అతను సహాయం చేయకపోయినా ఫర్వాలేదు-కనీసం అతని వేరెబవుట్స్ తెలుస్తాయని పరిగెత్తి ప్రయత్నించాడు. అది చూసి అతను మరింతగా పరిగెత్తాడు.....
ఇద్దరు భవానీ చేతుల్ని గట్టిగా పట్టుకున్నారు. మరో ఇద్దరు కాళ్ళు గట్టిగా పట్టుకోగా మొదటి వ్యక్తి షర్ట్ లోపల ఉన్న కేసట్ ని బయటకు తీసో "మర్యాదగా ఇవ్వమంటే ఇవ్వలేదుగదా? అందుకే దౌర్జన్యం తప్పలేదు మిత్రమా! మాకు సంబంధించిన షాట్ కట్ చేసుకొని మీ కేసట్ ని మీకు భద్రంగా పంపిస్తాను....వస్తాను" అంటూ కారుకేసి సాగాడు.
మిగతా నలుగురు మరికొద్ది క్షణాలపాటు అలాగే భవానీని బంధించి పట్టుకొని, ఆ తరువాత వదిలేసి కారుకేసి దూసుకుపోయారు.
కేసట్ తన చేతుల్లోంచి తన కళ్ళముందునుంచే జారిపోతుంటే నిస్సహాయంగా చూస్తుండిపోయాడు భవానీ.
* * *
అనిల్ కి గిల్టీగా ఉంది.....
బస్ లోకి ఎక్కి ఓ సీట్ మీద వెల్లకిలా పడుకొని ఆలోచిస్తున్నాడు. మొన్న......శిరీషను నలుగురు అల్లరి పెడుతుంటే చూస్తూ నిస్సహాయంగా మిగిలిపోయాడు. అరగంట క్రితం నడిరోడ్డుమీద పట్టపగలు నలుగురు వ్యక్తులు ఒక వ్యక్తి మీద దౌర్జన్యం చేస్తుంటే- అతను హెల్ప్ ...... హెల్ప్....అని అర్థిస్తుంటే తను భయంభయంగా దూరంగా పారిపోయి వచ్చాడు. ఛీ......ఛీ.....ఏమిటి తనలో ఇంతటి దౌర్భల్యం.....? ఎందుకింత పరికితనం.....? అందరికంటే ఎక్కువగానే కనిపిస్తుంది తన పర్సనాలిటీ. చూట్టానికి ఆరడుగులే....అప్పుడప్పుడు కొందరాడపిల్లలు ఆరడుగుల అందగాడే- అవసరానికి పనికిరానివాడు అని అనటం తనకింకా గుర్తే......
అన్యాయం, అక్రమం జరుగుతుంటే తిరగబడాలనే అనిపిస్తుంది. కాని ఎక్కడో ఓ మూల పిరికితనం....
నేటి మనిషికి కావలసిన ధైర్యం, స్థయిర్యం తనలో లేవు.....తన మీద తనకే జాలి.......సెల్ఫ్ పిటీ అంత ఘోరమైంది మరొకటి లేదు.
ఎందుకో ఈ మధ్య శిరీషను పలకరించాలంటే సిగ్గుగా ఉంటోంది. కావాలనే తను ఆమెనుంచి తప్పించుకుతిరుగుతున్నాడు. కాని ఎన్నాళ్ళిలా........
ఆ ఆలోచనల చివర గుండెనిండా శూన్యం....... విచిత్రమైన శూన్యం తన అస్థిత్వాన్నే ప్రశ్నించే భయంకరమైన శూన్యం.....గుండె గోడల మధ్య దయనీయమైన పిరికితనం గూడుకట్టుకుంది.
కనీసం ప్రేమించిన యువతిని రక్షించుకోలేని తను ప్రేమికుడు కాలేడు.
అంటే తను నిజంగానే శిరీషను ప్రేమిస్తున్నాడా? ఒకవేళ నిజంగానే ప్రేమించినా అది చెప్పేందుకు, దాన్ని దక్కించునేందుకు మాత్రం అర్హతలేదు.
ముందు తనా అర్హత సంపాదించుకోవాలి.
