మెదడు కమ్ముకొన్న చీకట్లుకూడా విచ్చిపోయాయి. బుర్రచురుగ్గా పనిచెయ్యసాగింది. స్పష్టంగా ఆలోచించగల మానసిక స్థితికి చేరుకొన్నాడు.
తనను ఇలా చీకటి గుహలో బంధించవలసిన అవసరం ఏమొచ్చింది? మానసితోపాటు తనను ఇలా బంధించింది ఎవరు? ఎవరిలా చేసి వుంటారు?
వాడేనా? అవును వాడే ! మానసిని వెంటాడుతున్నవాడే ఈ పని చేశారు! ముగ్గురూ కలిసే చేశారా? అయితే శివరామయ్య ఏంచేస్తున్నాట్టూ? అతడే ఇదంతా చేయిస్తున్నాడా?
ఆ ఆలోచన రాగానే ఉదయ్ కు వళ్ళంతా జలదరించింది.
శివరామయ్య ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు? అతడు తననుంచి ఏమి ఆశించి ఇలా చేస్తున్నాడూ? మానసి ఆరోగ్యం బాగుపడడం శివరంయ్యకు ఇష్టంలేదా? ఆమెను ఇంకా ఇంకా పిచ్చిదాన్ని చెయ్యాలని అతడి ప్రయత్నమా? కన్నాకూతుర్నే చేజేతులా పిచ్చిదాన్ని చేసేంతటి ఉన్మాదా శివరామయ్య.
శివరామయ్యకు ఉన్మాదమా? అయితే ఇది ఏ రకమైన ఉన్మాదం?
తాను వచ్చినప్పట్నుంచీ జరిగిన సంఘటనలను, ఒక్కొక్కటే మననం చేసుకోసాగాడు.
అవును! ఆ సంఘటనలు ఏ ఒకరిద్దరో చెయ్యగలిగినవి కావు అంతేకాదు. ఏ ఒక ఉన్మాదో, తాత్కాలికంగా మానసిక స్థిమితం తప్పిన వాడో చెయ్యగల సంఘటనలా ఇవి? కాదు. కానే కాదు ఒక పద్ధతి ప్రకారం , పటిష్టంగా అమలు పరుస్తున్న కుట్రలా వుంది ఇదంతా.
ప్రాణికోటి ప్రతి చర్యకూ, ప్రతి ఆలోచనకూ కార్యకారణ సంబంధం వుంటుంది.
అకారణ చేష్టలు మానసిక దౌర్భాల్యానికి ప్రతీకలు. ఇంత మంది కలిసి మానసి వెంటబడుతున్నారు?
ఎందుకూ? ఆమె పిచ్చిదయితే వాళ్ళకు వచ్చే లాభం ఏమిటి? అలా అయితే శివరామయ్య ఆమెను తన దగ్గరకు చికిత్స కోసం ఎందుకు తీసుకోస్తాడూ?
అసలు మానసి__?అవును___మానసి___
"ఇప్పుడింకేం భయంలేదు డాక్టర్ గారూ? వాడిప్పుడు నన్నేం చెయ్యలేడు. వాడితిక్క బాగా కుదిరింది. ఇకవాడు మన దగ్గరకు రాలేడు. భలే! భలే! మంచి పనే అయింది. బాగా అయింది."
ఉదయ్ చంద్ర ఆలోచనలు పుటుక్కున తెగిపోయాయి.
తృళ్ళిపడి మాన్సిని చూశాడు. ఆమెను పరిశీలనగా కళ్ళు పెద్దవి చేసి మరీ చూశాడు.ఆమె చప్పట్లు కొడ్తోంది. వెర్రిగా నవ్వుతూ, అతడి వైపుకు జరుగుతూ వస్తోంది.
తన మీదకు వస్తోన్న మాన్సిని రెండు చేతులతో పట్టుకొని, గట్టిగా కుదిపి, గోడకేసి నెట్టాడు గోడకు అనుకొని కూలబడింది మానసి. వెక్కి వెక్కి ఏడవసాగింది.
ఉదయ్ అదేమీ పట్టించుకోకుండా ఆలోచించసాగాడు
మానసి ప్రవర్తన__
రాను రాను చేకటి చిక్కగా అలుముకోసాగింది. అంతకు ముందున్న ఆ కాస్త వెలుగు కూడా తగ్గిపోయింది.
