Previous Page Next Page 
సూపర్ స్టార్ పేజి 25


    "నువ్వే చూడు.....ఏవి చదువుతారో:" అన్నాడు దశరధ చిద్విలాసంగా.

                      *    *    *

    "ఎయిర్ పోర్ట్ లో షూట్ చేసింది కూడా ఆ అమ్మాయే. అయితే ఆ అమ్మాయికి మన బాస్ గురించి ఏమీ తెలీదు. ఇండియన్ ఎయిర్ పోర్ట్స్ మీద జెనరల్ గా తీసింది......" దాదా చిన్నగా అన్నాడు తనకు అత్యంత ఆప్తుడయిన వ్యక్తితో.

    "ఆ క్యాసెట్ లో మన బాస్ కనిపించారా....?" ఆ వ్యక్తి ఆతృతను కనబర్చాడు.

    "తెలీదు.....బహుశా కనిపించక పోవచ్చు. ఆ జాగ్రత్త తీసుకున్నానని బాస్ చెప్పారు....." దాదా ఏదో ఆలోచిస్తూ అన్నాడు.

    "ఏ విషయమైనా స్పష్టంగా తెలుసుకోవటం మంచిది" అన్నాడా వ్యక్తి సాలోచనగా.


                         *    *    *

    రాత్రి తొమ్మిది గంటల సమయం.....

    ఎయిర్ పోర్ట్ కేసట్ లో తమ బాస్ జయధీర్ స్పష్టంగా కనిపించిందీ, లేనిదీ దాదా తెలుసుకొనేలోపే అది టెలీకాస్ట్ కావటం ప్రారంభమైంది.

    ఓబరాయ్ హొటల్ సూట్ లో జయధీర్.....

    అన అడ్డాలో దాదా.....

    తన ఆఫీసులో  ప్రభు.....

    తన స్టూడియోలో హంపీ....

    టీవీముందు కూర్చుని ఇండియన్ ఎయిర్ పోర్ట్ డాక్యుమెంటరీనే చూస్తున్నారు.

    అరగంట గడిచింది-

    జయధీర్ రిలాక్సయ్యాడు.

    దాదా ఊపిరి తీసుకున్నాడు.

    ప్రభు నిస్పృహగా తల విదిలించాడు.

    హంపీ తన వర్క్ పట్ల తృప్తిపడింది-ఆపైన ప్రభు చెప్పే జయధీర్ గాని, మరే వ్యక్తిగాని స్పష్టంగా తన డాక్యుమెంటరీలో కనిపించక పోవటం ఆమెకు ఆనందాన్ని కలిగించింది.

    పోలీసుల నేరపరిశోధన తాను కేంద్రబిందువు కాకూడదానే ఆమె కోరుకుంది.

   
                       *    *    *

    "మీరేవరండి.....? బ్రహ్మానందం తలుపుతీస్తూ అన్నాడు.

    "నేను దూరదర్శన్ గేట్ పనిచేసే వాచ్ మెన్ నండి" అన్నాడా వ్యక్తి.

    సైకిల్ తొక్కుంటూ వచ్చాడేమో చెమటలు కక్కుతున్నాడు.

    "ఏం పనిమీదొచ్చావ్.....?"

    "అయ్యగారికి ఇవి ఇచ్చిపోదామని" అని అంటూ పెద్ద కాగితాల కట్టాను సంచిలోంచి బయటకు తీసాడు.

    "ఏమిటివి.....?"

    "పిచ్చివాడా.....ఆ మాత్రం  తెలీదా.........? మా దూరదర్శన్  అప్రూవల్ కోసం వివిధ వ్యక్తులు సబ్ మిట్  చేసిన సీరియల్స్ (స్క్రిప్ట్స్) ఫోటో స్టాట్ కాపీలు".

    ఓర్నీ......కంచే చేనుని మేస్తోందా.....?ఎంత న్యాయం.....? వాచ్ మెన్ వి అయుండి రహస్యంగా ఇలాంటి  దొంగపనులు చేస్తున్నావా?"

