Previous Page Next Page 
ఇంటింటి కధ పేజి 24


    నారాయణమూర్తిగారు కూతురికి ఓ గంట బోధపరిచారు. అల్లుడికి బాగా కోపం వచ్చిందని, నీ ప్రవర్తన మార్చుకోకపోతే అతని ప్రాణం విసిగి యింట్లోంచి పోతాడని ముందు కాస్త కోపంగా, తరువాత బతిమాలుతూ నచ్చ చెప్పాడు.
    "పొతే పోనీ డాడీ, గతిలేని వాడికే అంత పౌరుషం వుంటే నాకెంత వుండాలి." లత పొగరుగా అంది. పాతికేళ్ళు బతికిన దాన్ని యికముందు బతకలేనేమిటి. ఆయనగారికంత అభిమానం, పౌరుషం అయితే అసలు ఎందుకు చేసుకున్నాడు పెళ్ళి. డబ్బు కోసం చేసికోగా లేంది అంటే తప్పేముంది.'
    "లత, యీ లోకంలో కావాల్సింది డబ్బు ఒకటే కాదని నీవెప్పటికి గ్రహిస్తావు," కఠినంగా అన్నారాయన. "మనకున్న యీ లక్షలన్నీ పోస్తామన్నా నీ కాళ్ళు రాలేదే, యిప్పటికీ గ్రహించవెం డబ్బొక్కటే జీవితం కాదని....నీకెన్ని సార్లు చెప్పాను. నీ జీవితానికో తోడు, నీడ వుండాలి. రేపు నాకేదన్నా అయితే నీకెవరు దిక్కు . మంచాన పడివుంటే నీవు ఎంతమంది నౌకర్లు, డాక్టర్లు ని పెట్టుకున్నా నీ వళ్ళయి విశ్వాసంగా వుంటారా, నీ వంటరి జీవితానికో లక్ష్యం కావాలి. భర్త , పిల్లలు వుంటే నీ జీవితానికో గమ్యం వుంటుంది. నా అనేవాళ్ళు లేని వంటరి బతుకు నీదవకూడదని తాపత్రయపడి యీ పెళ్ళి చేశాను. లతా, నీ కడుపునా ఓ యిద్దరు బిడ్డలు పుడితే యీ ఆస్థికి , ఐశ్వర్యానికి ఓ అర్ధం వుంటుంది. కనీసం నీ బిడ్డలు పెరిగి పెద్దవాళ్ళయ్యే వరకన్నా నీ భర్త నీడన నీవుండాలి. ఈలోకం భర్త లేని ఆడదాన్ని గౌరవించదు. ఆ భర్తని నీవే అగౌరవపరిస్తే అది నీకే అవమానం నీవు అతన్ని హీనంగా చూస్తుంటే , కింద పరుస్తుంటే.....అది అతని కంటే నీకే అవమానం. నౌకర్లు, చాకర్లు ఎలా గుసగుసలాడుకుంటారో తెలుసా....యింటా బయటా నీ గురించి ఎంత చెప్పుకుంటారో తెలుసా.... తెగేవరకు తాడు లాగితే తరువాత ఎన్ని ముళ్ళు వేసినా అతుకు అతుకే .... అతని ప్రాణం విసిగి నీ డబ్బుకి ఓ నమస్కారం అని వెళ్ళిపోతే ఆ అవమానం ఎదుర్కొవలసింది నీవు..... అప్పుడేం చేస్తావు ...మళ్ళీ యింకోడ్ని పెళ్ళాడతావా? ఎవడు చేసుకున్నా డబ్బు కోసమే చేసుకుంటాడు. అలాంటిది అతనితో ప్రతిదానికి తగవు లాడితే నష్టపోయేది నీవే. కొన్ని చూసి చూడనట్లూరుకోవాలి. డబ్బు కట్టుకుని పోం..."
