Previous Page Next Page 
సూపర్ స్టార్ పేజి 27


    రిస్క్ చేయందే ఏ మనిషీ ఏమీ సాధించలేడు - ప్రతిదానికీ భయపడే పిరికివాళ్లు ఏదీ సాధించకుండానే, ఎవరికీ ఏది చేయకుండానే మిగిలిపోతారు.

    ఉన్నట్టుండి సడన్ గా అనిల్ కి హంపీ గుర్తుకొచ్చింది- ఎప్పుడూ లేనిది తను ఒక యువతిపై చేయి చేసుకున్నాడు- ఎంతో సిగ్గు పడవల్సిన సంఘటన తనతల్లి చావు నిజం- ఆ నిజాన్ని నటన అన్నందుకే తను రియాక్ట్ అయి ఆ సిగ్గుమాలిన పనిచేశాడు.

    మరి.....శిరీష తనకు ఆప్తురాలు- స్నేహితురాలు.... తన  ప్రియురాలు...... అది నిజం ....మరా నిజాన్ని ఆ రోజు నలుగురు జులాయిలు ప్రశ్నిస్తే తానెందుకు రియాక్టు కాలేకపోయాడు..... అతని పాతికేండ్ల జీవితంలో అతన్ని ప్రశ్నించిన అతిపెద్ద ప్రశ్న..... జఠిలమైన ప్రశ్న ఇదేనేమో.....

    చొరవ..... తెగువ.... దైర్యం..... సాహసం... రిస్క్ .... పోరాటం..... అనవసరపు శ్రమ..... గెలుపు..... ఓటమి..... అస్థిత్వం.....అందలం.... లక్ష్యసాధన.... ఏవి .... ఇవేవీ ఇప్పటివరకు తన దృష్టికి రావకపోవటానికి కారణం కేవలం పిరికితనం..... తన జీవితాన్ని ఖైదు చేసిన పిరికితనం.... తన ఎదుగుదలకు కటకటాల్ని అడ్డుపెట్టిన అసహ్యమైన పిరికితనం.....భయపడుతున్నంత సేపు భయపెట్టేవారికి భయపెట్టడం పెద్ద థ్రిల్లింగ్.....మనం లోకువ చేసినా భరించి భయపడి, బెదిరిపోయే వాడుంటే ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి ఆ రాక్షస ఆనందాన్ని ఒదులుకోడేమో..... గట్టిగా ధైర్యంచేసి ఒక్కసారి తిరగబడితే పెద్ద పెద్ద నాయకులే రోడ్లపాలు కావటం నిత్యం జరుగుతున్నదే.....భోఫోర్స్.... ఎయిర్ బస్ ల వ్యవహారం పిరికి ఓటర్లనే పౌరుషవంతులుగా చేసింది. మేమెంత తిన్నా, ఎన్ని  ఆటలాడినా, మరిన్ని నాటకాలాడినా ఈ పిచ్చి ప్రజలు- పిరికి ప్రజలు ఏం చేయగలరని ప్రశ్నించిన పార్టీ ఎక్కడుందిప్పుడు.... పదవుల్లో ఉండగా  పరుగులు పెట్టిన మంత్రులంతా తుఫానుకి దెబ్బతిన్న ప్రజల్ని పలకరించడానికి కూడా కరువైపోయారే.....ఒక్కరు కనిపించరు......ఒక్కరూ బయటకురారు. ఎలక్షన్స్ అయిపోగానే ఎలుకలు కలుగుల్లోకి దూరిపోతాయి.....మా ఓట్లతో ఎంపీలయిన మీరు మంత్రి పదవులు రాకపోతే మాకు సేవచేయరా.......? పేరు  ప్రతిష్టలకోసం ఎలక్షన్స్ లో గెలిచి సొంత వ్యాపారాలెందుకు చేసుకుంటున్నారని పిరికి ప్రజలే సాహసం ప్రదర్శిస్తే.........? చరిత్ర తిరగబడదా........?ఖచ్చితంగా తిరగబడుతుంది.....అదే తన విషయంలో జరగదా.......? తాను కొట్టిన చెంపదెబ్బ శారీరకంగా ఆమెకి తగిలినా, మానసికంగా తనకే తగిలింది...

    ఏ మనిషీ అల్లరిచిల్లరి ఆక్వర్డ్ టీనేజర్ గానే మిగలిపోగూడదు.... ఎడోల్ మెంట్ ఫాంటసీ వరల్డ్ నుంచి విడివడాలి......

