సిద్దార్థ వచ్చాడు. దిగులో, మరేమోగాని ఇల్లు కదలడంలేదు. అంటే అర్థం దిగులు కాదు. మరేదో కారణం. అంటే అన్నయ్య ఇంకా దాక్కున్నాడనే అర్థం ఇన్నాళ్ళూ ఎక్కడున్నట్టు? పోయిన డబ్బు ఏమయింది? అన్నయ్య కోసం పోలీసులు గాలిస్తున్నారుకదా? అన్నయ్య గురించి వివరాలు ఎలా తెల్సుకొడం?
అన్నీ ప్రశ్నలు.....ప్రశ్నలు.....
శృతి తల తిరిగిపోతున్నది.
ఓ పక్క పట్టలేని ఆనందం.
మరోపక్క అంతులేని ఆలోచన.
కొద్దిసేపు ఆగి స్వాతివద్దకు వెళ్ళింది శృతి.
"నీ ముఖం అదోలా వుందేమిటి శృతీ!" చూస్తూనే అడిగింది స్వాతి.
"ఎలావున్నాను?" అంటూ తడబడింది శృతి.
వికలాంగులకి బుద్ధి పదునెక్కువంటారు. స్వాతి అంతే. మనిషిని చూసి మనసుని చదువుతుంది.
"ఎలా వున్నావో చెపుతా. ఇలా వచ్చి నాపక్కనే కూర్చో ముఖంలో సంతోషం, ఆందోళన చీకటి వెలుగుల్లా దోబూచులాడుతున్నాయి. మనిషి ఇక్కడ మనసెక్కడో వుంది. ఆ చూపుల్లో ఏదో చెయ్యాలి అనే తపన వుంది. ఆ కళ్ళు వూరికే చంచలిస్తున్నాయ్! పెదవులు చిన్నగా కంపిస్తున్నాయ్. ఏదో ఊహించనిది ఆదాటుగా ఎదురైతే....."
మృదువుగా తన చేత్తో స్వాతి నోరు మూసింది శృతి. సరిపోతుంది. నేనిప్పుడే స్నానం చేసి ప్రెష్ గా వచ్చాను. ఓ వేళ నీ వూహ కరెక్ట్ అయి, సరే నేను పెళ్ళికూతురిని. పెళ్ళికొడుకేడి మరి?"
"పెళ్ళికొడుకుని నేను. తొలిపాదం గదిలో పెడుతూ నన్ను చూసి అక్కడ ఆగిపోయి ముఖకవళికలు మారుస్తూవున్నావని నా గాఢబిప్రాయం శృతీ దేవీ!"
"లెస్సబలికితివి స్వాతికుమారా!" వెంటనే అందిశృతి.
స్వాతి ఫక్కున నవ్వింది.
శృతి ఆ నవ్వుతో శృతి కలిపింది.
"నీకో గుడ్ న్యూస్ చెప్పాలనుకున్నా శృతీ! కాని చెప్పను"
"ఎందుకనో?"
"అప్పటికప్పుడే త్రిల్ కలిగించాలని......."
"ఆలోచించి అదేమిటో కనిపెట్టలేనేమిటీ!"
"లాభంలేదు నీ వూహకందనిది"
"ఏంటబ్బా"
"అంతగా ఆలోచించకు. తల తిరిగిపోగలదు.
"ఇప్పటికే ఆలోచించకు. తల తిరిగిపోగలదు.
"ఇప్పటికే ఆలోచించి ఆలోచించి తల తిరిగిపోతున్నది" చటుక్కున అనేసిందేమో పొరపాటు గ్రహించినాలుక్కర్చుకుంది.
"ఆ.....ఆ....దొరికిపోయావ్! ఇందాక ఏమీలేదన్నావే లేకేం ఏదో వుంది. ఏంటమ్మా అంత తలతిరిగిపోయే ఆలోచన?"
"నిజంగా ఏం లేదు."
"ఊహూ! నిజంగా ఏదో వుంది. చెప్పకపోతే నే మాట్లాడను" అంటూ మూతి ముడుచుకుంది స్వాతి.
"మా అమ్మవు కదూ?"
ఈ తఫా కళ్ళుకూడా మూసుకుంది స్వాతి.
"నా బంగారు తల్లికదూ" స్వాతి గడ్డం పుచ్చుకుంది శృతి బతిమిలాడుతూ.
సరిగ్గా అప్పుడే గదిలో వచ్చింది నళినీదేవి. వచ్చిగుమ్మంలోనే ఆగిపోయింది.
ఇహ లాభంలేదని శృతికూడా ఉట్టుట్టి కోపం తెచ్చుకుని" ఇదిగో స్వాతీ! నాక్కోపమొస్తే మనిషిని కాదు. నే తల్చుకుంటేనా, నీ ముక్కుపిండి ఆ రసం వీదేశాల కెగుమతిచేస్తాను" అంటూ స్వాతి ముక్కు పట్టి పండింది.
"అబ్బా! అంటూ కళ్ళు తెరిచిన స్వాతి గుమ్మంలోనే వున్న తల్లిని చూసి" అమ్మ....అమ్మ....అంది.
శృతి తలతిప్పి చూసి చటుక్కున మంచంమీంచిలేచింది.
నళినీదేవి నీ "అంతస్తు ఎక్కడ, నాకూతురి అంతస్తు ఎక్కడ" అన్నట్లు ఒక చూపు చూసి రాయంచలా ఠీవిగా నడుస్తూ వచ్చి స్వాతి పక్కనే కూర్చుని స్వాతి తలమీద చేయివేసి నిమిరింది.
శృతి తల వంచుకుని చేతులు కట్టుకు నిలబడిపోయింది.