    "ఆ అడిగినప్పుడల్లా డబ్బిస్తే యింక అసలు లెక్క చేస్తారా..... తేరగా వస్తే యింకా జల్సాగా తిరుగుతారు....ఎన్నాళ్ళలా యిస్తుంటాం. శుభ్రంగా తింటున్నారు, సూట్లూ, బూట్లూ వేసుకుని, కారుల్లో తిరుగుతూ, ఎయిర్ కండిషన్డ్ గదుల్లో వుంటున్నాడు. యింకేం కావాలి ...." తననుభవించలేనిది అతను అనుభవించకూడదన్న ఉక్రోషంతో అంది.
    'అతనికి మాత్రం తన వాళ్ళ మీద అపేక్ష వుండదా , వాళ్ళు కొడుకు నించి ఏదన్నా ఆశిస్తే తప్పేముంది."
    "కొడుకుని నిక్షేపంగా సంపాదించి పంపుకోమనండి. మన డబ్బెందుకు కీయాలి" మొండిగా అంది. "యీ కొడుకు బయటేక్కడన్నా ఉద్యోగం చేస్తే వచ్చే నాలుగైదు వందలలో యింటి కిచ్చేవాడా, తేరగా వస్తే అందరికి కావాలి. మీకు తెలీదు డాడీ, డబ్బిస్తూ వుంటే యింక అసలు నన్ను కేర్ చెయ్యరాయన..... యింకా యిల్లు పట్టకుండా తిరుగుతారు. చేతిలో డబ్బు లేదు గనక యింటికి వస్తున్నారు. లేకపోతే నా ఖర్మానికి నన్నొదిలి షికార్లు కొడతారు" కసిగా అంది.
    "లతా నీకు తెలుసు. అతను జల్సాలు చేయడం లేదని. యింట్లో వుండి నీ ఎత్తి పొడుపు మాటలు వినలేక ఆఫీసులో కూర్చుంటున్నాడని నాకు తెలుసు. ;లతా, నీవంటే నా కూతురువి, నా రక్తానివి, పెంచిన ప్రేమతో నీవేం హటం చేసినా నేను సహించినట్లు భర్తన్నవాడు సహించడు. ఇది మీ భార్యభర్తలిద్దరి విషయం, నేను కల్పించుకోకూడదు. అయినా నీ మొండితనం, మూర్ఖత్వం, తెలుసు కనక హెచ్చరిస్తున్నాను. నీ పంతం తగ్గించుకొని అతనితో సౌమ్యంగా వుంటే నీకే మంచిది. అతను డబ్బడిగినప్పుడు యియ్యి. అతనేమీ తగలెయ్యడానికి అడగలేదు" చెల్లెల పెళ్ళి కడిగాడు. ఆ డబ్బు పెళ్ళిలో అతనికిస్తానన్నదే. అదివ్వననడానికి నీకేం అధికారం లేదు" అయన కాస్త కటువుగా అన్నారు.
    తండ్రి అలా కోపంగా మాట్లాడేసరికి ఎప్పుడూ అంత దురుసుగా అయన మాట్లాడడం వినని లత మొహం గంటు పెట్టుకుంది. అభిమానంతో ఆమె మొహం ఎర్రబడి పోయింది. కళ్ళలో నీళ్ళు తిరిగిపోయింది. "డాడీ నీవు నన్నే అంటావు. నేనిలా మంచంలో పడి ఏడుస్తుంటాను. అయన చక్కగా తిరుగుతుంటారు. నాతో మాట్లాడనే మాట్లాడరు. నా మొహం చూడగానే ఆయనకి చీదరింపు చిరాకు వస్తాయి. పట్టుమని నా దగ్గర పది నిమిషాలుండాలంటే ముళ్ళ మీద వున్నట్టుంటారు. నీ డబ్బు కోసం చేసుకున్నాను లేకపోతే నీలాంటి అవిటిదాన్ని చేసుకునే ఖర్మ నాకేమిటని మొహం మీదే అంటారు. నేనంటే ప్రేమ లేదు. నా శరీరమే కాదట నా మనసు వక్రంట. అలాంటివన్నీ వింటూ ఆయన్ని నేను ప్రేమించాలా, గౌరవించాలా..... నీకేం తెలుసు డాడీ నా మనసెలా కాలిపోతుందో భగవంతుడా నేనేం పాపం చేశానని నాకింతా శిక్ష వేశావు. నేను చచ్చిపోతాను డాడీ....అప్పుడు అంతా హాయిగా వుండొచ్చు.....' ఆవేశంతో చిన్నపిల్లలా ఏడుస్తూ జుట్టు పీక్కోడం , ఆరంభించింది.