చేతికి వున్న రేడియండయల్ వాచీ చూసుకొన్నాడు.
ఐదూ ఎభయ్ నిముషాలు అయింది.
అంటే తను ఇక్కడ ఏడు గంటలకు పైగా వున్నాడన్నమాట!
చిన్నగా లేచి గోడలను చేత్తోతడుముతూ గదంతా కలయతిరిగాడు.
ఏదో ఆశ!
బయటపడే మార్గం దొరక్కపోతుందా అనే ఆశ!
గదికి రెండు వైపులా వున్న ఇనుపతలుపులను మళ్ళీ మళ్ళీ శక్తి కొద్దీ తోసి తోసి చూశాడు. చెవి తలుపుకు ఆనించి విన్నాడు. ఎలాంటి అలికిడీ లేదు. అతడి ఆశలు అడుగంటాయి.
లాభం లేదు. బయటపడే అవకాశంలేదు. ఇలా ఎన్ని గంటలు___ఎన్ని రోజులు___రోజులా?
ఉదయ్ కు మెదడులో ఏదో ఫెళ్ళున పగిలినట్టు అయింది. గుండెల్లో గునపాలు గుచ్చినట్టు అయింది. నరాలు విచ్చిపోతున్నాయి.
అన్నం నీళ్ళూ లేకుండా మనిషి ఎంతకాలం బతుకుతాడు? చీకటి గదుల్లో బంధించబడిన ఖైదీల గురించి తను ఎన్ని కథలో చదివాడు వాళ్ళకేమైంది? మనిషి ముందు పిచ్చివాడైపోతాడు. ఆ తర్వాత రాక్షసుడే అవుతాడు. ఆకలిగొన్న ఆ వెర్రి మనిషి. ఆ చీకటి గదిలో దొరికిన ఎలుకల్నీ, బొద్దెంకల్నీ వెంటాడితిన్నాడు. రక్తంతాగి దాహం తీర్చుకొన్నాడు.
ఎదురుగా ముడుచుకుపోయి కూర్చుని వున్న మానసి నీడలాకన్పించింది.
మనసు చెదిరిపోతూంది, మెదడు ఉడికిపోతూంది. అణువణువూ బాధతో మూలుగుతోంది.
వళ్ళంతా చెమట్లు కమ్మాయి. కళ్ళు బైర్లు కమ్మాయి. కడుపులో పేగులు చుట్టచుట్టుకుని గొంతులోకి వచ్చింట్టుగా వుంది.
ఉదయ్ రెండు చేతుల్తో తల పట్టుకొన్నాడు. అది అతడికి తన తలలా అన్పించలేదు. ఏదో రాతిని పట్టుకొన్నట్టుగా వుంది. రాయి కరిగినీరై పోతూ ధారాపాతంగా ప్రవహిస్తూన్నట్టుగా అయిపోతూంది.
ఏమైంది తనకు?
తనకు మతిభ్రమణం కలుగుతోంది!
తను పిచ్చివాడైపోతున్నాడు.
17
"డాక్టర్ గారూ ! డాక్టర్ గారూ!"
ఉదయ్ చిన్నగా కళ్ళు తెరిచాడు. లాంతరు వెలుగు కళ్ళమీద పడింది. మెరుపును చూసినట్టుగా అతడి కళ్ళు చిడతలారి పోతున్నాయ్. రెప్పలు టపా టపా కొట్టుకుంటున్నాయి. కాసేపు చేతులు వెలుతురుకు అడ్డం పెట్టుకొని మెల్లగా కళ్ళు తెరిచాడు.
మోకాళ్ళమీద కూర్చుని వంగి తన ముఖంలోకి ముఖం పెట్టి చూస్తున్న మానసి కన్పించింది ఉదయ్ కు. ఆ పక్కగా శివరామయ్య నిలబడి ఉన్నాడు. ఆయన వెనగ్గా వీరభద్రుడు లాంతరు పట్టుకొని నిలబడి వున్నాడు.
"ఎంతపని జరిగిపోయింది డాక్టర్ గారూ? ఎంత ఘోరం జరిగిపోయింది?" ముందుకు వంగి బాధగా అన్నాడు శివరామయ్య.
ఉదయ్ చంద్ర అయోమయంగా అందరి ముఖాలూకలియచూశాడు.
