"చెప్పేదేముంది! బలవంతాన నన్నొకరికి కట్టబెడదామనుకోవటం, నేను నీతో పారిపోయి రావటం చాలా చక్కగా చెప్పావ్. నేను జరిగినదంతా వివరంగా పృధ్వీరాజుకి లెటర్ రాశాను. నన్ను ఎలా అయినా సరే తీసుకెళ్ళు, లేకపోతే నా శవాన్నే నీవు చూసేదని తెలియజేసాగదా! ఆ లెటర్ నీ చేతికి చిక్కింది. రాజులాగా నీవే లెటర్ రాసి నన్ను యింత దూరం తీసుకువచ్చావు" వందనాదేవి కోపంగా బుసకొడుతూ అంది.
"భేష్. బాగానే ఆలోచించావ్. ఇందులో సత్యాసత్యాలు అక్కరలేదన్నమాట!" రాజు నవ్వుతూ అంటుంటే పెదవి విరుపులో లీలగా వ్యంగ్యం దోబూచులాడింది.
వందనాదేవికి వళ్ళు మండింది. పక్కనే టీపాయ్ మీద వున్న పేపర్ వెయిట్ చేతిలోకి తీసుకుంది. "అలా మరోసారి నవ్వావంటే ఈ పేపర్ వెయిట్ నా చేతిలోంచి ఎగిరివచ్చి ముఖాన్ని ముద్దిడుతుంది. జాగ్రత్త" గద్దిస్తూ అంది.
రాజు మాట్లాడలేదు. "బాప్ రే. ఈ పిల్ల అన్నంతపనీ చేసేటట్టువుంది" అనుకున్నాడు.
"దోవలో ఒక్క మాటా మాట్లాడలేదు. ఎందుకు? నీ వేషం గ్రహిస్తానని. అంతే కాదు. ప్రతీచోటా నీ మనుషులను నియమించావ్. పెద్ద ముఠాకి నాయకుడయివుంటావు. పిచ్చిముఖం దాన్ని. ఆ తొందరలో ఆలోచించలేదు-ప్రేయసీ ప్రియులు పారిపోవటానికి యిన్ని మారువేషాలు, ఈ విధంగా ప్రయాణం, నాకా ఆలోచనే రాలేదు. ఎత్తూ లావూ దాదాపు నా రాజులాగానే ఉన్నావు. పైగా గడ్డమూ పెద్ద పెద్ద గాగుల్స్ సగం ముఖాన్ని కప్పేశాయి. స్వరం మార్చి మాట్లాడుతున్నావని అనుకున్నాను..."
"అలాగే అనుకో వందనాదేవీ! పేపర్ వెయిట్ కి పని కల్పించక నా నాలుగు ప్రశ్నలకి జవాబివ్వు చాలు."
"ఏమిటా చచ్చు ప్రశ్నలు?"
"చచ్చు ప్రశ్నలో పుచ్చు ప్రశ్నలో దయచేసి జవాబివ్వు. నందితాదేవి నీకు ఏమవుతుంది?"
"అరె మా అక్క పేరు నీకెలా తెలుసు. ఓహ్, నేనెంత పిచ్చిదాన్ని. ఇంత కధ నడిపిన వాడివి పేరు తెలుసుకోవటం ఏం కష్టంలే."
"మీ ఇద్దరూ కవల పిల్లలు. మీలో నందితాదేవి పెద్దది."
ఇదీ తేలిగ్గానే కనుక్కున్నావు?"
"నందితాదేవి, నేను ప్రేమించుకున్నాము."
"ఇదో కొత్త మలుపు. కానియ్ కానియ్."
"నందితదేవీ!" రాజ్ కంఠంలో కరుకుదనం చోటు చేసుకుంది. "మగవాడి శరీరం ఉక్కులాగానూ, చేతలు కఠినంగాను, మనసు రాయిలాగాను వుంటే మీ ఆడవాళ్లు చెప్పినట్లు వింటారు. ఇందాకా దౌర్జన్యంగా నీ నోరు నొక్కితే నోరు మూసుకున్నావు. ఇప్పుడు సానునయంగా మాట్లాడుతుంటే నన్ను చవటలాగా జమకట్టి ఏం చెప్పినా కొయ్ కోయ్ అంటున్నావు. నేనే నిజంగా మోసగాడినయితే నీకింత దూరాన కూర్చుని కథలు వినిపించను. ఏ దురుద్దేశ్యంతో ఇంతదూరం తీసుకొచ్చానో ఆ పని పూర్తిచేసే వాడిని బలవంతాన. నే చెప్పేది నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. నేను నందితాదేవి గాఢంగా ప్రేమించుకున్నాము. నేను... నేను..."
ఆపై చెప్పటం ఇష్టం లేనట్టు రాజ్ ఆగిపోయాడు.
"ఊ ఆ పై నేం జరిగింది?"
"నేనో విషవలయంలో చిక్కుకున్నాను. అదేమిటో నన్ను పూర్తిగా నమ్మిన తరువాత చెపుతాను. నందితాదేవికి నాకు మధ్య వున్న మిత్రులు ఒకరి విషయాలు ఒకరికి చేర వేస్తుండేవారు. నందితాదేవికి బలవంతాన వివాహం చేయటానికి వాళ్ళ పెదనాన్న నిశ్చయించాడని తెలిసింది. ఇరువురం పారిపోవటానికి చూస్తున్నాము. నే రావటం కాస్త ఆలస్యం అయింది. ఆలస్యమయినా నా రాణీ నాకు దక్కిందని మురిసిపోయాను. ఇంత పటిష్ఠమైన పధకం వేసి ఇంత దూరానికొస్తే నాతో వచ్చింది. నీవు ఇలా జరగటానికి కారణం ఏమిటి మీ అక్క స్థానంలో నీవెలా వున్నావు?"
"పెళ్ళి సరిగా రేపు రాత్రి అనగా అక్క పారిపోయింది. ఆ స్థానంలో బలవంతాన నన్ను పెళ్లికూతురిని చేశారు. రాజ్ వచ్చి రక్షించి తీసుకెళతాడా సరే సరి. లేకపోతే మృత్యువుని ఆశ్రయించదలుచుకుని నిద్రమాత్రలు దగ్గర పెట్టుకుని కూర్చున్నాను. తర్వాత సంగతి ఇరువురికీ తెలిసిందే కదా."