Previous Page Next Page 
దాశరథి రంగాచార్య రచనలు -6 పేజి 24


    బోగంకొంపలో చెడిపోయిన లేఖ భగవత్సాన్నిధ్యంలో ఉండాలి. దేవుడూ దేవాలయం పెరిగి పెద్దవి అవుతాయి. వాటితోపాటు లేఖకూడా పెరిగి ఔన్నత్యాన్ని అందుకుంటుంది. తండ్రి ఈ మోసానికి తలపెట్టింది ఎవరికోసం? తనకోసం కాదూమరి. తానే లేకుంటే రేయింబవళ్ళు కష్టించి కాలూ పిడికెడు గింజల్తో సంతృప్తిచెందేవాడే! ఇప్పుడలాకాదు. తనకోసం అతడు మోసంమీద సవారీచేస్తున్నాడు. అది దేవుని పెరటిపులి. ఆ పులి పడద్రోసి మింగేయాలేకాని అతడు ఇంక ఆ పులిని దిగబోడు.
    విచిత్రఅయిన గారడీ గుడికి పునాదిరాయి. రాత్రిఅయి చివరి ప్రేక్షకబృందం ఆ స్థలం వదిలింతర్వాత కాలూ లేఖతో ఒంటరిగా ప్రక్కనున్నవానికి సహితం వినపడనంత మెల్లగా మాట్లాడాడు. ప్రక్కనున్న మర్రిచెట్టుకు చెవులుంటాయని అతనికి భయం.
    "ఈ గారడీఅంతా ఎలా జరిగిందని నన్ను అడిగావుకావేం?"
    "ఏ గారడీ?"
    "శివునిరాక"
    ఒకరిముఖం ఇంకొకరికి కనపడనంతగా చీకటి ఉంది. ఆమె అడుగుతుందేమో అని క్షణం ఆగాడు. ఆమెనోటివెంట మాటరాలేదు.
    "నేను తెచ్చిన శనగలు చూచావుకదూ! అవే రెండుసేర్ల శనగలు. ఆ శనగలే ఈ గారడీ అంతటికీ మూలకారణం. మొట్టమొదలు ఒక శివలింగంలాంటి రాతిని సంపాదించాను. దాన్ని కాస్త నున్నగా ఉండేందుకు ఉలితోచెక్కి తేలిగ్గా ఉండేందుకు లోపల గుల్లగా చేశాను. లింగం పురాతనమైందిగా కనిపించాలని సన్నని శగమీదకాల్చాను. ఆ తర్వాత ఒక మంచిస్థలంకోసం వెదికాను. ఈ స్థలం దొరికింది. ఇక్కడ ఒకలోతైన సన్నని రంధ్రంచేశాను. రెండుసేర్లపైనపట్టే ఒక కాళీ గిన్నె తీసుకొని అందులో శనగలుపోశాను. శనగలు గిన్నెలో మూడువంతులుదాకా వచ్చాయి. రాతిని ఆ శనగలమీద పెట్టాను. అప్పుడు ఆ రాతిచివరకు నేల పైభాగానికీ ఒక అంగుళం స్థలం ఉండిపోయింది. దాన్ని గుల్లగా ఉన్న మట్టితోనింపి చదునుచేశాను."
    రహస్యం బయటపెడుతున్న కాలూ కాస్త వెనకాముందులాడాడు. ఆమె పెద్ద ఆశ్చర్యం ఏమిలేకుండా మామూలు ధోరణితోనే "అయితే" అన్నది. కాలూ చెప్పుకొని పోతున్నాడు.
    "ఇవాళ ఉదయం అసలు కార్యక్రమం ప్రారంభం అయింది. తడవకు ఒక పురిశిలెడు చూపున గుల్లమట్టిమీద నీరుచల్లుతూండడం నీవుచూశావుగా! ఆ నీటివల్ల శనగలు ఉబ్బి మొక్కలు వచ్చాయి. ఉబ్బుతున్న ఆ శనగలు క్రమక్రమంగా శివలింగాన్ని పైకినెట్టాయి. అలా పెరుగుతూ పెరుగుతూ శివుడు ఆవిర్భవించాడు. జనం సంతోషంతో పిచ్చివాళ్ళు అయిపోయారు. అంతా టైమ్ ప్రకారం జరగడంలో ఉంది కిటుకంతా. అనేకసార్లు ప్రయోగాలు చేసి చూశాను. ఎలా ఉంది ఉపాయం? చతురమైన ఉపాయంకాదూ?"
