మరి కొద్దిసేపుస్వాతితో మాట్లాడి, గది విడిచిపెట్టి వెళ్ళిపోయింది నళిదేవి.
"అమ్మ మాటలు పట్టించుకోవద్దు శృతీ!" జాలిగా అంది స్వాతి.
"ఈ పిల్లతో ఏ మొచ్చినా పట్టలేమమ్మా! అందరూ తనలాంటి సుతిమెత్తనివారే అనుకుంటుంది." అంటూ శృతి మళ్ళీ స్వాతి పక్కనే మంచంమీద కూర్చుని బుగ్గ పిండింది. "ఈ సంగతి ఇంతటితో వదిలెయ్యి. చండీ పూజ దాని కథాకమామిషూ చెప్పు" చిరునవ్వుతో అంది.
శృతి నవ్వు ముఖం చూడగానే స్వాతి అంతా మర్చిపోయింది. పైవారం జరుపబడే చండీపూజ వివరాలు ఉత్సాహంగా చెప్పటం మొదలుపెట్టింది.
చండీపూజ రోజున ఈ ఇంట్లో అంతా పూజ చూడటానికి గుడి దగ్గరకి వెడతారు. ఆ టైములో వీలయితే శ్రీదేవికి ఫోన్ చేయవచ్చు. ఫోన్ లో వివరాలు చాలానే తెలుస్తాయి, ఆ దేవుడు....కాదు, కాదు. ఆ చండీ దేవి దయ తనమీద వుంటే కింద హాల్లో ఫోనున్న గదిలో ఎవరూ ఉండరు, ఫలానా రోజున వీలయితే ఫోనులో మాట్లాడతానని శ్రీదేవికి లెటర్ రాయాలి.
స్వాతి చెప్పేది వింటూ శృతి పైవిధంగా తన ప్లాను ఆలోచించింది.
స్వాతి చెప్పటం ముగించి "ఈ రఘునందన్ మేనేజర్ అనుకుంటున్నాడో ఈ ఇంటి యజమాని అనుకుంటున్నాడో, నువ్వోచ్చింతర్వాత పత్రికలకి చందాకట్టడం వగైరా పోస్టు వనంతా నీకప్పంగించాడు." అంటూ విసుక్కుంది.
"ఫరవాలేదు. ఇలాంటి చిన్నపనులు చేయాలంటే పెద్ద పెద్ద పనులు చేసేవారికి బద్ధకం. నేనేదో పెద్దశ్రమ పడటం లేదుకదా?"
"నీవు వచ్చేముందే డైరీ తిరగేశాను, ఓ వారపత్రికకి, రెండు మాసపత్రికలకి ఈవారంలోనే చందా డబ్బు కట్టాలి. టైమయిపోయింది. న్యూకాల్ పబ్లికేషన్ చందా డబ్బు కట్టాలి. టైమయిపోయింది న్యూకాల్ పబ్లికేషన్ వారికి లెటర్ రాసి కొత్త వాటిని ఎనిమిది నవలలు ప్రచురించారు. మరికొన్ని చోట్లకి లెటర్స్ రాయాలి." అంటూ లిస్టు చెప్పింది స్వాతి.
"నేనే అన్నీ స్వయంగా రేపే చేస్తాను. ఇప్పటికి రెండుసార్లు పోస్టాఫీసు చూశాను. కొత్తేంలేదు, నేనే పోస్టాఫీసుకు వెళ్ళి పనంతా పూర్తి చేస్తాను." అంది శృతి. ఈ రాత్రికే వివరంగా లెటర్ రాసి వాటితోపాటు స్వయంగా తను పోస్టులో పడేయాలి" అనుకుంది వచ్చిన అవకాశానికి సంతోషిస్తూ.
"ఏదయినా హిందీ సినిమా కథ చెప్పవూ!" అంది స్వాతి.
శృతి తను చూసిన సినిమాలు ఇక్కడికొచ్చిన తరువాత కళ్ళకుకట్టేటట్లు స్వాతికి చెప్పింది. సినిమాకథ గుర్తొచ్చింది చెపుతాను. అంటూ వెంటనే కథ మొదలుపెట్టింది శృతి.
సినిమా చూస్తున్నట్లే ఆనందిస్తూ చెవులప్పగించింది స్వాతి.
21
గదిలో కాలుపెడుతూనే చటుక్కున గుమ్మంలోనే ఆగిపోయింది శృతి.
స్వాతి మంచానికానింది కుర్చీవేసుకుని ఆ కుర్చీలో అపరిచిత వ్యక్తి కూర్చుని వున్నాడు. కొద్దిగా స్వాతిమీదకు వంగి తగ్గు స్వరంతో మాటాడుతున్నాడు.
శృతి రావడం స్వాతి చూడలేదు.
అక్కడ వుండాలో, వెళ్ళాలో శృతికి తెలియలేదు.
ఆలివ్ గ్రీన్ పుల్ సూటులో వున్నాడావ్యక్తి, కాళ్ళకి తొడుక్కున్న బూట్లు నిగనిగలాడుతున్నాయి.
ఇప్పుడు వెళ్ళిపోయి తర్వాత వద్దామని నెమ్మదిగా వెనుతిరిగింది శృతి
స్వాతి చూడనే చూసింది "ఏయ్ దొంగా! పిల్లిలా వచ్చి వెళ్ళిపోతున్నావా?" అంది.
శృతి ఆగిపోయింది.
"రా......రా......ఎవరొచ్చారో చూద్దువుగాని" అంది. స్వాతి మాటాల్లో పట్టరాని ఆనందం తెలుస్తూనే వుంది.
