Previous Page Next Page 
అగాధాల అంచులలో పేజి 25

    "నిజంగా పృధ్వీరాజుని తీసుకువస్తావా?"

    "ఆ... ముందు నిన్ను పృధ్వీరాజూకి అప్పగించి, ఆ తర్వాత మీ అక్కని వెతుక్కుంటాను. వకటిమాత్రం నిజం. నీలాగా మరీ పసిపిల్ల తత్త్వం, తొందరపాటు నీ అక్కకు లేదు. అవసరాన్ని బట్టి గట్టి నిర్ణయం తీసుకోగలదు. చపల చిత్తం పిల్లవి నీవు."

    "ఏయ్" అంటూ పేపర్ వెయిట్ ఎత్తింది నందితాదేవి.

    "దానిని కాగితాలు ఎగిరిపోకుండా పెడతారు. ముఖం పగలగొట్టటానికి కాదు. దాన్నలా బల్లమీద వుంచెయ్యి. అవును మనం రాజీ పడ్డట్టే కదా?"

    "ఆలోచించాలి. అప్పుడే నా నిర్ణయం చెప్పను"

    "కావలసినంతసేపు ఆలోచించు. అల్లరి మాత్రం పెట్టకు"

    "ఇదీ ఆలోచించాలి"

    "ఏం పిల్లరా బాబూ!" అనుకుంటూ మౌనం వహించాడు రాజు.

    కొద్దిసేపు ఆగి నందితాదేవి అడిగింది. "ఎందుకు జైలులో పెట్టారు?"

    "మరోసారి చెపుతాను." మారుమాటకు ఆస్కారమివ్వక బాత్ రూమ్ లోకి వెళ్ళాడు రాజు.

    "మరీ చెడ్డవాడులా కనపడటం లేదులే. పెద్ద ప్రమాదం వెళ్ళి తప్పిపోయింది. ఇతను మంచివాడయితే పృధ్వీరాజు దగ్గరకు చేరుస్తాడు. మోసగాడయితే ధైర్యంగా అంతుచూస్తాను" ఓ నిర్ణయానికొచ్చి హాయిగా వూపిరి పీల్చుకుంది నందితాదేవి.

                                                                  10

    నందితాదేవి ప్రస్తుతః పిరికిది కాదు. ఆదుకునే తెలివి, ధైర్యం దండిగా ఆమెలో ఉన్నాయి. కాకపోతే జీవితంలో మొదటిసారిగా భయంకరంగా హత్యచేయబడిన మనిషితో ఒంటరిగా బంధింపబడి వుండటంతో భయపడ్డది, కన్నీరు కార్చింది. ఇంట్లో బందీ అయిపోయింది. బైటకెళ్ళే మార్గం లేదు. కిటికీలు తెరిచి అరిస్తే నలుగురూ పోగవుతారు. ఇంట్లోంచి బైటపడి కటకటాల వెనక్కి గెంటబడుతుంది. కుంపట్లోంచి గెంతి అగ్నిగుండంలో పడ్డట్టు!

    నందితాదేవి భారం దిగేటట్లు ఏడ్చి మనసు నిబ్బరపడి అప్పుడు కర్తవ్యం గురించి ఆలోచిస్తూ వుండిపోయింది.

    తల ఎత్తి వకసారి జాస్మిన్ వేపు చూసింది. భయంకరంగా ఉంది జాస్మిన్ శవం. పత్తికాయల్లా తెరుచుకున్న కనుగుడ్లు. సగం నీటితో నిండి వున్న నోరు. ఎండిన రక్తం మడుగు. నల్లగా మారిన పెదవులు. కట్టెలా బిగుసుకున్న శరీరం.

    నందితాదేవి చూడలేకపోయింది. లేచి పెద్ద దుప్పటి తీసుకువచ్చి జాస్మిన్ శవం మీద నిండా కప్పింది. "అన్నం పెట్టి, ఆశ్రయం ఇచ్చి ఆదుకున్న అన్నపూర్ణలాంటి జాస్మిన్ నిన్ను జీవితంలో మర్చిపోను. కర్తవ్య నిర్వహణలో ప్రాణాలు పోగొట్టుకున్నావ్; అమరజీవివి" కళ్ళు మూసుకుని గొణుగుతూ నుంచుంది నందితాదేవి కొద్దిసేపు.

    "తను ఈ ఇంట్లోంచి బయటపడాలి. ఎలా? ఎలా? వంటగది. ఈ ముందుగది. బెడ్ రూమ్ మాత్రమే తను చూసింది. బయట తాళాలు వేయబడ్డాయి. ముందు ఇల్లంతా చూడాలి. బాగా అలోచించి ముందడుగు వేయాలి. హత్య చేయబడిన స్థలంలో హతురాలి ప్రక్కన తానుంది. ఇల్లంతా చాలా వస్తువుల మీద తన వేలిముద్రలు పడివుంటాయి. అవి చెరిపి వేయగలిగినా పోవీస్ డాగ్స్ తన వాసన పడతాయి. దీన్ని గురించి ఆలోచించటం టైం వేస్టు. జాస్మిన్ క్రైమ్ బ్రాంచ్ మనిషి. వాళ్ళకి తనెంతో సమాచారం అందిస్తున్నది. తక్షణ కర్తవ్యం ఇంట్లోంచి బయటపడటం?

    నందితాదేవి అక్కడినుంచి కదిలి బెడ్ రూంలోకి వచ్చింది. బెడ్ రూం నుంచి బయటకు దారిలేదు. వంటింట్లోకి నడిచింది. "ఈ చిన్న డైనింగ్ టేబుల్ ముందు కూర్చునే కదూ జాస్మిన్ నవ్వుకుంటూ భోం చేసింది? ఐస్ లా వున్న గడ్డ పెరుగు తనకెంతో ఇష్టమని చెప్పింది. ఆమె చివరి ఇష్టం కూడా సగమే తీరింది. అరకప్పు పెరుగు నాకే వేసింది కదా?" నిట్టూర్పు విడిచి గదంతా కలియజూసింది. వంట గదిలోంచి బయటికెళ్ళే దారి వుంది. అదీ బయట లాక్ చేయబడి వుంది. వంటింటి కానుకుని మరో గది ఉంది. తలుపు తీసి చూసింది. చిన్న స్టోర్ రూమ్ అది. ప్యాకేజీ పెట్టెలు, పాత పేపర్లు అలాంటి చిల్లర సామాను వుంది. ఆ గదిలోంచి బయటికి దారి లేదు.   

 Previous Page Next Page