Previous Page Next Page 
సంధియుగంలో స్త్రీ పేజి 25

    ఏది ఏమైనా తాను నవ్వుతూ, చుట్టూ వాళ్ళను నవ్విస్తూ బ్రతికే వ్యక్తి ధన్యజీవి అనక తప్పదు.  
                          "అమ్మలారా, ఏడవకండి!"
    ఆఫీసు సూపర్నెంటు గాభరాగా నా గదిలోకి పరుగులాంటి నడకతో వచ్చాడు. "మేడం, మేడం:" మాటలు ఆపైన గొంతు పెగలటం లేదు.
    "ఏమిటి? ఏమైంది?" ఆశ్చర్యపోతూ అడిగాను. "సుశీల ..... అదే టైపిస్టు--మూర్చపోయింది నేను ఏమి అనలేదు." ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంటూ అన్నాడు నేను లేచి ఆఫీసులోకి వచ్చాను టైపిస్టు సీటు చుట్టూ ఆఫీసు వాళ్ళున్నారు నన్ను చూసి తప్పుకున్నారు సూపర్నెంటు మీద జాలి చూపించసాగారు.
    నేను భుజం మీద చెయ్యి వేసి తట్టాను ఆ పిల్ల కొంచెం కదిలింది హిస్టీరియా పేషంటులా వెక్కి వెక్కి ఏడుస్తూ ఏదో అంటున్నది పక్క డాక్టర్ కు కబురు పంపించాను ఆ అమ్మాయి సరిగా పనిచెయ్యదు మాటకు ముందు ఏడుస్తుందట సూపర్నెంటుకు ఆ అమ్మాయితో పని తీసుకోవడం ఒక సమస్య అయిపోయింది.  
    రెండు రోజుల క్రితం టైపు చెయ్యాల్సిన అర్జెంటు కాగితాలు అలాగేపడి ఉన్నాయట సూపర్నెంటు కోప్పడ్డాడు ఇంకేముంది -- ఏడుపు మొదలు పెట్టింది మూర్చపోయింది డాక్టర్ వచ్చాడు. "ఏం లేదు అంతా వేషం మొన్నను ఆ బ్యాంకులో కూడా ఇలాగే జరిగింది. మేనేజరు ఒక ఆడపిల్లను కోప్పడ్డాడు పని చెయ్యకపోతే. ఆ పిల్ల ఏడ్చి ఏడ్చి మూర్చపోయింది నాకోసం కబురు పెట్టారు ఆ మేనేజరు పాపం చాలా భయపడిపోయాడు నేను వీపు మీద గట్టిగా చరిచాను దిగ్గునలేచి కూర్చుంది "అమ్మా మీరు ఆఫీసరు ఏమి అనుకోకండి మీ ఆడవారికి ఉద్యోగాలు కావాలి మగవారితో సమానంగా హక్కులు కావాలి.
    ఆఫీసులో మగవారితో సమానంగా జీతం తీసుకుంటారు పని మాత్రం చెయ్యరు కోప్పడితే ఏడుస్తారు ఆడపిల్ల ఏడిస్తే సాధారణంగా మగవారు కరిగిపోతారు" కన్నీటితో ఇలా ఎక్స్ ప్లాయిట్ చేస్తారు" అంటూ ఆ డాక్టరు లెక్చర్ ఇస్తుంటే నాకు తలగిర్రున తిరిగిపోయింది.
    "అందరూ అలా ఉండరు" అన్నాను.
    "కాని చాలా మంది అలాగే ఉంటారు" అన్నాడు.
    ఆ తరువాత నేను గమనించడం మొదలు పెట్టాను నిజమే, ఆడపిల్లలు ఉద్యోగాలు చేస్తూ కూడా మాటకు ముందు ఏడుస్తారు. "కన్నీళ్ళు ఆడదాని ఆయుధం" అంటారు ఈ విధంగా బయట ఉద్యోగాలు చేస్తూ చీటికీమాటికీ ఏడ్చే ఆడపిల్లలు స్త్రీ జాతినే తలవంచేలా చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే బాహ్యప్రపంచంలో అడుగుపెట్టి అన్ని రంగాల్లోనూ పురుషులతో పోటీ పడుతున్న స్త్రీలంటే చాలామంది పురుషులకు అక్కసుగానే ఉంటున్నది అసూయ అనేది ఆడవాళ్ళకే కాదు మగవారికి కూడా ఉంటుంది.   
    ఒక ఆడపిల్ల ఏడిస్తే దాన్ని పెద్ద కథగా చేసి, ఆడవాళ్ళు ఉద్యోగాలు చెయ్యడం శుద్ధ దండగ అన్నట్లు మాట్లాడుతారు ఒక ఆఫీసరు (మగ) ఎంత దుర్మార్గుడైనా పెద్దగా ఎవరూ పట్టించుకోరు ఒక లేడీ ఆఫీసరు కొంచెం కటువుగా ఉన్నా, ఖచ్చితంగా ఉన్నా ఆమెను బ్రహ్మరాక్షసిగా చిత్రించి, చిలవలు పలవలతో మాట్లాడుతారు.
