"ఇప్పుడు కాఫీయా?" కళ్ళు తిప్పుతూ అన్నాది మానసి.
"తెల్లవారొస్తూంది. ఇప్పుడేమీ తినే ఓపిక లేదు. నువ్వు భోజనం చెయ్యి. కాఫీ ఇవ్వగలిగితే తాగుతాను."
"అయితే నాకూ తినాలనిలేదు. ఇద్దరం కాఫీయే తాగుదాం." మానసి వంటింట్లోకి వెళ్ళింది.
"డాక్టర్ గారూ! మీకెంతో శ్రమ ఇచ్చ్చాం. మానసి ఆరోగ్య విషయంలో మీరెంతో శ్రద్ధ తీసుకొన్నారు." శివరామయ్య కృతజ్ఞతా పూర్వకంగా అన్నాడు.
"అయినా ప్రయోజనం ఏముందీ?" సాలోచనగా అన్నాడు ఉదయ్.
"దానికి మీరేం చేస్తారు డాక్టర్ గారూ. మీరు చెయ్యవలసినాదంతా చేశారు. మానసి జబ్బు ఇక్కడుంటే నయం అవుతుందని నాకు నమ్మకంలేదు. రెండురోజులాగి మళ్ళీ మీ నర్సింగ్ హొంలోనే చేర్పించాలని వుంది. మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి" తల పక్కకు వాల్చేసి బాధగా అన్నాడు.
"నాకూ అదే మంచిదనిపిస్తోంది. ఇక్కడ వుండి నేను చేయగలిగిందేమీవున్నట్టు తోచడంలేదు. పైగానేనిక్కడకొచ్చి నాలుగురోజులైపోయింది. రెండు రోజుల్లో వస్తానని చెప్పి నా స్నేహితుడికి నర్సింగ్ హొం అప్పగించి వచ్చాను. అక్కడ అతనికీ, నా పేషెంట్సుకూ ఇబ్బందిగా వుంటుంది. నేను వెళ్తాను. మీరొక పని చెయ్యండి....."
"ఏమిటి "డాక్టర్ గారూ!" మధ్యలోనే అందుకున్నాడు శివరామయ్య.
"మానసిని నాతో పంపించండి" అని ఉదయ్ శివరామయ్య ముఖంలోకి చూశాడు.
"నాకిక్కడ రెండురోజుల మీరే చూశారుగా ఇక్కడి పరిస్థితులు? ఈ తోటా....ఏఎ పనివాళ్ళూ ఈ కొంపను ఎలా తయారు చేసి పెట్టారో చూశారుగా. అంతా భీభత్సంగా ఉంది! నాలుగురోజులుండి, అన్నీ చక్కబెట్టుకొని, అమ్మాయిని తీసుకొని నేనే వస్తాను."
"అయితే ఓ పని చెయ్యండి"
"చెప్పండి డాక్టర్ గారూ!"
"ఇప్పుడు మానసిని నాతో పంపించండి తర్వాత తీరిగ్గా పనులన్నీ చూసుకొని మీరు రావచ్చు."
శివరామయ్య ముఖంలో వచ్చిన మార్పును గమనించాడు ఉదయ్.
"మీ అమ్మాయికి ఏ ఇబ్బందీ లేకుండా నేను చూసుకుంటాను" భరోసా ఇస్తూ అన్నాడు.
"అబ్బే అలా అనికాదు. మీ నెత్తిన అంత బాధ్యత పెట్టడం భావ్యం కాదేమోనని...." నసిగినట్టుగా అన్నాడు.
"ఇందులో భాధ్యతేముంది అది నా వృత్తిధర్మం. మానసి మరో రోజు ఇక్కడ వున్నా ఆమె మానసిక స్థితి మరీ అధ్వాన్నం అవుతుందేమోనన్న భయంతోనే ఆమెను నావెంట తీసుకెళ్తానంటున్నాను."
"మీరు మామీద అంత ఆదరణ చూపిస్తుంటే కాదంటానా? మానసిని అడిగిచూద్దాం" శివరామయ్య సాలోచనగా అన్నాడు.
మానసి కాఫీ తీసుకొని వచ్చింది.
"చూడమ్మా! డాక్టర్ గారు వెళ్తారట."
"అప్పుడేనా! వాడంతు తేల్చకుండానేనా?"
"ఎవడి అంతు?" శివరామయ్య నొసలు చిట్లించాడు.