    "నేరం నాదికాదు-నా అవసరాలది. సైకిల్ మీద ఎన్నాళ్ళు తిరుగుతాను చెప్పండి.....? మీకు తెలుసోలేదో.....నేను నాలుగు స్క్రిప్ట్స్ ని అప్రూవల్ చేయించి, తీయగల  మహానుభావులకు అమ్ముకొనే ఈ సైకిల్, ఒక కలర్ టీ.వీ.  కొనుక్కున్నానండి. ఇంకెన్నాళ్ళు ఈ సైకిల్ మీద తిరగగలనండి.....?లూనా కొనుక్కునదామని" వాచ్ మెన్ నవ్వుతూ అన్నాడు.

    బ్రహ్మానందం కళ్ళు తేలేశాడు. కొద్ది క్షణాలకు తేరుకొని-

    "లూనా ఏం ఖర్మ..... కారే కొనుక్కోవచ్చు..... నీవృత్తి మూడు పూవులు ఆరుకాయలైతే చార్మినార్ నే కోనేసుకోవచ్చు....."

    "వీటిల్లో ఉన్న మంచి పాయింట్స్ - సంఘటనలు కలిపి అయ్యగారు ఒక స్క్రిప్ట్ ని సబ్ మిట్ చేసుకోవచ్చని వచ్చాను."

    "అవకాశం లేదుగాని- ఉంటే దూరదర్శన్ నే కొనేసుకునే వాడిని....అయినా సంగ్రహించ గలిగేంత గొప్ప స్క్రిప్ట్స్ వస్తున్నాయని పరోక్షంగా చెప్పి మీ దూరదర్శన్ పరువును కొద్దిగా కాపాడావు. ఉండు అయ్యగార్ని పిలుస్తా- ఆ చేత్తోటే త్రాసుకూడా పట్టుకొస్తా" అంటూ బ్రహ్మానందం లోపలకు వెళ్ళాడు.

   
                       *    *    *

    "మనం తీయబోయే సీరియల్ లో హీరో పాత్రకు ఎదురయ్యే ఒక ముఖ్య సంఘటన -మొన్నీమధ్య మేడమ్ స్మశానంలో షూట్ చేసిన సంఘటనకు చాలా దగ్గర పోలికలున్నాయి....." విల్సన్ టీవీ మెల్లగా సిప్ చేస్తూ అన్నాడు.

    "ఎలా.....?" భవానీ ఆశ్చర్యపోతూ అడిగాడు.

    "సీరియల్ లో హీరో ఆశ్చర్యపోతూ అడిగాడు.

    "సీరియల్ లో హీరో తల్లి చనిపోతుంది. అక్కడి నుంచి హీరో రివోల్ట్ అవుతాడు. సీరియల్ లో సీన్  ఎలా రాసిఉందో- అచ్చం అలాగే ఆరోజు స్మశానంలో జరిగింది.........."

    "నాకోటి అనిపిస్తోంది".

    "ఏమిటది?"

    "నేను మాస్టర్ క్యాసట్ తెస్తున్నప్పుడు ఫోన్ లో మిమ్మల్ని బెదిరించిన మనుష్యులు నామీద ఎటాక్ చేశారుగదా.....?"

    "అవునూ..... అయితే?"

    "అప్పుడు అటుగా ఆరోజు మనం స్మశానంలో చూసిన వ్యక్తి వెళ్తున్నాడు. అతన్ని ఉద్దేశించి హెల్ప్ హెల్ప్ అని అరిచాను. అతనేమో నేను ఆపదలో ఉండటం చూసికూడా భయంతో పారిపోయే ప్రయత్నం చేసాడు. సో......సీరియల్ లోని హీరో పాత్రలాగే ఈ యువకుడు కూడా పిరికివాడే. తల్లిచావు అతనిలో ధైర్య సాహసాల్ని నింపుతుందేమో....."

    విల్సన్ చిన్నగా నవ్వాడు.