"నేను చెప్పలేదా డాక్టర్ గారూ! ఆ దుర్మార్గుడే ఇంతపనిచేశాడు" మానసి ఉదయ్ కళ్ళలోకి చూస్తూ అన్నది.
"ఏ దుర్మర్గుడూ?" అప్పుడే ఈ ప్రపంచంలోకి అడుగు పెడ్తున్న వాడిలా అన్నాడు ఉదయ్.
"ఇంకెవరూ? వాడే?" మానసి సాగదీస్తూ అన్నది.
"నువ్వుండమ్మా! డాక్టర్ గారూ లేవండి. ముందీ గదిలో నుంచి బయటపడండి. తర్వాత మాట్లాడుకోవచ్చు." అని శివరామయ్య దారితీశాడు.
వీరభద్రుడు లాంతరుతో ముందుకు నడిచాడు. మెట్లెక్కి అందరూ మేడ మీదకు వచ్చారు.
"వచ్చిన దోవనే వెళ్తూన్నాం మళ్ళీ. కింద నుంచి వెళ్ళే షెడ్డులోకి వెళ్ళొచ్చు అన్నావుగా మానసీ!" ఏదో గుర్తొచ్చినట్టుగా అడిగాడు ఉదయ్ అయోమయావస్థలో నుంచి అప్పుడప్పుడే బయటికివస్తూ.
"అటుదోవ బాగుండదు. ఆ దోవ ఈ మధ్య కాలంలో వాడిన గుర్తులేదు. పాములూ, తేళ్ళూ వున్నా వుండొచ్చు. మానసి తొందరపడి మిమ్మల్ని ఇటు తీసుకొచ్చింది మెట్లు విరిగితే మాత్రమేం? నిచ్చెన వేసి మిమ్మల్ని కిందకుదించే వాళ్ళంగదా?" అన్నాడు శివరామయ్య.
"ఇంతకీ ఈ మెట్ల కింద తలుపు ఎవరు వేశారూ?" శివరామయ్య ముఖంలోకి చూస్తూ అడిగాడు ఉదయచంద్ర.
"ఎవరూ వెయ్యలేదు. దానంతటదే గాలికి పడింది. ఆ అదురుకు గడియ జారి బిగుసుకుపోయింది. అది మీరు___"
"కాదు. వాడేవచ్చి వేశాడు." మానసి మధ్యలో అందుకుంది.
"నువ్వుండమ్మా. నీ మూలంగా, పాపం, డాక్టర్ గారు ఎంత ఇబ్బంది పడ్డారో చూశావుగా? క్షమించండి డాక్టర్ గారూ!" శివరామయ్య ప్రాధేయ పూర్వకంగా అన్నాడు.
"మేమీ సెల్లార్ లోకి వచ్చినట్టు మీకెలా తెలిసింది?" సందేహాన్ని వెలిబుచ్చుతూ అడిగాడు ఉదయ్.
"విరిగిన మెట్టు బాగు చేయించి పైకి వచ్చి చూచాను. అంతవరకూ మీరు గదిలోనే వుండి వుంటారానుకొన్నాను. కాని మీరు గదిలో కన్పించక పోయేసరికి కిందికి వెళ్ళి వుంటారనుకొన్నాను. మధ్యాహ్నం వరకూ మీరు తోటలో ఎక్కడో తిరుగుతూ వుండి వుంటారనుకొన్నాను. రాత్రయినా రాకపోయేసరికి అనుమానం వచ్చింది. నిజం చెప్పొద్దూ డాక్టర్ గారూ___అంతవరకూ మీరు క్రిందికి ఎలావెళ్ళి వుంటారా అనే ఆలోచన రాలేదు సుమా. నేలమాళిగ నుండి బయటికి వెళ్ళి వుంటారనే ఆలోచన ఈ వీరభద్రుడికే వచ్చింది డాక్టర్ గారూ! నాకు అంతవరకూ ఆ విషయం తట్టనే లేదు సుమండీ? మానసి ఇంత సాహసం చసి, మిమ్మల్ని నేలమాళిగ గుండా బయటికి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తుందని నేను ఊహించను కూడాలేదు. మంచిదే అయింది నేలమాళిగ కింద తలుపు మూసివుండటం. లేకపోతే ఆ మార్గంలో ఎన్ని ఇబ్బందులు పడేవాళ్ళో ఏమో? ఆ మార్గంలో దీపం కూడా లేకుండా రావడం చాలా ప్రమాదకరం. అందుకే ఏనాడో ఆ దారి మూసేశాం బయటినుంచి ఆ తలుపు తాళం వేశాం. ఆ సంగతి త్లియని మానసి మిమ్మల్ని ఇంత ఇబ్బందిలో పడేసింది. మాళిగపై తలుపు గాలికి పడటం, గడియా కూడా పడటం మీకు ఇంత ఇబ్బంది కలిగించింది. అది జరక్కుండా వుంటే మీరు ఏ ఇబ్బందీ లేకుండా వెనక్కు వచ్చేసి వుండేవాళ్ళు" ఓ క్షణం ఆగి మళ్ళీ అందుకున్నాడు.