శృతి నెమ్మదిగా దగ్గర కొచ్చి ఆగింది.
"ఆ రోజు నీకో గుడ్ న్యూస్ చెపుతానని చెప్పలేదూ? ఆ గుడ్ న్యూస్ ఈ మహానుభావుడే ఇతనెవరో కనుక్కో?" శృతితో అని, అతని వేపు తిరిగి "ఈ అల్లరి పిల్ల గురించే చెప్పబోతున్నాను ఇందాక. నీవేమో అడ్డు తగిలావు ఇప్పుడు చూసి చెప్పు. ఈ పిల్ల అల్లరిదో, టక్కరిదో, మహా బుద్ది మంతురాలో!" అంది స్వాతి.
మెల్లగా తలయెత్తి చూసింది శృతి.
కుర్చిలోంచి పక్కకు తిరిగి చూశాడు అతను.
అల్లరిగా చూస్తూ వుండిపోయింది స్వాతి.
ఏదో అద్భుతం చూస్తున్నట్లు ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవిచేసి చూశాడు అతడు.
నిర్ఘాంతపోయింది శృతి. "ఇతను......ఇతను.....మురారి దేముడు" అనుకుంది.
"ఏమిటలా చూస్తూ వుండిపోయారు?" స్వాతి అనడంతో ఉలిక్కిపడి సర్దుకున్నారు ఇరువురు.
అతను తల తిప్పేసుకున్నాడు.
స్వాతి పడుకుని వుండడంవల్ల ఇరువురి ముఖాలు పక్క నుంచి తప్పు సరిగా కనపడవు. లేకపోతే వారి మార్పు చెందిన ముఖకవళికలు చూస్తూనే కథ అల్లి చెప్పేదే.
"ఈ అజానబహుడు, అరవిందదళాక్షుడు ఎవరో తెలుసా? సాక్షాత్తు మా అన్నయ్య. పేరు రామరాజభూపతి. అందరూ చిన్నరాజాగారని రామరాజు అని అంటారు శృతీ! అన్నయ్యా! ఈమె నా కొత్త ఫ్రెండ్. పేరు శృతి. ఎంత చక్కనిపేరో చూడు! శృతి ఈ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత రోజులు క్షణాల్లా గడిచిపోతున్నాయి. పాపం శృతికి ఎవరూలేరు. చిన్నమ్మ దగ్గరే పెరిగింది. ఆవిడకి బోలెడుమంది పిల్లలట. పరమ గయ్యాళిట. పాపం శృతి చాలా బాధలుపడి ఇప్పుడు కాస్త వూపిరితీసుకోగలుగుతుంది." "ఏకబిగిన చెప్పి ఆయాసపడింది స్వాతి.
ఇరువురు "ఊ" అనికూడా అనలేదు.
రామరాజు ఏమాలోచిస్తున్నాడోగాని శృతి మాత్రం తీవ్రంగా ఆలోచిస్తుంది. రామరాజ భూపతిట. ఇంకా నయం, అల్లూరి సీతారామరాజు అనలేదు. మురారి దేముడుట. చంద్రగుప్తుడట. ఫరవాలేదు చేసేవి ఖూనీలు, దొంగతనాలు, మోసాలు, పేరు చూడబోతే వీరులవి. అసలీ మురారిదేముడు ఇంత జమీకి అధికారి అయితే ఈ నేరాలేమిటి?
"పరిచయం చేయకపోతే ఏమీ మాట్లాడరా?" అంది స్వాతి.
ముఖ పరిచయం లేని మనిషితో ఏం మాట్లాడుతాము స్వాతీ! దిక్కు లేనివారికి దేముడే దిక్కు అంటారు. తల్లి లేక సోదరుడు లేక చిన్నమ్మ దగ్గర బాధలు పడిన ఓఅమ్మాయిని చేరదీశావు. మంచి పనే చేశావు. వివేకం వున్నవారు నోరు జారారు కోరి ఆపదలు తెచ్చుకోరు. మంచి స్నేహితురాలు అని చెప్పావ్. నీకు ఏది మంచి అయితే అదే నాకు మంచి, నీ స్నేహితురాలు నాకూ ఆప్తురాలే." అని స్వాతితో మృదువుగా అని శృతివేపు తిరిగి "మిస్ శృతీ! ఇంతగా ఇంత తక్కువ కాలంలో మా స్వాతి ప్రాణమిత్రురాలి వయినందుకు మీ కివే న ధన్యవాదాలు." గంభీరంగా అన్నాడు రామరాజు.
ఇతను మురారిదేముడే, ఇందులో అణుమాత్రం పోరపాటు లేదు. తల్లి, సోదరుడు లేని దిక్కులేనిదంటాడా! అంటే....అంటే.....అర్థం! నీకు తల్లి, అన్నయ్య వున్నారనే అర్థం. అని గట్టుకునికావాలనే వాళ్ళమాట ఎత్తలేదు. మురారి దేముడుగాక ఇతను రామరాజే అయితే అలాగా! అని మిన్నకుండేవాడే. వివేకం వున్నవారు నోరు జారి కోరి ఆపద తెచ్చుకోరు అంటూ వార్నింగ్ ఇచ్చాడు. దాని అర్థం నా విషయం బైట పెడితే, నీ విషయం బైట పెనతాననే. లేక నీ అంతు చూస్తానని కావచ్చు, మీరుట, ఆహ, ఏం గౌరవం! నీవు అంటూ శృతీ అంటూ పిలిచేవాడే. ఆ రోజు తను రక్షించకపోతే ఈ పాటికి ఏ లోకంలో వుండేవాడో!