"మీరు కొంచెం ఆగండి శివరామయ్యగారూ!" అని మనసిచేతులో నుంచి కాఫీకప్పు అందుకున్నాడు.
కాఫీతాగి కప్పు టేబుల్ మీద వుంచుతూ మానసిని చూస్తూ చిరునవ్వు నవ్వాడు.
"మానసీ! ఇక నీకు వాడి భయంలేదు. వారిని నేలమాళిగలో బంధించివేశాను. ఇహవాడు బయటికి రాలేదు నువ్వుహాయిగా వుండొచ్చు."
"నిజంగానా?" మానసి కనురెప్పలు టపటప కొట్టుకున్నాయి.
"అవును. శాశ్వతంగా బంధించివేశాను ఇక వాడుఅక్కడే కృంగి కృంగి నశించిపోతాడు. ఇహ నీకేం భయంలేదు. ఈ వాతావరణంనుంచి కొద్దికాలం దూరంగావుంటే నీ ఆరోగ్యం పూర్తిగా బాగుపడుతుంది. నాతో వచ్చి, మా నర్సింగ్ హొంలో నాలుగు రోజులపాటు వుంటే మంచిది. మీ నాన్నగారు ఒప్పుకున్నారు" ఉదయ్ మానసి కళ్ళల్లోకి చూశాడు.
"అవునా?" అన్నట్టు మానసి కళ్ళల్లోకి చూశాడు.
"అవునమ్మా డాక్టర్ గారి సలహా పాటించడం మంచిదేమో?" శివరామయ్య మానసిని ఆప్యాయంగా చూస్తూ చెప్పాడు.
"ఇంకా నర్సింగ్ హొమ్ లూ, హస్పటల్సూ ఎందుకు నాన్నా? దాక్తార్ గారు వాడ్ని బంధించి వేశారుగా! ఇహ వాడు చచ్చినా బయటికి రాలేడు. నాకింకే భయమూలేదు. హాయిగా వుంటాను. ఐ యామ్ సో హాపీ! థాంక్స్ డాక్టర్ గారూ! థ్యాంక్స్? మీరు నాకు పునర్జన్మను ప్రసాదించారు. ఈ జన్మలో మీ రుణం తీర్చుకోగలనా? మరో జన్మంటూ వుంటే, నర్సు నై పుట్టి మీ ఆసుపత్రిలో, మీకూ, మీ రోగులకూ సేవచేసి మీ రుణం తీర్చుకుంటాను" ఉద్రేకంగా చెప్పుకుపోయింది మానసి.
"ఆగాగు! ఆగు మానసీ! పునర్జన్మలమీద నాకు నమ్మకంలేదు. ఒకవేళ నువ్వన్నట్టు పునర్జన్మంటూ వుండి, నేనుమనిషిగా పుడితే డాక్టర్ను మాత్రం కాను. ఒకవేళ అయినా సైకియాట్రిస్టునుమాత్రం కాను. అందువల్ల వచ్చే జన్మలో నువ్వు నా రుణం తీర్చుకొనే ప్రసక్తేలేదు. నీ ఆరోగ్యం బాగుపడి, ఒక ఇంటిదానివయి, మీ నాన్నగారిని ఆస్తిని అణుభావించే వారసుడ్ని కానీ ఇవ్వు చాలు. ఒక తరాన్ని ఒక కుటుంబాన్ని నిలిపిన సంతృప్తి నాకు మిగులుతుంది, మీరేమంటారు శివరామయ్యగారూ?" అంటూ డాక్టర్ శివరామయ్యను చూశాడు.
ఆయనకళ్ళు ఆర్ద్రమైనాయి.
పై పంచతో కళ్ళోత్తుకున్నాడు.
రెండు చేతులూ ఎత్తి ఉదయ్ చంద్ర అతడి గొంతు చెయ్యివేసి దైర్యం చెపుతున్నట్టుగా తట్టాడు.
"ఇట్స్ ఓ.కె! డాక్టర్ గా నా ధర్మాన్ని నేను నిర్వర్తించాను మీరు ఎప్పుడు అవసరం అనుకొంటే, అప్పుడు మానసిని తీసుకొని నా దగ్గరకు వచ్చెయ్యండి. ఇక ఆ అవసరం రాదనే అనుకొంటున్నాను. శెలవ్. ఇక నేను బయలుదేర్తాను." ఉదయ్ అక్కడ్నుంచి కదిలాడు.