    అలా ఒంటరిగా..... బస్సులో.....సీట్లమధ్య నిశ్శబ్దాన్ని పెనవేసుకు ఆలోచిస్తున్న అనిల్ తన ఆలోచనల్లో వచ్చిన మార్పుకు తనే విస్మయపడ్డాడు.


                       *    *    *

    "ఎందుకలా చెప్పావ్-? ఎప్పుడు ఎడిట్ చేసావ్.....?" హంపీ మెల్లగా అడిగింది ఆశ్చర్యపోతూ.

    "క్లోజ్ షాట్స్ లో ఒకవ్యక్తి స్పష్టంగా కనిపిస్తున్నాడు. వాటిని చూడగానే ఆ ప్రభు పరిశోధనలో మరింత ముందుకెళ్ళిపోతే అతనికి అనుమానం వస్తుంది. అప్పుడతను పగబట్టేది పోలీసులమీద కాదు మనమీద.... ఒక క్రిమినల్ ని ఎదుర్కొనే శక్తి మనకుందా మేడమ్-?"

    విల్సన్ రీజనింగ్ కి హంపీ దిమ్మెరపోయింది.

    "అందుకే మేడమ్..... అతన్ని స్పష్టంగా చూపించే నాలుగు క్లోజ్ షాట్స్ ని జాగ్రత్తగా ఎడిట్ చేసి దాచేసాను. అతనే జయధీర్ అయితే.....?"

    "అలా అని ఎలా చెప్పగలవు?"

    "అలా అని చెప్పలేము- అలా కాకూడదనీ చెప్పలేము. ఇంతకు ముందు మీరు చెప్పిన సంఘటనల్ని మదింపు చేసుకొని ఆలోచిస్తే అతను జయధీర్ అయ్యేందుకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అసలయినా ఆ వివరాలన్నీ మీరు ఆ పోలీసాఫీసర్ కి చెబుతారని నేను ఊహించలేదు. అలా చెప్పటం నాకు ఇష్టంలేదు. పోలీసులతో శతృత్వం -మితృత్వం ఏదీ మంచిదికాదు. శతృత్వమైతే కేసులు పెట్టి హింసిస్తారు. మితృత్వమయితే వాళ్ళ పరిశోధనకు మనల్ని అడ్డం పెట్టుకుంటారు. వాళ్లు చెప్పినట్లు నడుచుకుంటే శెభాషని మెచ్చుకుంటారు - లేదంటే 420 క్రింద బొక్కలోకి తోస్తామని బెదిరిస్తారు. మన పని - వృత్తి వేరు. మన టెన్షన్స్ మనకున్నాయి- మన ఇబ్బందులు మనకున్నాయి. యాదృచ్చికంగా సంభవించిన వాటిచుట్టే పరిభ్రమిస్తే మ్సనం విలువైన కాలాన్ని నష్టపోవలసి వస్తుంది.

    రమణి క్రియేషన్స్ రంగనాథంగారి ఆఖరి ఎపిసోడ్ షూటింగ్ పార్ట్ అలాగే ఉంది. ఇప్పుడు కొత్తగా చేప్పటిన ప్రిస్టేజియస్ వెంచర్ - వీటికే మనకు టైం సరిపోవటం లేదు - దీనికితోడు పోలీసుల పరిశోధనకు మనం కేంద్రబిందువయితే ఎలా మేడం....? వీటన్నిటినీ మించిన పెద్ద ప్రమాదం మరొకటి ఉంది- అతను నిజంగా జయధీరే అయితే - మనం అతని క్లోజ్ షాట్స్  ప్రభుకి చూపిస్తే ఇంకేమయినా ఉందా..... తన ఉనికిని పోలీసులకు తెలిపినందుకు - తనెలా ఉంటాడో తెలియజేసినందుకు మనమీద పగబట్టడా? ఒక అంతర్జాతీయ స్థాయి క్రిమినల్ ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు మనకున్నాయా.....? అందుకే మేడమ్ మీ పర్మిషన్ లేకుండా మీరు ప్రభుతో మాట్లాడుతుండగానే హడావిడిగా ఎడిటింగ్ రూమ్ కెళ్ళి అతని క్లోజ్ షాట్స్ ని ఎడిట్ చేసాను. గోవా మాస్టర్ కేసట్ ని ఎడిట్ చేసి వాళ్ళే  పంపించారు. నిజంగా వాళ్లు మనకు చాలా మేలుచేసారు. వాళ్ళా కేసట్ ని కాల్చిపడేసి ఉంటే....? అందుకు మనమే బాధ్యత వహించి, మన ఖర్చులతో మరలా గోవా వెళ్ళి మరలా షూటింగ్ చేయవలసి వచ్చేది. గోవా మాస్టర్ క్యాసట్ ని వి.హెచ్.ఎస్ క్యాసట్ లోకి ఎక్కించాం కాబట్టే ఇదంతా అలా చేసుండకపోతే.....? నిమజ్జనం కేసట్స్ కోసం ఫోన్స్ చేసినవాళ్ళు కామ్ అయిపోయారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కేసట్ టెలీకాస్ట్ అయింది. అందులో వదిలేసిన దృశ్యాల్ని, నిమజ్జనం కేసట్స్ చూపించి చేతులు దులుపుకుంటే పోతుంది.

