"ఆ....తాపీగా నడుస్తూ వెళితే సినిమా టైము సరిపోతుంది" అంటూ మనోరమ లేచింది.
ఇరువురు పార్కులోంచి బయటపడి ఇంటిముఖం పట్టారు.
13
రాత్రి
ఒంటిగంట.
"నువ్వు అటు తిరిగి కూర్చో."
"ఎందుకు?"
"మళ్ళీ ఫెయింట్ అయి పడిపోకుండా వుండడానికి. నిన్న రాత్రి నువ్వలా పడిపోతే నేను హడలిచచ్చాను. శవాన్ని చూసి కూడా భయపడలేదు. నీకు ఏమయిందోనని గుండె గుబగుబలాడింది. నీకు తెలివి తెప్పించడానికి నానా పాట్లు పడ్డాను. తెలివి వచ్చిందాకా నా ప్రాణాలు సరిగా లేవంటే నమ్ము." కోదండరామయ్య చెప్పాడు.
"అది నిన్నటి సంగతి. వూహించని విధంగా శవం కనబడేసరికి తెలివితప్పి పడిపోయాను. ఇప్పుడు దానిలో వున్నది శవం అని తెలిసేసరికి భయం గీయం ఎగిరిపోయి దాని స్థానంలో ధైర్యం వచ్చింది. ఎప్పుడెప్పుడు ఆ పీడాకారాన్ని వదిలించుకుందామా అని తప్ప మనసులో మరో ఆలోచన లేదు" వెంకుమాంబ చెప్పింది.
"అయితే ఆ పెట్టె ఇలా అందుకో"
పెట్టె తీసుకువస్తూ వెంకుమాంబ అంది.
"అనవసరంగా ఇంత ఖరీదుపోసి తోలుపెట్టె తెచ్చారు పారేసేదానికి పనికిమాలిన పెట్టె తెస్తే సరిపోయేది"
"ఆమాత్రం ఆలోచన నాకు రాకకాదు. మనం ఎర్రపెట్టె చూసి మోజుపడి తెచ్చాము చూడు-అలా ఈ కొత్తపెట్టెని చూసి మోజుపడి ఎవడో తీసి దాస్తాడు. ఆ తర్వాత మనలాగానే ఆశతో తెరిచిచూసి అఘోరిస్తాడు" కోదండరామయ్య అర్ధం అయ్యేలా చెప్పాడు.
"నిజమే నే అంతగా ఆలోచించలేదు. ముందు ఈ శని వదలడం ముఖ్యం" అన్నది వెంకుమాంబ.
మధ్యాహ్నం మనోరమ పంకజం పడుకుంటారు ఆ టైములో కోదండరామయ్య బజారుకెళ్ళి అందమైన పెట్టె కొనుక్కొచ్చాడు, "ఎర్రపెట్టెని పారేస్తే అది బయటపడి గుర్తిస్తే ప్రమాదం అందువలన ఇంట్లోనే వుంచుకుని పెట్టెకొని శవం, తలకాయ చేతులని తీసి కొనుక్కుని వచ్చిన పెట్టెలో పెట్టి ఆ పెట్టెని దూరంగా పారేసి వస్తే అది తీసుకు వెళ్ళిన దురదృష్టవంతుడు మళ్ళీ దానిని వదిలించుకోవడానికి నానా పాట్లు పడ్తాడు. మనకి శని వదలి వాడికి పడుతుంది" అని కోదండరామయ్య ఆలోచన చేశాడు. ఇప్పుడు ఆచరణలో పెడుతున్నాడు.
అందమైన గట్టి మందపాటి తోలుపెట్టెని తెచ్చి వెంకుమాంబ భర్త పక్కనే పెట్టింది.
కోదండరామయ్య ఎర్రపెట్టెని తెరిచాడు.
ఈ తఫా శవం తాలూకు తల, చేతులేగాక అవయవాల మూట, బెదిరింపు లేఖ కోదండరామయ్య చూడడం జరిగింది. మూట విప్పి చూశాడు. లేఖ భయభ్రాంతులను కలగజేసింది. మూటలోని అవయవాలు చూసి పేగులన్నీ కదిలిపోయేలా కడుపులో తిప్పడం జరిగింది.
వాటిని చూసి "శివ శివా" అని కళ్ళు, చెవులు ముఉసుకుంది వెంకుమాంబ.
కోదండరామయ్య చకచక పెట్టెలో ఆమె తలని, చేతులని అవయవాల మూటని సర్ది పైన లేఖ పెట్టాడు. పెట్టె మూత వేశాడు. పెట్టెకి వున్న లాక్ ని వేసి కీ ఎడాపెడా తిప్పాడు. షాపు వాడు పెట్టెతో పాటు కీస్ ఇస్తూ చెప్పాడు. "ఈ పెట్టె కొత్తగా మార్కెట్ లోకి వచ్చింది. ఒక తాళానికి రెండు కీస్ వుంటాయి. మొదట నెంబర్ వన్ కీతో లాక్ చేసి వెంటనే నెంబర్ టూ కీతో మళ్ళీ లాక్ చేయాలి. అలాకాక ఓకే తాళానికి ఓకే కీ చాలని ఒక్క కీతో ఎడాపెడా తిప్పితే తాళం పాడవుతుంది. పెట్టెని పగల కొట్టాల్సిందేగాని తాళం రాదూ ఇది కొత్తరకం లాక్ సిష్టం" అంటూ చెప్పాడు.