"ఇంకా తెల్లవారలేదు. చీకటిగా వుంది. మీకు రాత్రంతా నిద్రలేదు. కొన్ని గంటలైనా పడుకొని, తెల్లవారాకా వెళ్ళోచ్చుగా డాక్టర్!" అన్నాడు శివరామయ్య.
"పడుకుంటే వెంటనే లేవడం కష్టం! ఇప్పుడు బయలుదేరితే ఎనిమిది గంటలకళ్ళా నర్సింగ్ హొమ్ కు చేరుకుంటాను. అప్పటికి ఫేషెంట్సు కూడా వచ్చేస్తారు. గుడ్ బై మనసీ!" అని లేచి హాల్లోకి వచ్చాడు.
మేడమీద తన గదికి వెళ్ళే ఉద్దేశ్యంతో మెట్లకేసి చూశాడు.
"డాక్టర్ ! మీ సామానంతా తెచ్చి కింద గదిలో మానసమ్మగారి గది పక్కగదిలో పెట్టాను బాబూ. మళ్ళీ మీరా మెట్లెక్కడమెందుకని" చెప్తూన్న వీరభద్రుడ్ని ఉదయ్ గిర్రున తిరిగి చూశాడు.
"అవును డాక్టర్ గారూ. వీరభద్రుడికి నేనే చెప్పాను. మీకు కింద గదిలో ఏర్పాటు చెయ్యమని" అన్నాడు శివరామయ్య.
"రండి బాబూ!" వీరభద్రుడు ఉదయ్ ను గదిలోకి తీసుకెళ్ళాడు.
పై గదిలో తన సామాను ఎలావుందో కింద గదిలో సరిగ్గా అలాగే సర్దివుంది.
"పైనుంచి సామాను తెచ్చింది నువ్వేనా?" వీరభద్రుడ్ని పరిశీలనగా చూస్తూ అడిగాడు.
"అవును బాబుగారూ! నేనే! ఏమైనా వదిలేశానా?" కంగారూపడి పోయాడు వీరభద్రుడు.
ఉదయ్ తన సామానుకేసి పరిశీలనగా చూశాడు. డైరీతో సహాఅన్నీ వున్నాయి. సంతృప్తిగా నిట్టూర్చాడు.
వీరభద్రుడు సామాను తీసుకొని ఉదయ్ ను అనుసరించాడు.
సూట్ కేసు కారు వెనకసీట్లో పెట్టి నిలబడ్డాడు.
మానసి, శివరామయ్య కారు దగ్గరకొచ్చారు.
ఒక కవరులో వందరూపాయల నోట్లుపెట్టి, శివరామయ్య కారు ముందుసీట్లో స్టీరింగ్ దగ్గిర కూర్చున్న డాక్టర్ ఉదయ్ చేతుల్లో వుంచాడు.
డాక్టర్ కవర్ కేసి ఆశ్చర్యంగా చూశాడు.
"ఏమిటిది?"
"ఇది మీ ఫీజుగా ఇస్తున్నాం అనుకోవద్దు మీకెంత ఇచ్చినా మీ రుణం తీరేదికాదు. ఏదో మా సంతృప్తికోసం" నసిగాడు శివరామయ్య.
"అదేమిటి నాన్నా! మీరిచ్చింది డాక్టర్ గారికి ఇక్కడి కొచ్చినకారు పెట్రోలు ఖర్చులకు కూడా చాలదు." గుణుస్తున్నట్టుగా అన్నది మానసి.
"నిజమేనమ్మా! కాదనడంలేదు! తోటఫలసాయం అందగానే డాక్టరుగార్ని దర్శించుకొని, ఇంకొంత ఇవ్వాలనే నా మనసులో వుంది. పేరుకు దివాణం. ఇంటిపేరు కస్తూరివారు, ఇంట్లో గుబ్బిలాలు కంపు అన్నట్టుంది నా పని డాక్టరుగారూ?"
"శివరామయ్యగారూ! మీరు బాధపడకండి. ఇదికూడా మీ దగ్గిరే వుంచండి. మీకు వీలైనప్పుడే, ఇవ్వగలగినప్పుడే ఇవ్వండి. ఒకేసారిఅంతా కలిపి ఇవ్వండి" అంటూ డాక్టర్ ఉదయ్ , కవరు శివరామయ్యకు తిరిగి ఇచ్చేశాడు.
ఉదయ్ కారు స్టార్ట్ చేసి తల బయటికి పెట్టి చూశాడు.
ముగ్గురూ అతడ్నే చూస్తూ నిలబడి వున్నారు.