"అయినా డాక్టర్ గారూ! మీరు తొందరపడి మానసి చెప్పినట్టు చేసి వుండాల్సింది కాదు. మానసి సంగతి మీకు తెలియదా? మెట్ల దగ్గర కొచ్చి మమల్ని కేకవేస్తే సరిపోయేది. అడివయ్యో, వీరభద్రుడో వచ్చి మిమ్మల్ని ఎలాగోలా క్రిందికి దించేవాళ్ళు. అవునంటారా?" శివరామయ్య ప్రశ్నార్థకంగా డాక్టర్ ఉదయ్ ముఖంలోకి చూశాడు.
"మీరన్నది వాస్తవమే. నేనే తొందరపడ్డాను" సంజాయిషీ ఇస్తున్నట్టుగా అన్నాడు డాక్టర్ ఉదయ్ చంద్ర.
వరండాలోనుంచి చెక్క మెట్లదగ్గరకొచ్చారు అందరూ.
"జాగ్రత్త బాబుగారూ" అంటూ వీరభద్రుడు ఒక్కొక్క మెట్టే లాంతరు చూపిస్తూ దిగసాగాడు.
మెట్లదగ్గర ఒక్క క్షణం ఆగి చూశాడు ఉదయ్. గతరాత్రి విరిగిన మెట్లను తెల్లవారి కొయ్యలూ , కర్రలూ అడ్డువేసి, మళ్ళీ చెక్కమెట్లకు మోపుచేసి కట్టివుంచారు. మెట్లమీద కాలుపెడ్తూ వెనక్కు తిరిగి చూశాడు. తనవెనకే నిలబడివున్న శివరామయ్యను ముందుగా దిగమన్నట్టు చెయ్యి ఊపాడు.
శివరామయ్య ముందూ, అతడి వెనక మానసీ మెట్లు దిగసాగారు. వాళ్ళ వెనకే ఒక్కొక్క మెట్టూ అతి జాగ్రత్తగా దిగుతూ, ముందు నడుస్తున్న వాళ్ళను- ముఖ్యంగా వీరభద్రుడ్ని పరిశేలనగా చూశాడు. అన్ని మెట్లూ దిగాక గుండెల నిండుగా గాలి పీల్చుకొన్నాడు.
హల్లో పెట్రోమాక్స్ లైట్ వెలుగుతోంది. ఆ వెలుక్కు ఉదయ్ కళ్ళు భగ్గున మండినట్టుగా అయినై. కళ్ళు మూస్తూ తెరుస్తూ ముందుకు నడిచాడు.
డైనింగ్ హల్లో అడుగు పెట్టగానే "డాక్టర్ గారూ! మీరు మానసీ మిగిలిపోయారు, మేమంతా భోజనం చేశాం." అంటూ శివరామయ్య డైనింగ్ టేబుల్ దగ్గరకొచ్చి ఆగాడు.
"ఇప్పుడు భోజనమా?"
టైం చూసుకున్నాడు ఉదయ్. నాలుగు గంటల పదిహేను నిముషాలయింది.
"అవును డాక్టర్ గారూ. నిన్న ఉదయం ఎప్పుడో ఓ కప్పు కాఫీ తాగారు. ఆ తర్వాత ఏమీ తీసుకోలేదు." మానసి సానుభూతి పుట్టిపడే స్వరంతో అన్నది.
"నో! నో! నేనిప్పుడు ఏమీ తినలేను. పాలుంటే కాఫీఇస్తే చాలు."