    "మేడమ్ జడ్జ్ మెంట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్. ప్రశాంత్ కన్నా అతనయితేనే ఆపాత్రకు బాగా సరిపోతాడు. మనిషి ఒడ్డూ, పొడవు, ఫ్రెష్ నెస్, మొఖంలో అమాయకత్వం, బేలతనం- వీటన్నింటిని మించిన అందం- పురుషత్వం అతనిలో ఉట్టిపడుతున్నాయి ........." భవానీ డ్రీమీగా అన్నాడు.

    "నీకూ నచ్చాడా.....? చచ్చాం. అతనెవరో తెలీకుండా, ఎక్కడుంటాడో, పేరేమిటోకూడా కనీసం తెలీకుండా ఎక్కడ ఛస్తాం.........? పైగా టైమ్ లేదు.

    అవన్నీ అలా ఉంచి ఈ గోవా అగంతకుడెవరో.......ఆ పోలీసాఫీసర్ నేర పరిశోధనేమిటో నాకంతా అయోమయంగా ఉంది. మేడమ్ కేమన్నా ఆపద సంభవిస్తుందా అని నాకు భయంగా ఉంది" అన్నాడు విల్సన్ ఆందోళనగా.

    "మేడమ్ కేదన్నా ఆపద సంభవిస్తే నా ప్రాణాల్ని అడ్డువేసన్నా కాపాడేందుకు ప్రయత్నిస్తాను...... ఆ సందర్భంలో నేను హంతకుడ్నయినా ఫర్వాలేదు" భవానీ ఆవేశంగా అన్నాడు.

    ఆ తరువాత కొద్ది క్షణాలు ఆగదిలో నిశ్శబ్దం పేరుకొంది. అన్నీ స్పష్టంగా విన్న హంపీ ఆ గదిలోకి వెళ్ళే ప్రయత్నాన్ని విరమించుకొని వెనుదిరిగింది.


                                              *    *    *

    "ఎయిర్ పోర్ట్స్ మీద తీసింది ఆ అమ్మాయేనని నేను టెలివిజన్ ద్వారా తెలుసుకోవాల్సి వచ్చింది. ఇట్స్ వెరీ బేడ్........" జయధీర్ ఆ రోజు దినపత్రికల్ని తిరగవేస్తూ అన్నాడు. అతని మాటల్లో తొంగిచూసిన వంగ్యం, కఠినత్వం దాదా దృష్టికి వచ్చి కొద్దిక్షణాలు గిల్టీగా ఫీలయ్యాడు.

    "నా టైమ్ బాగుంది. అందుకే ఎయిర్ పోర్ట్స్ మీద తీసిన కేసెట్ లో నా ఫేస్ పర్టిక్యులర్స్ రికార్డు కాలేదు. మరోసారి నేనిలా మందలించవలసిన రావటం గాని, నీవు గిల్టీగా ఫీలవటం కాని జరగకూడదు. నేను కృష్ణుడ్ని కాదు వంద తప్పులు కాయటానికి....."

    దాదా ఓక్షణం భయంతో ఉలిక్కిపడ్డాడు.

    "ఎయిర్ పోర్ట్సు కేసెట్ కోసం ఇక ప్రయత్నించవలసిన అవసరం లేదు. దాని గురించి మర్చిపో. ఇకపోతే నేనారోజు, అదే ప్లైట్ లో వచ్చినట్లు క్రైమ్ బ్రాంచ్ పసిగట్టింది. దాన్ని ఆధారం చేసుకొనే ప్రభు రంగంలోకి దిగాడు. అందులో భాగంగానే ఈ కెమేరా వుమెన్ ని కలుసుకునేందుకు ఢిల్లీనుంచి గోవా వచ్చాడు. గోవానుంచి తిరిగి హైదరాబాద్ వచ్చాడు. తన పరిశోధనలో ఎలా ముందుకెళ్ళాలో తేలిక ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతున్నాడు. నథింగ్ టు వర్రీ. ఇప్పుడు మనకు కావల్సింది గోవా కేసెట్ మాత్రమే. గోవా కేసెట్  కోసం మనం ప్రయత్నించిన విషయాన్ని ఆ కెమేరావుమెన్ ప్రభుకి తెలియజేస్తుంది. అలా అయినా మనల్ని ఎవరో అని ఊహించగలడే తప్ప మరేమీ చేయలేడు. ఇంతకీ  ఆ అమ్మాయి నేనున్నా షాట్ ని కట్ చేసి పంపించిందా......?"