ఆలోచనల నిండా ఆత్మవంచనను నింపుకొని బ్రతుకుతున్న హిపోక్రాట్స్ లోకంలో డిగ్రీ చదివి నిర్భయంగా అంట్లు తోముతూ బ్రతుకుతున్న ఆమె......అన్యాయాన్ని, దౌర్జన్యాన్ని నిర్భయంగా ప్రతిఘటించమని ఉద్భోదించే ఆమె తనకన్నా ఎంతో ఎత్తులో ఉంది.
సాధ్యమైనంతవరకు ప్రతిఘటించే ప్రయత్నం చేసింది. తన నుంచి అదే ప్రతిఘటనను ఆశించింది. ఆ రెండూ నిలబడకపోయేసరికి సహాయాన్ని అర్థించింది.
ఒక్కటి మాత్రం నిజం..... ఈ ప్రపంచంలో పిరికివాడేం చేయలేడు. ఏమీ సాధించలేడు. ఎందుకూ కొరగాడు.
ఇప్పటికీ శిరీష తనను పెళ్ళిచేసుకొనేందుకు సిద్దపడితే, అదామె తనను దయతలచి ఒప్పుకున్నట్లే తప్ప-తన అర్హత కాబోదు.
అతనలాగే ఆ బస్సులో ఒంటరిగా నిశ్శబ్దంలో నిల్చుండిపోయి తనను తాను ప్రశ్నించుకుంటున్నాడు-తనను తాను విమర్శించుకుంటున్నాడు.
* * *
దెబ్బలు తిని క్షతగాత్రుడిలా తన ముందు ప్రత్యక్షమయిన భవానీని చూసి హంపి షాక్ తింది.
'ఏమిటి? ఏం జరిగింది?'
ఆమె ఆందోళనగా చూస్తూ అడిగింది.
'ఆ క్యాసెట్ మనుష్యులే నామీద ఎటాక్ చేశారు. వాళ్ళు మనమీద పూర్తి నిఘా పెట్టారు మేడమ్. నేను మన ఆఫీసు నుంచి బయలుదేరటం వీడియోలాబ్ కి వెళ్ళటం-క్యాసెట్ తో తిరిగి ఆఫీసుకి రావటం అంతా వాళ్ళు పసిగట్టారు. నన్ను ఫాలో అయి నిర్జనంగా ఉన్న ప్రదేశం చూసి విరుచుపడ్డారు. వాళ్ళు అయిదుగురు-అక్కడికీసాధ్యమైనంతవరకు ప్రతిఘటించేందుకే ప్రయత్నించాను. కాని సాధ్యం కాలేదు. సారీ మేడమ్. ఆ క్యాసెట్....." అంతను మాటల్ని మధ్యలోనే మ్రింగేసాడు.
క్యాసెట్ పోయిందని తెలియగానే ఆమె మరోసారి షాక్ తింది.
"ఇంకో విషయం మేడమ్....." భవానీ భయపడుతూ అన్నాడు.
క్షతగాత్రుడై ఉన్న భవానీని చూడగానే అతని పొరపాటు లేదని గ్రహించగలిగింది. కాని ఎంతో కష్టపడి ఎన్నోవేలు ఖర్చుపెట్టి తీసిన గోవా కేసెట్ పోయిందని తెలీగానే ఆమె మానసికంగా దెబ్బతింది.
అయినా ఆమె తన వృత్తిలో అప్పటికే ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఉండటంతో కంపార్ట్ మెంటలిజమ్ వచ్చేసింది.
దాంతో వెంటనే తనను తాను సర్ధుకుంటూ "ఏమిటా?" అంది.
ఆమె మాటలు తగ్గుస్థాయిలో ఉన్నాయి. "మీరు బాగా నటించగలడనుకున్న మనిషిని చూశాను....."
"ఎప్పుడు? ఎక్కడ? బుల్లెట్ లా వచ్చాయి ఆమె నోటినుంచి ఆ ప్రశ్నలు.
