింది. అతనికెలాగయినా సహాయం చేయాలని అనిపించిందామెకు.

    "మిస్టర్ ప్రభు.....నాకు కొన్ని అనుమానాలున్నాయి. అవి మీకు  తెలియజేస్తే మీకేదన్నా ప్రయోజనం కలుగుతుందేమోననిపిస్తోంది....."
   
    హంపీ మాటలకు ఉలిక్కిపడి తేరుకుంటూ "చెప్పండి మేడమ్..... నాకిప్పుడు గడ్డిపూచ ఆధారం దొరికినా చాలు, అన్నాడు ఉత్సాహంగా.

    గోవాలో తను సముద్రపు ఒడ్డు అందాల్ని షూట్ చేయటం, అప్పుడు రెండు కొబ్బరిచెట్ల మధ్యకట్టిన ఉయ్యాల-ఆ ఉయ్యాలలో ఉన్న యువతి- ఉయ్యాల ప్రక్కనించుని ఆమెకేసి వంగిన యువకుడు- అది తను షూట్ చేయటం-హైదరాబాద్ వచ్చాక ఒక వ్యక్తి ఫోన్ చేసి మా బాస్ తన గర్ల్ ఫ్రెండ్ తో ఉండగా మీ మేడమ్ కెమేరాను ఆ వేపుకు తిప్పింది-ఆ దృశ్యం మీ కెమేరాలో నిక్షిప్తమయి పోయింది. అది ఎడిట్ చేసి ఇవ్వకపోతే మా బాస్ సంసారం  పాడవుతుందని ఆ ఆగంతకుడు చెప్పటం-ఆ తరువాత భవానీమీద దాడిచేసి ఆ కేసెట్ ని చేజిక్కించుకోవటం-వాళ్ళు దాన్ని ఎడిట్ చేసుకొని ఉదయమే పంపించడం- క్రితం రోజు మరో అగంతకుడు ఫోన్ చేసి ఊరేగింపుని షూట్ చేసావట - ఎక్కువ కాలం బ్రతకాలనిలేదా అని అడగటం -అన్నీ చెప్పింది.

    ప్రభుకు తను విన్నదేమితో ముందు అర్థం కాలేదు- అర్థమయ్యాక షాక్ తిన్నట్లయిపోయాడు. హంపీ ద్వారా తీగను లాగితే డొంకంతా కదులుతుందనే తన ఊహకు బలం చేకూరటంతో ప్రభు మొఖంలో వెలుగు నిండిపోయింది.

    అతనిలో ఉత్సాహం ఉరకలు వేసింది. అక్కడే  ఉన్న విల్సన్  కి తమ మేడమ్ ఆ వివరాల్ని ప్రభుకి చెప్పటం ఇష్టంలేదు. అలా అని చెప్పలేక నిస్సహాయంగా చూస్తుండిపోయాడు.

    పోలీసులు శతృవులుగానే కాదు- మిత్రులుగా కూడా ఉండకూడదని అనుభవపూర్వంగా గతంలో తెల్సుకొని ఉన్న విల్సన్ కి ఆ పరిస్థితి సంకటంగా ఉంది.

    అప్పటికప్పుడే ఒక నిర్ణయానికి వస్తూ మెల్లగా ఆ గదిలోంచి జారుకొని ఎడిటింగ్ టేబుల్ కేసి సాగిపోయాడు వడిగా.

    "ఊరేగింపుని షూట్ చేసావట-ఎక్కువకాలం బ్రతకాలని లేదా అని అడిగిన వ్యక్తి గొంతుకి, గోవా కేసెట్ ని ఎడిట్ చేసివ్వమని ఫోన్ లో బెదిరించిన వ్యక్తి గొంతుకి దగ్గర సంబంధమేదైనా ఉందా..... ఐ మీన్ ఇద్దరు వ్యక్తులా లేక ఆ రెండు ఫోన్ కాల్స్ చేసింది ఒకరేనా.......?" ప్రభు తనలో రేగుతున్న ఉత్కంఠను కంట్రోల్ చేసుకుంటూ అడిగాడు.

    "ఒకరు కాదనుకుంటాను" హంపీ గుర్తుకు తెచ్చుకుంటూ అంది.

    "ప్లీజ్.....గుచ్చి గుచ్చి అడుగుతున్నందుకు మరేమీ అనుకో వద్దు..... నేరపరిశోధనలో ఇఫ్....లు- బట్ లు ఉండకూడదు. దయచేసి మరోసారి గుర్తుకు తెచ్చుకొని చెప్పండి-" రిక్వెస్టింగా అడిగాడు ప్రభు.