    చీకటితెర వారిద్దరినీ విడగొట్టింది. అయినా లేఖ ముఖకవళికల్ను చూడ్డానికి కాలూ ప్రయత్నించాడు.
    "తెలివైనపనే" ఆమె యాంత్రికంగా అన్నది.
    గతంలో ఏనాడో జరిగిన ఒక సంఘటన, స్మృతిపథంలో శాశ్వతంగా నిలిచిపోయి లేఖ గుండెమీద మ్రోగుతున్నట్లు కనిపెట్టిన కాలూకు ఆమెసహజధ్వని వినిపించలేదు.
    "ఏయ్ కమ్మరిపిల్లా! మీ బాబుతో గ్రాహకుల్ను మోసగించవద్దని చెప్పు. వాడు మా నాలుగు బక్కెట్లల్లో ఒకదాన్ని బాగుజేశాడు. అది అప్పుడే చిల్లిపడింది."
    నేడు ఆమెధ్వనిలో చిన్నతనపు ఆ అమాయికతలేదు. ఆమె ధ్వనిలో ఏదో అర్ధం ఇమిడి ఉన్నట్లు ఉంది.
    ముఖాన్నిబట్టి ఆమె ఆలోచనలను గ్రహించే కాలూ నేడు ఆమె మేధస్సులోని ఆలోచనలను గురించి అట్టేపట్టించుకోనేలేదు. తమజీవితవ్యసనాలనే మార్చివేసే అతిసాహసవంతమైన మహాసంఘటన్ను ఆమె ఎలాస్వీకరిస్తుందో చూడాలని వీక్షించాడు. నిరాశచెందాడు. లేఖ అతని కిటుకు మూల్యాన్ని గ్రహించలేదు. జరిగిన గారడీని ఆమె కాదనేస్తుందా? ఈ ఉపాయం అతని స్వంత ఆలోచనేమీకాదు. జేల్లో బి- 10 చెప్పింది. శనగలు ఎన్ని ఉండాలి? అవి ఉబ్బడానికి ఎంతకాలం పడుతుంది? అన్నీ అతడుచెప్పినవే. ఏ కొద్దిపొరపాటైనా అంచనాలన్నీ తలక్రిందులయ్యేవి. తనకు మహద్విజయం లభించిన ఈ సమయంలో కాలూ బి-10 కు కృతజ్ఞతలు తెల్పుకున్నాడు. తగిన ఉపకారం చేయాలని నిశ్చయించుకున్నాడు.
    "మనం మట్టిబిడ్డలం. మనం అంటే పెద్దవారికి భయం. అందుకే మనం అంటే వారికి అసహ్యం. వారు మనను పొట్టలో పొడుస్తారు. మనం వారిని వీపుమీద గుద్దాలి."
    సుపరిచితాలైన ఈ పదాలను ఆవర్తనం చేసుకుంటూ కాలూ తనలో తానే నవ్వుకున్నాడు. ఇక తాను మట్టిబిడ్డకాడు. సమాజానికి స్తంభప్రాయుడు కాబోతున్నాడు. ఆ స్తంభాన్ని సృష్టించింది రెండుసేర్ల శనగలు. కమ్మరి బ్రాహ్మణుడైనాడు. ఖైదీ - బోగంకొంప తార్పుకాడు దేవాలయాధిపతి కాబోతున్నాడు. తలవంచి కాళ్ళుమ్రొక్కిన భక్తులను తనచేత్తో ఆశీర్వదిస్తాడు. తన అదృష్టం మళ్ళింది.
    మరి తనకూతురు? బలవంతంగా పాతాళానికి నెట్టబడిన చంద్రలేఖ? కాలూ సంతోషం అడుగంటింది. లేఖ తనభావప్రపంచంలో భాగస్వామిని అయి తన అనుభవాల్లో పాలు పంచుకుంటుందా? నిజం ఆలోచిస్తే ఆమెను సమాజం కుళ్ళుగా చేసింది. ఆమెకష్టాలముందు తనవి ఎందుకూకొరగానివి అవుతాయి. ఆమె ఎదురుదెబ్బ తీస్తుందా? తీస్తుందా? ఆమె పగతీర్చుకుంటుందా? అతడు ఆశ్చర్యపడ్డాడు. ఒక సారికాదు. అనేకసార్లు ఆశ్చర్యపడ్డాడు.