"అడివయ్యెక్కడా?"
శివరంయ్యా ఉలిక్కిపడ్డట్టు చూశాడు.
"వాడా? వాడిది ఒట్టి బండనిద్ర డాక్టరుగారు. అక్కడే, ఆ షెడ్డు దగ్గరే పడి నిద్రపోతున్నాడనుకుంటాను. పిలిపించమంటారా?"
శివరామయ్య కంగారు పడుతున్నట్టు గ్రహించాడు ఉదయ్.
"అదేమీ పట్టించుకొనట్టే "బుచ్చిబాబు ఊరికి వెళ్ళాడేమో?" తనలో తనే అనుకుంటున్నట్టుగా శివరామయ్యకు విన్పించేలా అన్నాడు.
"లేదు డాక్టరుగారూ వాడు తన గదిలోనే గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు. వాడ్ని పిలవమంటారా?" అడిగాడు శివరామయ్య.
"అవసరంలేదు, ఊరికే అడిగాను. ఈసారి మీరోచ్చేప్పుడు నా దగ్గరకు తీసుకురండి. ఒకసారి పరీక్ష చెయ్యాలి.
"వాడు చిన్నప్పట్నుంచీ అలాగే వున్నాడు మందబుద్ది."
"అయినా ఒకసారి పరీక్షించి చూద్దాం. ఓ.కె బైబై!" ఉదయ్ కారు స్టార్టు చేశాడు.
కారు తోటదాటి రోడ్డెక్కుతూండగా, తోటలోనుంచి బంగళావైపుకు వెళ్తున్నకారు హెడ్ లైట్ల కాంతిలో బుచ్చిబాబు కన్పించాడు.
బంగళాలో గుర్రుపెట్టి నిద్రపోతున్నాడని చెప్పాడు శివరామయ్య.
వీడేమో ఈవేళప్పుడు తోటలోనుంచి బంగళావైపుకు వెళ్తున్నాడు.
"ఈవేళప్పుడు వీడు తోటలో ఏంచేస్తున్నట్టు?
ఆలోచిస్తూ ఉదయ్ కారు రోడ్డుమలుపు తిప్పాడు. ఒక కిలోమీటర్ దూరంవెళ్ళి రోడ్డుపక్కన చెట్టుకింద కారు ఆపాడు. కారుదిగి వెనక్కు తిరిగి చూశాడు. తోట, బంగళా అన్నీ చీకట్లో కలిసిపోయినాయ్. బంగళాలో వున్న వాళ్ళకు కారు కన్పించే అవకాశం లేదని గ్రహింకుకొన్నాడు గబగబా రోడ్డుదిగి పక్కనే వున్న చేలల్లో నడవసాగాడు.
"ఓ ఇరవై నిముషాల్లో తోటదగ్గర కొచ్చాడు. అరటితోట దగ్గిర్నుంచి అడుగులో అడుగువేస్తూ పెద్ద బావిదగ్గిర కొచ్చాడు. షెడ్డులో అడివయ్య ఉన్నాడో లేదో చూడాలనుకున్నాడు షెడ్డు పక్కన ఒదిగి ఒదిగి చూశాడు షెడ్డులో ఎవరూలేరు. బావి దగ్గిర కీచురాళ్ళ ధ్వనిమాత్రం విన్పిస్తోంది. బావి దగ్గర నిలబడి తోటంతా కలయజూశాడు.
బావి దగ్గర పనసచెట్టు!
పనసచెట్టుకింద___
గతాన్ని పెళ్ళగించుకొని శ్మృతి శకలాలు ఉదయ్ మస్తిష్కంలో నుంచి బయటికి వస్తున్నాయ్.
పనస చెట్టును వెతుకుతూ, తోటంతా కలియతిరిగాడు. ఒక్కటి కాదు__తొమ్మిదున్నాయి పనసచెట్లు. మొదటి పనసచెట్టుకింద కొచ్చాడు.
కాలు భూమిలోకి దిగిపోతూవుంది. అక్కడ గుంట తవ్వి మళ్ళీ పూడ్చినట్టుగా వుంది. ఇంకా మట్టి వదులొదులుగా వుండటంవల్ల కాళ్ళు దిగబడిపోతున్నాయి. చెట్టుచుట్టూ తిరిగి చూశాడు. మొదలు చుట్టూ ఇరవైఅడుగుల వలయంలో మట్టి దిగబడిపోతూ కన్పించింది.