    ఆమె గురించి అనేక పుకార్లు లేవదీస్తారు అంతవరకూ ఎందుకు? రచయితల సభలు జరిగాయే అనుకోండి ఇద్దరు రచయితలు పరస్పర విరుద్ధ భావాలు వ్యక్త పరిచినప్పుడు "అభిప్రాయభేదాలు" అంటారు అదే ఇద్దరు రచయిత్రులు భిన్నాభిప్రాయాలను వెలిబుచ్చారే అనుకోండి "స్టేజీ మీద రచయిత్రులు పోట్లాడుకున్నారు" అంటూ దానికి రంగు పూసి ప్రచారం చేస్తారు.   
    బస్సుల్లో స్త్రీలకు కేటాయించిన సీట్లలో కూర్చుని లేవమంటే కొందరు పురుషులు కామెంట్సు పాస్ చేస్తూ "ఆడవాళ్ళ సమానహక్కులు గురించి" ఎద్దేవా చేస్తారు ఇదంతా ఎందుకు జరుగుతుంది? మరి స్త్రీలను మాత్రమే అసూయాపరులు అని ఎందుకు అంటారు? పుకార్లు లేవదీస్తారని ఎందుకు అంటారు?
    స్త్రీలలో ఏ చిన్న లోపానికయినా గోరంతల్ని కొండంతలుగా చిత్రించడం జరుగుతున్నది స్త్రీలు మాటకు ముందు ఏడవడం మానెయ్యాలి. పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కొనాలి.     
    భార్య భర్త దగ్గర మాటకు ముందు ఏడవడం, తల్లి కొడుకు ముందు ఏడవడం స్త్రీలు ఎప్పటికి మానతారో వూహించలేము.
    స్త్రీల కన్నీటికి పురుషులే కాదు, స్త్రీలు కూడా కరిగిపోతారు ఉదాహరణకు సినిమాలను తీసుకోండి ఒక సినిమాలోని హీరోయిన్ ఎన్నో కష్టాలుపడి, టాంకుల కొద్ది కన్నీరు కారిస్తేనే ఆ సినిమా ఆడవాళ్ళకు పడుతుందట.
    ఆడవాళ్ళకు పట్టిన సినిమాకే కనకవర్షం  కురుస్తుంది. అందుకే సినిమాలలో స్త్రీల చేత భోరు భోరున ఏడిపిస్తారు కష్టాలను ఎదుర్కొనే వెన్నెముకగల స్త్రీని హీరోయిన్ గా చూపించే ధైర్యం ప్రొడ్యూసర్లకు ఉండదు అలాంటి స్త్రీని స్త్రీలే ఇష్టపడరట స్త్రీలు చూడని సినిమాకు మరి డబ్బు రాదు.
    ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా తీసి (ప్రీవ్యూ) ఫామిలీస్ కు చూపిస్తాడు సినిమా పూర్తి అయాక లోపల నుంచి వస్తున్న స్త్రీల ముఖాల్లోకి ఆత్రుతగా చూస్తాడు ఆడవాళ్లు నవ్వుతూ వచ్చారా, పాపం ఆ ప్రొడ్యూసర్ ఏడ్చేస్తాడు ఆడవాళ్ళు ఉబ్బిన కళ్ళతో, ఎర్రబడిన ముక్కులతో కనిపిస్తే ఆ ప్రొడ్యూసర్ ఆనందానికి అంతు ఉండదు.                                                  
    స్త్రీలలోని ఈ ఏడ్చే బలాహీనతపోనంత  వరకూ మనం నిజమయిన ప్రగతిని సాధించలేము అందుకే "అమ్మలారా, ఏడవకండి" అంటూ ప్రార్థిస్తున్నాను.
                                      సేవా శ్రమదానం   
    గేటు ముందు గూర్కా ఉన్నాడు గేటులో నుంచి దూరంగా ఆ పెద్ద భవనం కన్పిస్తూ ఉంటుంది గేటు నుంచి భవనం వరకూ ఇరువైపులా పూల మొక్కలూ, కూరగాయల, మొక్కలూ ఉన్నాయ్. కొందరు ఆడపిల్లలు తోటపని చేస్తున్నారు. "అమ్మగారు ఉన్నారా?" అడిగాను గూర్కాను.
    ఉన్నారని తల ఊపి గేటు తెరిచాడు సూపరింటెండెంటును అక్కడ అందరూ 'అమ్మా' అని పిలుస్తారు లోపల ప్రవేశిస్తుండగానే గోడమీద నల్లటి బోర్డు -- దాని మీద కొన్ని అంకెలు కన్పించాయి ఆ సదనంలో ఎంత మందిని చేర్చుకునే అవకాశం ఉన్నదీ, ఆ రోజు ఎంతమంది ఉన్నదీ, అందులో పెద్దవాళ్లు ఎంతమందీ, పిల్లలు ఎంతమందీ - వగైరా వివరాలు రాసి ఉన్నది.