    ఇంకా నయం..... వాళ్ళు గోవా కేసట్ ఎత్తుకెళ్ళి కట్ చేసుకుంది తను చూసిన లాంగ్ షాట్సే అని - ముఖం సరీగ్గా కనిపించని షాట్సే  అని ప్రభునమ్మాడు కానుక సరిపోయింది. తన క్లోజ్ షాట్స్ వచ్చాయేమో అని గోవాకేసట్ దొంగిలించిన వ్యక్తి భయపడి ఉంటాడనే ప్రభు ఊహించాడు. ఆక్కడే మనం సేవ్ అయ్యాం. లేదంటే వాటిని ఎడిట్ చేసి దాచేసినట్లు అనుమానించి మనమీద కేసు పెట్టేవాడు......మీమీద గౌరవంతో, అభిమానంతో, కృతజ్ఞతతో ఈ చొరవ చేసాను. "నేను మీ క్షేమాన్ని కోరుకొనే విశ్వాసపాత్రుడ్ని. దయచేసి నన్ను అర్థంచేసుకోండి" అన్నాడు విల్సన్ తలవంచుకొని.

    విల్సన్ ఆవేదనను, తనపట్ల అతను తీసుకున్న శ్రద్దను గుర్తించి కృతజ్ఞతగా చూసింది హంపి.


                                             *    *    *

    సరీగ్గా పావుగంటకు పోస్ట్ మేన్ వచ్చి కేసట్ డెలివరీచేసి వెళ్ళిపోయాడు.

    తిరిగి అందరూ మానిటర్ ముందు కూర్చున్నారు. ఎయిర్ పోర్ట్స్ మీద తీసిన కేసట్ లోని దృశ్యాలు ఒక్కొక్కటి కదిలిపోతున్నాయి.

    ప్రభు రెప్పవేయటంకూడా మర్చిపోయి చూస్తున్నాడు.

    కస్టమ్ కౌంటర్ కేసి నడుస్తున్న ప్రయాణికుల్లోని ఆరవ వ్యక్తిని పరిశీలనగా చూసాడు. అతనికి దాదాపు డెభ్బై ఏండ్ల వయస్సుండటంతో పదిహేనవ ప్రయాణికుడికేసి చూసాడు.

    చూస్తూనే ఉలిక్కిపడ్డాడు.

    అతను కావాలనే తలను బాగావంచుకొని అటుకేసి తిరిగి ఉన్నాడు.

    "అతనే..... ఖచ్చితంగా ఆ పదిహేనవ వ్యక్తే జయధీర్ సందేహం ఎంతమాత్రం లేదు. ఉద్దేశ పూర్వకంగానే తలని వంచుకున్నట్లు స్పష్టంగా తెలిసిపోతోంది. అతనో పాదరసం.....ప్చ్...." అంటూ ప్రభు పెదవి విరుస్తూ-

    "మీ దగ్గర మిగిలిన షాట్స్ ఇవేనా....." అన్నాడు.

    "ఎడిట్ చేసిన ఫైనల్ కేసట్ ని డూప్లికేట్ చేయించి మీ పోలీస్ డిపార్ట్ మెంట్  తెప్పించుకు చూసింది. అదే టీవీలోకూడా టెలీకాస్ట్ అయింది. మిగిలిన షాట్స్..... అంటే ఉపయోగించుకోకుండా వదిలేసినా షాట్స్ ఇవే....." అన్నాడు విల్సన్.

    "ఇవి నేను తీసుకువెళ్ళవచ్చా......." ప్రభు అడిగాడు హంపీకేసి చూస్తూ.

    "నో ప్రాబ్లమ్....." అంది హంపీ అంగీకార సూచకంగా.

