Previous Page Next Page 
పెట్టితిసిచూడు పేజి 23

    మనకి తెలియంది ఏదో వుంది. రిక్షావాడితో ఖాళీపెట్టె  అన్న పదం ఎర్రపెట్టె గురించా! మరోపెట్టె గురించా! తెలియదు. మిల్లిగరిటె కొనటానికి ఆలోచించే పెద్దమనిషి ఎర్రరంగు ట్రంకు పెట్టె కొనటమే ఆశ్చర్యం. అది చాలక ఇంకో పెట్టి! కనుక ఇంకో పెట్టె అన్న ఆలోచన అనవసరం ఏ పెట్టి నేను చూడలేదు. కాబట్టి రిక్షావాడు తెచ్చింది ఖాళీ ఎర్రపెట్టె అనుకుందాం విషయాన్ని అక్కడితో వదిలేసినా వాళ్ళు ముఖాలలో మబ్బులు కమ్మిన కళ వుండదు. మనం సినిమాకి అడిగితే రాకపోవటం ఇదంతా చూస్తుంటే నా మటుకు నాకు...."

    "....చాలా పెద్ద అనుమానమ వస్తుంది అంటావ్? అంతేనా?' అంతవరకు మౌనంగా వింటున్న పంకజం నవ్వుతూ అడిగింది.

    "అంతే" సీరియస్ పోజులో జవాబు ఇచ్చింది మనోరమ.

    "నీవు ఇంత వివరంగా వరస క్రమంతో చెప్పటంవలన నాకొకటి అర్ధమైంది."

    "ఏమిటి?"

    "మనం పెట్టె పెట్టె అనిపెట్టేమీద కథ అల్లుకుంటున్నాము. పెట్టెగురించి ఏమీ లేదు. ఏదో మనకి తెలియంది వుంది ఆ ఏదో వుండటం.....వల్లనే బాబాయిగారు, పిన్నిగారు యాత్రల నుంచీ వచ్చినప్పటినుంచీ అది ఇదిగా వుంటున్నారు. అని నేననుకుంటున్నాను."

    "ఏదో వుంది అన్నది నీవు నమ్ముతున్నావు కదా!"

    "ఆ..."

    "మరి ఆ ఏదో అన్నది మనం కనిపెట్టాలి కదా!"

    "కనిపెడదాం."

    "ఎలా?"

    "ప్రతిదీ వేయి కళ్ళతో చూసి."

    "ఏం చూస్తావ్. పెట్టెని వదిలేసి....!"

    "అంటే?"

    "అర్ధంకాలేదా?"

    "ఉహు."

    "ప్రతిది వేయికళ్ళతో చూసి అని నీవే అన్నావు. అలాంటప్పుడు మనం ఎర్రపెట్టెతో మొదలయిన మన అనుమానాన్ని ఎందుకు వదులుకోవాలి?" మనోరమ లా పాయింటు తీస్తూ అంది.

    "నీవు కవయిత్రివి గాక క్రైమ్ రచయిత్రివి అయితే బాగుండేది రమా!" పంకజం నవ్వుతూ అన్నది.

    "క్లూ దొరకనీ, క్రైమ్ రచన వండి పారేస్తాను." తనూ నవ్వుతూ అంది మనోరమ.

    ఉన్నట్లుండి పెద్ద అనుమానం వచ్చింది పంకజంకి.

    "మనం ఈ పరిశోధన ఎందుకు చేస్తున్నట్లు?"

    "తోచీ తోచనమ్మ తోడికోడలి పుట్టింటికి వెళ్ళిందట. అందుకు"

    మరోసారి ఇరువురు నవ్వుకున్నారు.

    ఆ తర్వత-

    ఎర్రపెట్టె గురించి, పిన్నిగారు బాబాయిగారి వింత ప్రవర్తన గురించి మళ్ళీ చర్చించుకున్నారు.

    "దేవ రహస్యం వున్నమాట గ్యారంటీ. అదేమిటన్నది మనం తెలుసుకోవాలి. అంతేనా?"

    "అంతే నా అనుమానానికి బీజం ఏర్పడింది ఎర్రపెట్టెని చూసినప్పటినుంచి"

    "ఎర్రపెట్టెలో ఏం రహస్యం వున్నట్లు?"

    "అది తెలిస్తే అది రహస్యం ఎలా అవుతుంది! దాన్ని గురించి మనం ఈ ప్రదేశంతో రహస్య చర్చలు ఎందుకు చేస్తాము?"

    "బాగా చెప్పావు, మన రహస్య పరిశోధన విషయం మన భర్తలకి చెప్పాలా? అక్కరలేదా?" పంకజం అడిగింది.

    "వద్దు. చివరకి చెపుదాము. ఇప్పటినుంచి వాళ్ళకి చెప్పి చివరకి తుస్సుమంటే వాళ్ళు నవ్వే అంత ప్రమాదం కొని తెచ్చుకోవద్దు. ఈ రహస్యం మనిద్దరి మధ్యనే ప్రస్తుతం దాద్దాము. మరో విషయం. పిన్నిగారికి, బాబాయిగారికి అనుమానం రాకుండా మనం మెలగాలి. మనం అనుమానిస్తున్నట్లు వాళ్ళు గమనిస్తే జాగ్రత్తపడతారు" మనోరమ వివరించింది.

    "అలాగే. ఇంక వెళదామా?" పంకజం అడిగింది.

 Previous Page Next Page