    హంపీ కొద్ది క్షణాలు మౌనంగా ఉంది.

    ప్రభు ఆతృతగా ఎదురుచూస్తున్నాడు.

    "ఇద్దరూ ఒకటికాదు- మొదటి ఫోన్ కాల్ లో మాట్లాడిన వ్యక్తి కంఠానికీ రెండో ఫోన్ కాల్ లో మాట్లాడిన కంఠానికి వాయిస్ కల్చర్ లో, వె ఆఫ్ డైలాగ్ డెలివరీ లో స్పష్టమైన తేడా ఉంది" అంది హంపీ.

    ప్రభు మొఖంలో తిరిగి నిరాశచోటు చేసుకొంది.

    ఢిల్లీ ఎయిర్ పోర్టు కేసెట్ ఒక ప్రక్క తత్సంబంధమైన వ్యక్తులు-గోవా కేసెట్, డానికి సంబంధించిన వ్యక్తులు- ఏదో మెలిక ఎక్కడో పీటముడి పడింది. దాన్ని  విప్పగలిగితే...అలా ఆలోచిస్తూ తిరిగి ప్రశ్నించాడు ప్రభు-

    "నిమజ్జనం కేసట్స్ కోసం ఎవరయినా ప్రయత్నించారా?"

    "లేదు"

    "అయితే లూటీ చేసింది జయధీర్ మనుష్యులే అని నిర్థారించటానికి రీజనింగ్ లేదా..... నేను ఒకసారి ఆ కేసట్స్ చూడవచ్చా?"

    "విత్ ప్లెజర్' అంటూ కాలింగ్ బెల్ నొక్కింది.

    భవానీ లోపలకు వచ్చాడు.

    "గోవా కేసట్, నిమజ్జనం కేసట్ ఒకసారి మానిటర్ లో డిమాన్ స్ట్రేట్ చేయి" అంది హంపి లేచి టీ ఉన్న ఫ్లాస్కోని, ఒక ఖాళీ కప్పుని ప్రభు ముందుంచుతూ.


                        *    *    *

    పది నిమిషాలకు భవానీ వచ్చి ప్రభుని కెమేరా రూమ్ లోకి రమ్మని ఆహ్వానించాడు.

    ప్రభువచ్చి మానిటర్ ముందు కూర్చున్నాడు.

    గోవా సముద్రపు ఒడ్డు అందాలు మానిటర్ పై కదిలిపోతున్నాయి. వాటిని చూస్తూ అనుకున్నాడు ప్రభు మనసులోనే-

    హంపి ఒక అద్భుతమైన కెమేరా వుమెన్ అని.

    ఆ గదిలో ఉన్న ప్రభు, హంపి, భవాని, విల్సన్ నలుగురూ మానిటర్ కేసే చూస్తున్నారు.

    కొద్ది క్షణాలు గడిచాక "మిస్టర్ ప్రభు.....మీరు మీకు ఎదురుగా ఉన్న మేగ్నిఫైయింగ్ గ్లాసెస్ ని ధరించి చూడండి" అంది హంపి.

    ప్రభు గ్లాసెస్ పెట్టుకొని చూడసాగాడు.

    జయధీర్ ఫలానా విధంగా ఉంటాడని ఐడెంటిఫై అయితే చాలు. తాను తన పరిశోధనలో జెట్ స్పీడ్ తో ముందుకు వెళ్ళవచ్చు........తనలో రేగుతున్న ఏంగ్జైటీని అదుపులోకి తెచ్చుకుంటూ మానిటర్ కేసి శ్రద్ధగా చూడసాగాడు.

    రెండుకొబ్బరిచెట్లు.........వాటికి కట్టిన నెట్టేడ్ ఉయ్యాల........దూరంగా కనిపిస్తున్నాయి.

    ప్రభు ఊపిరి పీల్చటంకూడా మర్చిపోయినట్లుగా మానిటర్ కేసే చూడసాగాడు.

    ఆ దృశ్యం మరికొంత దగ్గరయింది.

    ఒక యువకుడు, యువతి స్పష్టంగా కనిపించారు.

    మరికొన్ని క్షణాలు.........

    ఉయ్యాలలో బికినీ డ్రస్ లో ఉన్న యువతి పైకి ఆ యువకుడు  వంగుతూ కనిపించాడు.

    ప్రభు రక్తప్రసరణ రెట్టింపయింది.

    దృశ్యం మరింత దగ్గరయింది.

    కాని ప్రభుకి ఆశాభంగమయింది.

    అతని తలమొత్తం ఆమె ఎత్తయిన ఎదమధ్య ఇరుక్కుపోయింది.