    "థ్యాంక్యూ...." అన్నాడు ప్రభు.

    "నిమజ్జనం కేసట్ పోస్టుమేన్ డెలివరీచేసి వెళ్ళాడు. అదీ చూసుకోండి" అన్నాడు విల్సన్.

    మరికొద్ది క్షణాలకి మానిటర్ పై ఊరేగింపు దృశ్యాలు కనిపించసాగాయి.

    నలభైఐదు నిమిషాలపాటు ఊరేగింపు దృశ్యాలు, లూటీ ఆపరేషన్ అంతా కనిపించింది. అయినా ప్రభుకి ఎలాంటి ఆధారం దొరకలేదు.

    "మాస్టర్ కేసట్ ని ప్లే చేయటానికి మానిటర్ కావాలిగదా........? అది  మాదగ్గరలేదు. దీన్ని వి.హెచ్. ఎస్. కేసట్ లోకి ఎక్కించి ఇస్తారా....." ప్రభు తనలోని ఆశను చంపుకోలేక అడిగాడు.

    హంపీ ప్రభుపనిని చేసిపెట్టమన్నట్లుగా విల్సన్ కేసి చూసింది.


                       *    *    *

    పైలట్ షూట్ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. విల్సన్, భవానీ రాత్రింబవళ్ళు శ్రమించి లోకేషన్, కాస్ట్యూమ్స్, సెట్ ప్రాపర్టీస్ సిద్దం చేసారు.

    ఉదయం ఆరుగంటలకే హంపి కారులో బయలుదేరింది. కారు బి.ఎన్.ఆర్ హిల్స్ కేసి దూసుకుపోతోంది.

    హంపీకి పదేపదే అనిల్  ఫెర్ ఫార్మేన్స్ గుర్తుకు వస్తోంది. తను సృష్టించిన పాత్రకు సరీగ్గా సరిపోయేవ్యక్తి అతను - ప్రశాంత్ బాగా నటించగలడేమోగాని ఎమోషనల్ గా, తానాశించిన స్థాయిలో ఆ పాత్రలో లీనమయిపోలేడు - నందిని వెరీపూర్ ఆర్టిస్ట్.....వీళ్ళతోతను సజీవ చిత్రకల్పన చేయగలదా.....? రాజీ పడటమే తప్ప - పూర్తిగా సంతృప్తి  పడలేదు.

    అతను ఒక్కసారి కనిపిస్తే.....

    ఆలోచనలు ఒకకొలిక్కి రాకముందే కారు జూబ్లీహిల్స్ ప్రపోజ్ బస్ స్టేషన్ దాటి, దేవరకొండ లోయలోకిదిగి బి . ఎన్ .ఆర్. హిల్స్ ఎక్కేసి, నంది హిల్స్ కేసి సాగిపోయింది.

    హంపీ కారుని చూస్తూనే భవానీ పరుగెత్తుకుంటూ వచ్చాడు.

    "గుడ్ మార్నింగ్ మేడమ్" అన్నాడు వినయంగా భవానీ.

    వెరీ గుడ్ మార్నింగ్....... అరేంజ్ మెంట్స్ పూర్తయ్యాయా.... ఆర్టిస్టు లొచ్చారా....?" తూర్పు వైపుకిచూస్తూ అడిగింది హంపి.

    "అరేంజ్ మెంట్స్ సిద్దంమేడమ్...... బట్......"

    "బట్...... చెప్పు భవానీ"

    "నందినీ రాలేదింకా. ప్రశాంత్ ఒక్కడే వచ్చాడు" అన్నాడు నీళ్ళు నములుతూ భవానీ.

    నందినీమీద అప్పటికే అసంతృప్తితో ఉన్న హంపీ చిరాకుపడిపోయింది.

    "ప్రారంభం రోజే ఇలా చేసిందంటే..... ముందు ముందు ఇంకెంత ఏడిపిస్తుందో....? కారు ఏర్లీగానే వెళ్ళిందా........?"

    "4.30 కే కారు నందిని ఇంటికి వెళ్ళింది...."

    నిజానికి భవానీకికూడా నందిని, ప్రశాంత్ ల మీద అంతగా ఇష్టంలేదు.

    హంపీ లోకేషన్ లోకి వెళ్ళి పరిసరాల్ని గమనించింది కొద్దిసేపు.

    అంతలో విల్సన్ వచ్చి విష్ చేసి, ఏం చేయమన్నారన్నట్లు చూసాడు. 

 Previous Page Next Page