"సరీగ్గా నా మీద ఎటాక్ జరుగుతున్న సమయంలో నాకేదన్నా అండ దొరుకుతుందనే ఆశతో హెల్ప్ హెల్ప్ అని అరిచాను. అయినా అతను పట్టించుకోలేదు. మరలా అరిచాను-అప్పుడతను నావేపు చూశాడు. నా పరిస్థితి కూడా గమనించాడు. అయినా నాకు సహాయంగా రాలేదు పైగా భయంగా పారిపోసాగాడు. మీరతను ఎవరయిందీ ఎక్కడుండేదీ తెలీక మధనపట్టం తెలిసి సడన్ గా ఆ అగంతకుల్ని తప్పించుకొని క్యాసెట్ తీసుకొని అతన్ని పట్టుకుందామని పరిగెత్తటం మొదలెట్టాను. అతను నన్నుచూసిమరింత భయంగా పారిపోసాగాడు. అతని వెనుక నేను -నా వెనుక ఆ ఆగంతకులు చివరికతను నా దృష్టి నుంచి తప్పించుకుపోయాడు- నేను మాత్రం వాళ్ళకు దొరికిపోయాను......" భవానీ చెప్పటం ఆపాడు.
ఆమెకతని ప్రవర్తన ఆశ్చర్యంగా అనిపించింది.
అతను భయమేసి పారిపోయినట్లా......? లేక మనకెందుకు లేనిపోనీ గొడవని తప్పుకున్నట్లా......?
"మరో విషయం మేడమ్.....ఆ అగంతకులలో ఒకడు క్యాసెట్ తో పోతూ మాక్కావాల్సిన షాట్ ని కట్ చేసుకొని మిగతా క్యాసెట్ భద్రంగా తిప్పి పంపించేస్తానని చెప్పాడు" భవాని గుర్తుకు తెచ్చుకుంటూ అన్నాడు.
ఆమె చటుక్కున సీట్లోంచి లేచింది.
"ఆ మాస్టర్ క్యాసెట్ నుంచి వేరే క్యాసెట్ లోకి ఎక్కించారా?'
"ఎక్కించాం మేడమ్"
"వెరీగుడ్.....వాళ్ళు మాస్టర్ క్యాసెట్ పంపించేవరకు ఆగుదాం. వాళ్ళు దాన్ని తిరిగి పంపించాక ఏ షాట్ వాళ్ళు కట్ చేసారో చూసి దాన్ని బట్టి పోలీసులకు తెలియజెయ్యటమో- ఏదో చేద్దాం.....డూప్లికేట్ చేసిన క్యాసెట్ వెంటనే నా టేబుల్ పైకి చేర్చండి" అంది హంపి ఓ నిర్ణయానికొస్తూ.
భవానీ బయటకు వెళ్ళబోతుండగా ఆమె మరలా అంది.... "ముందు హాస్పిటల్ కి వెళ్ళి దెబ్బలకు ట్రీట్ మెంట్ తీసుకుని అప్పుడు పని చూడు" అంటూ కొంత డబ్బు ఇచ్చింది.
మాస్టర్ కేసెట్ ని పోగొట్టి రిక్తహస్తాలతో వచ్చినందుకు మేడమ్ ఒక్కమాట కూడా పరుషం అనలేదే అని ఫీలవుతూ బయటకు నడిచాడు భవాని.
ప్రభు అనే పోలీసాఫీసర్ జయధీర్ అనేవ్యక్తి ఆచూకి కోసం కేసట్స్ కావాలంటున్నాడు. ఇతనెవరో....గోవా కేసట్ లో తానున్న షాట్ ని కట్ చేసి పంపిస్తానని మాస్టర్ కేసట్ ని భవానీనుంచి తస్కరించాడు.
ఊరేగింపును షూట్ చేశావా అని మరో అంగతకుడు బెదిరిస్తున్నాడు. ఊరేగింపుని రికార్డ్ చేసిన కేసట్స్ ని చూస్తే నా పరిశోధనలో నేను ముందుకెళ్ళ గలనని ప్రభు అంటున్నాడు.
ప్రభు వెదికే ఆగంతకుడెవరు? జయధీరే కదా......? ఢిల్లీఎయిర్ పోర్ట్ లో పోలీసుల కన్నుగప్పి జారుకున్నది, వినాయక నిమజ్జనం సందర్భంగా లూటీ చేయించింది కూడా జయధీరే అని ప్రభు అనుమానం..... ఏమిటిదంతా.....?