    వెక్కిళ్ళు పెడ్తూ ఏడుస్తున్న కూతురిని చూసి కరిగిపోయాడాయన ఒక్కసారిగా.....ఏ కూతురి కోసం అష్టకష్టాలు పడ్డారో, ఎవరి కోసం అన్ని సుఖాలు త్యాగాలు చేసి కళ్ళల్లో వత్తులు వేసుకు పెంచారో ఏ కూతురి సుఖం కోసం రాత్రింబవళ్ళు కష్టపడి లక్షలు దాచాడో.....ఆ కూతురు నిస్సహాయిగా బేలగా చచ్చిపోతానని ఏడుస్తుంటే కరిగిపోయాడు. "లతా , వద్దమ్మా అలా అనకు ఏడవకు తల్లీ ఏడవకు.... ప్రసాద్ కి నేను చెపుతాను....' అంటూ ఆమె తలని గుండెల కదుముకుని ఒదార్చసాగాడాయన.
    తండ్రి ఓదార్పుతో ఆవేశం తగ్గి ఉపశమనం పొందాక లత తలెత్తి "డాడీ యీ పెళ్ళి కానపుడే హాయిగా వున్నాను. ఈ పెళ్ళి చేసి నన్ననవసరంగా నరకంలో కి తోశావు డాడీ.....మనశ్శాంతి లేకుండా చేశావు "
    "లేదు తల్లీ లేదు" నీ సుఖం కోసం , నీ కడుపున నాలుగు కాయలు కాస్తే నిన్ను తల్లిగా చూసి.... నీతో తీరని ముద్దు ముచ్చట్లు నీ పిల్లలతో తీర్చుకోవాలన్న కోరికతో చేశాను. ... లతా, ప్రసాద్ చెడ్డవాడు కాడు. అతన్ని మార్చుకోడం నీ చేతిలో పని, ప్రేమాభిమానాలకి లొంగని మనిషి ఎవడూ వుండడమ్మా ....నా మాట విను ....ఎందుకు చెప్పానో అర్ధం చేసుకో. ఎంతో అనునయించి , బుజ్జగిందారు ." ముందు పెళ్ళి కుదిరితే కదా డబ్బు, డబ్బు తీసికేడితే ఖర్చు పెట్టేస్తారు. సంబంధం కుదిరాక యివ్వచ్చు అంతా కాకపోయినా కొంతయినా ...' అంది ఆఖరికి. ఆ మాత్రానికే సంబర పడ్డాయన. "అలాగే ఆమాటే చెపుతాను అతనితో" అన్నారాయన.
    ఆ మర్నాడు ఉదయం టిఫిను తింటుండగా "లతతో చెప్పానోయ్ నిన్న....అలాగే అంది. ముందు సంబంధాలు చూడమను, కుదరగానే బ్యాంకు లోంచి డబ్బు తీయడం ఎంతసేపు" అన్నారు నారాయణమూర్తిగారు. ప్రసాద్ నమ్మలేనట్టు చూశాడు. "లత! లత అంత సుళువుగా వప్పుకుం'దంటే నమ్మశక్యం కాలేదు" అది అర్ధం చేసుకున్నట్టు అయన, 'చూడు బాబూ, లతని నీవర్ధం చేసుకోడానికి ప్రయత్నించు. పైకి కనిపించేటంత కఠినరాలు కాదు, పరిస్థితులు దాన్నలామార్చాయి. మంచిగా విషాన్ని తాగించవచ్చు అన్న సామెత మర్చిపోకు" అన్నారు.

 Previous Page Next Page