వంటగదిలో డైనింగ్ టేబుల్ దగ్గరవున్న చైర్ లాక్కుని కూర్చుంది తల రెండు చేతుల సందులో ఇరికించుకుని. కడుపులో ఆవేదనలాంటిది బయలుదేరింది. భగ్గున మంట. ఈ మంట చల్లారాలంటే ఏదయినా పొయ్యాలి.
నందితాదేవి లేచి డబ్బాలు, సీసాలు గాలించింది. పాల పొడి వుంది. బ్రూ వుంది. టీ పొడి వుంది. కేకులు, బ్రెడ్, బిస్కెట్స్ వున్నాయి. ఫ్రిజ్ లో ఇంకా అమృతపాణీలు, యాపిల్స్ వున్నాయి. "తనున్నది మంచు పర్వతం శిఖరాన కాదు. కారడవి మధ్యలోనూ కాదు. ఎడారిలో అంతకన్నా కాదు. వంటింట్లో" స్టవ్ వెలిగించి కాఫీ తయారు చేసుకుంది, ఒకే ఒక బ్రెడ్ ముక్క తిని కాఫీ తాగింది.
ఇప్పుడు ప్రాణం హాయిగా వుంది.
పొట్టకింత వేడి కాఫీ పడగానే ఉత్సాహం వచ్చింది.
వంటింట్లోంచి వున్న పెరటివేపు తలుపులు బద్దలుకొట్టి ఈ ఇంట్లోంచి బయటపడాలి. ఇంతకన్నా మరో మార్గం లేదు. కిటికీ ఊచలు ఐరన్ వి బలంగా ఉన్నాయి. గోడ పగలగొట్టే ప్రసక్తి ఎలాగూ లేదు.
తలుపులు పగలగొట్టడానికి కావలసిన ఆయుధం కోసం ఇల్లంతా గాలించటం మొదలుపెట్టింది.
గడ్డపలుగు, చిన్న గునపం, పోనీ దేని తాలూకూ అయినా పనికిరాని ఇనపరాడ్, ఊహూ. ఆఖరికి కత్తిపీట కూడాలేదు. జాస్మిన్ కూరగాయలు కోయటానికి చాకు ఉపయోగిస్తుంది. అది కూడా చాలా చిన్నది. ఎందుకూ పనికిరాదు. బరువయిన ఆయుధం కూడా లేదు- ఎత్తి తలుపుపై కొట్టడానికి.
నందితాదేవి గదిగదీ గాలించి మళ్ళీ వచ్చి వంటింట్లోనే కుర్చీ కతుక్కుపోయి కూర్చుంది. బుర్ర తిరుగుడు తప్ప బుర్ర పనిచేయడం ఎప్పుడో మానేసింది.
"ఎలా బైట పడటం?
ఈ ఇంట్లోంచి ఎలా బైట పడాలి?"
వంటగదిలో గాలిరాక ముచ్చెమటలు పోశాయి. బెడ్ రూమ్ లోకి వచ్చి ఫుల్ స్పీడ్ లో ఫ్యాన్ పెట్టి మంచానికి అడ్డంగా పడుకుంది. గతం కళ్ళముందు గిర్రున తిరిగింది. తను బయలుదేరిన వేళావిశేషం. క్షణం క్షణం మృత్యువు నీడల్లోకి పోతున్నది. ఒక ఆపదలోంచి బయట పడేసరికి మరో ఆపద.
నందితాదేవి ఆలోచిస్తూ అలా ఎంతసేపో వుండిపోయింది.
బూటు కాలితో ఈడ్చి పెట్టి తంతే తలుపు విరగటం, భుజబల ప్రయోగంతో నెట్టినా తలుపులు ఊడి కిందపడటం చాలా సినిమాలలో వుంటుంది. ఇంత గట్టి తలుపుల్ని ఈడ్చి తంతే తలుపులు కాదు విరిగేది- తన కాలు. పైగా బయటనుంచి లోపలికి తోయటం వేరు. లోపలినుంచి బయటకు తోస్తే మండిగం కూడా అడ్డు వుండి పని అసలు కాదు. ఇంత ఇంటిలో తలుపు విరగ్గొట్టే ఆయుధమే లేదు కదా! పైగా పెరటి తలుపులే కావచ్చు. అయినా వాటిని పూర్తిగా విరగ కొట్టకూడదు. కుక్కలు దూరవచ్చు. మనుషులు పసిగట్టవచ్చు. క్షణాలలో జాస్మిన్ మరణవార్త అందరికీ తెలిసిపోతుంది. తను గమ్యం చేరకముందే పోలీసులు రంగంలోకి దిగి పట్టుకుంటారు. ఇక్కడనుంచి ఆ ఊరికి వెళ్ళటానికి రోజున్నర ప్రయాణం. ఎడ్రస్ ఇచ్చింది కాబట్టి ఇల్లు పట్టుకోవటం అంత కష్టం కాకపోవచ్చు. ముందు ఈ ఇంట్లోంచి బయటపడడం ఎలా?
చటుక్కున మెరుపులాంటి ఆలోచన రాగా గబుక్కున మంచం మీంచి లేచింది.
తనకు కావలసింది వెతుకుతూ వుండగా మాటలు వినిపించాయి.
స్థాణువులా నుంచుండిపోయింది.
ఆ మాటలు బయట గుమ్మం దగ్గర.
"అమ్మగారు అర్జెంట్ గా రాత్రికి రాత్రి వూరికి వెళ్ళారేమో"
"అయితే అయి ఉండవచ్చు. నే కాదనటం లేదు కదా. నిన్న సాయంత్రం పాలకి లెక్కగట్టి డబ్బులిచ్చారు. అప్పుడేం చెప్పలేదు ఊరికి వెళతానని..."