    సూపరింటెండెంటు చిరునవ్వుతో నన్ను ఆహ్వానించింది బిల్డింగ్ అంతా తిప్పి చూపించింది కొంతమంది కుట్లక్లాసులో ఉన్నారు కొందరు మెట్రిక్ క్లాసులో ఉన్నారు కొందరు గదుల్లోనే ఉన్నారు వాళ్ళు కొత్తగా వచ్చారట ముఖాల్లో స్పష్టంగా కన్పిస్తోంది వాళ్ళకు ఏ పని ఇవ్వాలో ఇంకా నిర్ణయించలేదు.
    ఒక గదిలో రెండు ఉయ్యాలలు ఉన్నాయి ఇద్దరు పసిబిడ్డలు (రెండు నెలల లోపలవాళ్లు) ఉన్నారు ఆ రెండు ఉయ్యాలలు దగ్గిర ఇద్దరు ఆడపిల్లలు కూర్చుని ఉన్నారు మమ్మల్ని చూసి ఇద్దరూ లేచి నిలబడ్డారు ఇద్దరి వయసు పదిహేడు ఏళ్ళ కంటే ఎక్కువ ఉండదు అవివాహిత తల్లులు అని చెప్పింది సూపరింటెండెంటు ఆ మాట చెబుతున్నప్పుడే వాళ్ళ చూపులు నా కేసి ఉన్నాయి.   
    ఒక పిల్లవాడు కెవ్వుమన్నారు ఒక అమ్మాయి ఉయ్యాల ఊపసాగింది ఆ అమ్మాయి చేతివేళ్లు వణుకుతున్నాయి ఆమె కళ్ళు ఒక క్షణం పిల్లవాడివైపు తిరిగితే మరుక్షణం శూన్యంలోకి తిరుగుతున్నాయి. "ఇలా ఎందుకు జరిగింది? ఇదేమిటి? ఈ పిల్లవాడేమిటి?" అన్న అయోమయం వారి ప్రతి కదలికలోనూ కన్పిస్తున్నది.  
    అందులో ఒక పిల్ల పేరు తార. తార పది నెలల క్రితం వరకూ చేతిలో పుస్తకాలు పట్టుకొని, కలల్లో తేలిపోతూ స్కూలుకు వెళ్ళేది త్రోవలో ఒక కుర్రవాడితో పరిచయం అయింది ఎవరూ చూడకుండా ఏ చెట్టుచాటునో కూర్చుని, ఎన్నో కథలు చెప్పుకొనే వారు సినిమాల గురించి మాట్లాడుకొనేవారు.
    పెళ్ళి చేసుకుందాం అనుకున్నారు ఎంచెక్కా సినిమాలోని హీరోహీరోయిన్లలాగా వాళ్ళ జీవితం గడుస్తుందనుకున్నారు ఒకరోజు ఆ కుర్రవాడు ఆ పిల్లను ఇంటికి తీసుకెళ్ళాడు చాలాసేపు కలలు చూశారు కబుర్లలో పడ్డారు.
    చివరకు జరగకూడనిదే జరిగింది అదో వింత ఆటలా భావించిన ఆ పిల్ల, ఇంత ఘోరం అయిన ఫలితం తనకోసం ఎదురు చూస్తున్నదని ఊహించలేకపోయింది గీత కథ కూడా దాదాపు ఇలాంటిదే పెళ్లి చేసుకుంటామని ఆశలు చూపించిన వాళ్లు ముఖాలు తిప్పుకున్నారు చివరికి ఇక్కడికి చేరారు ఎలా చేరారనేది అనవసరం.   
    సమాజానికి దూరంగా ఈ నాలుగు గోడల మధ్య ఉన్నవారి దగ్గరకు ఎవరైనా వస్తే వాళ్లు తమలోకి తామే ముడుచుకుపోతారు వాళ్ళ కాళ్ళు నల్లగా మాసిపోయిన గోడల వరకే నడవగలవు వాళ్ళ చూపులు ఆ గోడలకు కొట్టుకొని మళ్ళీ వాళ్ళ దగ్గరకే వస్తాయి.    
    ఈ పసివాళ్ళ మనస్సులోని గాయాలు చిన్నగా మానిపోతాయి మళ్ళీ హృదయాల్లో మధువు చేరుతుంది ఆ మధువును ఎవరిదోసిళ్ళలో పోయాలా అనే ఆవేదన ప్రారంభం అవుతుంది వారి కళ్ళలో నీరు ఇంకిపోతుంది మళ్ళీ కొత్త కలలు చోటు చేసుకొంటాయి. వారికి జీవితం కావాలి ఎలా లభిస్తుంది."

 Previous Page Next Page