    ఈ మధ్య ఆమె తనకు అర్ధంకావడంలేదు. ఆమెకు ఈ కథలో విశ్వాసంలేకపోతే? దేశం మొత్తంలోనూ యువతులకై వలలు పన్నుతున్న దుర్మార్గులు దేశం అంతటికీ పాకిపోయారని జేల్లో తాను విన్న విషయం ఆమెకు చెప్పాడు. కొన్ని ఇండ్లపేర్లుకూడా చెప్పాడు. తానుజైల్లోంచి బైటపడ్డతర్వాత ఆ యిండ్ల విషయంలో కాస్తజాగ్రత్తగానే ఉన్నాడు. ఒక్కరికైనా సహాయపడగలుగుతానని అతని ఉద్దేశం. అసలు తనదే బుద్దితక్కువ. రోజులు ఇంతగడ్డుగా ఉన్నాయని తెలిసికూడా లేఖను ఇందువిషయంలో హెచ్చరించలేదు. అది బుద్దిహీనతకాక మరేమిటి?
    లేఖ అందునుగురించి ఎలాంటి వ్యాఖ్యానమూ చేయకుండా తలనేలకువేసి కూర్చుంది. ఆమె అతన్నిచూచి భయపడుతున్న భావనలు ఆమెకండ్లలో కాలూకు కనిపించాయి. ఆమె ముఖంలో స్పష్టంగా ఏ భావనలూ గోచరించడంలేదు. ఆమె అతనినుంచి దూరంగా అగాధంలోకి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆమె అతనికి అందేట్టులేదు.
    
                                      9
    
    "పాపాత్ములమీద ఆ భగవంతుని దయకాకపోతే ఇంత దగ్గరగా ప్రత్యక్షం అవుతాడా? దేవాలయం ఎంతదగ్గరుంటే అంత మంచిది. ఇప్పుడు దేవాలయం మన ఇంటిముందుకే వచ్చేసింది."
    ఆ భావంతోనే కనకవర్షం కురిసింది. కాని క్లైవువీధిలో ఇనుప వర్తకుడైన ఆ స్థలపు యజమానిని అడగాలి. అతడూ కాలూ కులంవాడే. కాని డబ్బుంది కాబట్టి మామూలు కమ్మరి అంటే ఊసేవాడు. ఈ విషయం తెలిసిన కాలూ గుండె బండచేసుకొని పోరాటం సాగించాడు.
    ఆ వర్తకుడు నెట్టుకుంటూవచ్చి కాలూను కొలిచాడు. తుదకు అతడు కోపంతో అగ్గి అయిపోయినాడు.
    "ఇది నా స్థలం. ఏమిటీ ఈ గారడీఅంతా? కలకత్తాలో ఇంకా న్యాయం చావలేదు."
    కాలూ సూటిగా వర్తకునికళ్ళల్లోకి చూశాడు. కాని పెదవి కదల్పలేదు. వర్తకుని ఓపిక చచ్చి "మాట్లాడవేం" అని అరిచేదాకా అతని నోటివెంట మాట రాలేదు.
    కాలూ నోరు తెరిచాడు. అతని పదాలు మెత్తని కత్తిలా ఉన్నాయి.
    "నీ కులం?" కాలూ అడిగాడు.
    ఊహించని ప్రశ్న సరిగ్గా గుండెలో పొడిచింది. అయినా మరుక్షణానే ధైర్యం తెచ్చుకొని "నీతో వంశవృక్షాన్ని గురించి చర్చించడానికి రాలేదు. వ్యాపారంకోసం వచ్చాను, వ్యాపారం, తెలుసా?" అన్నాడు.
    "పుత్రుడు, పౌత్రుడు, ప్రపౌత్రుడు అంతా తక్కువకులం వాళ్ళు. అలాంటివానికి బ్రాహ్మనిముందు, శివుని అర్చకునిముందు నుంచోవడం ఎలా తెలుస్తుంది?" అన్నాడు కాలూ ఆ మాటలు తనకు కూడా వర్తిస్తున్నాయనుకుంటూ.
    కాలూ బొంగురువోయిన గొంతుతో గట్టిగా "వంగు దండం పెట్టు" అని ఆదేశించినట్లు అన్నాడు.
    కొద్దిగా నీరసించినా వర్తకుడు జంకలేదు. ఇలాంటి కరకుమాటలు వినాల్సివస్తుందని ఊహించనూలేదు. "అసలు వ్యాపారానికి రారేం?" అన్నాడు. ఈ తడవ అతని ధ్వనిలో మెత్తదనం కనిపించింది.
    "నీవు వంగి దండం పెట్టేదాకా ఒక్కమాట మాట్లాడేది లేదు."

 Previous Page Next Page