"అక్క పెదనాన్న గారింట్లో ఉంటుంది. నేను మా ఊళ్ళో మామయ్య దగ్గర వున్నాను. మాదో పెద్ద కధ. తర్వాత చెపుతాను. అక్క వెళ్ళిపోవటం, మామయ్య అత్తయ్యతో నేను పెదనాన్నగారి యింటికి రావటం జరిగింది. నా మాట వినిపించుకోకుండా చస్తానన్నా నా బెదిరింపు లెక్క చేయక నన్ను పెళ్ళి కూతురిని చేశారు. అవునూ, విషవలయంలో చిక్కుకున్నానంటే అదేమిటి? ఏదైనా స్మగ్లింగ్ లాంటిదా?"
"కాదు అంతకన్నా పెద్దదే. మరోసారి చెపుతాను."
"ఉహూ, యిప్పుడే చెప్పాలి."
రాజ్ దీర్ఘంగా ఓ నిట్టూర్పు విడిచాడు. "చేయని నేరానికి జైలులో పెట్టారు..."
"జైలు. బాప్ రే నీవు ఖైదీవన్నమాట. పోలీసుల కళ్ళుగప్పి పారిపోయిన ఖైదీవన్నమాట" కనుగుడ్లు పెద్దవి చేసి భయంతో అంది నందితాదేవి.
"ఎస్!"
"నువు ఖైదీవి. చస్తే యిహ నీ మాట నమ్మను." మంచం చివరికంటా జరిగి అంది నందితాదేవి.
"కొరివితో తల గోక్కోవటం అంటే యిదే! నిన్ను తీసుకువచ్చి మరింత చిక్కుల్లో ఇరుక్కున్నాను. నా రక్షణే చూసుకోనా, నా రాణినే వెతకనా! నిన్ను..."
"నా సంగతి నీకనవసరం. నా దారి నే చూసుకుంటాను."
"ఆ దారి ఎందాకా, ఎక్కడికి?"
"అది నీకనవసరం"
"పసిపిల్లలా బిహేవ్ చేయకు నందితదేవీ! నేను నిన్నింత దూరం తీసుకువచ్చాను. మీ వాళ్ళింటికి ఎలాగూ వెళ్ళవు. ఈ విశాల ప్రపంచంలో నరరూప రాక్షసులు, విష కీటకాలు దండిగా సంచరిస్తున్నాయి. వంటరి ఆడదాన్ని- అందులో వయసు, అందము వున్న అమ్మాయిని అసలు బ్రతకనియ్యవు."
"నన్నేం భయపెట్టక్కరలేదు."
"భయపెట్టటం కాదు. ఉన్న వాస్తవం. నిన్ను వదిలేశాననుకో తర్వాత మీ అక్క నన్ను క్షమించదు. నీ పృధ్వీరాజ్ మాత్రం నీ సంగతి చూసుకున్నావు, నా నందితకి అన్యాయం చేశావు అని అపనిందవేస్తే..."
రాజు మాట పూర్తికాక ముందే నందితాదేవి ముఖం నల్లబడింది. "ఎంత పని జరిగింది? పృధ్వీరాజు చాలా మంచివాడు. అయినా పరాయి మగవాడివి-నీతో ఇంత దూరం రావటం ఎంత తప్పు! నా రాజు అపార్ధం చేసుకుంటే చీ... యిదంతా నువ్వే చేశావు! నువ్వుత్త మోసగాడివి..."
తల్లీ చేయెత్తి నమస్కరిస్తాను. మళ్ళీ నీళ్ళకుండ మూత తియ్యకు. కాస్త పరిస్థితి అర్ధం చేసుకుని మాట్లాడు. నీ పృధ్వీరాజ్ వీరుడు, శూరుడు, మహా మంచివాడు. నేనే చెడ్డవాడిని. ఓ.కే. మరి నిన్ను రక్షించుకోటానికి రాలేదే!"
` "నా కబురు అంది వుండదు."
"ఇదీ ఓ.కే. పృధ్వీరాజ్ సమయానికి రాలేదు. తర్వాత పరిస్థితి ఏమిటి? మరొకడి యిల్లాలు కావటం లేక చావటం అంతేకదా! పొరపాటు జరిగినా వొకందుకు మంచిదే అయింది. నాలుగు రోజులు ఆగి అయినా నీవు, పృధ్వీరాజ్ దంపతులవుతారు"
"ఆ అవుతాము అవుతాము"
"అవుతారు మరదలు పిల్లా!"
"ఏయ్! వూరికే వరసలు కలపకు. బులి బుచ్చికం మాటలు చెప్పి మళ్ళీ నన్ను మోసం చేయటానికి చూస్తున్నావు! నువ్వసలే మోసగాడివి జైలునుంచి తప్పించుకుని వచ్చావు!"
"నందితాదేవీ! మాటకు ముందు జైలు, మోసగాడివి అంటూ నన్ను రెచ్చగొట్టకు. నలుగురి నోళ్ళలో పడేసి మళ్ళీ జైలుకి పంపి పుణ్యం కట్టుకోకు. నా క్షేమం తర్వాత, ముందు నీ పృధ్వీరాజ్ అడ్రస్ యివ్వు. అతన్ని తీసుకువచ్చి అతనితో పంపి ఆ తర్వాతే నా సంగతి చూసుకుంటాను! అందాకా మాత్రం ఇతరుల ముందు భార్యగానే నటించు" రాజు గట్టిగా చెప్పాడు.