ఒకవేపు తాను-తనకు ఇబ్బందులు కలిగించే దశరథ -సుశీల్ కుమార్- ప్రశాంత్- నందిని -టీవీ స్టేషన్ డిప్యూటీ డైరెక్టర్ - ఎవర్నో పట్టుకొనేందుకు ప్రయత్నించే ప్రభు, పోలీసు సిబ్బంది -వీటన్నిటికి తోడు తను కోరుకుంటున్న మరో వ్యక్తి - కేవలం నూట యాభైకోసం అద్భుతంగా నటించిన ఆ యువకుడు-
అక్కడే ఆమె ఆలోచనలు ఆగిపోయాయి.
నూటయాభైకోసం నటించాడంటే.....అదీ చావు ఏడుపు..... ఎంతో పేదరికంలో ఉండి ఉండాలి. నిరుద్యోగి అయి వుండాలి.....అతని గురించి చెప్పిన అతని మిత్రులు కూడా నిరుద్యోగుల్లాగే కనిపించారు. అతను దొరికితే సీరియల్ లో నటించడానికి ఒప్పుకోవటం అంతకష్టం కాకపోవచ్చు-అవసరాల్లో ఉన్నాడు- ఆపైన నటనలో ఎంతో అనుభవం ఉండి ఉండాలి......
ఆమె సడన్ గా ఉలిక్కిపడుతూ ఎడమ చెక్కిలిని తడుముకుంది.....అతను కొట్టినదెబ్బ......దానివే మరచిపోలేకపోతోంది. ఎంత అద్భుతమైన యాదృచ్చికంగా.....కేవలం ఏడుపు నటించడానికి వస్తే తన తల్లే పాడె మీద చివరిక్షణంలో కనిపించటం......ఒక్కోసారి కల్పనకన్నా వాస్తవమే దిగ్భ్రమకు గురిచేస్తుంది.....
తరచూ ఆమెను తట్టిలేపే ఆమె కలల ప్రపంచం -తిరిగి అదే ప్రశ్నను గుర్తుచేసింది - నిశ్శబ్దమైన చీకట్లో నావెంట వచ్చేదెవరు.....నా ఊహలకు ఆకృతి ఇచ్చే ఊహాసుందరుడు ఎవరు......? ఎన్నాళ్ళు నాకీ నిరీక్షణ.....? అది గుర్తుకు రావటంతో ఆమె ఓ క్షణం ఉలిక్కిపడింది... ఆ యువకుడు గుర్తుకొచ్చినప్పుడే ఆ ప్రశ్న అసంకల్పితంగా ముందుకు రావటం ఆశ్చర్యం.....ఆమెకు తెలీకుండానే అనిల్ పట్ల ఆకర్షితురాలయింది.... అనిల్ పదే పదే ఆమె స్మృతిపథం ముందు నిలవటం అనే అసంకల్పిత చర్యకు ఆమె నిర్వచనం ఇచ్చుకొనే ప్రయత్నం చేసుంటే అదామెకు తెలిసి ఉండేది..... ఆ ఇష్టమన్నది వృత్తిపరమయినదే.
* * *
"ఒక్కొక్కరు ఎన్ని కార్డ్స్ రాసార్రా....." దశరథ తన ఆఫీసులో పనిచేసే ఉద్యోగుల్ని ఉద్దేశించి ప్రశ్నించాడు.
"ఆ చేత్తో..... ఈ చేత్తో.... ఎడాపెడా మన సీరియల్ అద్భుతంగా ఉందంటూ ఒక వెయ్యిదాకా వ్రాసారండి. ఎఫ్.బి.ఐ.స్కాట్ లాండ్ యార్డ్, ఇంటర్ పోల్ రైటింగ్ ఎక్స్ పర్ట్ కూడా అవన్నీ వ్రాసింది కేవలం ఈ నలుగురే అన్నా నమ్మలేరండి.
మన ఏరియా పోస్టాఫీసులోని కార్డులు, కవర్స్ ఒకే దెబ్బకు నిండుకున్నాయండి. మన సీరియల్ చెత్తగా ఉందని ప్రేక్షకులు వాపోతున్నారు గదండి.....ప్రశ్నోత్తరాల సమయంలో ఈ పొగిడే ఉత్తరాల్ని వాళ్ళు చదువుతారండి.....?" బ్రహ్మానందం దిగులుగా అడిగాడు.