    "లేదు సార్.....నేనే ఆమె అసిస్టెంట్ నుంచి తీసుకున్నాను....." దాదా గొప్పగా ఫీలవుతూ అన్నాడు.

    "క్రిమినల్స్ కి కండబలం ఎంత అవసరమో బుద్దిబలమూ అంతే అవసరం. దౌర్జన్యంగా తెచ్చుంటావ్.....అవునా?"

    దాదా అవునన్నట్లు తలూపాడు.

    "మెదడు ఆలోచించటానికి కాని అరికాళ్ళలో దాచుకునేందుకు కాదు. మనం దౌర్జన్యం చేసి తీసుకున్నామని తెలియగానే వాళ్లు అనవసరంగా ఎక్కువ అటెన్షన్ మనమీద పే చేస్తారు.......ఇంకెప్పుడూ అలా చేయకు. ఆ అమ్మాయి ఎడిట్ చేసి ఇచ్చేందుకు మొరాయించినప్పుడే ఆ పని చేసుండవల్సింది. గోటితో పోయే దానికి గొడ్డలి ఉపయోగించటం ఆజ్ఞాతంలో ఉండే మనకు మంచిదికాదు...."

    "ఈ కేసెట్ నేం చేయమంటారు.......? కాల్చిపడెయ్యమంటారా.....?" దాదా తన జర్కిస్ లోపలఉన్న గోవామాస్టర్ కేసట్ ని తీసి చూపిస్తూ అడిగాడు.

    "పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అనవసరం. నేనున్నవరకు ఎడిట్ చేసి మిగతా భాగాల్ని భద్రంగా తిప్పిపంపించు లేదంటే మనమీద  పూర్తిగా  అనుమానపడే  ప్రమాదముంది. పోలీసుల పరిశోధనకు తొలిమెట్టు అనుమానం- వాళ్ళ  పరిశోధనకు వీలుకలిపించే తొలిమెట్టును మనమే పేర్చటం అవివేకం. వాళ్ళకు కావాల్సిన షాట్స్ ని ఎడిట్ చేసుకొని పంపించి ఉంటారు. లేదంటే అతని సంసారం పాడయిపోయి ఉండేదేమో అని మాత్రమే ఆలోచించి ఈ విషయాన్ని అంతటితో వదిలేస్తారు....."గంభీరంగా అన్నాడు జయధీర్.

    "ఓకే సార్" అంటూ దాదా బయటకు వెళ్ళేందుకు ప్రయత్నిస్తుండగా తిరిగి అన్నాడు జయధీర్..

    "నిమజ్జనం క్యాసెట్ గురించి ఆ అమ్మాయికి ఫోన్ చేసావా......?"

    "చేసాను......"

    "అక్కడితో ఆ క్యాసెట్స్ కి ప్రాముఖ్యం ఇవ్వటం మానేయ్. అందులోకి నేను వచ్చే ఛాన్స్ లేదు. నీవు జాగ్రత్తపడి ఉంటావ్. ఒకవేళ ఆ క్యాసెట్స్ ని ప్రభు చేజిక్కించుకొని శోధించినా మూలవిరాట్టులమైన మనం కనిపించం. ఒకవేళ దొరికినా కొన్ని అడ్రస్ లేని మేకలు దొరకవచ్చు."

    జయధీర్ మాటలకు దాదా ఆశ్చర్యపోయాడు.

 Previous Page Next Page