    అతని మొఖంకాని, ఆమె మోముకాని స్పష్టంగా కనిపించటం లేదు.

    మంచి పర్సనాలిటీ......

    వైట్ ఫాంట్..... పైన షర్ట్ లేదు......భుజంమీద ఒక టర్కిష్ టవలు మాత్రమే ఉంది. ఆ తరువాత దృశ్యం మారిపోయి చిన్నపిల్లలు పరుగెత్తుకొస్తున్న దృశ్యం కనిపించింది.

    ప్రభు నిస్పృహగా తల విదిలించాడు.

    హంపి ఆశ్చర్యపోతూ విల్సన్ కేసి చూసింది.

    అతను మర్మగర్భంగా చూస్తూ ఏమీ మాట్లాడవద్దన్నట్లు సంజ్ఞ చేసాడు. అది ప్రభు చూసే అవకాశం లేదు.

    క్లోజ్ షాట్స్ అన్నారు.....?" ప్రభు తలతిప్పి హంపీకేసి చూస్తూ అడిగాడు.

    "అది జెస్ట్ ఏక్సిడెంటల్ గా షూట్ చేసిన దృశ్యం. క్లోజ్ షాట్.......బట్....అతను నిప్పుకోడిలా తన మొఖాన్ని ఆమె గుండెలమధ్య దాచుకున్నాడు. దానికి మేమేం చేయగలం చెప్పండి! వారిద్దరే మాకు మెయిన్ ఆబ్ జెక్ట్ అయితే వారి కదలికలమీదే మా కెమేరాని కేంద్రీకరించే వాళ్ళం. పైగా అలాంటి దృశ్యాల్ని మేం జనరలైజ్ చేసి చూపించాలి కాని స్పెషలైజ్ ఆర్ పర్సనలైజ్ చేయకూడదు. బహమాన్ ఎట్మాస్ ఫియర్.....సముద్రపు ఒడ్డు, వంగిన కొబ్బరిచెట్లు.....బంగారపు ఇసుక తెన్నెలు.....సర్వే చెట్లు, చిన్న చిన్న కాటేజీలు......పొంగిపొరలే సముద్రపు అలలు..... సన్ సెట్ మనోహర దృశ్యం.....దూరంగా సముద్రంమీద చిన్న చిన్న పడవలు....లంగరేసే ఓడలు....ఇవే మాకు కావల్సిన దృశ్యాలు.....మమ్మల్ని గోవా టూరిజం డిపార్ట్ మెంట్ కావాలని అడిగిందికూడా వాటినే..... విల్సన్ చెప్పాడు.

    విల్సన్ ఏదో దాచిపెడ్తున్నట్లు హంపీ, భవానీ మాత్రమే పసిగట్టారు.

    దీనికోసమా..... తాను ఆతృతపడింది....?: ప్రభు డిజ్ గస్టింగా అనుకున్నాడు మనసులో.

    "అతను అనవసరంగా మమ్మల్ని టెన్షన్ లో పెట్టాడు...... నీ పర్సనాలిటీ తప్ప నీ ముఖం మా కెమేరాలోకి ఎక్కలేదని చెబుదామని ప్రయత్నించినా వినలేదు. పైగా కాలాన్ని వృధా చేసాడు- మా భవానీ మీద దాడి చేయించాడు. మోస్ట్ డిజ్ గస్టింగ్ ఫెలో...." విల్సన్ చికాకు పడ్డాడు.

    ప్రభు బాగా అప్ సెట్ అయ్యాడు.

    "పోనీ ఆ ఊరేగింపు కేసట్ ని చూడవచ్చా....?" కొద్దిపాటి ఆశ మిణుకు మిణుకుమంటుండగా అడిగాడు ప్రభు.

    హంపీ సంజ్ఞ చేయగానే విల్సన్ పెదవి విరిచాడు.

    ఈ కేసట్ కోసం తిరిగి తనమీద దాడి జరగవచ్చని ఊహించి భవానీ దాన్ని మన ఏరియా పోస్ట్ మేన్ కి యిచ్చి మన ఆఫీసులో ఇవ్వమని చెప్పాడతా మేడమ్. అది మరి కాసేపట్లో రావచ్చు...." అన్నాడు విల్సన్.

    ఆ కేసట్ వచ్చేవరకు ప్రభు అక్కడే ఉండదలచుకున్నాడు. భవానీ ముందు జగ్రత్తకి హంపీ విస్మయపడింది.

   
                        *    *    *

    తల్లిచావు అనిల్ ని ఓవేపు కృంగదీసినా మరోవేపు ఆలోచనలకు శ్రీకారం చుట్టింది.

 Previous Page Next Page