"పై వారమే చండీదేవి పూజ, ఈసారి నువ్వుకూడా దగ్గరుండి చూద్దువుగాని" అంది నళినీదేవి.
"వద్దమ్మా! ఆదేవి దయ నాపై ఈమాత్రం వుండబట్టే ఆరోగ్యం ఈ మాత్రమైనా బాగుంది. నా కిదే చాలమ్మా! నడక వస్తుంది. కాళ్ళు బాగవుతాయనే ఆశ ఏలాగూ లేదుకదా?"
"అలా అనకు తల్లీ! ఆ దేవి దయ వుంటే కాళ్ళు బాగు కావటం ఎంతసేపు!"
"పోనీ నీ మాటే నిజం. నేను ఎక్కడున్నా దేవి దయనాపై పరిపూర్ణంగా వుంటే కాళ్ళు బాగవుతాయి! నా కక్కడికి రావటం ఇష్టం లేదమ్మా!"
నళినీదేవి నొసలు ముడిపడ్డాయ్. "ఎందుకని?" అంది.
"కాళ్ళు బాగానే వున్నంతకాలం నాన్నగారు పూజ చేసూ కూర్చునేవాగు. ఇప్పుడేం చేయగలుగుతున్నారు? కొద్ది కాలం క్రితం నేను నీ మాట కాదనక పూజ చేసేదాన్ని. ఫలితమేముంది? భగవంతుడికి నమస్కారం భక్తితో పెట్టాలిగాని చేతులకిబంగారు తొడుగులుతొడుక్కుని పెట్టనక్కరలేదమ్మా అదీగాకపోయినా మరో యిబ్బంది వుందమ్మా! వీల్ చైర్ లో కూడా ఇదివరకులా ఎక్కువసేపు కూర్చోలేక పోతున్నాను. పదినిమిషాలు కాగానే వీపులో నొప్పి బైలుదేరుతున్నది."
"పోనీ కాసేపుపడుకుని కాసేపు కూర్చునేట్టుఏర్పాటు చేయిస్తాను" పట్టుదలగా అంది నళినీదేవి.
"అప్పుడు అందరూ చూసేది చండీ పూజ కాదమ్మా! నన్ను.....నన్ను...." ఆ పైన చెప్పేదేం లేదనట్లు కళ్ళు మూసుకుంది స్వాతి.
నళినీ మాతృ హృదయం కరిగిపోయింది. "హ్హూ" అనే భారమైన నిట్టూర్పు అప్రయత్నంగా పైకి వచ్చింది.
"ఈ రోజు చంద్రమతి కొత్తవంట ఏం చేస్తుందమ్మా!" మాట మార్చి నవ్వుతూ అడిగింది స్వాతి.
"చెయ్యటానికేమంది? తిమ్మిని బమ్మి చేస్తుంది. ఈ పనివాళ్ళని ఎంతలో వుంచాలో అంతలో వుంచాలి. కాస్త చనువిస్తే చాలు, నెత్తి నెక్కుతారు. అందుకే తరుచు నీకూ చెప్పేది. మన మంచితనం ఆధారంగా మనల్ని పట్టుకు ఏమే అంటే చూసే వాళ్ళకు బాగుండాలా!" అంటూ చురుక్కుమని గుచ్చుకునేలా శృతిని ఓ చూపు చూసింది నళినీదేవి.
ఈ మాట చెప్పేది తనకి కాదని, శృతికని స్వాతి గ్రహించుకుంది. అనవసరంగా చంద్రమతి మాట ఎందుకెత్తాను అనుకుంది బాధగా.
నళినీదేవి ఏ వుద్దేశంతో అందో శృతికి బాగానే అర్ధమైంది. ఒకసారి నళినీదేవి శృతిని మందలించింది. కారణం ఆవిడముందు శృతి స్వాతిని నీవునీవు అంటూ ఏకవచనంతో మాట్లాడింది. "స్వాతీ" అని పిలిచిందికూడా. "బొడ్డు కోసి పేరు పెట్టినట్టు పేరుతో పిలుస్తున్నావే. చిన్నమ్మగారనో, చిన్నమ్మాయిగారనోపిలువు. మీరుఅను. నీవుఅనకు ఇహపై" ఆజ్ఞాపిస్తున్నట్లే అంది నళినీదేవి అప్పుడు.
"నా యిష్టంతో అలా పిలుస్తున్నదమ్మా! అలా పిలవంది నా ఫ్రెండ్ ఎలా అవుతుంది? ఇది నా ఇష్టానికి వదిలెయ్యి. లేకపోతే శృతిని పంపించెయ్యి" అంది స్వాతి కాస్త గట్టిగానే.
అక్కడితో నళినీదేవే తగ్గింది. ఇందాక తనొచ్చినపుడు స్వాతి ముక్కు శృతి పట్టుకు ఆడించటం చూసి సమయానుకూలంగా ఇప్పుడో మాట విసిరింది.
నళినీదేవికి నిలువెల్లా గర్వమే అని, కఠినాత్మురాలని రూపం మాత్రం మృదువైన పువ్వులాంటిదని శృతి ఇక్కడి కొచ్చిన కొద్దిరోజుల్లోనే తెలుసుకుంది. ఇదేగాక చాయిగా నళినీదేవి, రఘునందన్ ల ప్రవర్తన చూసింది. ఇంకా ఆ ఇంటి కొన్ని రహస్యాలు అవగాహన చేసుకుంది. ఏమీ తెలియనట్లు ఆ పైన చాలా జాగ్రత్త వహించింది. ఇప్పుడు నళినీదేవి అన్నందుకు కించిత్ కూడా బాధపోయింది శృతి.